వాడుకరి:Shishirdasika/కన్నప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్నప్ప నాయనార్

కన్నప్ప వీరశైవలు ఆరాధించే 63 నాయనార్లలో ప్రసిద్ధుడు. తను ముగ్ధభక్తితో శివుడుకి తన కళ్ళను అర్పించి శివసాన్నిధ్యం పొందిన శరణుడు. తనకు దిన్నప్ప, దిన్న, ధీర, తిన్నడు, తిన్నప్పన్ అను పలు పేర్లు ఉండగా, శివుడికి కన్ను అర్పించడం వలన తనకు కన్నప్ప అను పేరు వచ్చింది. కన్నప్ప సొంత ఊరు శ్రీకాళహస్తికి దెగ్గర ఉడుమూరు. అ ఉరి పేరు నేడు ఉటుక్కూరు. ఉటుక్కూరు ఆంధ్రప్రదేశ్లోని రాజంపేట జిల్లాలో ఉంది. తన భార్య పేరు నీల. కన్నప్ప కథ పాల్కురికి సోమనాథుడి బసవ పురాణంలో వివరంగా ఉంది.

కథ[మార్చు]

కన్నప్ప తన రెండో కన్ను తీయకుండా అడ్డుకున్న శివుడు.

ఈ కథ పాలకురికి సోమనాథుడి బసవపురాణంలో ఇచ్చినట్లుగా చెప్పబడింది. శ్రీకాళహస్తికి కొంచెం దూరంలో ఉడుమూరు అనే పల్లె ఒకటి ఉండేది. కన్నప్ప ఆ పల్లెలో ఉన్న ఎరుకలవారికి నాయకుడు. ఒకనాడు దగ్గర అడవికి వారంతా వేటకు వెళ్ళినప్పుడు, బాగా అలిసిపోయిన కన్నప్ప అక్కడే నిద్రపోయాడు. అతను నిద్రలో ఉండగా, రుద్రచిహ్నలతో ఉన్న ఒక తపసి వచ్చి, నుదుట వీభూతి రాసి, శివతీర్థం జల్లి, "ఇంకా ముందుకు వెళితే ఘనలింగమూర్తిని చూస్తావు; అదే నీకు ప్రాణలింగ" మని ఉపదేశించినట్లు కల వచ్చింది. అప్పుడు నిద్ర నుంచి మేల్కోన్న కన్నప్ప నాలుగు వైపులు చూడగా, ఇంతకుముందు ఎప్పుడూ కనిపించని దారి ఒకటి కనిపించింది. “నా కల నిజమైంది” అనుకుంటూ ముందుకు పోగా పోగా అతనికి ఘనలింగమూర్తి కనిపించింది. ఆది చూసి భక్తితో ఉప్పొంగిపోయి, ఆ లింగానికి మొక్కి తనలో తాను "కలగన్న చోటికి పళ్ళ గంపతో పోతే, ఫలసిద్ధి కావడం నా భాగ్యం కాదా! ఆ తపోమూర్తి చెప్పినట్లు ఇదే నా ప్రాణలింగ” మని నిశ్చయించుకున్నాడు కన్నప్ప. "నా ప్రాణలింగాన్ని ఇలా ఎండలో వానలో వదలిపెట్టడం మంచిది కాదు. దీనికి మంచి బుద్ధులు చెప్పి, బుజ్జగించి, వెట్టు చేసి, కావలసిన వస్తువులన్నీ తెచ్చపెట్టి వలపించి, తొందరగా నా పల్లేకు తీసుకుపోయి, అక్కడో మంచి పాక కట్టించాలి" అని కన్నప్ప తలచాడు. అంతలో అతని ధోరణి మారి, ముగ్ధభావనతో శివుణ్ణి - “ఇక్కడ ఇలా ఒంటరిగా ఉండడానికి కారణమేంటి? గుళ్ళలో పూజారాలుతో అలిగి వచ్చావా? అలాగైతే నీ అలక నేను తీరుస్తా. గొరగలు ఉమ్మెత్త అకులతో పూజలు చేస్తే వెర్రులెత్తి వచ్చావా మా అడివికి? శ్రీసైలంలో జనుల తొక్కిసలాట భరించలేక కాళహస్తికి వచ్చావా? నీ సవతులిద్దరు నీ కోసం చేసే పోరు తట్టుకోలేక వచ్చావా? చెన్నయ్యతో కలిసినందుకు నీ కులం చెడిందని లోకులు నిన్ను వెలివేయడం వలన వచ్చావా? నంబి కోరికలు తీర్చలేక అలిసిపోయి వచ్చావా? లేదా నాటి బ్రహ్మ నేడు న్యాయం తప్పాడని వేటాడడానికి వచ్చావా?అయినా ఇన్ని మాటలెందుకు? తిన్నగా చెప్పు. నాపైన అభిమానంతో వచ్చావా? ఎక్కడ నుండి వచ్చావు? ఎట్లా ఉంది నీ బ్రతుకు? ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడే ఉంటావు? నీ వంటిలో సగమైన ఉమ ఏది? ఇలా ఒక్కడివే వచ్చేస్తే నలుగురు నవ్వరు? నీ గోచీని ఎక్కడ పోగొట్టుకున్నావు?” అని పలు ప్రశ్నలు అడగసాగాడు. ఆ శివలింగాన్ని ఒంటరిగా అడవిలో వదలలేక, శివుణ్ని తన పల్లెకు రమ్మని ఎంతో వేడుకున్నాడు. తన పల్లెలో అడవి మనుబిళ్ళ పాలు, ఇప్పపూతేనె, ఒడిపిలి పాయసము, ఇంకా ఎన్నో రకాల మాంసాలతో జీవితం ఎంతో సుఖంగా ఉంటుందని చెప్పి పాదాక్రాంతుడైనా ఈశ్వరుడు పలకలేద. ఆకలితో పేగులు మాడిపోయి ఉండడంవలనే శివుడి నోట మాట రావట్లేదని కన్నప్ప మనసులో అనుకున్నాడు. ఇలా చెవులు చిల్లులు పడేలా వాగడంవలన లాభం లేదని చెప్పి, శివుడు తినడానికి కందమూలాలు, కూరగాయలు, మాంసము తెద్దామని బైలుదేరాడు. శివభక్తులైన జీమూతవాహనుడు, శిబి, మరియు కీర్తిముఖుడు జింకలుగా అడవిలో సంచరిస్తున్నారు. వీరు శివభక్తుడిచేతుల్లో వధించబడి శివుడికి ప్రసాదంగా సమర్పించబడతారన్న వరం పొంది ఉన్నారు. అందుచేత వీరు కన్నప్ప తప్ప వేరెవ్వరికి కనబడరు. కనప్ప ఒక్కొక్క బాణానికి ఒక్కొక్క జింక నేలకులిపోతూ వచ్చింది. చచ్చిపోయిన జింకలను ఖండఖండాలుగా నరికి, మంటమీద తిప్పి-తిప్పి కాలుస్తూ, మధ్య-మధ్యన రుచి చూస్తూ, బాగా రుచిగా ఉన్న ముక్కలను మాత్రం మారేడాకు దొప్పలో పెట్టి బైలుదేరాడు. దారిలో పడ్డ మొగిలేటి నీటిని రెండు పుక్కిళ్ళలో నింపుకొని శివలింగంవద్దకు చేరాడు. అంతకముందున్న పూజా సామగ్రిని కాళ్ళతో తన్ని, తను తెచ్చిన మాంసపు దొప్పను కింద పెట్టి, పుక్కిటి నీటితో శివలింగానికి స్నానం చేయించాడు. ఇదంతా అంతకముందు పని చేసే పూజారి చూసి "ఈ మ్లేచ్ఛుడు చేసే అన్యాయం చూస్తూ ఊరుకోడం తప్ప నేను చేయగలిగనదేం లేదు” అని ఏవగించుకున్నాడు. ఆ పూజారికి కన్నప్పదేవుడి ఘనముగ్ధతనూ సన్నుతభక్తి చూపదలచి శంకరుడు తన కుడి కంట నీరు కార్చడం మొదలుపెట్టాడు. ఎప్పుడూలాగానే కన్నప్ప అక్కడికి వచ్చి ఇదంతా చూసి ఉల్లిక్కిపడి భయభ్రాంతడై తను తెచ్చిన మాంసపు దొప్పను కింద పెట్టి, పుక్కిటి నీటిని ఉమ్మి ఆశ్చర్యంతో - “నిటలాక్షా! ఎన్నడు లేనిది ఈనాడు నీ కంట నీరు కారుతోంది ఎందుకు? నీ నింద విని గౌరి నీరైన నాడు కూడా నువ్వు కంటతడి పెట్టలేదు. ఒక తండ్రిచేత కొడుకు తల నరికించినప్పుడు కనికరంతో ని కంట కన్నీరు కమ్మలేదు. బ్రాహ్మణులు నీ బట్టలు చింపి నిన్ను వేధించినప్పుడు నీ కంటి నుంచి చుక్క నీరైనా కారలేదు కదా! తట్టలు బుట్టలు ఎత్తి వేట్టి చేసిన చోటు ఒక్క భాష్పము కూడ రాలలేదు కదా! ఎప్పుడు పొడిగా ఉండే కళ్ళలో ఈ తడి ఏంటి? ఆలుబిడ్డలను బాసి, అడివిపాలయ్యావని దఃఖపడి ఏడుస్తున్నావా? లోకాన్ని కాపాడేవడవు నీవొక్కడివే ఉన్నావని ఏడుస్తున్నావా? ఆకలితో కడుపుకాలి ఏడుస్తున్నావా? నిన్ను విడిచి నా దారిన నేను పల్లెకు పోతానని బెంగపెట్టుకొని ఏడుస్తున్నావా? ఇంతగా ఏడ్చే అవసరం నీకేమొచ్చింది? చెప్పవే?” అని అంటూ దిగులుతో సతమతమయ్యాడు. కన్నప్ప లింగాన్ని గట్టిగా కౌగిలించుకొని “ఊరుకో నా యన్నా ! ఊరుకో నా తండ్రి! ఊరుకో నాసామి ! నీ కొడుకును నేను ఉన్నానుగా. ఇలాగే ఏడిస్తే నీ సాటి లింములు నిన్ను చూసి నవ్వరా?” అంటూ ఉరడించసాగాడు. కళ్ళలో నులసేదైనా పడిందని అనుమానంతో కనుగుడ్డుపై నాలిక పెట్టి తిప్పితిప్పి శోధించాడు. కంటికొక వైపు వేలు పెట్టి నొక్కితె ఇంకొక వైపు నుంచి నీరు కారడం మొదలుపెడుతోంది. రెండువైపుల పెట్టి నొక్కితే కంటి మొత్తం నుంచి ఎడతెగని నీటి ధార. ఇంకేమి తోచక, లేచి నిలబడి కంగారుగా లింగం చుట్టూ తిరుగుతున్నపుడు తనకొక అలోచన వచ్చింది - “ఆనందభాష్పాలో, లేదా దఃఖంతో వచ్చే నిళ్ళైతే రెండు కళ్ళలోంచి రావాలి. కాని ఒక్క కన్ను నుంచే వస్తోంది ఎందుకు? ఇదేదో జబ్బు చేసి ఉండాలి! పొరగప్పిందా? మాదతెవులా? అక్షిరోగమా? తడికంటివిధమా? దుమ్ముపడిందా? దుర్మాంసదోషమా? కోడిరెప్ప చేసిందా? కంట్లో పువ్వు వట్రిల్లిందా? ”. సర్వాంగసుందరుడైన శివుడి జబ్బు చేసిన కళ్ళు చూసి కన్నప్ప ఎంతో వెతచెంది - “నువ్వు ముక్కంటి వాడవని మూడు లోకాల భీతి చెందేవి. ఇప్పుడు అందరి ముందు లోకువైపోయావు. నిన్ను గుడ్డిగా ప్రేమింన అమ్మాయిలు ఇలా అంగహీనుడవైనావని తెలిసి నీకు చిక్కుతారా? నీ భక్తులే నిన్ను చూసి హిహి అని నవ్వి పోరు?” అని అనుకున్నాడు. ఇంకేమి చేయాలో తోచక, కన్నప్ప తన సొంత కంటిని ఇవ్వాడానికి సిద్ధపడ్డాడు. వెంటనే తన కంటిని పీకేసి శివుడి కంటి మీద పెట్టేసాడు. పెట్టిన వెంటనే కళ్ళలోంచి నీరు కారడం ఆగిపోయింది. కాని, ఇప్పుడు ఎడమ కంటి నుంచి నీరు కారడం మొదలైయ్యింది. ఇది చూసి తన రెండో కన్ను కూడా తీసివేయబోయాడు కన్నప్ప. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, తనకు తన కళ్ళను ప్రసాదించి అభయమిచ్చాడు. పైనుంచి దేవతలు, ప్రమథలు ఉప్పొంగి పూల వర్షం కురిపించారు. ఇంతకముందు కన్నప్పను ఏవగించుకున్న పూజారి “బాపురే కన్నప్ప! పరమ లింగంబ! బాపురే కన్నప్ప ! ప్రథమవిలాస! నల్లవో కన్నప్ప ! ఆలింగముగ్ధా! నల్లవో కన్నప్ప నల్లనైనార!” అంటూ పరమభక్తితో వినుతించాడు. అలా కన్నప్ప కైలాసవాసుడై చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు.