వాడుకరి:Veera.sj/ప్రయోగశాల/బ్లాగు/నిషా శర్మ
త్రిశూలం సినిమాలో ఒక పాట: పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు. పెళ్ళైతే ముంగిళ్ళు, లోగిళ్ళు, ముగ్గులు, ముత్తైదు భాగ్యాలు, ముద్దు ముచ్చట్లు, మురిసె లోగుట్లు, చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు!!
ఉత్తర భారతదేశ సంప్రదాయాల ప్రకారం వధువు ఇంటికి వరుడు ఊరేగింపుగా వచ్చి ఆమెను వివాహమాడాలి. నోయిడాకు చెందిన మునీష్ దలాల్ కూడా 11 మార్చి 2003 న ఇటువంటి కలల్లోనే తేలిపోతూ వధువు అయిన నిషా శర్మ ఇంటికి ఊరేగింపుగా వచ్చాడు. అయితే వధూవరుల చెలిమికి పడవలసిన సంకెళ్ళు ఆ తర్వాతి రోజున మునీష్ దలాల్ చేతులకు పడ్డాయి. 15 మే 2003 న మునీష్ దలాల్ తల్లి అయిన విద్యా దలాల్ కు కూడా పడ్డాయి. ఇక్కడ కట్ చేద్దాం.
11 మార్చి 2003 న ఏం జరిగిందో నిషా మాటల్లో: వారు మమ్మల్ని ఒప్పుకొన్న దాని కంటే ఎక్కువ కట్నం ఇస్తామని చెబుతున్నట్లు మా తమ్ముడు (జ్ఞానేశ్వర్ శర్మ) చెప్పగనే, నేను పోలీసులకు ఫోన్ చేశాను. అప్పటికే అక్కడ మా నాన్న దేవదత్ శర్మకు, వరుడికి అతని తల్లికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. దీనితో వారి ఊరేగింపును వెనక్కి పంపేశాం.
ఇంకేముంది, న్యాయస్థానాలు సైతం తీర్పు వెలువరించటానికి కష్టపడే కేసులలో కూడా ముద్దాయిలను దోషులు చేసే మన అధికప్రసంగా ప్రసార మాధ్యమాలు మొత్తం విజృంభించాయి. నిశా శర్మ Youth Icon అనీ, Role Model అనీ, Iron Lady అనీ ఊదరగొట్టాయి.
అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రేమికుల దినోత్సవం బంపర్ ఆఫర్ గా 14 ఫిబ్రవరి 2003 న నే నిశా తను ప్రేమించిన నవనీత్ రాయ్ ను గుళ్ళో ఎవరికీ తెలియకుండా పెళ్ళి చేసుకొన్నది. అయితే నవనీత్ రాయ్, పేదవాడు కావటంతో, నిశా తండ్రి ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు. కాబట్టి ఈమెని పెళ్ళి చేసుకోవటానికి ఒక బలిపశువును వెదికే ప్రయత్నంలో క్లాసిఫైడ్స్ లో యాడ్ ఇచ్చాడు దేవదత్ శర్మ. అదుగో, అక్కడ దొరికిపోయాడు మనవాడు. తర్వాత పెళ్ళి నిశ్చయమైనది. అయితే నవనీత్ ను తను పెళ్ళి చేసుకోలేదు అని నిషా శర్మ అతని పై కూడా సేఫ్టీకి ఏవో కేసులు పడేసింది.
ఇంక మునీష్ దలాల్ కు పండగ మొదలైంది నా సామి రంగా, జైలు, అక్కడ ఖైదీలతో గొడవలు, కోర్టు చుట్టూ తిరగళ్ళు. కొన్ని బెనిఫిట్స్ నవనీత్ రాయ్ కు కూడా ఉన్నాయనుకొండి, అది వేరే విషయం. ఈ లోపు ఏది ఎటు పోయి ఎటు వస్తుందో అని, మన అతి జాగ్రత్తపరుడైన వధువు తండ్రి గారు, అశ్విన్ శర్మ అనే ఇంకో బలిపశువును వెదుక్కొని దెయ్యాలు కూడా భయపడే ముహూర్తానికి (తెల్లవారు ఝాము 3.00 గంటలకు) గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళి చేసేశాడు. హమ్మయ్య, ఒక ఇద్దరు అమాయక యువకుల జీవితాలు నాశనమైనా ఫర్వాలేదు, దేవదత్ మాత్రం ఇక తడి గుడ్డ వేసుకుని పడుకోవచ్చనుకొన్నాడు. అవును మరి ఇప్పుడు భర్త అశ్విన్ శర్మ అయితే, మరి మునీష్ దలాల్, నవనీత్ రాయ్ లు ఈమెకు ఏమౌతారు? వారు ఏమీ కారనుకొందాం. మరి ఏమీ కానప్పుడు వారు జైలులో ఎందుకు ఉండాలి? అబ్బోవ్...వద్దులెండి. ఇటువంటి ఫక్కీరు యవ్వారాలు ఆలోచించటం లాయర్లకు, పోలీసులకు మాత్రమే సాధ్యం. మన లాంటి వారు ఇందులో తలదూర్చకూడదు.
దాని తర్వాత అమ్మాయిగారు కోర్టులో దేవదత్ ను ప్రేమించింది నిజమే అని ఒప్పుకొన్నారు. కానీ అతను చూపించే వివాహ దస్తావేజుల్లో సంతకం మాత్రం తనది కాదని చెప్పినది. ఇటువంటి దిక్కుమాలని సలహాలు ఇవ్వటం కోసం, దేశంలో దరిద్రగొట్టు లాయర్లకు కొదవ లేదు లెండి. తాము చేసిన ఏ ఆరోపణలకు సాక్ష్యం లేకపోవటం వలన కోర్టు మునీష్ ను, అతని తల్లిని, దేవదత్ రాయ్ ను తొమ్మిదేళ్ళ తర్వాత, అంటే, 29 ఫిబ్రవరి 2012న విడుదల చేసింది.
అయితే, ఈ కథకు అద్భుతమైన క్లైమాక్స్ సన్నివేశం ఉన్నది. జనవరి 2013 లో స్వయానా తమ్ముడు జ్ఞానేశ్వర్ శర్మ యొక్క ఏకైక భార్య అయిన మనీషా శర్మ, భర్త పైన, అతని అక్క నిషా శర్మ పైన వరకట్న వేధింపు వ్యాజ్యం వేసింది. ఇంకేముంది, ఐరన్ లేడి కాలికి బుద్ధి చెప్పింది. ఈ కేసు లో తీర్పు ఇప్పటికైతే వెలువడినట్లు లేదు, ఎవరికైనా తెలిస్తే వెంటనే నాకు తెలపండి.