Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 04వ వారం

వికీపీడియా నుండి

ఆఫ్ఘనిస్తాన్, ఆసియా ఖండం మధ్యలో ఉన్న ఒక దేశము. ఈ దేశం ఆధికారిక నామం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. దక్షిణ ఆసియా, మధ్య అసియా, నైరుతి ఆసియా లను కలిపే ఆఫ్ఘనిస్తాన్ చారిత్రకంగా సిల్క్ వాణిజ్య మార్గం లో ఒక ముఖ్యమైన స్థానం. వివిధ సంస్కృతుల మేళనానికీ, జాతుల వలసకూ ముఖ్యమైన మజిలీగా ఉంది. పరిసర రాజ్యాల దండయాత్రలకు ఊ దేశం తరచు గురయ్యేది. అలాగే ఇక్కడి రాజులు కూడా పరాయి రాజ్యాలను ఆక్రమించి సామ్రాజ్యాలు స్థాపించారు.

ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఇతర దేశాలతో చుట్టబడిన (సముద్ర తీరం లేని) దేశం. ఎక్కువ భాగం పర్వత మయం. ఉత్తరాన, నైరుతి దిశన మైదాన ప్రాంతం. దేశంలో అత్యంత ఎత్తైన స్థలం నౌషాక్ (సముద్ర మట్టం నుండి 7,485 మీటర్లు లేదా 24,557 అడుగులు ఎత్తు). దేశంలో వర్షపాతం బాగా తక్కువ. ఎక్కువ భాగం పొడి ప్రదేశం.

1970 దశకంనుండీ ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన అంతర్యుద్ధాలతోనూ, తీవ్రవాద కార్యకలాపాలతోనూ, విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయింది. దేశప్రజలు దారుణమైన ఇబ్బందులకు గురయ్యారు. 2001 తరువాత నాటో జోక్యంతో జరిగిన యుద్ధం తరువాత ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం అమెరికా సహకారంతో నడుస్తున్నది. అంతర్జాతీయ సహకారంతో పెద్దపెట్టున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. దేశం పునర్నిర్మాణం జరుగుతున్నది కాని అనేక సమస్యలతో ఆఫ్ఘనిస్తాన్ సతమతమవుతున్నది. పేదరికం, మౌలిక సదుపాయాల కొరత, దేశమంతటా ఉన్న ల్యాండ్ మైనులు (భూమిలో పాతబడి ఉన్న బాంబులు), ప్రేలుడు పదార్ధాలు, ఆయుధాలు, చట్టవ్యతిరేకంగా సాగుతున్న గంజాయి పెంపకం, రాజకీయ అంతర్యుద్ధాలు, తాలిబాన్ల దాడులు, మిగిలి ఉన్న అల్-కైదా ప్రభావం, (ప్రత్యేకించి ఉత్తరభాగంలో ఉన్న) అనిశ్చితి - ఇవి కొన్ని సమస్యలు. ....పూర్తివ్యాసం: పాతవి