Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 04వ వారం

వికీపీడియా నుండి
రబటక్ శాసనం ప్రకారం కనిష్కుని కాలంలో కుషాణుల పాలనలో ఉన్న ప్రాంతం (గీత లోపల) మరియు వారి అధిపత్య ప్రభావంలో ఉన్న ప్రాంతాలు (చుక్కల గీత లోపల)
రబటక్ శాసనం ప్రకారం కనిష్కుని కాలంలో కుషాణుల పాలనలో ఉన్న ప్రాంతం (గీత లోపల) మరియు వారి అధిపత్య ప్రభావంలో ఉన్న ప్రాంతాలు (చుక్కల గీత లోపల)

కుషాణు సామ్రాజ్యం క్రీ.శ. 1వ శతాబ్దం - 3వ శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లింది. దాని ప్రాభవ కాలంలో, షుమారు క్రీ.శ.250 నాటికి, ఆ సామ్రాజ్యం ప్రస్తుత తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాల నుండి ఉత్తర భారతదేశంలోని గంగానది పరివాహక ప్రాంతమంతా విస్తరించింది. ఈ సామ్రాజ్యం పాలకులు మొదట యూజీ అనే ఇండో-యూరోపియన్ తెగకు చెందిన పశ్చిమచైనా ప్రాంతంవారు. కుషాణులకు రోమన్ సామ్రాజ్యంతోను, పర్షియా సస్సానిద్ సామ్రాజ్యంతోను, చైనాతోను రాజకీయ సంబంధాలుండేవి. తూర్పు, పశ్చిమ భూముల మధ్య సాస్కృతిక, ఆర్ధిక, రాజకీయ మేళవింపులకు కుషాన్ సామ్రాజ్యం ఒక ముఖ్యమైన కేంద్రం అయ్యింది.

చైనాలో లభించిన సమాచారం ప్రకారం కుషాన్ మూలపదం గ్విషువాంగ్ (చైనా భాషలో: 貴霜) అనేది యూజీ (月氏) జాతికి చెందిన ఐదు రాజకుటుంబాలలో ఒకటి. ఇది ఒక ఇండో- యూరోపియన్ జాతి. బహుశా వీరి భాష తొచారిన్ భాషకు చెందినది కావచ్చును. వీరు క్రీ.పూ. 176 - 160 మధ్యకాలంలో జొయోగ్ను వారి దాడుల వలన మరింత పడమర దిక్కుకు వెళ్ళిఉంటారు. తరువాతి శతాబ్దంలో (క్రీ.పూ. 1వ శతాబ్దం) గ్విషాంగ్ జాతివారు తక్కిన యూజీజాతులవారిపై నాయకత్వం సాధించి, వారందరినీ ఒక బలమైన సంఘంగా రూపొందించారు. ఈ దశలో గ్విషాంగ్ నాయకుడు కుజులా కాడ్‌ఫైసిస్. ఈ గ్విషాంగ్ పదమే పాశ్చాత్య దేశాలలో కుషాన్గా వ్యవహరింపబడింది. కాని చైనాలో మాత్రం యూజీ పదం కొనసాగింది. క్రమంగా వారు తక్కిన సిథియన్ జాతులనుండి అధికారాన్ని హస్తగతం చేసుకొని దక్షిణాన గాంధార దేశం అనబడే ప్రాంతానికి విస్తరించారు. ఈ గాంధార దేశంలో ప్రస్తుత పాకిస్తాన్‌యొక్క పోతోవార్, వాయువ్య సరిహద్దు, కాబూల్ లోయ, కాందహార్ ప్రాంతాలు ఉండేవి. అలా కనిష్కులు అప్పటిలో "కాప్సియా" (ఇప్పటి కాబూల్) మరియు "పుష్కలావతి" (ఇప్పటి పెషావర్)లలో జంట రాజధానులను స్థాపించారు. .....పూర్తివ్యాసం: పాతవి