Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 23వ వారం

వికీపీడియా నుండి


మహా సముద్రం లేదా మహాసాగరం, భూగోళం యొక్క జలావరణంలో ప్రధాన భాగం. ఉప్పు నీటితో నిండిన ఈ మహా సముద్రాలు భూమి ఉపరితలము పై 71% పైగా విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 36.1 కోట్ల చదరపు కిలో మీటర్లు. ప్రపంచం సముద్ర జలాలలో దాదాపు సగ భాగము 3,000 మీటర్లు (9,800 అడుగులు) ఫైగా లోతైనవి. సరాసరి మహాసముద్రాల 'సెలైనిటీ' (ఉప్పదనం) దాదాపు వెయ్యికి 35 వంతులు (3.5%). మహాసాగరాలన్నీ కలిసి ఉన్నా గాని వ్యావహారికంగా ఐదు వేరు వేరు మహాసాగరాలుగా గుర్తిస్తారు. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియుదక్షిణ మహాసముద్రం. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయిన పెద్ద నీటి భాగాలు. కనుక దీనిని ప్రపంచ మహాసముద్రం అని చెప్పవచ్చును

మహా సముద్రాలలో కొన్ని చిన్న భాగాలను సముద్రాలు, సింధుశాఖలు అని అంటారు. అధికంగా అక్కడి భూభాగం లేదా దేశం లేదా ప్రాంతం బట్టి ఈ సముద్రాల, సింధుశాఖల పేర్లు ఉంటాయి. కొన్ని జలాశయాలు పూర్తిగా భూమిచే చుట్టబడి ఉంటాయి. (అంటే ఇతర సముద్రాలతో కలసి ఉండవు). కాస్పియన్ సముద్రం, అరల్ సముద్రం, గ్రేట్ సాల్ట్ లేక్ ఈ కోవలోకి వస్తాయి. నిజానికి ఇవి పెద్ద ఉప్పునీటి సరస్సులే గాని సముద్రాలు కాదు. భౌగోళికంగా మహాసముద్రం అంటే భూగోళంపై నీటితో కప్పబడిన "సముద్రపు అడుగు". (ఓషియానిక్ క్రస్ట్).

మొత్తం ప్రపంచ సముద్ర ఉపరితల వైశాల్యం 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మొత్తం ఘన పరిమాణం షుమారు 1,300 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు. సరాసరి లోతు 3,790 మీటర్లు పురాతన కాలంనుండీ మానవుడు సముద్రాలపై ప్రయాణిస్తున్నప్పటికీ సముద్రాల నీటి అడుగుకు వెళ్ళడం ఇటీవల కాలంలోనే సాధ్యమయ్యింది. ప్రపంచంలో అన్నింటికంటే లోతైన ప్రదేశం మెరియానా ట్రెంచ్. ఇది పసఫిక్ మహాసముద్రంలో ఉత్తర మెరియానా దీవులు ప్రాంతంలో ఉంది. దీని అత్యధిక లోతు 10,923 మీటర్లు (35,838 అడుగులు). ఇప్పటికీ సముద్రాంతరతలం చాలావరకు అన్వేషించబడలేదు.

....పూర్తివ్యాసం: పాతవి