అట్లాంటిక్ మహాసముద్రం
భూమిపై గల జలభాగాలన్నింటిలో అట్లాంటిక్ మహాసముద్రం రెండవ అతి పెద్ద జలభాగం. 10.64 కోట్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ మహాసముద్రం దాదాపు భూమిపై అయిదవ వంతు భాగాన్ని ఆక్రమిస్తుంది. ఈ మహాసముద్రానికి గ్రీకు పురణాలలోని అట్లాస్ రాక్షసుని పేరు మీదుగా ఆ పేరు స్థిరపడింది.
అట్లాంటిక్ మహాసముద్రం భూమిపై ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలకు తూర్పుగాను ఆసియా ఐరోపా, ఆఫ్రికా ఖండాలకు పడమరగా, దక్షిణదిశగా అంటార్కిటిక్ ఖండం వరకు నిలువుగా ఇంగ్లీషు అక్షరం S ఆకారంలో పరుచుకుని ఉంది. ఈ సముద్రం ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రానికి, నైరుతిన పసిఫిక్ మహాసముద్రానికి, ఆగ్నేయాన హిందూ మహాసముద్రానికి అనుసంధానమై ఉంది. భూమధ్యరేఖకు రెండు వైపులా ఉన్న ఈ సముద్ర భాగాలను ఉత్తర అట్లాంటిక్, దక్షిణ అట్లాంటిక్ సముద్రాలుగా వ్యవహరిస్తారు.
భౌగోళిక స్వరూపం
[మార్చు]అట్లాంటిక్ మహాసముద్రం పడమరన ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల వరకు వ్యాపించి ఉన్నది. ఉత్తరాన, ఈశాన్యాన అర్కిటిక్ మహాసముద్రానికి, అట్లాంటిక్ కు మధ్యన గ్రీన్ లాండ్,ఐస్ లాండ్, ఆర్కిటిక్ కెనడియన్ ద్వీప సమూహం, యాన్ మాయెన్ ద్వీపం, స్వాల్బార్డ్ ద్వీప సమూహం, ఐరోపా ఖండాలున్నాయి. డెన్మార్క్ జలసంధి, గ్రీన్ లాండ్ సముద్రం, నార్వేజియన్ సముద్రం, బారెంట్స్ సముద్రం అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాలను కలిపే ప్రధాన జలసంధులు. తూర్పున ఈ మహాసముద్రం ఐరోపా ఖండం వరకు వ్యాపించి ఉంది. జిబ్రాల్టర్ జలసంధి వద్ద ఈ మహాసముద్రం మధ్యధరా సముద్రానికి తద్వారా నల్ల సముద్రానికి అనుసంధానం అవుతుంది. ఆగ్నేయంగా ఈ మహాసముద్రం హిందూ మహాసముద్రంతో అనుసంధానం అవుతుంది. ఈ అనుసంధాన ప్రదేశాన్ని 20° తూర్పు అక్షాంశంగా వ్యవహరిస్తారు. కొంత మంది ఆట్లాంటిక్ మహాసముద్రం దక్షిణంగా అంటార్కిటికా వరకు ఉందని వాదిస్తే, ఇంకొందరు అంటార్కిటికా చుట్టూ ఉన్న సముద్రాన్ని అంటార్కిటికా మహాసముద్రంగా వ్యవహరించి అట్లాంటిక్ మహాసముద్రం ఈ సముద్రంతో అనుసంధానమవుతున్నట్లుగా వ్యవహరిస్తారు. నైరుతి దిక్కున అట్లాంటిక్ మహాసముద్రం డ్రేక్ మార్గం వద్ద పసిఫిక్ మహాసముద్రంతో అనుసంధానం అవుతుంది. మానవ నిర్మాణమయిన పనామా కాలువ కూడా పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను అనుసంధానిస్తుంది. ఇవి కాక కారిబ్బియన్ సముద్రం, మెక్సికో అఖాతం, హడ్సన్ అఖాతం, బాల్టిక్ సముద్రం, పడమర సముద్రం అట్లాంటిక్ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న చెప్పుకోదగ్గ జలభాగాలు.
భూవైశాల్యంలో మొత్తం 20 శాతం అట్లాంటిక్ మహాసముద్రమే ఆక్రమిస్తుంది. భూమిపై గల జలభాగాలన్నిటిలోకి ఇది రెండవ అతి పెద్ద జలభాగం. పొరుగున ఉన్న సముద్రాలతో కలిపితే అట్లాంటిక్ మహాసముద్ర వైశాల్యం దాదాపుగా 106,400,000 చదరపు కిలోమీటర్లు. పరిమాణం దాదాపుగా 354,700,000 ఘనపుకిలోమీటర్లు.ఈ మహాసముద్రపు సగటు లోతు 3,338 మీటర్లు. 8,605 మీటర్ల లోతు గల ప్యుఎర్టో రికో అగడ్త ఈ మహాసముద్రపు అత్యంత లోతైన ప్రదేశం. బ్రెజిల్, లైబీరియా మధ్యన అట్లాంటిక్ అతి తక్కువ వెడల్పు ఉంది. ఇక్కడ దీని వెడల్పు 2,848 కిలోమీటర్లు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఉత్తర ఆఫ్రికా మధ్యన అట్లాంటిక్ అతి ఎక్కువ వెడల్పు ఉంది. ఇక్కడ దీని వెడల్పు 4,830 కిలోమీటర్లు.
చరిత్ర
[మార్చు]అన్ని మహాసముద్రాలలోకీ అట్లాంటికి రెండవ అతి తక్కువ వయసు గలది. అతి తక్కువ వయసు గలది దక్షిణ సముద్రం. గత 130 మిలియన్ సంవత్సరాల లోపే ఈ సముద్రం ఆవిర్భవించింది. మొట్టమొదటి ఏకైక భూభాగం పాంగియా క్రమంగా ముక్కలు విడిపోవడం వలన ఈ సముద్రం ఆవిర్భవించిందనడానికి ఆధారాలున్నాయి. కానీ అట్లాంటిక్ మహాసముద్రం చాలా విస్తృతంగా పరిశోధింపబడింది. వైకింగ్ నావికులు, పోర్చుగీసు వారు, క్రిష్టఫర్ కొలంబస్ ఈ సముద్రాన్ని పరిశోధించిన తొలి ప్రముఖ పరిశోధకుల్లో కొందరు.
|
| ||||||||||||||||||||||||
ప్రపంచ ఖండాలు కూడా చూడండి |