Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 25వ వారం

వికీపీడియా నుండి

కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషిలతో పెనవేసుకు పోయింది. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి.

బాల్య వివాహాల వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు అకుంఠిత దీక్షతో పనిచేసాడు. ఆయన చేసిన ఇతర సంస్కరణా కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. 1881 డిసెంబరు 11న తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేశారు. సమాజం నుండి ఎంతో ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించాడు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు వంటి మిత్రులు, మరియు ఆయన విద్యార్ధులు వీరేశలింగానికి అండగా నిలిచారు. ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ భర్తకు బాసటగా ఉంది. వంటవాళ్ళు, నీళ్ళవాళ్ళు వారి ఇంటికి రావడానికి నిరాకరించినపుడు రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి పెళ్ళివారికి వంట చేసిపెట్టింది.

వీరేశలింగం సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు. 130కి పైగా గ్రంధాలు రాసాడు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు రాసాడు. స్వీయ చరిత్ర రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు. సంగ్రహ వ్యాకరణం రాసాడు. నీతిచంద్రిక లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసాడు. ....పూర్తివ్యాసం: పాతవి