వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 47వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Hepatitis B virus 1.jpg

హెపటైటిస్‌-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ హెపడ్నావైరస్ (Hepadnaviridae) కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్‌లలో ఒక రకం. దీనికి సీరం హెపటైటిస్ అని ఇంకో పేరుంది. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది. ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్నవాళ్లు మన దేశంలో, మన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 3-5% వరకూ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి (liver cirrhosis) లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది


హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్‌-బి 'పాజిటివ్‌' ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు. ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు. ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. పసర్లు తాగించటం, చేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు. అంటే హెపటైటిస్‌-బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది. ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం! ఒకసారి హెపటైటిస్‌-బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!

కామెర్లు తగ్గిన ఆర్నెల్ల తర్వాత కూడా HBsAg పరీక్ష పాజిటివ్‌ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రానిక్‌ హెపటైటిస్‌గా పరిగణిస్తారు. అంటే ఇక హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే. వీళ్లను అన్‌ఎఫెక్టెడ్‌ క్యారియర్స్‌ అంటారు. వీళ్లు ఎప్పుడూ రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్లినా హెపటైటిస్‌-బి ఉన్న విషయం చెప్పాలి. మద్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

క్రానిక్‌ హెపటైటిస్‌ బాధితుల్లో ఓ 40 శాతం మందికి మాత్రం భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్‌ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి ఎప్పుడైనా తీవ్రమైన లివర్‌ సమస్యలు ఆరంభం కావచ్చు. తీవ్రస్థాయి కామెర్లు, లేదా పొట్ట ఉబ్బరం, జలోదరం, సరైన స్పృహ లేకపోవటం, రక్తపువాంతుల వంటి లక్షణాల్లో ఏవో ఒకటి మొదలవ్వచ్చు.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి