వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 05వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేరీ క్యూరీ నవంబర్ 7, 1867జూలై 4, 1934) ప్రసిద్ధ భౌతిక, రసాయనిక మహిళా శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు. రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. సోర్‌బోన్‌లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలండ్‌లో జన్మించి తరువాత ఫ్రెంచి పౌరసత్వం తీసుకొన్న ఈమెకు రెండు దేశాలతోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది. ఈమె భర్త, సహ పరిశోధకుడు అయిన పియరీ క్యూరీ తన నోబెల్ బహుమతిని ఈమెతో కలసి అందుకొన్నాడు. ఈమె కుమార్తె ఇరీన్ జూలియట్ క్యూరీ మరియు అల్లుడు 1935లో రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి పొందినారు. ఇలా వీరి కుటుంబంలో నలుగురికి నోబెల్ బహుమతులు లభించాయి.

మారియా స్క్లొడొస్క పోలండ్ రాజధాని నగరమైన వార్సాలో నివసిస్తున్న బ్రోనిస్లావా మరియు వ్లాడిస్లా స్క్లొడొస్కి అనబడే పోలిష్ దంపతులకు జన్మించినది. అమ్మాయి అవడం వల్లనూ, ఇంకా రష్యా మరియు పోలండ్‌ల మధ్య ఉన్న గొడవల వల్ల అప్పట్లో ఆమెకు విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకలేదు. 1891 లో కూడబెట్టుకున్న ధనంతో ఆవిడ పారిస్ చేరుకున్నది.

పారిస్‌లో ఈమె ఉన్నత విద్యను అభ్యసించి తన పరిశోధనలను ప్రారంభించింది. సార్బోన్‌లో గణితం, భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రాలను అభ్యసించింది (అక్కడే తరవాత 1909లో సార్బోన్‌లో ప్రొఫెసర్ అయిన మొట్టమొదటి స్త్రీగా చరిత్రలో నిలిచిపోయింది). 1893 ప్రారంభంలో అండర్ గ్రాడ్యుయెషన్ ప్రథమస్థానంలో పూర్తి చేసింది. ఒక సంవత్సరం తరవాత అదే యూనివర్సిటీలో, గణితంలో ఆవిడ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. 1903లో ఫ్రాన్సులో డాక్టరేటు పూర్తి చేసిన మొట్టమొదటి స్త్రీగా మళ్ళీ చరిత్ర సృష్టించింది. సార్బోన్‌లో తోటి ఇన్‌స్ట్రక్టర్ అయిన పియరి క్యూరీని పెళ్ళాడింది. వారిరువురూ తరవాత వారి పరిశోధనలను రేడియోధార్మికతపై ఆరంభించారు. ముఖ్యంగా వారి పరిశోధనలు పిచ్‌బ్లెండ్ అనబడే ఖనిజంపై సాగాయి. ఈ ఖనిజంనుండి వారు యురేనియంను వేరుచేసారు. 1898 కల్లా వారు పిచ్‌బ్లెండ్‌లో యురేనియం కన్నా ఎక్కువ రేడియోధార్మికతను కలిగియున్న పదార్థం ఉందని నిర్దారించారు. 26 డిసెంబరు 1898న వీరు ఈ పరిశోధనను బయలు పరిచారు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి