వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 09వ వారం
ఇళయరాజా భారత దేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 4,000 పాటలకు, 800 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇళయరాజా భారత దేశంలోని, చెన్నై లో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా మూడు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు. ఇళయరాజా సతీమణి జీవా. వారికి ఇద్దరు కుమారులు (కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా) మరియు ఒక కుమార్తె (భవతారణి). వీరు కూడా సంగీత దర్శకులు, గాయకులు. తెలుగు, తమిళ చిత్రసీమలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి.
తమిళనాడు రాష్త్రంలో, తేని జిల్లాలో పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయిక ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది.సంగీతాన్ని వృత్తిగా చేసుకొని అందులో స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరం అని గ్రహించి 1968లో మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) అడుగెడుతూనే, ఇళయరాజా ధనరాజ గారి వద్ద సంగీతం అభ్యసించాడు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో కూడా పరిచయం ఏర్పడింది. బాఁక్, బీథోవెన్, మొజార్ట్, షూబర్ట్ మొదలైన పాశ్చాత్య సంగీతపు దిగజ్జాల యొక్క సంగీత శైలులు, ఆ తరువాత ఇళయరాజా బాణీ కట్టిన పాటలను ఎంతో ప్రభావితం చేసాయి (ఉదాహరణకు కౌంటర్ పాయింట్ యొక్క ఉపయోగం). ఇళయరాజ యొక్క శాస్త్రీయ సంగీత శిక్షణ ట్రినిటీ కళాశాల, లండన్ నుంచి సాంప్రదాయక గిటార్లో ఆయనకు బంగారు పతకం తెచ్చిపెట్టింది.
దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేచ్ఛ లభించింది. అంతే కాకుండా, ఈయన రాక వల్ల ఈ ప్రక్రియ కేంద్రీకృతమైంది. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మాత్రమే పరిమితమైన రాగాలను, తీగల వంటి వాయిద్య పరికరాలను, భారతీయ చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగించిన వారిలో ఇళయరాజా ఆద్యుడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన "దళపతి" చిత్రంలోని "చిలకమ్మా చిటికెయ్యంగ" పాట బిబిసి వారి 10 అత్యుత్తమ పాటల్లో ఒకటిగా ఎంపికైంది. ఇంకా....పూర్తివ్యాసం పాతవి