Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 32వ వారం

వికీపీడియా నుండి

కార్గిల్ యుద్ధం , భారత్ పాకిస్తాన్ మధ్య మే - జులై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో మరియు మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్.ఒ.సి(వాస్తవాధీన రేఖ) దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలు మరియు తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ సైన్యాధిపతి చేసిన వ్యాఖ్యలు బట్టి ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువయ్యింది.

వాస్తవాధీనరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది (మొదటిది చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది).

భారత్-పాకిస్తాన్ విభజన జరగక ముందు కార్గిల్ ప్రాంతం లధాక్ ప్రాంతం లోని బల్టిస్తాన్ జిల్లా లో భాగంగా ఉండేది. మొదిటి కాశ్మీర్ యుద్ధం (1947–48) తర్వాత వాస్తవాధీన రేఖ బల్టిస్తాన్ జిల్లాగుండా ఏర్పడింది. దీంతో కార్గిల్ ప్రాంతం భారత దేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో భాగమైంది. 1971లో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దుని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి కాల్పులకు దిగకూడదు. కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 km ల దూరంలో ఉంది. శ్రీనగర్ - లేహ్ లను కలిపే జాతీయ రహదారి(NH 1D) కార్గిల్ గుండా వెళుతుంది. ఈ ప్రాంతం లోకి పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చి 160 km పొడవునా కొండలపైనుంచి కాల్పులు జరిపారు.

పూర్తి వ్యాసము, పాతవి