వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 34వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:SwamiAyyappan.jpg

అయ్యప్ప, హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శశబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.

శబరిమలైలోని అయ్యప్పస్వామి దేవాలయము భారతదేశంలో ప్రసిద్ది చెందిన, అధిక జనసమ్మర్ధం కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకొని నలుభైఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీకమాసం మరియు సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు. అయ్యప్ప మాల ధారణ దక్షిణ భారతదేశము లోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా కలదు. ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక పట్టణాలు. గ్రామాలలో అయ్యప్ప ఆలయాలు నిర్మించారు.


నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది. భక్తులు కార్తీకమాసం నుండి దాధాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మధ్య మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభుదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.

పూర్తి వ్యాసము, పాతవి