వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 43వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ రామకృష్ణ పరమహంస, (పుట్టినప్పుడు పేరు గధాధర్ ఛటోపాధ్యాయ) (ఫిబ్రవరి 18, 1836 - ఆగష్టు 16, 1886) ఒక హిందూ మత గురువు. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది. రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గధాధరుడు చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించకుండెను. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామము బైట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు. దానివలన చదువు అబ్బలేదు. పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామము గుండా వెళ్ళేవారు. వారు ఆ గ్రామములో ఆగి ప్రసంగిచేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్దగా వినేవాడు.

ఇతని అన్న రామ్‌కుమార్ కలకత్తా లో సంస్కృత పాఠశాల నడుపుతూ, కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యము చేస్తూ ఉండేవాడు. ఆ కాలములో రాణీ రాషమొణి అనే ధనిక యువతి, దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి రామ్‌కుమార్ ను పురోహితుడుగా ఉండమని కోరింది. రామ్‌కుమార్ దానికి అంగీకరించెను. కొంత ప్రోద్బలముతో గధాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకొనెను. రామ్‌కుమార్ రిటైరయిన తరువాత రామకృష్ణుడు పూజారిగా భాధ్యతలను తీసుకొనెను. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తాఅని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కాళికా దేవిని ప్రత్యక్షము కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించడము మొదలుపెట్టాడు. తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు. రాత్రిళ్ళు అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు. అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమ సత్యమును తెలిసికొనుటకై ప్రార్థించేవాడు. కొంత మంది గురువులు ఆతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమ సత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు. ఈ మాట అన్ని ఊళ్ళలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు.

కాలక్రమంలో తోతాపురి అను నాగాసాంప్రదాయపు సాధువు వీరికి అద్వైతజ్ఞానం ఉపదేశించారు. వీరి గురువుగారు చిన్నప్పటినుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజులలోనే పొందారు. తర్వాత భైరవీ బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు. ఈ విధంగా భగవత్, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి