వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 44వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిమాలయాలలో ఉన్న నేపాల్ రాజ్యము, 2006 నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యము. ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉన్నది. ఇది ఒక భూపరివేష్టిత దేశం.

నేపాల్‌కి వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది. కిరాంత్ లేదా కిరాతి అనేది 7వ లేక 8వ శతాబ్దములలో తూర్పు నుండి వలస వచ్చిన మరియు చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 563లో నేపాల్‌లోనే జన్మించాడు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంతో బాటు ఇప్పటి నేపాల్‌లోని దక్షిణ ప్రాంతాలను(హిమాలయ పర్వత ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యంలో లేవు) పరిపాలించాడు. క్రీస్తు శకం 200కల్లా బౌద్ధ సామ్రాజ్యాన్ని హిందువులు అంతమొందించి లిక్కావి వంశ పరిపాలనను ప్రారంభించారు.

900వ సంవత్సరంలో లిక్కావి వంశాన్ని పారద్రోలి ఠాకూర్లు, వారిని పారద్రోలి మల్లులు పరిపాలనకు వచ్చారు. 1768లో ప్రిథ్వి నారాయణ్ షా అనే గూర్ఖా రాజు ఖాట్మండును ఆక్రమించుకున్నాడు. 1814లో నేపాల్ ఇంగ్లీషు వారితో యుద్ధం చేసింది(ది ఆంగ్లో నేపాలీస్ వార్). 1816లో సుగౌలి సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఇంగ్లీషు వారికి సిక్కింను, దక్షిణ భాగాలను ఇచ్చివేయడంతో ఇంగ్లీషు వారు వెనుదిరిగారు. కానీ 1857లో భారత దేశంలోని సిపాయిల తిరుగుబాటును అణచివేయడంలో ఇంగ్లీషు వారికి సహాయపడినందుకుగాను ఇంగ్లీషువారు దక్షిణ ప్రాంతాలను తిరిగి ఇచ్చివేశారు.

షా వంశాన్ని 1846లో జంగ్ బహద్దూర్ రాణా అంతమొందించి దేశ పరిపాలనను తన చేతిలోకి తీసుకున్నాడు. దీనికోసం అతడు దాదాపు కొన్ని వందల మంది రాకుమారులను, తెగల నాయకులను అంతమొందించాడు (దాన్నే కోట్ ఊచకోత అంటారు). 1948వ సంవత్సరము వరకూ రాణాలు వారసత్వ ప్రధాన మంత్రులుగా నేపాల్‌ను పరిపాలించారు. ఎప్పుడైతే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందో త్రిభువన్ అనే క్రొత్త రాజు నేపాల్ పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది. రాజు త్రిభువన్ కుమారుడైన రాజు మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని, పార్లమెంటును రద్దు చేసి పార్టీలు లేని పంచాయితీ పద్ధతి ద్వారా నేపాల్ని పరిపాలించాడు. అతని కుమారుడు బీరేంద్ర సింహాసనాన్ని అధిరోహించాడు. అతను కూడా 1989 వరకూ పంచాయితీ పద్ధతినే అనుసరించాడు. కాని ప్రజా ఆందోళన తర్వాత బలవంతంగా రాజ్యాంగ మార్పులను ఆమోదించాడు. 1991 మే నెలలో దాదాపు యాభై సంవత్సరాల తరువాత నేపాల్‌లో ఎన్నికలు జరిగాయి. నేపాలి కాంగ్రెస్ పార్టీ, కమ్మూనిస్ట్ పార్టీలకు ఎక్కువ వోట్లు దక్కాయి. ఏ పార్టీ కూడా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పరిపాలించలేక పోయాయి. అందుకు కారణంగా ప్రజోపయోగ కార్యక్రమాలలో మార్పు లేకపోవటం, అవినీతి రోగంలాగా మారటాన్ని చూపిస్తారు.

ఫిబ్రవరి 1996లో మావోయిస్టు పార్టీ ప్రజాస్వామ్యాన్ని మార్చి సామ్యవాదాన్ని స్థాపించడం కోసం విప్లవాత్మక ధోరణిని ఎంచుకొని ప్రజా యుద్ధాన్ని ప్రారంభించింది. అదే ఆ తర్వాత అంతర్యుద్ధంగా మారి 10 వేల మంది మరణానికి దారితీసింది.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి