వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 48వ వారం
మైసూరు : ( కన్నడ భాష ಮೈಸೂರು ) కర్ణాటక రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం. మైసూరు జిల్లా ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. మైసూరు డివిజన్ కర్ణాటక రాజధానియైన బెంగళూరుకు నైరుతి దిశగా 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైసూరు అనే పదం మహిషూరు అనే పదం నుంచి ఉద్భవించింది. మహిషుడు అంటే హిందూ పురాణాల్లో పేర్కొన్న ఒక రాక్షసుడు. దీని వైశాల్యం సుమారు 42 చ.కి.మీ. ఉంటుంది. చాముండి హిల్స్ పర్వత పాదాలను ఆనుకుని ఉంది. మైసూరు దసరా ఉత్సవాలకు పేరుగాంచినది. ఈ ఉత్సవాలకు యాత్రికులు విశేష సంఖ్యలో హాజరవుతారు. ఈ పేరు నుంచే మైసూరు పెయింటింగ్, మైసూర్ పాక్ అనే మిఠాయి, మైసూర్ సిల్క్ అనే వస్త్రాలు ప్రాచుర్యం పొందాయి.
1947 వరకూ ఈ నగరం ఒడయార్లు పరిపాలిస్తున్న మైసూరు రాజ్యానికి రాజధానిగా ఉండేది. 18 శతాబ్దం లో కొద్దికాలం మాత్రం హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లు పరిపాలించారు. ఒడయార్లు సంస్కృతి కళలంటే ప్రాణమిచ్చే వారు. ఈ విధంగా నగరాన్ని సంస్కృతికి నిలువుటద్దంగా తయారు చేశారు. హిందూ పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు మహిషూరు అని పిలువబడే ఈ ప్రాంతం మహిషాసురుడు అనే రాక్షసుని పరిపాలనలో ఉండేది. ఈ రాక్షసుణ్ణి దగ్గరే ఉన్న కొండపై కొలువున్న చాముండీ దేవి సంహరించిందని ప్రతీతి. తర్వాత కాలక్రమంలో మహిషూరు, మహిసూరుగా మారి చివరకు మైసూరు అనే స్థిరపడింది.
ప్రస్తుతం మైసూరు నగరం ఉన్న ప్రాంతాన్ని 15వ శతాబ్దం వరకు "పురగేరె" అనేవారు. 1524లో "మహిషూరు"కోటను 3వ చామరాజ వొడయార్ (1513–1553) నిర్మించాడు. తరువాత ఇక్కడి పాలన అతని కొడుకు 4వ చామరాజ వొడయార్ (1572–1576) క్రిందికి వచ్చింది. 16వ శతాబ్దంనుండి నగరాన్ని "మహిషూరు" అనసాగారు. తరువాత ఇది మైసూరుగా పరిణమించింది. విజయనగర సామ్రాజ్యం కాలంలో వొడయార్‌ల మైసూరు రాజ్యం వారికి సామంతరాజ్యంగా ఉండేది. అప్పటిలో మహిషూరు వొడయార్ల రాజధాని. దగ్గరలోని శ్రీరంగపట్నం విజయనగర సామ్రాజ్య ప్రతినిధి కార్యాలయకేంద్రంగా ఉండేది. 1565లో విజయనగర సామ్రాజ్యం పతనమయ్యింది. 1610లో రాజా వొడయార్ శ్రీరంగపట్నంలోని సామ్రాజ్య ప్రతినిధిని ఓడించి తన రాజధానిని శ్రీరంగపట్నానికి మార్చాడు. క్రమంగా మైసూర్ వొడయార్లు స్వతంత్ర పాలకులయ్యారు. 1637లో నరసింహరాజ వొడయార్ పాలనాకాలంలో మైసూర్ పూర్తి స్వతంత్ర రాజ్యమయ్యింది.
ఇంకా... పూర్తివ్యాసం పాతవి