వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 08వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహాశివరాత్రి

హిందూ మతం పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.

ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలొనర్చి, ఉపవాసం ఉండి రాత్రి అంతయు జాగరణము చేసి మరునాడు భోజనం చేయుదురు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుదురు. అన్ని శివక్షేత్రము లందు ఈ ఉత్సవము గొప్పగా జరుగును. పూర్వం శ్రీశైలం క్షేత్రమందు జరుగు ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రము లో విపులముగా వర్ణించాడు. శైవులు ధరించు భస్మము/విభూతి తయారుచేయుటకు ఈనాడు పవిత్రముగా భావిస్తారు.

మహాశివ రాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా , నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.
ఇంకా…