శివపురాణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చాగంటి కోటేశ్వర రావు ప్రవచన భాష్యంగా శివపురాణ గాథల్ని ఒకచోట పొందుపరచే ఉద్దేశం.

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం


శివమహా పురాణం వ్యాఖ్యానం భాగాలు[మార్చు]

శివమహా పురాణం భాగం: 1[మార్చు]


శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే.

'శివ' అనే శబ్దము చాలా గొప్పది. శివమహాపురాణము శివ శబ్దముతోటే ప్రారంభమయింది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశము మనకు సాధికారికమయిన గ్రంథము. దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమర కోశముతో పాటు అనేక గ్రంథములను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అపుడు ఆయనకు బాధ కలిగింది. 'నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను - కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి' అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశాడు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్య మూర్తి. ఆయన వచ్చి 'ఎంత పనిచేశావయ్యా! గ్రంథములను ఎందుకు తగులబెట్టావు?' అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉంది. అది అమరకోశము. అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్త్వికమయిన విషయములను, నామములకు, అనేకమయిన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసేముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు.

శివ అన్నమాటను ఏవిధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములయిన అర్థములు చెప్పబడ్డాయి. 'శివ' 'శివా' అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. 'శివ' అంటే శంకరుడు. 'శివా' అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము.అమరకోశములో 'శివః' అంటే - 'శామ్యతి, పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి యితి శివః' - శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ ఆరు వికారములు లేనిది ఏదయినా ఉన్నదా? ఉంది. అదే ‘శివ’. ఆయన నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది. కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకు వచ్చి చూస్తే ఎలా ఉంటాడు?

అమరకోశంలో అమరసింహుడు ఆయనను 'పరమానంద రూపత్వ' అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయటవున్న వస్తువులలో లేదు. లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో వుంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే 'శివ'. ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలోతాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు. మనం అందరం కూడా కదులుతున్న తరంగములతో కూడిన సరోవరములలాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మనుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదానివెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడా హేతువులు అవుతుంటాయి. ఇటువండి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలోనుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు 'శివ' అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యడైవము. అమరకోశంలో 'శేరతే సజ్జనమనాం స్యస్మిన్నితి' - ఈయన యందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏరూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు యిష్టపడిన దానితో మీరు రమించి పోవడం ప్రారంభించినా, అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉంది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినయినా యివ్వగల సమర్ధుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరికున్నదేదీ ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అదీ ఆయన గొప్ప! మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే యిచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్లి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారి పోయినట్లు అయిపోతుంది. ఒకరి దగ్గరకు వెళ్లి వాచికంగా 'నాకిది యిప్పించండి' అని అడగడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియ పడిపోతాడు. అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకునే వారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నము. వాని రోషమునకు, శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు. మీరు శివ స్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు.

అమరకోశంలో అమరసింహుడు శివ శబ్దమునకు ‘సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగిన వాడు’ అని అర్థం. అది ఎలా రమిస్తుంది? దేనివలన? దానికి ఈ కారణము, ఆ కారణము అని చెప్పడం కుదరదు. మీకు మనస్సు ఉంటె భక్తీ ఉంటె ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడియందు మనస్సు రమిస్తే వానికి సమస్తమయిన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది.

అమరకోశంలో శివ శబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ - 'చేతే సజ్జన మనాంసి ఇతివా' - సాధువుల మనస్సునందు తానుండు వాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివునియందు పెట్టారు. లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణముచేత పరవశించి పోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడయిపోయి ఉంటాడు.

అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని ఏ రకంగానయినా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది. శివనామము పంచాక్షరీ మంత్రములో దాచబడింది. ‘నమశ్శివాయ’ అనేది పంచాక్షరీ మంత్రము. ‘నమశ్శివాయ’ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది.

మనకి వేదములు నాలుగయినా, సంప్రదాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానందలహరిలో - 'త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం' అన్నారు.

త్రయీవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఈ మూడు వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రీ ఉపదేశంతో ఈ మూడు వేదములు చదువవచ్చు. కానీ అధర్వవేదం చదవడానికి, ఈ మూడు వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అధర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని, ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా మూడు వేదములను అలా పెడితే ఈ మూడు వేదములలో మధ్యలో వున్నది యజుర్వేదము. యజుర్వేదమునకు ఏడు కాండలు ఉన్నాయి. మరల యిందులో మధ్యప్రాకారము నాల్గవ కాండ. ముందు మూడు, వెనుక మూడు ఉండగా, మధ్యలో నాల్గవది ఉంది. ఈ నాల్గవ కాండలో రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే -

నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ
నమశ్శంజ్గాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హన్త్రే చ హనీయ సే చ
నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ స్తారాయ నమశ్శంభవే చ మయోభవే చ
నమశ్శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శ్శివతరాయచ!! ( శ్రీ రుద్రాధ్యాయం - అష్టమానువాకం-1 - 11)
అష్టమానువాకం చివరి పాదంలో 'నమశ్శివాయ చ' అనే పదమును పెట్టారు. ఈ నమశ్శివాయ చ' ముందు 'మయస్కరాయ చ ' అని ఉంచారు. 'మయస్కరాయ చ' అంటే గురువు. గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైతసిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదూ మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే! ఎలా చెప్పగలరు? ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. 'నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ' అని. 'కపర్దినే చ' అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. 'వ్యుప్తకేశాయ చ' అంటే అసలు వెంట్రుకలు లేని వాడు. మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే వున్నా నామంలో పెద్ద జటాజూటం వున్నట్లు చెప్పబడింది. ఆ పక్కనే వున్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో వున్నవాడు. ఈ రెండూ ఎలా సమన్వయము అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడయినా చెప్పారా? దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో 'శివుడు గుండుతో ఉన్నాడు' అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ వున్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణ ముండనం చేయించుకున్న శివ స్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయు పురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు -

'చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి'

'నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో వుండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు' అని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకొని, చేతిలో వేదములు పట్టుకొని యిలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామి వారు.

నమః కపర్దినే చ - పరమశివుడు. వ్యుప్తకేశాయ చ - శంకరాచార్యుల వారు కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు పరమశివుడే! ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయ చ - ఆ శంకరుల గురుపరంపర ఉన్నదే అది -సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం!

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!

ఆనాడు శంకరుడు కపర్ది అని యింత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమయిన ఈ గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురుపరంపరే నడుస్తున్నది.

ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి, అవతార స్వీకారం చేసారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా భాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ తత్త్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాసించింది. అటువంటి భగవద్గీతను యిచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం, ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదములనుండి ఉద్ధరించ గలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు? దానికి ఒక్కటే కారణం. ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది.

కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరిని ముందరే చంపి ఉండకపోతే, కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబదగలరా! అవతారంలో వున్నా తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్ఞ్మయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయభాష్యంతో మొదలుపెట్టి, ఈశ్వరుడిని స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్ఞ్మయమును జ్ఞానబోధ తప్ప యింకొక ప్రయత్నమూ కాని, పని కాని పెట్టుకోకుండా, ముప్పది రెండేళ్ళ జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్రభాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు. వారి పేరు చెబితే చాలు, మన పాపములు పటాపంచలు అయిపోతాయి.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం!!

అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమిమీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం – యివన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంక ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురురూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురురూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి.

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః!
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!

అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళ ప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్త్వబోధ చేసే వాడిని తయారుచేయాలని గోవిందపదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి, సనాతన ధర్మము, పురాణములు ఎంత గొప్పవో, ‘శివ’ అనేమాట ఎంత గొప్పదో, ‘శివం’ అన్నమాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించాము.

పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!

‘శివా! నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము’ అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, అటువంటి శివనామం గురువై నడవటం గురించి, శివనామ మంగళత్వం గురించి, ఆ నామము ఎంతగా భక్తులను ఆదుకునేదో దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము.

శివమహా పురాణం భాగం : 2[మార్చు]

  • హరిహరమూర్తి.


పరమశివుని లీలా మూర్తులలో పదమూడవ మూర్తి హరిహరమూర్తి. అనగా ఆయన శరీరంలో సగభాగమును శ్రీమహావిష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకొని శరీరంలో సగాభాగామును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు. 'నీవు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధభాగమును పొందావో ఆ ఉపాయమును నాకు చెప్పవలసినది' అని పార్వతీ దేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే, శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్రము. ఈ శివాష్టోత్తర శత నామ స్తోత్రమును ఆధారము చేసుకొని పార్వతీ దేవి శంకరుని శరీరంలో అర్థ భాగమును పొందింది. అది పదునాల్గవ స్వరూపము. దానిని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ప్రదోష వేళలో చదవడం ఇహమునందు సమస్తమయిన కోరికలను తీరుస్తుంది. పరలోక సుఖమును, భగవంతుని అనుగ్రహమును మనయందు ప్రసరింపజేస్తుంది.

‘శివో మహేశ్వరః’ అని పిలుస్తారు. ‘మహేశ్వరః’ అనబడే నామము చిత్రమయిన నామము. మంత్రపుష్పం చెప్పినప్పుడు

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్!
బ్రాహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం!!

అని చెపుతాము. సర్వమంగళములకు కారణం అయినవాడు, సర్వ జగన్నిమాయకుడు, సృష్టిస్థితిలయలు చేసేవాడు తానొక్కడే అయివుండి, కాని సృష్టి చేసినప్పుడు ఒకడిగా, స్థితి కారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, మూడుగా కనపడుతూ ఆయన అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయన మహేశ్వరుడు. ఆయనే మూడుగా కనపడే ఒక్కడి. అందుకే పోతనగారు భాగవతంలో ఒకచోట ఒకమాట అంటారు –

మూడు మూర్తులకును మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమై యొప్పారు బ్రహ్మమనగ నీవె ఫాలనయన’. మనము సృష్టి స్థితిలయ అని మూడు మాటలు వాడుతుంటాము. మనలో చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది. రుద్రుడు లేదా శివుడు అనేసరికి ఆయన సంహారకర్త, లయకారుడు, ఆయన సంహరిస్తాడు అని అనుకుంటారు. అన్నివేళలా లయము అనే శబ్దమునకు అర్థం కేవలం చంపివేయడం కాదు. పరమశివుడు చాలా ఉదారుడై ఉంటాడు. మనకు లయమునందు ‘స్వల్పకాలిక లయం’ అని ఒకమాట ఉంది. గాఢనిద్ర పట్టినట్లయితే ఆ నిద్రలో దుఃఖం తెలియదు. హాయిగా నిద్ర పట్టింది అంటాడు. ఆ హాయి అనేది ఏమిటి? మనస్సు లేకపోవడమే హాయి. గాఢ నిద్రలో ఉన్న స్థితిలో మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా ఉంటుంది. ఆ స్థితిలో బాహ్యమునకు సంబంధించిన ఎరుక అంతా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందమును పొందుతాడు. ఇలా ఆనందమును పొందిన స్వరూపము ఏదైతే ఉందో ఆ ఆనందమే శంకరుడు. ఆ ఆనందమే పరమశివుడు. మనం పొందిన ఆ నిద్రను స్వల్పకాలిక లయం అని పిలుస్తారు. తెల్లవారి నిద్రలేవగానే మనస్సు మేల్కొంటుంది. మేల్కొనడం అనగా ఆత్మనుంచి విడివడుతుంది. యథార్థమునకు సృష్టి స్థితి లయ అనేవాటిని యిక్కడే దర్శనం చెయ్యాలి. అది మహేశ్వర స్వరూప దర్శనం అవుతుంది. తెలివిరాగానే మనం చేయవలసిన పనులకు సంబంధించి మనకు ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన అనేది మనస్సు స్వరూపం. ఆత్మగా ఉండి మీరు మొదటి ఆలోచనను చూసినట్లయితే దాని ఆలోచనలను చూడడం మీకు అలవాటు అవుతుంది. ఇదే సృష్టి. చతుర్ముఖ బ్రహ్మ దర్శనం. బ్రహ్మకి పూజలేదు. సంకల్పదర్శనం చేత మాత్రమే మీరు బ్రహ్మదర్శనం చేసేస్తారు. సృష్టి ప్రారంభం అయింది. అనగా మీ మనస్సు బయటకు వచ్చింది. ఇప్పుడు మీకు స్థితి కావాలి. స్థితి అంటే నిర్వహణ శక్తి. మనస్సు కొన్ని సంకల్పములను చేస్తుంది. వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి. ఇలా చేయాలంటే మీకు సమర్థత కావాలి. ఇది నిర్వహణ సమర్థత. అటువంటి శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారకుడు. అటువంటి శక్తిని స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు. పురుషుడిగా చెప్తే శ్రీమహావిష్ణువు. కాబట్టి మీరు తప్పకుండా ప్రాతఃకాలమునందు విష్ణునామం చెప్పాలి. విష్ణుశక్తి మీయందు ప్రసరిస్తే సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా వెడుతుంది. అందుకని విష్ణుపూజతో, విష్ణు నామంతో రోజు ప్రారంభం కావాలి. తరువాత మీరు అభిషేకం చేసుకోవచ్చు, శివార్చన చేసుకోవచ్చు. కానీ విష్ణునామంతో ప్రార్థించాలి. మనకు భగవంతుడు ఒక్కడే. కానీ మనకు ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపములను పొందాడు. రాత్రి నిద్రపోయే ముందు 11 మార్లు శివనామం జపించి విశ్రాంతి స్థానమునకు శరీరమును చేర్చివేయాలి. ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలికలయం. శివనామము చెప్పి నిద్రపోతే ‘నిద్రాసమాధి స్థితి’ – అది సమాధి స్థితి అవుతుంది. తొలి తలంపు ఏది వస్తుందో దానిని మీరు ఈశ్వరుని వైపు తిప్పడం మనస్సుకు ప్రయత్నపూర్వకంగా అలవాటు చెయ్యాలి. అపుడు మీరు కాలమునందు ఒకరోజు అనబడే విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు. ఇది మహేశ్వరార్చనము.

ఈ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడు అయ్యారు. ఎలా? మొట్టమొదట ఆలోచన బయటకు వస్తూనే మనస్సుకి ఒక అలవాటు ఉండాలి. మీకు కూడా మీ మనస్సుకు తర్ఫీదు ఇవ్వడం రావాలి. నిద్రలేవగానే అది మొదటి సంకల్పం ఏమి చెప్పాలంటే –సాధారణంగా ఎడమవైపు నిద్ర పొమ్మని శాస్త్రం చెపుతోంది. మీరు నిద్రలేవగానే నీ దృష్టి ప్రసారం తిన్నగా మీరు ఆరాధించే దేవతా స్వరూపము మీద పడాలి. అలా లేవగానే దేవతా స్వరూపమును చూడడం మొదటిగా మనస్సుకు మీరు అలవాటు చేయాలి. అంతేకానీ, టైం అయిపోతోందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు. నిద్రలేవగానే మీ తలను తిప్పి కళ్ళు విప్పితే మొట్టమొదటి దృష్టి పరమేశ్వర మూర్తి మీద పడడం చేత పరావర్తనం చెంది ఆ పార్వతీ పరమేశ్వరులు లేక లక్ష్మీ నారాయణుల దర్శనం జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టేముందు మనస్సునందు మరల ‘సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే’ అని శ్లోకం చెప్పి క్రిందకి దిగగానే గురువుగారూ, మీరు నాకు ఉపదేశం చేశారు – మీరు చెప్పిన బుద్ధితో ఈరోజు నారోజు గడుచుగాక’ అని నేలమీద పది గురువుగారి పాదములను ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి, వారి పాదములకు శిరస్సు తాటించి పైకి లేవాలి. ఇది మీకు అలవాటు అయితే మీకు తెలియకుండా మీకు మొదటి ఆలోచన రావడానికి సాక్షి అవుతుంది. ఇపుడు ఈ ఆలోచనను మీరు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదీ స్థితికారకత్వం.

లలితాసహస్రంలో అమ్మవారికి 'భావనామాత్ర సంతుష్టాయై నమః' అని ఒక నామం ఉంది. నీ భావన చేత ఆవిడ సంతుష్టురాలవుతుంది. మీ మనస్సులో మీరు మంచి భావన చేస్తుంటే అక్కడ ఆమె ఆనందిస్తుంది. మనలోవున్న శక్తి అంతా ఆవిడే! ఇక్కడవున్న ప్రకృతి వికారమయిన శరీరము ఆవిడ. ఇది ఆయనను కోరుతోంది. దీనిని దానితో కలపాలని ఆవిడ తెరపైకెత్తుతుంది. ఇది మాయ అన్న యవనికను ఒకరోజున పైకి ఎత్తేస్తుంది. అప్పుడు మీరు దానితో కలుస్తారు. అప్పుడు మీరు జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసిన మహేశ్వర స్వరూపము. అంతేకాని - మహేశ్వర స్వరూపమనగా ఏదో దేవతలందరి చేత పూజించబడేవాడు అని అనుకోకూడదు. అలా అనుకోవడం దోషం కాకపోవచ్చు. కాని మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది. కాని ఇది మీరు నిత్యజీవితమునందు అలవాటులోకి తెచ్చుకోవలసిన ప్రక్రియ. మీరు యిలా దర్శనం చేస్తూ వెడుతున్నట్లయితే మీ లయ పరమశివుడు. నిద్రలేవగానే మిమ్మల్ని ఎవరయినా 'మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు' అని అడిగినట్లయితే అపుడు మీరు ధైర్యంగా 'నేను ఇప్పటివరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి వున్నాను - అదీ నా నిద్ర' అని చెప్పగలగాలి. ఎందుచేత? నేను ణా నిద్రను పడుకోబోయే ముందు అలా స్వీకరించాను. నేను లేచినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దర్శనమే ణా మేల్కొనుట. ణా పూజామందిర ప్రవేశము స్థితికర్త ప్రార్థన. నా నిన్నటిరోజు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల సమాహారము. అది మహేశ్వర స్వరూపముగా నాచేత ఉపాసన చేయబడిన కాలము. కనుక నేను మహేశ్వరోపాసన చేత మరొక మాహేశ్వరుడను అయినాను. ఇది మీ జీవితమునందు రావలసిన ప్రక్రియ. ఇలా చెయ్యగా చెయ్యగా భ్రమరకీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపమును పొందుతారు. ఇలా కాకుండా వేరొక రకమయిన ఆలోచనతో వ్యగ్రతతో జీవితం వెళ్ళిందంటే అసలు ఆత్మలోంచి విడివడడంలో మీకు కృతజ్ఞతా భావం కలగదు.

మహేశ్వర శబ్దం గురించి –

తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమం చ దైవతం’ దేవతలు అందరూ కూడా ఎవరికీ ప్రార్థన చేసి నమస్కరిస్తారో, సర్వ జగత్తును ఎవరు నియమించి, పోషించి రక్షిస్తున్నాడో, ఎవడు దీనిని నిలబెడుతున్నాడో, ఎవడు దీనిని తనలోకి తీసుకుంటున్నాడో వాడే మహేశ్వరుడు. వాడు సర్వ జగన్నియామకుడు. వాడు పరబ్రహ్మమయి ఉన్నాడు. ఇటువంటి పరబ్రహ్మము ఎక్కడ దర్శనం అవుతుంది? దానిని మనం చూడగలమా? దీనికి శాస్త్రం సమాధానం చెప్పింది. మహేశ్వర దర్శనం చేయడానికి ముందుగా మీకు మహేశ్వర దర్శనం చేయాలన్న తాపత్రయం కలగాలి అని చెప్పింది. ఒక్కొక్కరు చాలా పెద్ద చదువులు చదువుకుంటారు. అలా చదువుకోవడం గొప్ప కాదు. అలా చదువుకున్న చదువును నిరంతరం ఎవరయితే అనుష్ఠానంలోనికి తెచ్చుకుంటారో వారు గొప్పవారు. అటువంటి వారు మహాపురుషులు అవుతారు. చదివిన విషయమును ఆచరణలో పెట్టడానికి శ్రద్ధ కావాలి. చెప్పాం కాదు., అనుష్ఠానం లో ఉండాలి. ఈశ్వరుడు సర్వసాక్షి. ఆయన చూస్తున్నాడు అనే బెరుకు మీకు ఉన్నట్లయితే, ఒకడు చూసి మిమ్ము మెచ్చుకోవాలని మీరు పనులు చేయరు. అ పనులు చేయడం మీవిదిగా భావించి పనులను చేస్తారు. శివ పురాణమును ఒక కథగా వినే ప్రయత్నం మీరు చేయకూడదు. అలా చేస్తే అది మీ జీవితమును అభ్యున్నతి మార్గం వైపు తీసుకువెళ్ళదు. శివపురాణం మన నిత్యజీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మనం ఆలోచించాలి. ఈశ్వరుడిని చూడాలి అనే తాపత్రయం మీరు సృష్టి స్థితి లయానుసంధానం నిరంతర ప్రక్రియగా చెయ్యడంలో ఉంటుంది. ఆయన –

సర్వజ్ఞాతా తృప్తి రనాది బోధః స్వతంత్రతా నిత్యమలుప్త శక్తిః
అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞాత షడాహురంగాని మహేశ్వరస్య’ అంది శాస్త్రం

కొన్ని విషయములను కన్ను చూసినా మనస్సు వాటిని పట్టుకోదు. మనం ఒకచోట కూర్చుని కంటితో అన్నిటినీ చూస్తున్నా అల చూస్తున్నవాటిలో కొన్నిటిని మాత్రమే గుర్తు పెట్టుకోగలము. కానీ ఈశ్వరుడు అలా కాదు. మహేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయగతమయిన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు. మీ మనస్సును ఈశ్వరుని పాదముల మీద పెట్టగలిగితే ఈశ్వరుడు మీవెంట పడుగెడతాడు. మీ మనస్సు అక్కడ పెట్టడానికి మీరు చేస్తున్న పరిశ్రమకు ‘పూజ’ అని పేరు. అలా భగవంతునియందు మనస్సును కేంద్రీకరించి పూజ చేయడం అలవాటు చేసుకోవాలి. అది అలవాటు అయితే మీరు ఏ ప్రదేశంలో వున్నా పూజ చేసుకోగలుగుతారు. కాబట్టి పరమేశ్వరుడు హృదయగతాభిప్రాయమును పట్టగలిగినవాడు. దీనికే సర్వజ్ఞత అంటారు. సర్వజ్ఞత, స్వతంత్రత అనేవి రెండూ ఈశ్వరుడితో ముడిపడి ఉంటాయి. ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో వున్న ప్రాణుల హృదయాంతర్గత భాగములను తాను చూస్తాడు. చూసి ఆ భావముల పరిపుష్టి చేత మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు. పైకి చూస్తే ఈవిషయము మీకు ఒక్కనాటికీ దొరకదు.

శివమహా పురాణం భాగం: 3[మార్చు]

  • శాక్తేయ నాయనారు – నారదుడు మాయకు వశుడగుట

మనకు *పెరియపురాణం* అని ఒక గ్రంథం ఉంది. అది మనకి *నాయనార్ల చరిత్ర*ను తెలియజేస్తుంది. అందులో ‘శాక్తేయ నాయనారు’ అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తితత్పరుడు. కాని ఆయన ఉన్నరోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని, ‘శివ’ అన్న నామం పలకడం కాని, శివార్చన చెయ్యడం కాని కుదరని భయంకర పరిస్థితులు ప్రబలివున్నాయి.కానీ ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమభక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము నొకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్లి శివ నామములు జపిస్తూ ఆ శివలింగం మీద పూవులు వెయ్యాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరయినా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురి చేసేవారు. అపుడు ఆయన ఒక మార్గమును ఎంచుకున్నారు. శివార్చన చెయ్యనివాడిలా కనపడాలి పైకి. లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోర్కె తీరాలి. అందుకని ఆయన అటుగా వెళుతూ అన్నం తినేముందు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని శివా, నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను? అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి, నీవు శివుదివా?” అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనస్సులో భావిస్తూ, ఆ శివలింగం మీద పడేసేవారు. మరొక రాయిని తీసుకుని ‘నీవు శివుడివా? అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లెపువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు. నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరినా రాళ్ళకు బదులు చేమంతిపువ్వులు, మల్లెపువ్వులు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారముల ననుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు, ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు. అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థం అవుతుందా –శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. అదీ ఆయన పూజ! ఇది ఆర్తిలోనుంచి వచ్చిన పూజ.

ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అపుడు ‘శర్వతి’ అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది. ‘ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలి వెడితే దానిని జీర్ణం చేస్తున్న వాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద నాలుగు పువ్వులు వెయ్యడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గరనుంచి లేచి, భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్లి ‘శివుడివా’ అని నాలుగు రాళ్ళు తీసి శివలింగం మీద విసిరాడు. ఇలా తప్ప మరొకవిధంగా నీకు పూజ చేయలేక పోతున్నానయ్యా’ అని మనస్సులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజ మూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగిన వాడు. ఇదీ ఆయన స్వతంత్రత. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి నాలుగు రాళ్ళతో పూజ చేసిన మోక్షము యిచ్చిన వాడు శంకరుడు. అలా మోక్షమును యివ్వగల శక్తి ఈశ్వరునికి ఉంది. ఐడి మహేశ్వర శబ్దముచేత ప్రతిపాదించబడుతుంది. ఈశ్వరుని శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుని కనపడకుండా చేస్తుంది. ఈ మాయ ఈశ్వర వాక్కువలన, ఈశ్వర స్వరూపులయిన గురువాక్కుల వలన తొలగుతుంది. నిరంతర గురు వాక్శ్రవణమే మాయ తొలగేందుకు కారణం. అందుకే గురువులేని విద్య గుడ్డివిద్య. గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదుమాయ వలన ఈశ్వర దర్శనమును విస్మరించి ‘ఇదంతా నా ప్రజ్ఞ’ అని అంటాడు. . కామక్రోదాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. చంద్రశేఖర పరమాచార్య తన 73వ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది’ అని చెప్పుకున్నారు. మహాత్ములు విషయములను దాచరు. శివమహా పురాణం ఈ జ్ఞానమును ఉపదేశించడానికి ఒక అద్భుతమయిన ఘట్టమును తీసుకువచ్చి మీకు బోధచేసే ప్రయత్నమును ప్రారంభం చేస్తోంది.

ఒకానొక సమయంలో నారదమహర్షి హిమవత్పర్వతము క్రింది భాగమునందు, గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో, అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశారు. తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతునియందు మగ్నమై ఉండాలి. అది చంచలం అవుతున్నదీ లేనిదీ పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు మన్మథుడిని పిలిచి ఒకమాట చెప్పాడు.

‘మన్మథా, మహా సంయముడయిన నారదమహర్షి తపస్సు చేస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను, ఇంద్రియములకు చూపించి ప్రలోభపెట్టి, నారదుడు యింద్రియములకు వశుడవుతాడేమో చూడవలసినది అని చెప్పాడు. మన్మథుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు. నారదుడు లొంగలేదు. నారదుని తపస్సు సఫలీకృతం అయింది. ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి ‘ఈశ్వరా, హిమవత్పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను, మన్మథుడు వచ్చి నామీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను వాటిని లెక్కపెట్టలేదు. కామమును జయించి తపస్సునందు సిద్ధిని పొందాను’ అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం. ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి. నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి ‘నారదా, నీవు కాముడినే జయిన్చావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు’ అని చెప్పాడు. కానీ నారదుడు శంకరుని మాటలను పట్టించుకోలేదు. గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానములోనికి రానివిద్య. ఆ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది. అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్యవలన ప్రయోజనం లేదు. నారదుడు వైకుంఠమునకు వెళ్తూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు, సిద్ధిని పొందినట్లు చెప్పాడు. అపుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకుపూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మథుడు వస్తే మూడవ కంటి మంటచేత కాల్చివేశాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకుపూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం. నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు. అది శివ ప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు.

నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. వైకుంఠమునకు వెళ్ళాడు. నారాయణుడు ఎదురువచ్చి స్వాగతించాడు. అపుడు నారదుడు ‘స్వామీ, నేను తపస్సు చేశాను మన్మథుడు నామీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు. సిద్ధి పొందాను’ అని చెప్పాడు. అపుడు నారాయణుడు ‘ఎంత గొప్పపని చేశావయ్యా, శివుని తర్వాత మరల నీవే చేశావు’ అని మెచ్చుకున్నాడు. నారదునికి పుట్టం పెట్టి లోపల జ్ఞానము బాగా నిలబడేటట్లుగా చేయవలసిన అవసరం ఏర్పడింది అని నారదుని పంపించివేశాడు. ఇపుడు మాయ ప్రారంభమయింది.

నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యమును శీలనిది అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కుమార్తె, పేరు శ్రీమతి. నారదుడు శీలనిధి అంతఃపురంలోనికి వెళ్ళాడు. రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు. తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చి ఆమెచేత నారదునికి నమస్కారం చేయించి, తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినది అని కోరాడు.

నారదుడు త్రికాలవేది. ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడో, ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకం చేత పూజించబడుతూ ఉంటాడో, ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీమహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది’ అన్నాడు. అక్కడివరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండు అని లోపల అనుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు. స్వయంవరం పెట్టాము. స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది. అని చెప్పాడు. అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడు అని నారదుడు గ్రహించాడు. వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి ‘అయ్యా, నామనస్సు ఆ శ్రీమతిని పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళూరి పోతున్నది. ఆమె నాకు దక్కకపోతే మన్మథబాణముల చేత చచ్చిపోతాను’ అన్నాడు. ఇంతకు మునుపు మన్మథబాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఇదీ మాయ అంటే. నేను బతకాలంటే నాకు నీరూపం కావాలి. అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది. అందుకని దయచేసి నీ రూపమును నాకీయవలసినది’ అని అడిగాడు. శ్రీమహావిష్ణువు మహానుభావుడు. ఆయన హరి శరీరమునూ ఇచ్చాడు, శిరస్సునూ ఇచ్చాడు. హరి అనే పదమునకు రెండు అర్థములు – పాపములను హరించే శ్రీమహావిష్ణువు, కోటి. హరి శరీరమును కిందవరకు ఇచ్చాడు, కోతి తలను పైన యిచ్చాడు.

వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి అటూ ఇటూ రుద్రపార్షదులు కూర్చుని ఉన్నారు. ఈతని అలంకరణ చూస్తె మహావిష్ణువులా అలంకరించుకున్నాడు, పైన మాత్రం కోతి ముఖం ఇతని మేడలో ఎలా మాల వేస్తుంది అని అనుకుంటున్నారు. పక్కవాళ్ళు అసూయతో అలా అనుకుంటున్నారని అనుకుంటున్నాడు నారదుడు. శ్రీమతి దండ పట్టుకుని దగ్గరకు వచ్చింది. ఆమె నారదుని వంక ఒకసారి చూసి భ్రుకుటి ముకుళించి ఈ కోతి శిరస్సు ఏమిటి? ఈ రూపమేమిటి? అనుకుని వెళ్ళిపోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. వరమాల తీసుకువెళ్ళి ఆయన మేడలో వేసింది. ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.

అపుడు నారదునికి ఎక్కడలేని బాధా కలిగింది. పక్కన ఉన్న రుద్రపార్షదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. నారదుడు వారిద్దరినీ మీరు రాక్షస యోనులయందు జన్మించెదరు గాక అని శపించాడు. మాయా ప్రభావం కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్రపార్షదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు. నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్లి “శ్రీమన్నారాయణా! ఎంత పని చేశావు. హరిరూపము యివ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు. ఆమెను నాకు కాకుండా చేశావు. నీవు ఒకానొకనాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పది ఏడిస్తే, ఈ కోతిముఖం వున్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను శపిస్తున్నాను’ అన్నాడు. శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మమార్గము నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది. తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు. ఆత్మపరిశీలన చేసుకున్నాడు. మాయ తొలగింది. శ్రీమన్నారాయణుని చూసి యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి. గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా! ఇంకా ఎంత మాత్రము జాగు చెయ్యకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించెయ్యి. అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ళమీద పడ్డాడు. నారదుడు కాబట్టి మరల అంత తొందరగా స్వస్థితిని పొందగలిగాడు. మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము. పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణం అయింది. అదే రజకుడు మరల ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినపుడు, కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు యివ్వమని అడిగాడు. అపుడు ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలిచేసి మాట్లాడాడు. యుగం మారినా వాని బుద్ధి మారలేదు. అపుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వేయిముక్కలు చేశాడు. మీరు ఏ మంచి పనిచేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి. ‘నేను’ అనేమాట అంటే మాత్రం యిబ్బందిలోకి వెళ్ళిపోతారు. మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి. నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళము. ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపము. మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్ములను దగ్గరికి తీసి, మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీచేత ఈశ్వర సేవ చేయించి, ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామపాషములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తిపాశములుగా మారిపోతాయి. ఆవిడ మాయాశక్తి, స్వరూపిణి. మాయా పాశమును భక్తి పాశము చేస్తుంది. లోకమునందు పంచతన్మాత్రలను ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది. అది మహేశ్వరుని చేరుకోవడానికి మార్గం. ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ ఈశ్వర ప్రజ్ఞను ఈశ్వరానుగ్రహమును గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి.

శివమహా పురాణం భాగం: 4[మార్చు]

  • శంభునామ ప్రాశస్త్యము:

ఇదే పరమశివుని పక్కనే ‘శంభుః’ అని ఒక చిత్రమయిన నామంతో పిలుస్తారు. ‘శం’ అనగా నిరతిశయమయిన సుఖము. ‘భావయతి’ అనగా కల్పించేవాడు. ఒక వస్తువు మీచేత అనుభవించబడినప్పుడు ఆ వస్తువు సుఖానుభూతిని మీరు పొందగలరు. వస్తువు ఉండడానికి, అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఈశక్తి మీయందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు. ‘ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత’ అంటుంది రుద్రాధ్యాయం. సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు, సుఖంగా బ్రతకడం వేరు. ఒకడు కోటీశ్వరుడై ఉండి కూడా మిగిలిపోయిన చద్ది అన్నమును పులిసిపోయిన పెరుగుతో తింటాడు. కేవలం సుఖానుభావం కాదు.

లోకములు మూడు రకాలుగా ఉంటాయి. ఒక లోకము కేవలము సుఖములను అనుభవించడానికి ఉంటుంది. స్వర్గాది లోకములలో దుఃఖస్పర్శ ఉండదు. మరొక లోకం ఉన్నది అక్కడ సుఖమన్నది ఉండదు. అది నరక లోకం. ఈ రెండూ లోకములు కాక సుఖము, దుఃఖము రెండూ ఉన్న లోకం భూలోకం. ఇక్కడి నుండి మానవుడు పూర్ణ దుఃఖము కలిగిన లోకములోకయినా వెళ్ళవచ్చు, లేదా పూర్తీ సుఖము కలిగిన లోకములోకయినా వెళ్ళవచ్చు. లౌకికంగా కోరుకుంటే స్వర్గమును కోరుకోవచ్చు. అక్కడకు వెళ్ళాలంటే పాపము చేయకుండా ఉండాలి. ఇది శంభవ ఇతి – మంచిభావములను ఇచ్చుట. ఇది కలగడం అంత తేలికకాదు. శివ మహాపురాణం మీ జీవితమును సరిదిద్దుతుంది. మనం సాధారణంగా బ్రహ్మ మన లలాటం మీద రాసిన రాత ప్రకారం పనులు చేసేస్తూ ఉంటాము అని ఒక మాట అంటూంటాము. అది తప్పు శాస్త్రం అలా ఉండమని చెప్పలేదు. తిలకథారణం అనేమాట ఎందుకిచ్చారో తెలుసా? మీ ఆలోచనా సరళిని మార్చుకొని గత జన్మలుగా తరుముకు వస్తున్న వాసనలను జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి లలాటమునందు పెట్టుకొని, బొట్టు తీసుకొని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ లలాటమునందు వసించి ఉన్నారు.

లలాట లిఖితారేఖా పరిమార్తుం నాశక్యతే’ ఇది కదా సామాన్య సిద్ధాంతం. బ్రహ్మ రాసిన రాత మారదు. కానీ తిలకథారణ చేసి విభూతి పెట్టుకోగానే ఆలోచనా సరళియందు మార్పు వస్తుంది. సాత్త్విక ప్రవృత్తి ముఖలో కనపడిపోతుంది. ఆజ్ఞాచక్రం మీది బొట్టు అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరించడం మొదలవగానే మీ బుద్ధియందు ఆలోచన మారుతుంది. తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది. అందుకని మనస్సును జయించలేకపోతే ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనస్సును సంస్కరించడం దగ్గరకు వెళతారు. పెద్దలు ఇటువంటి ఆచారాలు ఏదో హాస్యాస్పదంగా పెట్టలేదు. కనుక తిలకథారణ చేసి భస్మం పెట్టుకుంటే మీరు దుఃఖమును స్వీకరించి దుఃఖమునుండి బయటపడతారు. మనస్సుకు రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉండడం వలన మీ మనస్సు పాపపు ఆలోచనల వైపు తిరుగుతోంది. ఈ త్రిగుణములు మనస్సును సుఖములను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. భగవత్సంబంధమయిన ప్రవచనములను వినడానికి వెళ్ళడానికి బదులు లౌకికమయిన కార్యక్రమములు మున్నగువాటిని చూడమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంటాయి. సంసారంలో ఉండి తరించడం చాలా కష్టం. త్రిగుణములనుండి బయటపడడానికే సంసారంలోనికి ప్రవేశించి సుఖములను అనుభవించి, ఈ సుఖములు సుఖములు కావు. నిజమయిన సుఖము ఈశ్వరుడే అనే లక్షనమును ఏర్పరచుకుని, వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం దానివలన ఇంద్రియములు మనస్సు చలించని స్థితికి వెళతాడు. ఇంద్రియములను గెలవడం కాదు, మనస్సుకడాలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు. పూర్ణ వైరాగ్యం పొందినవాడు జరిగేది అంతా ఈశ్వరలీల అంటాడు. అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహమే. ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖ స్థానమయిన ఈశ్వరుని యందు కలిసిపోతాడు. అప్పుడు వానికిక ఊర్ధ్వ అధో లోకములనేవి ఉండవు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్ష స్థితిని పొందుతాడు. ఇలా పొందడానికి ‘శంభు’ అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శివుడి పాదములను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఏమీ చేతకాకపోయినా శివనామములు చెప్పడం మొదలు పెట్టినట్లయితే మీకు తెలియకుండా ఒక రకమయిన మార్పు ప్రారంభం అయిపోతుంది. ఆ మార్పు మిమ్మల్ని మంచి ఆలోచనల వైపు తీసుకొని వెళ్ళగలదు.

ఇంతకుపూర్వం ద్వాపరయుగం వరకు ఒక లక్షణం ఉండేది. రాక్షసులు వారి గుణములను బట్టి తెలిసేవారు. కాబట్టి వారిని దూరంగా పెట్టడమో, పరమాత్మ వాడిని సంహారం చేయడమో జరిగేది. కానీ కలియుగంలో అలా కాదు. కలియుగంలో రాక్షసులు చిత్తవృత్తుల రూపంలో ఉంటాడు. పైకి దొరకరు. మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్లుగా సాధుపురుషుడిలా ఉంటాడు. అవతల వాడిని నమ్మించి మోసం చెయ్యాలనుకునే వాడు మాట కలిపి చక్కగా మాట్లాడతాడు. ఇపుడు రాక్షసుడు వాని చిత్తవృత్తియందు ఉన్నాడు. త్రేతాయుగంలో రాక్షసులు ఈ చిత్తవృత్తుల రూపంలో ఉండి ఉంటే విశ్వామిత్రుడు యాగం చేయలేడు. రాముడు పలు రాక్షసులను చంపడానికి తానే అనుసంధానం చేసుకోవలసి వచ్చేది. కానీ వారు బయట రాక్షసులుగా ఉన్నారు. కాబట్టి అపుడు రాముడు వచ్చి బాణం వేసి రాక్షసులను కొట్టి చంపాడు. ఈ యుగంలో అలా కుదరదు. రాక్షసులు మన మనస్సులలోనే ఉన్నారు. వారు ఎప్పుడయినా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు. అలా పడగొట్టే రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు. వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఈతడే శంభుః’. అందుకే ‘ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం’ అంటాము. ప్రదోషవేళలో ప్రతిరోజూ శంభు నామములు చెప్పినట్లయితే ఆయన మీలోని రాక్షస ప్రవృత్తులను తొక్కిపెట్టి మీ భావములయందు మంచి ప్రవాహమును ఏర్పాటు చేస్తాడు. ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత మీరు ఉన్నతిని పొందేస్తారు. శంభునామమును పట్టుకుని శంభుని అనుగ్రహమును పొందినవాని స్థితి ఎలా ఉంటుందో మనం రుద్రపశుపతి నాయనారు చరిత్ర చదివితే తెలుస్తుంది.

  • రుద్రపశుపతి నాయనారు:

అరువది మంది నాయనార్లలో రుద్రపశుపతి నాయనారు ఒకరు. సన్యాసి కూడా రుద్రం చదవాలి. అభిషేకం చేయకపోయినా రుద్రం పారాయణ చేస్తే వెంటనే పాపములు పటాపంచలు అవుతాయి. రుద్రపశుపతి నాయనారుకి ఒక లక్షణం ఉండేది. ప్రతిరోజూ కూర్చుని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు. అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది. అందులో ‘మేఘ్యాయచ విద్యుత్యాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ లప్యాయచ ఈద్రియాయచ ప్రేత్యాయచ శిఖత్యాయచ – ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నాడు. అనగా నీరు, నీటిమీద నురుగు, చెట్టు, చెట్టు మీద పిట్ట చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. నాయనారు తిరుమలయార్ ప్రాంతంలో ఉండేవారు. ఆయన ఈ రుద్రమును చదివి ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని వీటన్నింటినీ చెప్తుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను’ అన్నాడు.

ఒకరోజున తెల్లవారు జామున ఎవ్వరికీ చెప్పకుండా ఊరిబయటకు వెళ్ళిపోయారు. అక్కడ గల కొండమీద నుంచి ఒక సెలయేరు జాలువారుతోంది. ఆ సెలయేట్లో నడుంలోతు నీళ్ళలో నిలబడ్డాడు. చల్లని నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగలించుకున్న అనుభూతిని పొందారు. ఇవన్నీ ఈశ్వరుడు కదా. నేను ఈశ్వరుడిలో ఉన్నాను అని నమః ఫేన్యాయచ నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ’ అని పారాయణ చేసి బయటకి రాలేక రాలేక వచ్చేవాడు. ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మరల మధ్యాహ్నం సంధ్యావందనం కోసం ఆ చెరువు దగ్గరకు వెళ్ళిపోయేవాడు. నీళ్ళలో నిలబడి శివుని ధ్యానం చేసేవాడు. చుట్టూ కనిపిస్తున్న ప్రతివస్తువులో శివరూపమును చూసేవాడు. సాయంత్రం కూడా అదేనీటిలో అదే పరిస్థితి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. చివరకు రానురాను ఆయనకు ఎవరు కనపడినా ఈశ్వరుడే కనపదేవాడు. ఆఖరికి దొంగ కనపడితే “నమః చోరాయచ’ అనేవాడు. అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు. అపుడు శంకరుడు ఇకనేను తప్ప ఇంకొకడు కనపడని నిన్ను నాలోకే తీసుకోవాలి అని నాయనారుని తనలోకి తీసుకున్నాడు. అపుడు నాయనారు శివునిలో ఏకమయి పోయి తాను శివుడు అయిపోయాడు. దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నాయనారు భావనచేత మోక్షమును పొందినట్లుగా మనం గమనిస్తాము.

శం – భావయతి – మీయందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతిశయ సుఖ స్వరూపమయిన శివునియందు కలిసి మీరే శివుడు అవుతారు. అటువంటి స్థితి మనకు కలగడం కోసమే మహానుభావుడయిన పరమాత్మ మనకీ ఉపకారం చేశాడు. ఇటువంటి జ్ఞానమును శంభు స్వరూపం మనకు కటాక్షిస్తుంది. అందుకే ‘శంభుః’ అన్న నామం అంత గొప్ప నామం అయింది. పరమశివుని రూపములలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పది అయింది. ఆ నామములు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరించబడతాము.

ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్ఛేత్ జ్ఞానదాతా మహేశ్వరః’ ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమును ఇచ్చేవాడికి మహేశ్వరుడు అని పేరు. శంభునామమును మీరు గట్టిగా పట్టుకుని ఆ నామముతో పిలిస్తే, ఆయన మీ భావములను మార్చి మిమ్మల్ని ఈశ్వరుని వైపు తిప్పుతాడు. మీకు సత్ప్రవర్తన కల్పిస్తాడు. మిమ్మల్ని చక్కటి వాడిగా రూపు దిద్దుతాడు. కనుక మనం ప్రతిరోజూ శంభు నామమును చెప్పుకుంటూ శంభు అనుగ్రహమును పొందాలి. ఇదియే ‘శం’ – ఈ లోకంలో సుఖము దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖములను మీకు ఇవ్వడం. దీనినే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అనగా ఇక్కడ కోర్కెలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చెయ్యడం వరకు తీసుకువెళ్ళి ఆ తరువాత పుణ్యమును ఇచ్చి పుణ్యము వలన ఊర్ధ్వలోక ప్రాప్తివరకు ఇచ్చి తరువాత మరల తిరిగి రానవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి అనబడే మోక్ష స్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ ఆవిడ చేత పరిపాలించబడుతున్నాయి. ఆవిడ యవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టుమీద మీరు నిలబడతారో దానికి తగినట్లుగా మిమ్మల్ని నిలబెట్టదానికి ఈ నామములు ఈశ్వరానుగ్రహము మిమ్మల్ని రక్షిస్తాయి. రుద్రపశుపతి నాయనారు వృత్తాంతమే అందుకు ఉదాహరణ.

శివమహా పురాణం భాగం: 5[మార్చు]

  • శివనామములు: పినాకి – రుద్రుడు

స్వామిని పినాకి అని పిలుస్తారు. పినాకి అనే నామం చాలా చిత్రమయినది. పరమశివమూర్తి పట్టుకునే ధనుస్సు సామాన్యమయిన ధనుస్సు కాదు. మేరుపర్వతమును ధనుస్సుగా పట్టుకుంటారు. శంకరుడు రాక్షస సంహారం చేస్తే తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు. వేరొక రూపమును తీసుకొని సంహారం చేయడు. కానీ శివుడు ధనుస్సు పట్టుకున్నట్లు మనకు శాబ్దికముగా తెలుస్తుంది. వేదముల వలన తెలుస్తుంది. యజుర్వేదంలో శ్రీరుద్రం “నమస్తే రుద్రా మన్యవ ఉతోత ఇషవే నమః” అని ప్రారంభమవుతుంది. స్వామీ మీ కోపమునకు ఒక నమస్కారం – ఆ మాట చెప్తున్నారు. కోపంగా ఉన్నవాడు తన చేతిలో ఉన్న ఆయుధము నుండి బాణములను విడిచిపెడతాడు. ఇవి మిమ్మల్ని రోడింపజేస్తాయి. మరి ఆయన ఎందుకు అలా ధనుస్సు పట్టుకోవాలి? రుద్రుడు మనం చేసిన తప్పులకు మానను శిక్షించడానికి ధనుస్సును పట్టుకుని ఉన్నాడు. అదే మేరుపర్వతము. బంగారు ధనుస్సు! ధనుస్సు సంధించడానికి రెండు పక్కలా తూణీరములున్నాయి. దీనిని ఈశ్వరుని ఘోర రూపము అంటారు. మీరు చేసిన పాప ఫలితం ఉంది. మీరు బాధ పడితే తప్ప ఆ పాపం పోదు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలి. అందుకు గాను బాణములను తీస్తున్నాడు. ఈ శరీరంతో ఉన్నప్పుడు సుఖమును, దుఃఖమును రెండింటినీ అనుభవిస్తాము. ఈ శరీరంతో పాప పుణ్యములను రెండింటినీ చేస్తాము. తప్పు చేశాము కాబట్టి దుఃఖము అనుభవించాలి. ‘నేను పాపము చేశాను కానీ నన్ను అంత ఏడిపించకు. తట్టుకోలేను. నేను ఏడిస్తే చివరకు నీ పాదముల యందు విస్మృతి కలుగుతుంది నేను ఆ ఏడుపులో ఉండిపోతాను. నేను ఆ బాధలో ఉండడంలో నా జీవితంలో కొంతకాలం నీ పాదములకు దూరం అయిపోతాను. నిష్ఠతో నీ పాదములను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఈశ్వరా, నీ కోపమునకు ఒక నమస్కారం, ఈశ్వరా, నీ ధనుస్సుకు ఒక నమస్కారం, నీ బాణములకు ఒక నమస్కారం.
యా త ఇషుపశ్శివతమాశివం బభూవ తే ధనుః
కాబట్టి నీవు మేము సంతోషించే బాణములు వెయ్యాలి. నాయందు దయవుంచి నన్ను నీ త్రోవలో పెట్టుకో. అని ప్రార్థిస్తే ఇప్పుడు ఆయన ప్రసన్నుడు అవుతాడు. ఇప్పుడు ఆయన పట్టుకున్న ధనుస్సుకు, మొదట్లో పట్టుకున్న ధనుస్సుకు తేడా కనిపిస్తుంది. పినాకిని అనే శబ్దమును మీ జీవితమునకు అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఇలానే మాట్లాడింది. ఇదీ అసలు ధనుస్సు. మీరు తప్పు చేస్తే ఘోరరూపంతో ఈశ్వరుడిని చూడవలసి వస్తుంది. తప్పు చేశానని చెప్పుకోవలసిన రోజు మీ జీవితంలో ఎందుకు రావాలి? మీరు జీవితంలో శాంతమయిన శివ దర్శనమును కోరుకున్నవారాయి ఉండాలి. అనగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి.

ఆయన బంగారు ధనుస్సును పట్టుకుని మీరు చేసిన పాపములకు తగిన శిక్షను విధిస్తూ మీ పాపములను పరిహారం చేస్తునాడు. ఎంత పాపం చేసిన వాడయినా ఆయన పాదములు పట్టుకున్న వాడయితే ఆయన పాదములయందు విస్మృతి కలగవలసిన అవసరం లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖమును మాత్రమే యిచ్చి తప్పిస్తాడు. కాబట్టి మీకు ఇప్పుడు శిక్ష వేయడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డలను చూసుకున్నట్లు చూసి కొడతాడు. కాబట్టి ఈశ్వరా మీరు ప్రసన్నమూర్తియై కనపడండి అని కోరుకుంటాము. అసలు సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టటానికి, మీరు చేసే పాపమునకు ఫలితం ఇచ్చేవాడు ఒకడు, మీ భయం తీయడానికి ఒకడు వేరుగా ఉండరు. ‘భయకృత్ భయనాశానః’ – భయమును సృష్టించే వాడు పరమాత్మే. భయమును తీసేసే వాడూ పరమాత్మే. ఇది సనాతన ధర్మమునందు ఉన్న జీవధార. కష్టమును కలిగించడానికి, కష్టమును తొలగించడానికి ఈశ్వరుడే కారకుడు. ఆ కష్టమును కాలములో మీరు మరిచేపోయేటట్లు చేసే కాలస్వరోఉదు కూడా ఈశ్వరుడే. గురుస్వరూపియై మరల వచ్చి మీ మనస్సుకు తగిలిన గాయమును మాన్పించి మిమ్మల్ని మరల యథామార్గమునందు మళ్ళీ తిప్పేవాడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుని కారుణ్యమునకు అంతులేదు. కాబట్టి ఆయన పట్టుకున్న ధనుస్సు మనకు ఎల్లప్పుడూ రక్షణే కల్పిస్తుంది. కాబట్టి శాస్త్రము ‘పాతీతి పినాకః’ అని చెప్పింది. ఈ ధనుస్సు మీకు ఘోర రూపముతో పాఫలితమును ఇచ్చినా అఘోర రూపముతో సుఖమును ఇచ్చినా అది చేస్తున్నది మీ రక్షణే! కనుక ఆ ధనుస్సు లోకములను రక్షించగలిగినది. అందుకే రుద్రము ఆ ధనుస్సును అంత స్తోత్రం చేసింది. ఆఖరున ఈ సమస్త లోకములను లయం చేస్తున్నప్పుడు అందరిని ఏడిపించే వాడు ఎవడో వాడు రుద్రుడు. మనకి మూడు ప్రళయములున్నాయి. నిత్య ప్రళయము – నిద్రపట్టేటట్లుగా ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు సుఖమును కల్పించడం నిత్యప్రళయము. రెండవది అత్యంతిక ప్రళయము – బాగా సాధన చేసి భక్తితో భగవంతుని చేరుకోవడానికి అడ్డంగా వున్న ప్రతిబంధకమును గుర్తించి వాటిని తొలగ తోసుకుని, భక్తితో కూడిన కర్మానుష్టానము చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానమును పొంది అద్వైత సిద్ధిచేత మోక్షానందమును పొందేటట్లుగా యోగ్యతను సంతరించుకున్నవాడు, ఈశ్వర కటాక్షము చేత మోక్షమును పొందడమే అత్యంతిక ప్రళయము. ఇది కూడా ఈశ్వరానుగ్రహమువలననే సిద్ధిస్తుంది. రమణమహర్షి వంటి మహాభాగులు ఈవిధంగా మోక్షమును పొందుతారు. మూడవది మహా ప్రళయము. అత్యంతిక ప్రళయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోతారు. ఈశ్వరుడిని తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు. వాళ్ళు ఏడుస్తున్నా వాళ్లకి సిద్ధిని ఇచ్చేస్తాడు. అల చేసిన రుద్రుడు చేతి ధనుస్సు సాత్త్వికమైనది, లోక రక్షణ హేతువైనది. అది కూడా ఆయన అనుగ్రహము. ఈ శరీరముతో ప్రయోజనమును సిద్ధింపచేసినందుకు ఈశ్వరుని ప్రార్థిస్తూ, ఈశ్వరునిలోకి చేరుతూ ఈ శరీరమును వదలాలి. ఇందు నిమిత్తం ధర్మమును పట్టుకోవాలి. ధర్మము తప్ప వేరొక మార్గం లేదు. ఇదే శాబ్దిక ప్రమాణమయిన వేదము. ఈ వేదమును ఎవడు ఇచ్చాడో వాడు రుద్రుడు. ఆ రుద్రుడు వేదముచేత ప్రతిపాదింపబడిన ధర్మమూ మనకు బాగా అర్థం అయేటట్లుగా గురురూపంలో వచ్చి చెప్పి, పరమాత్మవైపు అడుగులు వేసేటట్లు బుద్ధిని చక్కదిద్దుతాడు. కనుక ఈ ధర్మం వైపు మన మనస్సు నడిచేలా చెయ్యగలిగిన వాడు ఎవడో వాడు రుద్రుడు. అది వాడి చేత పట్టుకున్న పినాకము. దాని నారి శబ్దములే వేదములు. కాబట్టి ఇపుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు అటువంటి వేదము మానను ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చింది. ఆశాపాశములు ఎన్నింటితోనో తిరుగుతూ ఉంటాము. ధర్మం వైపు అడుగు పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అటువంటి అనుగ్రహమును ఇచ్చి నడిపించేవాడు ఎవరో వాడు రుద్రుడు.

రుద్రా శబ్దములో ‘రుత్’ అన్నమాట ఉంది. ఈ రుత్ – భర్తేభ్యోద్రావయతి – రుత్ అంటే ప్రతిబంధకము – అడ్డము. ఒక అడ్డం ఉండడం వలన వ్యక్తి ఈశ్వరుడిని చేరలేక పోతున్నాడు. మనస్సు ఈశ్వరాభిముఖం కావడం లేదు. ఎవరు భగవంతుని నిజంగా కోరుకుని నేను ఈ కోరికల వలన నిన్ను పొందలేక పోతున్నాను. వీటినుండి నా మనస్సు మరల్చు అని ఈశ్వరుడికి చెప్పుకున్నాడో, ఆ నిజాయితీకి పొంగిపోయి ఈశ్వరుడు ప్రతిబంధకమును తీసేస్తాడు. మీరు ఈశ్వరుడిని చేరడానికి ఏది ప్రతిబంధకమో ‘నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఉషావే నమః’ అని అభిషేకం చేస్తే రుద్రమును పారాయణ చేస్తే, శివాష్టోత్తరం చదివితే ఆయన ఆ ప్రతిబంధకమును తీసేస్తాడు. ఇది ‘రుద్రః’ – అందుకని ‘నమస్తే రుద్రమన్యవ’ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనుస్సును రుద్రశబ్దంతో కలపడంతో కలపడానికి కారణం అది.

రోదయతి శత్రూన్ ఇతి రుద్రః – ఇప్పటివరకు మిమ్మల్ని ఏడిపించిన వారు, లేదా లోకమునకు శత్రువులు అయిన వారు రాక్షసులు ఒంట్లో బలం ఉన్నది కదా అని ఈశ్వర మార్గమును విస్మరించి తిరిగారు. అటువంటి వాళ్ళను మట్టు పెట్టగలిగిన వాడు రుద్రుడు – వాళ్ళని ఏడిపించగలిగిన వాడు. రోదనం ద్రావయతి ఇతివా రుద్రః – నీకు ఏదో ఒక కారణం చేత అపారమయిన దుఃఖము ఉంది. ఈశ్వరానుగ్రహం బాగా ఉన్నట్లయితే ఆ వస్తువును శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళముందే ఉంచి, ఒక్కొక్కసారి మీకు లేనిది చేయవచ్చు. శంకరుడు ధనుస్సు పట్టుకుంటే వేదములో దీనికి సంబంధించిన మంత్రములు ఎన్నో వచ్చాయి. ఇలా ఎందుకు రావాలి అని అడిగారు. – “పినాకః త్రిపుర దాహకాలే జ్వాలా జాలైర్నాకం పిహితవాన్ పినాకః తదా మేరు ధనుస్త్వాత్” అన్నారు. లోకమునందు ఎక్కడా లేని రీతిలో బంగారుదయిన మేరు పర్వతమును తన చేతిలో ధనుస్సుగా పట్టుకుని నిలబడినవాడు. అటువంటి ధనుస్సు కాంతులచేత సమస్తలోకములు కప్పబడిపోయి రాత్రి అనక, పగలనక బంగారు కాంతి యందు అన్ని లోకములు ఎప్పుడు ప్రకాశించాయో అలా ధనుస్సు చేతిలో ఎవడు పట్టుకున్నాడో, వాడిచేతి ధనుస్సే చిత్రం. అలా ధనుస్సును పట్టుకున్నాడు కాబట్టి అతనిని ‘పినికి’ అని స్తోత్రం చేస్తున్నారు. కాబట్టి అన్ని విషయములను సమన్వయము చేస్తూ మనకి పెద్దలు ఆయన చేతిలో ఉన్న ధనుస్సు మనలను ఇన్ని రకములుగా ఉద్ధరించగలదు అని చెప్పారు. అందువలన ధనుస్సును చూడడం, ఆ ధనుస్సు గురించి చెప్పిన రుద్రమును పారాయణ చేయడం ఆ రుద్రంతో అభిషేకం జరుగుతుంటే ప్రశాంతంగా కూర్చుని వినడం, మీకు చేతనయితే మీరే కూర్చుని చదువుకుని మురిసిపోవడం నేర్చుకోవాలి.

శివమహా పురాణం భాగం: 6[మార్చు]

  • శశిశేఖరుడు – జ్యోతిర్లింగములు

‘శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః’ – ఆయనను శశిశేఖరః’ అని పిలుస్తారు. శశము అనగా కుందేలు. దూకే స్వభావం ఉన్నది. దూకేస్వభావం ఉన్నది కాలము. సుఖము చేత కాలము దూకేస్తుంది. దుఃఖములో వుంటే కాలము గడుస్తున్నట్లు అనిపించదు. దాంట్లో అర్థం చేసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది. మీరు దానిని పట్టుకుంటే ‘శశిశేఖరః’ అన్నమాటకున్న తాత్త్వికమయిన అర్థం అర్థం అవుతుంది. కాలంలో సుఖదుఃఖములు రెండూ ఉంటాయి. దూకేసినట్లు కనపడిన కాలమును, దూకనట్లు కనపడిన కాలమును వైదిక సమన్వయము చేస్తే మీరు రోజూ చెప్పేటప్పుడు కాలమును ఎలా చెప్పుతారు? శ్రీవిరోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే పంచంయాం భూమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథే శ్రీమాన్ శ్రీమతః’ అని చెప్తాము. ఎవడు ఆయన పాదములు పట్టుకున్నాడో అటువంటి వాడికి జ్ఞానమును ఇచ్చి కాలాతీతుడిని చేసి, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కలిగించగలడు. కాలము ఆభరణముగా కలిగిన వాడని చెప్పడానికే చంద్రరేఖను పొంది ఉంటాడు. మోక్షం ఇవ్వగలవాడని చెప్పడం కోసమే చంద్రరేఖను ధరించి ఉండడం. ఇదే శశిశేఖర అన్నమాటకు అసలు తాత్త్వికమయిన రహస్యం.

కానీ మనం సోమనాథ లింగము అన్నమాటను ప్రస్తావన చేస్తాము. శాస్త్ర సంబంధం అయిన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమయిన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి దానిని జ్యోతిర్లింగం అంటే శాస్త్రం అంగీకరించదు. దానిని అష్టమూర్తులయందు ఒక లింగము – పృథివీలింగము అని పిలుస్తారు. పంచ భూతలింగములలో ఒకటి.

కాళహస్తిలోని లింగము వాయులింగము. అది జ్యోతిర్లింగం కాదు. జంబుకేశ్వరంలోని శివలింగం జలలింగం. అది జ్యోతిర్లింగం కాదు. కానీ కొన్ని శివలింగములను జ్యోతిర్లింగములు అని పిలుస్తారు.

సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం” అని మనం ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం చదువుతుంటాం. ఈ పన్నెండింటినీ మనం జ్యోతిర్లింగములని పిలుస్తున్నాము.
సోమనాథుడు – సోమనాథ్ – గుజరాత్;
మల్లికార్జున స్వామి – శ్రీశైలం - ఆంధ్రప్రదేశ్;
మహాకాలేశ్వరుడు - ఉజ్జయిని – మధ్యప్రదేశ్;
అమలేశ్వరుడు – ఓంకారేశ్వరం – మధ్యప్రదేశ్;
వైద్యనాథుడు – పర్లి – మహారాష్ట్
ర; భీమశంకరుడు – పూణే – మహారాష్ట్ర;
రామలింగేశ్వరుడు – రామేశ్వరం – తమిళనాడు;
నాగేశ్వరుడు – ఔండా – గుజరాత్;
విశ్వనాథుడు – వారణాసి – ఉత్తరప్రదేశ్;
త్ర్యంబకేశ్వరుడు – నాసిక్ – మహారాష్ట్ర;
కేదారేశ్వరుడు – కేదారనాథ్ – హిమాచల్ ప్రదేశ్;
ఘ్రుష్ణేశ్వరుడు – వెరుల్ – మహారాష్ట్ర.

జ్యోతిర్లింగములని మనం వాటిని పిలిచినప్పుడు ఈ పన్నెండు చోట్ల జ్యోతి ఉండాలి. కానీ మనం ఆయా క్షేత్రములకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ మనకు శివలింగమే కనపడుతుంది. కానీ జ్యోతి కనపడదు. అయితే ఈ పన్నెండింటిలోనే జ్యోతిర్లింగములని ఎందుకు అంటారు? దీనికి సమాధానం “ఆపాతాళనభఃస్థలా” అని రుద్రమునకు ఉన్న ప్రార్థనా గద్యయందు చెప్పారు. మీరు ఆ లింగం దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యమునుండి మోక్షము వరకు ఏదయినా ఇవ్వగలిగిన పరబ్రహ్మ స్వరూపంగా ఆ శివలింగం ఉంది.ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా కోరికలు తీరవలెనన్నా శివుడిని అర్చించాలి. కోర్కె తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చేయగలిగిన శివలింగములు ఏవి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభు – ఒకరు ప్రతిష్ఠించినవి కావు. ఈశ్వరుడు చిత్రవిచిత్రమయిన పరిస్థితులలో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మనం స్థల పురాణములను పరిశీలించాలి. ఆయా కథలను తెలుసుకుని స్మరించడం చేత స్వయంభువు అయిన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభఫలితములను ఇస్తాడు. ఆయా కథలను వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనస్సు ఆయా క్షేత్రముల వద్దకు వెళ్ళిపోతుంది.

‘శశిశేఖరః’ అన్న నామము వ్యాఖ్యానం చేస్తూ అంటారు – దక్ష ప్రజాపతికి 27మంది కుమార్తెలు. ఈ 27మంది కుమార్తెలే అశ్వని భరణి మున్నగు పేర్లు కలవాళ్ళు. వారిని చంద్రునికిచ్చి వివాహం చేశాడు. పూర్వం దక్షిణనాయకత్వం అని ఒకటి ఉండేది. విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రామరాయల వారికి అనేక భార్యలు ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. పూర్వం అలా దక్షిణ నాయకత్వం ఉండేదో. తన భార్యలతో చంద్రుడు సంతోషంగా ఉండాలి. కానీ చంద్రుని చరిత్రయందు ఒకదోషం ఉంది. ఆయన కొంచెం తొందరపడిపోవడం యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీపట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్ళతో రమించడం కూడా చంద్రుని చరిత్రలో ఒకచోట ఉంది. ఈ అలవాటు ఫలితం ఎక్కడో రావాలి. అందుకుగాను శివుడు తన ధనుస్సులోంచి చంద్రునకి పాపఫలితం ఒకదానిని ఇస్తున్నాడు. చంద్రుడు తన భార్యలలో రోహిణి మీద అధిక ప్రేమను కనపరచాడు. ఇది సహజంగా మిగిలిన 26మందికి బాధ కలిగించింది. వాళ్ళు తండ్రిగారి వద్దకు వెళ్లి ఈ విషయమును చాలా బాధపతుతూ చెప్పారు. విన్న తండ్రి మనస్సు ఎంతగానో క్రున్గింది. ఆయనకు చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. వెంటనే దక్ష ప్రజాపతి చంద్రలోకం వెళ్ళాడు. అల్లుడయిన చంద్రుడు ఆయనకు ఎదురు వచ్చి తీసుకు వచ్చి కూర్చోపెట్టాడు. అపుడు దక్షుడు చంద్రునితో ‘నీకు నేను నా 27మంది కుమార్తెలను యిచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జాగ్రత్తగా సమానంగా చూసుకుంటాను అని మాట ఇచ్చావు. కానీ నీవు ఒక్క రోహిణితో మాత్రమే ఉంటున్నావని తెలిసింది. అందరినీ సమానంగా చూసుకో” అని చెప్పాడు. తప్పకుండా ఆయన మాట ప్రకారం నడుచుకుంటాను అని బదులిచ్చాడు. కొంతకాలం గడిచింది. కానీ అల్లుడి ప్రవర్తనలో ఏమీ మార్పులేదని, రోహిణి తప్ప మిగిలిన కుమార్తెలందరూ పూర్వంలాగే బాధపడుతున్నారని దక్షప్రజాపతికి తెలిసింది. దక్షునికి కోపం వచ్చి నీ విశ్రుంఖలత్వమునకు అడ్డుకట్ట వేస్తాను. నీవు క్షయవ్యాధి పీడితుడవు అవుదువు గాక’ అని శపించాడు. దీనివలన పూర్వం సంతోషపడిన రోహిణి కూడా చంద్రుడిని దగ్గరకు రానీయదని ఆయన ఉద్దేశం. ఫలితంగా చంద్రునికి క్షయవ్యాధి వచ్చింది. దాని ఫలితంగా దేవతలందరూ నీరసపడి పోయారు.

చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఓషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేయాలి. ఆ హవిస్సులను దేవతలు తీసుకుంటారు. అపుడు దేవతల ఆకలి తీరినట్లయితే వారు మనకు మంగళములను ఇస్తారు. చంద్రునికి క్షయ వ్యాధి సోకడం చేత దేవతలకు హవిస్సులు లేవు. ప్రజలకు మంగళములు లేవు. అటు దేవతలు, ప్రజలు మాడిపోయారు. ఇప్పుడు ఇది అన్ని లోకముల సమస్య అయి కూర్చుంది. ఇపుడు వీళ్ళందరూ తమలో తాము చర్చించుకుని అత్రి మహర్షిని పిలిచి అందరూ కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు –

“నేను లోక్ష సంక్షేమం గురించి చెప్తున్నాను. ఇపుడు చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళాలి. ప్రభాస క్షేత్రం సముద్రపు ఒడ్డున ఉంది. ఆ క్షేత్రంలో ఒక గుంత త్రవ్వి అందులో ఒక పార్థివలింగమును పెట్టుకుని పంచాక్షరి మహా మంత్రం జపమును, మృత్యుంజయమంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కునూ, అటు చంద్రుడినీ చచ్చిపోకుండా కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరోకనికి సాధ్యం కాదు. కాబట్టి శంకరుడు మాత్రమే ఈ పనిని చేయాలి. అందుకని అక్కడికి వెళ్లి పార్థివలింగమునకు అర్చన చేయమనండి” అని చెప్పాడు.

వెంటనే చంద్రుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్లి పంచాక్షరీ మంత్రమును, మృత్యుంజయ మహా మంత్రముతో అనుసంధానం చేశాడు. ఇపుడు ఎవడు వ్యాధిని ఇచ్చాడో వాడే – ‘శివా శరవ్యాయా తవ త యా నో రుద్రా మృడయ’ – రక్షించాలి. కొన్ని కోట్ల జపం అయిపోయిన తర్వాత భగవానుడు శంకరుడు, పార్వతీ సహితుడై ప్రత్యక్షమై ‘ఏమిటి నాయనా నీ అభీష్టము’ అని అడిగాడు. అపుడు చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గిపోయేలా చేయమని పరమేశ్వరుని ప్రార్థించాడు. ఇపుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు. కానీ అలా అనినట్లయితే దక్ష ప్రజాపతి మాటకు విలువ లేనట్లవుతుంది. ఆయన మాట నిలబడాలి, తప్పు చేసిన వాడయినా తన పాదములు పట్టుకున్నాడు కాబట్టి అతని బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే తరువాత చంద్రుడు తన 27మంది భార్యలతో సమానంగా లేదు అని చెప్పడానికి ఉదాహరణమే చాద్రమానంలో దీనిని చెప్తున్న తిథులు. పరమేశ్వరుడు బుద్ధిని ధర్మం వైపు మారుస్తాడు కాబట్టే ఆయనకు మనం రుద్రశబ్దమును ఉపయోగించాము. చంద్రునితో ‘నీకు క్షయ ఉంటుంది. కానీ నీవు పదిహేను రోజులు క్షీణిస్తావు, పదిహేను రోజులు వృద్ధి పొందుతుంటావు. క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు. ఎప్పుడూ హాయిగా ఉంటావు. ఇపుడు నీ చరిత్ర మారిపోయింది. నీవు పూర్తిగా గొప్పవాడివయ్యావు. నీవు నా చేత అనుగ్రహింప బడినవాడివని తెలుసుకోవడానికి నాతొ కలిపి నీ దర్శనం చేయించడానికి నాపేరే నీతో కలుపుకుంటాను. చంద్రశేఖర అని పిలిపించుకుంటాను’ అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకున్నాడు. ఇదీ ఆయన కారుణ్యం అంటే.

అందుకని తప్పులు జరిగిన వాటికి వేళ్ళు విరవకండి. ఇంత కారుణ్య మూర్తి అయిన శంకరుని పాదములు పట్టుకున్న వాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తిమీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకనే శంకరుని ‘శశిశేఖరః’ అని పిలువవలసి వచ్చింది. చంద్రుని క్షయ వ్యాధి పోయింది. చాంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీ దేవికి గొప్ప భక్తుడు అయ్యాడు. అందుకే మనుః చంద్రః కుబేరశ్చ లోపాముద్రా చ మన్మథః

అగస్తి రగ్ని సూర్యశ్చ ఇంద్రః స్కందశ్శివస్తదా క్రోధభట్టారకో దేవ్యాః ద్వాదశామీ ఉపాసకా!! (సౌభాగ్య భాస్కర భాష్యం) సూర్యుడు, స్కందుడు – అని పన్నెండుమంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు.

శివమహా పురాణం భాగం: 7[మార్చు]

  • సోమనాథుడు

శంకరుడు చంద్రుడిని నెత్తిమీద పెట్టుకోవడం మంచిదే.ఇక్కడే ఒక చిత్రం జరిగింది. అదే సోమనాథ లింగం. స+ఉమ+నాథుడు=సోమనాథుడు. అనగా పార్వతీదేవి పక్కన ఉన్న కారుణ్యమూర్తి. సశక్తిపరుడు. ఇది ఒక అర్థం. మరొక అర్థం ఉంది. సోముడు అనగా చంద్రుడు. సోముడు ప్రార్థన చేశాడు. ‘నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తరా ఎవరు వచ్చినా రక్షించడానికి ఇక్కడే వెలయవలసినది’ అన్నాడు. అపుడు శివుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలశాడు. అందుకే అది స్వయంభూ జ్యోతిర్లింగములలో మొట్టమొదటి లింగము. మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అక్కడికి వెళ్ళి సోమనాథ జ్యోతిర్లింగమును దర్శించుకుంటే దీర్ఘకాలంగా పీడిస్తున్న వ్యాధులు నయం అవుతాయని, భవిష్య జన్మలో చేసిన పాపముల వలన భయంకరమయిన కుష్ఠు మొదలయిన వ్యాధులు రావలసిన పాపములు ఖాతాలో ఉండిపోయినా అవి భగ్నం అయిపోతాయని సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది. సోమనాథ దేవాలయం శ్రీ సర్దార్ వల్లభాయ్ సారథ్యంలో పునర్నిర్మాణం అయింది. ఈ లింగం మీద కన్నుపడే ఈ సోమనాథ దేవాలయమును పూర్వం ఎందఱో ఎన్నో మార్లు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కుమనిషి అనిపించుకున్న భారతదేశపు తోలి ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి, సోమనాథ దేవాలయమును పునర్నిర్మాణం చేసి, అత్యద్భుతంగా రూపుదిద్దారు.

  • శ్రీశైల క్షేత్రం:

శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంధ్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని చెబుతారు. కానీ దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు.

గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుహ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అపుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.

సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. అపుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. అపుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. మనం అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.

అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామీ వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు.

శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని. అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.

శివమహా పురాణం భాగం: 8[మార్చు]

  • హాటకేశ్వరం

శ్రీశైలంలో హాటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండపెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమ పావనమయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.

పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉంది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.

అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.

శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది. అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది. అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు. మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈవిధంగా నరసింహ స్వామీ దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ.

అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.

శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

శివమహా పురాణం భాగం: 9[మార్చు]

  • మహాకాళేశ్వరం – ఉజ్జయిని

అవంతికాయాం విహితావతారం, ముక్తి ప్రదానాయచ సజ్జనానాం!
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం!!
(ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – 3)

ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహా కాళుడికి నమస్కారం చేస్తున్నాము. సజ్జనులకు ముక్తినిచ్చువాడు. అయితే సజ్జనుడు అనగా ఎవరు? పరమేశ్వరార్చన చేసేవాడికి సదాచారము తెలిసి ఉండాలి. శౌచము తెలిసి ఉండాలి. ఈ సదాచారం పథ్యం లాంటిది భగవద్భక్తి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని పథ్యం పాటిస్తే భవరోగమనే రోగం తగ్గుతుంది. కానీ లౌకికంగా బయటవచ్చే వ్యాధికి, భగవత్సంబంధంలో వచ్చే భవరోగమునకు ఒక తేడా ఉంది. ఒకనికి ఆచారం, శౌచం తెలియదు. తెలిసి మానిన వాడు కాదు. కానీ ఆయన గుండెల నిండా భక్తి ఉంది. కానీ శౌచం లేకపోయినా వాని భక్తి వృధా పోదు. సదాచారం తెలిసీ దానిని విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అతని అక్కరకు రాదు. ఆచారం తెలిస్తే పాటించాలి. తెలిసి ఉన్నది అనుష్ఠాన పర్యంతం రావాలి. ఏమీ తెలియనప్పుడు ఆచారమయినా అది తెలియక పొరపాటు చేసినా ఈశ్వరుడు దానిని పక్కన పెట్టి ఏలుకుంటాడు. మాహాకాళ దర్శనమునందు ‘సజ్జనానాం’ అనేమాట ఎందుకు వాడారో గుర్తెరిగి ప్రవర్తించాలి. అందుకే మహాకాళుడన్నమాట. కామమును పోగొట్టు వాడు, కాలారి, కామారి అనే రెండు మాటలను పరమశివునికి వాడతారు. కాలారిగా అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుని యందు ప్రవర్తించాలి. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనగా స్త్రీ అని, అక్క అని రెండు అర్థములు. అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపము. మనకి మోక్షపురులు ఏడు ఉన్నాయి. వీటిలో జగద్విఖ్యాతి గాంచిన పట్టణం అవంతి – ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఒకపక్క మహా కాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత కూడా అంత ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాల స్వరూపములై ఉన్నాయి. ఇవి లయకారకములై ఉంటాయి. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్న పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసు ఇద్దరూ నడయాడిన ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఈ ఉజ్జయిని పట్టణంనందు వేదప్రియుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనా శీలుడై శాత్కాలముల యందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దానియందు అపారమయిన ధృతి కలిగిన బ్రాహ్మణుడు. వేదప్రియుడికి నలుగురు కుమారులు. నలుగురు సుగుణోపేతులే. తండ్రిగారు ఎంత ధర్మానుష్టాన పరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్టాన పరులు. దొరికిన దానితో తృప్తిగా జీవించేవారు. ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు, రెండవ వానికి ప్రియ మేథుడు, మూడ వానికి సుకృతుడు, నాల్గవ వానికి సువ్రతుడు అని పేర్లు పెట్టుకున్నాడు. ఆ నలుగురు పిల్లలు వృద్ధిలోకి వచ్చారు.

ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరములలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఏదయినా కష్టం వచ్చినప్పుడే పరీక్షకు నిలబడినప్పుడే వాటి వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి. కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబమును ప్రకాశింపచేయాలనుకున్నాడు. భగవంతుడు భక్తుల యెడ అంత ఉదారుడై ఉంటాడు. దూషణుడు అనే రాక్షసుడు లోకం అంతటా బాధలు పెడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎక్కడా ఎవరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు. ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు నన్ను మాత్రమే అర్చించాలి, మీరు శివపూజను విదిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చేయనా? అని అడిగాడు వాళ్ళు కనీసం బెదరకుండా శంకరుని రక్షణ యందు మనం ఉండగా మనకు భయం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారు. దూషణుడు ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వేయబోతున్నాడు. అయినా వాళ్ళు కదలకుండా హర ఓం హర అంటూ అలానే ఆరాధన చేస్తూ కూర్చున్నారు. ఏ రూపంలో వస్తున్న మృత్యువునైనా ఈశ్వరుడు తప్పించగలడు. ఇక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమయిన రూపం కాదు. స్వామి మహాకాళ రూపంలో వచ్చి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారమునకు దూషణుడి సైన్యములు బూడిద రాశులై పడిపోయాయి. ఆ రూపము అత్యంత వేడితో వచ్చింది కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న బ్రాహ్మణ కుమారులను చెనకలేదు.బ్రాహ్మణ కుమారులు ఆ రూపమును చూసి ఆశ్చర్యం పొంది చచ్చిపోయే వారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు.

ప్రదోష వేళలో శివమహాపురాణాంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు చదవడం చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసినట్లే. ఆ ఫలితం ఉత్తరక్షణం మీ ఖాతాలో పడిపోతుంది. పిమ్మట ఆ స్వూపాన్ని చూసి దేవతలు పొంగిపోయారు. వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు. ‘ఈశ్వరా, మీరు ఇక్కడ లింగరూపంలో వెలవండి. కేవలం ఈ బ్రాహ్మణ కుమారులే కాక మిమ్మల్ని నమ్మిన వారెందరో ఉంటారు. సజ్జనులు, నీమీద పూనిక ఉన్నవాళ్ళు, నీవు ఉన్నావని నమ్మినవాళ్ళు ఎవరు ఇక్కడకు వస్తున్నారో వారు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యతా అటువంటి అనుగ్రహ ప్రసరణ కొడకు నీవు ఇక్కడ స్వయంభూ లింగముగా ఉండాలి అని అడిగారు. అప్పుడు స్వామీ తప్పకుండా ఉంటాను అని ప్రసన్న మూర్తియై వెంటనే మహా కాళ లింగముగా ఆవిర్భవించాడు.

ఉజ్జయినిలో శివలింగములు మూడు అంతస్తులుగా ఉంటాయి. క్రిందను ఉండేది మహాకాళ లింగము, మధ్యలో ఓంకార లింగము, ఆపైన నాగేంద్ర స్వరూపమయిన లింగము ఉంటాయి. క్రింద ఉండే మహాకాళ లింగమును భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉజ్జయినిలో ఈ శివలింగం దగ్గరే ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఉజ్జయినీ రాజ్యమును పరిపాలిస్తున్నాడు. గొప్ప శివభక్తుడు. ప్రతిరోజూ శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడయిన మణిభద్రుడు చంద్రసేనుడికి ఒక మణిని బహూకరించాడు. ఈ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇనుము, ఇత్తడి దేనిని తగిలినా అవి బంగారంగా మారిపోతాయి. దేశంలో క్షామం ఉండదు. అతివృష్టి ఉండదు. నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్పాడు. చంద్రసేనుడు ఆ మణిని కట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకు అలా సుఖపడుతున్నాడో తెలుసుకుని ఆయన వద్దవున్న మణిని ఎత్తుకు వచ్చెయ్యాలని భావించారు. అందరూ కలిసి చంద్రసేనుడి మీదికి యుద్ధానికి బయలుదేరారు. లోపల వున్న వేగుల వలన విషయంతెలుసుకున్న రాజు యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టం అని గ్రహించి యుద్ధానికి వెళ్ళడం అంటే నాకు సంతోషమే. కానీ లోకంలో ఉన్న రాజులందరూ కట్ట కట్టుకుని వస్తే నేను ఏకాకిని’ అన్నాడు. ఆయనయందు ధర్మలోపం లేదు. యుద్ధం చేయడానికి వచ్చిన రాజులలో ధర్మలోపం ఉంది. కాబట్టి తానిప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఎవరు నాకీ మణిని ఇవ్వడానికి కారకుడో వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటాను అని భావించి వెంటనే దేవాలయమునకు వెళ్లి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన భక్తి పరిఢవిల్లి ఉంది.

ఆ సమయంలో ఒక గోపాల బాలుడు దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ పిల్లవాడు తల్లితో కలిసి లోపలి వచ్చి నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇద్దరూ దర్శనం చేసినా గోపకాంత మనసు చిన్నపిల్లవాడి మనస్సంతగా భగవంతుని యందు కేంద్రీకరించబడలేదు. రాజు చేస్తున్న పూజను చూసిన పిల్లవాడు తానుకూడా అలాగే పూజచేయాలి అనుకున్నాడు. కానీ వాడికి పూజ చేయడం రాదు. వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ వాని దృష్టి అంతా రాజు చేస్తున్న లింగార్చన మీద ఉంది. ఇప్పుడతడు అర్చన చేయడానికి శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది. వాడు దానిని రాయిగా కాక శివలింగంగా చూశాడు. పూజచేయడం రాదు కాబట్టి చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజచేయడం ప్రారంభించాడు. రాజు చేస్తున్న పూజయందు సదాచారం ఉంది. కానీ ఈ పిల్లవాడు చేసున్న పూజయందు సదాచారం లేదు. కానీ భక్తి ఉంది. వాడికి అభిషేకం, పురుషసూక్తం తెలియదు. నైవేద్యం లేదు. కానీ వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ అంటూ వేస్తున్నాడు. వాడు మనస్సులో అలాగే మహాకాళ లింగానికి పూజ చేస్తున్నాడు. పిల్లవానికి అన్నం పెడదామని గొల్లవనిత వచ్చి పిలిచినా వాడికి ఇవేమీ వినపడలేదు. నటిస్తున్నాడు అని ఆవిడకి కోపం వచ్చింది. గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది. ఆకులన్నిటిని కాలితో తోసేసింది. ఇంట్లోకి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది.

పిల్లవాడు కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా ఉన్న శివలింగం కనపడలేదు. వెంటనే ఆర్తితో ఏడ్చాడు. ఇప్పుడు వారు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు. స్వామీ కనపడలేదన్న బెంగతో మూర్ఛపడిపోయాడు. తనకోసం ఇంత పరితపించిపోయిన పిల్లవానిని శంకరుడు చూశాడు. అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, పెద్ద శివలింగం ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీటమీద పట్టు పంచెతో కూర్చుని పూజ చేస్తున్నాడు. వానికి సమస్తమయిన శివజ్ఞానము భాసించింది. తల్లికి ఆ ఘోష వినపడి బయటకు వచ్చి చూసి తెల్లబోయింది. నా వంశమే తరించిపోయిందిరా తండ్రీ ఈ పూజ చేశావని నాకు తెలియదు అని వెళ్లి బిడ్డడిని కౌగాలించుకుంది. ఆనందపడిపోయింది. ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించి ఒకమాట చెప్పారు “ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వానికి మోక్షము కరతలామలకము. ఈ పిల్లవాడికి ఏమీ తెలియక పోవచ్చు. కానీ పరమేశ్వరుడిని నమ్మాడు. దీనివలన ఈతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్పగొప్ప వాళ్ళందరూ ఈ గొల్లవంశంలో పుడతారు. యితడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు. వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎనిమిది తరములు గడిచిన తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మమే గోపాలబాలుడై ఈ భూమి మీద నడయాడతాడు. అపుడు ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు. మీ వంశం అటువంటి వంశం కాబోతోంది’ అని హనుమ ఆనాడు శివభక్తి విశేషమును ఆవిష్కరించి వెళ్ళాడు.

ఈవార్త ఊరంతా పాకింది. ఈవార్త బయట విడిది చేసిన శత్రు సైన్యములకు తెలిసింది. ఇది నిజంగా అలా ఏర్పడినది అయితే మాలో కొంతమంది ప్రతినిధులం స్నేహంగా లోపలికి వస్తాం మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు. అపుడు రాజు వారిని లోపలికి తీసుకువెళ్ళి దేవాలయదర్శనం చేయించాడు. ఇంత భక్తి పరిపుష్టి కలిగిన గోపాల బాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బతుకులు ఏమవుతాయో, మన వంశములు ఏమవుతాయో అని చంద్రసేనుడికి నమస్కారం చేసి వెళ్ళిపోదాము అని యుద్ధం చెయ్యకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈవిధంగా ఆ ఉజ్జయిని యందు మహాద్భుతమయిన మహాకాళేశ్వరుని దేవాలయం ఆవిర్భవించింది.

ఉజ్జయిని యందు సంవత్సరమునకు ఒకసారి వర్షాకాలమునకు ముందర ‘పర్జన్యానుష్టానము’ అని చేస్తారు. వర్షములు బాగా పడాలని, పంటలు బాగా పండాలని మహాకాళేశ్వరాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. అంత గొప్ప ఆలయం ఆ ఆలయం.

ఈ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం క్రిందనే శంఖ యంత్రం అనే యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయమునకు గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులు శంఖములు ఊదుతున్నారు అని చెప్పాడు. ఎవరు శంఖమును ఊదాడో వానికి విజయం కలుగుతుంది. మహాకాళేశ్వరుని క్రింద శంఖయంత్రం ఉంది. అందుకని ఆయన దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయమునయినా పొందుతాడు. అపమృత్యుదోషం పోతుంది. ఎటువంటి కోర్కెలు అయినా తీరతాయి. అక్కడి అమ్మవారికి అవంతిక అని పేరు. ఇక్కడ ఉండే కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. ఆవిడ రాత్రివేళ పట్టణం అంతా సంచరించి తెల్లవారే సరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్లి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాడు. తెల్లవారి పోతోంది. లోపల కూర్చున్న ఆయన తనకు జ్ఞానం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాడు. అపుడు అమ్మవారు కాళిదాసును తలుపు సందులోంచి నాలుకను బయట పెట్టమని చెప్పి ఆయన అలా పెట్టగానే నాలుక మీద బీజాక్షరములను రాసింది. అప్పుడు మహానుభావుడు తలుపులు తీసి అమ్మవారి మీద శ్యామలాదండకం చేశారు. ఈ విధంగా కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బిన క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం.

ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరముల నుంచో ఉజ్జయినిలో ఉన్న అంతరాలయమునందు రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఈ రెండు జ్యోతులను అఖండ దీపములు అని పిలుస్తారు. ఈశ్వరుడిని మీరు దానిలో చూడవచ్చు.

ఉజ్జయిని దేవాలయంలో భస్మమందిరం అని ఉంది. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మ మందిరంలోనికి ఆవులను తీసుకువచ్చి ఆవులు వేసిన పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ విభూతి అభిషేకం రెండు రకములుగా ఉంటుంది. తెల్లని పల్చటి బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టి ఆ మూటను పట్టుకుని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్నచోటే కాదు అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖముకు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగములు ఇవన్నీ మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినా అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో అభిషేకం చేసుకోవాలి అనుకున్న పురుషులను సాంప్రదాయక వస్త్రాలతో తెల్లవారు జామున దేవాలయంలోపలికి పంపిస్తారు. అప్పుడు శ్మశానంలో కాలిన శవభస్మమును అర్చకులు పట్టుకు వచ్చి చుట్టూ కూర్చును ఆ శవ భస్మంతో అభిషేకం చేస్తారు. అప్పుడు నిజంగా మనం కైలాసపర్వతం మీద కూర్చున్నట్లే ఉంటుంది.

అసురసంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్రవిచిత్రమయిన నీరాజనములను ఎత్తుతారు. దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు. ఈ దీపారాధనతో కూడిన జ్వాలని నీరాజనంగా చూపించేముందు ఇక్కడ ఒక నియమం ఉంది. మహా కాళేశ్వరుడికి సమీపంలోనే మరొక శివలింగం ఉంది. ఆ శివలింగం పేరు కోటేశ్వర మహాకాళుడు. ఆయనకు ముందు పూజ చేస్తే తప్ప అసలు మహా కాళుడికి పూజచేయడం నిషిద్ధం. కాబట్టి ముందు కోటేశ్వర మహా కాళుడికి నీరాజనములను ఎత్తుతారు. తరువాత కాళేశ్వరుడికి ఇస్తారు. అందుకని ఉజ్జయినిలో కోటేశ్వర మహాకాళ దర్శనం కూడా చేయవలసి ఉంటుంది.

ఏడాదికొక్కసారి స్వామివారు సవారీ వెడతారు. ఆయన కారుణ్యమునకు పరాకాష్ఠ ఈ సవారీ ఉత్సవం. దీనిని ఊరేగింపు/ఊరెరిగింపు అంటాం. అపుడు ఉజ్జయిని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, ఎన్నికయిన మంత్రి ఎవరయినా లేదా పరిపాలన చేసే మంత్రి ఈ ముగ్గురు ప్రతి ఏటా స్వామివారి సవారీ ఉత్సవమునకు వచ్చి తప్పనిసరిగా సవారీని మోయాలి. కొన్ని వేల సంవత్సరములనుంచి ఇదే ఆనవాయితీ.

ఉజ్జయినిలో శివరాత్రినాడు స్వామి పెళ్ళికొడుకు అవుతాడు. అపుడు ఆయన పుష్ప కిరీటం పెట్టుకుని పెళ్ళికొడుకు అవుతాడు మహాశివరాత్రి వెళ్ళిపోయిన మరునాడు ఈ అలంకారం అంతా తీసేసి మరల భస్మాభిషేకమును అందుకుంటారు. అటువంటి సవారీ జరుగుతుంది. అక్కడే బలరామ కృష్ణులు ఇద్దరూ సాందీపని మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. ఈవిధంగా ఉజ్జయిని అన్నిరకములుగా ప్రకాశిస్తున్నది. అటువంటి దివ్యక్షేత్రమును జీవితంలో ఒక్కసారయినా దర్శనం చేసి, అక్కడ కొన్నిరోజులు గడిపి, జన్మసార్థకం చేసుకోవాలి.

శివమహా పురాణం భాగం : 10[మార్చు]

  • కేదారేశ్వరుడు

కేదారేశ్వర లింగం గురించి ఒకమాట చెప్తారు. మహాద్రి పార్శ్వే చ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే!!

(ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – ౧౧)

ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగము. నరనారాయణులిద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీక్షేత్రములో తపస్సు చేసినప్పుడు ద్యోతకమయిన శివలింగము. కేదారమునందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే! కేదారేశ్వర లింగమును దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉంది. ఆ నియమంతోనే దర్శనం చేయాలి.

కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు. పార్థివ లింగము అంటే మట్టితో చేసిన శివలింగం. మట్టితో చేసిన ఆ శివలింగమును వారు సాక్షాత్తు ఈశ్వరుడు అని నమ్మి శివలింగామునకు అర్చన చేస్తున్నారు. అపుడు ఆ శివలింగం లోంచి పరమశివుడు ఆవిర్భవించి ‘మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగమునకు ఇంత అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకొనండి’ అని అడిగారు. అపుడు వారు ‘స్వామీ, ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు ఆవలివైపు హిమాలయ పర్వతశృంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు’ అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు.

హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. కేదారం వెళ్ళడానికి దారి కొన్ని నెలలలో మాత్రమే వీలు చేయబడుతుంది. రాత్రి తొమ్మిది దాటితే ఆ మార్గ ప్రాంతంలో కరెంటు తీసివేస్తారు. అక్కడి కాటేజీలలో చీకట్లోనే పాడుకోవాలి. అక్కడ ప్రయాణం చేయాలి అంటే పాదచారియై వెళ్ళాలి. మంచి హోరుమని వానలా పడిపోతుంది. పైనుంచి క్రిందకి చూశారంటే కళ్ళు తిరిగిపోతాయి.

ఇటునుంచి రుద్రప్రయాగ, అటునుంచి దేవప్రయాగ రెండూ వెళ్ళి కలుస్తాయి. ఇక్కడ గంగానది – బదరీలో అలకనందానది. పర్వతముల నుండి ఎన్నో జలపాతములు పడిపోతూ ఉంటాయి. సాధారణంగా ఆ మార్గంలో నడిచి వెళ్ళే వాళ్ళు తక్కువ. డోలీ, లేదా గుర్రముల మీద కూర్చుని వెళ్ళాలి. గుర్రం ఒక్కసారి జారిందంటే ఇక గుర్రం మీద కూర్చున్న వాడిని వెతకవలసిన అవసరం ఉండదు. అలా జారితే వాడు కొన్నివేల అడుగుల నుండి క్రింద పడిపోతాడు. శరీరం చిన్నాభిన్నం అయిపోతుంది. యాత్రములో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కేదారనాథ్ యాత్ర వెళ్ళితీరవలసిన యాత్ర. ఇన్నివేల అడుగులు పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవళం కనపడుతుంది. లోపలి వెడితే లోపల పెద్ద అంతరాలయం ఉంటుంది. అక్కడ మహానుభావుడు కేదారేశ్వరుడుగా వెలిశాడు. కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలామలకము అని శివమహాపురాణం, పెద్దలు నిర్ణయం చేశారు. కేదారం వెళ్ళినపుడు పడిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతుంది. అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకసారి ఒక విచిత్రమయిన స్థితి ఏర్పడింది. అక్కడ శివలింగం వెలసి కొన్ని యుగములు అయిపొయింది. శివాలయములో శివునికి పునఃప్రతిష్ఠ ఉండదు.

ఒకసారి పాండవులు అయిదుగురు కలిసి కేదారేశ్వర దర్శనమునకు వెళ్ళారు.అప్పటికి ఆలయంలో చిన్న శివలింగం ఉంది. పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట. ఒక చిన్న దున్నపోతు రూపంలో పరుగెత్తాడు. పాండవులు దానిని గమనించారు. వారు అది కచ్చితంగా అది శంకరుడే అయి ఉంటాడని భావించారు. మహిషరూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు. దాని కాళ్ళు పట్టుకోవాలని వారు ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. వాళ్లకి దాని కాళ్ళు అందలేదు. తోక అందింది. ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై పరమేశ్వరుడు తన పృచ్ఛభాగమును అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్చివేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం. కేదారం వెళ్లి వచ్చిన వాడికి అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంత పరమ పవనమయిన క్షేత్రం కేదార క్షేత్రం.

అక్కడే మనం ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది. ‘అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు. ఆ మంచుకొండ నిజంగా కైలాసంలాగే భాసిస్తూ ఉంటుంది. వర్షం ఆగి సూర్య కిరణములు పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కైలాస సమీపమునకు వెళ్లి వచ్చినట్లు అనిపిస్తుంది. శంకర భగవత్పాదులు అక్కడే తమ సత్యదండమును విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతుంటారు. అక్కడ శంకరుల సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది. అక్కడే చిన్న ఆలయం కూడా ఉంటుంది. కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రము.

కేదారక్షేత్రం వెళ్ళినవారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం గనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి. అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చెయ్యాలి. మన చేతికి వున్నా ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు. కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక, ఆ కంకణములోంచి కేదార లింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు. ఇకముందు వెళ్ళేవారు ఒక వలయంలోంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది.

శివమహా పురాణం భాగం: 11[మార్చు]

కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే!!

మాంధాతృపురంలో వెలసిన వాడు ఓంకారేశ్వరుడు. ఓంకారేశ్వర క్షేత్రము చాలా చిత్రమయిన క్షేత్రము. అక్కడ రెండు స్వయంభూ శివలింగములు వెలశాయి. అందులో ఒకదానిని ‘ప్రణవాకార పరమేశ్వరుడు’ అంటారు. ఆయన ఓంకార స్వరూపియై ఉంటాడు. రెండవది మనము ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. అమలేశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది. ఇలా రెండు లింగములు వెలయడానికి కారణం తెలుసుకోవాలి.

నారదమహర్షి త్రిలోక సంచారి. మహానుభావుడు గురు స్వరూపుడు. అటువంటి నారద మహర్షి ఒకసారి వింధ్యపర్వతం దగ్గరకు వచ్చారు. వింధ్యపర్వతమునకు తాను చాలా గొప్పదానను అని, తనంత ఎత్తైన పర్వతం మరొకటి లేదని చాలా అహంకారం ఉంది. ఇది ఒక అర్థం లేని ఆభిజాత్యం. ఇక్కడ అదృష్టం ఏమిటంటే అటువంటి సద్గురువు అయిన నారదునితో వింధ్యపర్వతం మాట్లాడడం. ఎంత అహంకారి అయినా అతనికి ఒక సద్గురువు దొరికాడంటే అతనికి అంతకుమించిన అదృష్టం లేదు. వాని జీవితం మారిపోతుంది. నారదుడిని చూసి విద్యపర్వతం అహంకారమును బయట పెట్టింది. అసలు వింధ్యుడు చూడగానే నారదునికి నమస్కారం చెయ్యాలి. కానీ అహంకారంతో మాట్లాడాడు. అపుడు నారదుడు ఒక చిరునవ్వు నవ్వి “నీవు చెప్పినది యథార్థము. నీతో సామానమయిన పర్వతము ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది. మేరుపర్వతం కూడా చాలా గొప్ప పర్వతం. నవగ్రహములు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అవి మేరుపర్వతమునకు ప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాయి” అన్నాడు. ఆమాట వినేసరికి వింధ్య పర్వతానికి చాలా బాధ వేసింది. ‘నాకూ ఉన్నాయి శిఖరములు, కానీ వాటి చుట్టూ ఎవరూ తిరగడం లేదు. మేరు పర్వతమునకు ఉన్న కీర్తి నాకు లేదు’ అని అనుకుని ‘నారదా, నేను కూడా అటువంటి కీర్తిని పొందాలి. మేరుపర్వతం కంటే గొప్ప ఉన్నతిని పొందాలి. అందుకని ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు?” అని అడిగాడు.

అపుడు నారదుడు మహాశివుణ్ణి గూర్చి తపస్సు చేయమని వింధ్యుడికి సలహా చెప్పాడు.వెంటనే వింధ్యుడు మహాశివుణ్ణి గూర్చి శివ పంచాక్షరీ మహామంత్రమును ఉచ్చరిస్తూ తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. దేవతలు మహాదేవుని వద్దకు వెళ్లి ‘మహాదేవా, వాన్ తపస్సు సామాన్యంగా లేదు. మీరు వెళ్ళి ప్రత్యక్షం అవండి’ అన్నారు. అంతటా నిండి ఉన్న నిర్గుణ పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చేతితో స్పృశించాడు. వింధ్యుడు బహిర్ముఖుడు అయ్యాడు. ‘నాయనా, నీవు చాలా గొప్ప తపస్సు చేశావు. నీవు ఏమి కోరి ఈ తపస్సు చేశావు? ఏమి కావాలో చెప్పు ఇచ్చేస్తాను’ అన్నాడు. ‘నన్ను లోకములో గొప్పవాడిగా చెయ్యి’ అని అడిగాడు. “నీవు ఇంక అహంకారముతో ప్రవర్తించకు. ఏ నవగ్రహములు అయితే మేరువు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నీ శిఖరమును అధిరోహిస్తాను’ అని చెప్పి శంకరుడు వింధ్యుడిని అనుగ్రహించాడు. అపుడు వింధ్యుడు ‘ప్రభూ, దానిని నీ అనుగ్రహంగా భావిస్తాను, అహంకరించను’ అని చెప్పాడు. అపుడు ఆ వింధ్య పర్వత శ్రేణి మీద పరమాత్మ అన్ని చోట్లా ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింధ్య పర్వత శిఖరముల మీద స్వామి రెండు స్వయంభూ లింగములుగా వచ్చాడు. ఒకటి ‘ఓంకార లింగము’, ఒకటి ‘అమలేశ లింగము’. అందుకే మనం చెప్తే ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. ఆ వెలయడం మాంధాతృ పురంలో వెలశాడు. ఓంకారం అంటే ప్రణవము. ప్రణవము మోక్ష దాయకము. ఇపుడు వింధ్య గిరి మీదికి వెళ్లి దర్శనం చేసిన వాడికి మోక్షం వస్తుంది. పక్కన అమలేశుడు ఉన్నాడు. మనందరి యందు ఆసవ మలము, కార్మిక మలము, మాయక మలము అని మూడు రకములయిన మలములు ఉంటాయి. మీరు స్నానం చేసినా ఈ మూడూ వదలవు. కానీ ఈశ్వరుడు ఈ మూడు మలములకు అతీతుడు. ఎవడు మీకు ఈ మూడు మలములకు అతీతమయిన స్థితిని ఇవ్వగలడో, తానే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగినవాడో వాడు ఓంకారేశ్వరుడు. మీరు కోరిన సమస్త కోరికలనూ తీర్చగలిగిన వాడు. ఆయన నిరంతర ఆనంద స్వరూపుడు. మీరు అడిగినది ఏదయినా ఇవ్వగలడు. ఇపుడు ఆయన అమరేశ్వరుడిగా, ఓంకారేశ్వరుడిగా ఉన్నాడు. ఇద్దరుగా అక్కడ వెలసి శంకరుడు నిరంతరమూ జనులకు శుభములను ఇస్తూ ఆ కొండమీద వెలసి ఉన్నాడు. అలా వెలసిన అమలేశ్వరుణ్ణి శంకర భగవత్పాదులు ఒక అద్భుతమయిన శ్లోకముతో ఆరాధన చేస్తారు. మనం అమరేశ్వర లింగమును చూసినప్పుడు ఆ భావనను మనస్సులో తెచ్చుకోవాలి. అమలేశ్వర లింగమును, ఓంకారేశ్వర లింగమును మీరు అక్కడ కళ్ళతో చూసి తత్త్వ విచారణ రీత్యా మీ మనస్సు లోపలి తెచ్చుకోవాలి. శంకరులు అంటారు

ఆకాశ శ్చికురాయతే దశదిశాభాగో దుకూలాయతే
శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే,
వేదాంతో నిలయాయ తేసువినయో యస్యస్వభావాయతే
తస్మి న్మే హృదయం సుఖేనరమతాంసాంబే పరబ్రహ్మణి!!

సాంబే’ అంటే ‘స అంబే’ – అమ్మతో కూడుకున్న అయ్యా, ఓ శంకరా నీవు పరబ్రహ్మవు. నీవు అమలేశ్వరుడవు. మూడు మలములకు అతీతమై ఉన్నవాడవు. ఇక్కడ నీవు లింగముగా కనపడుతున్నావు. నీవు నాతొ వచ్చినప్పుడు నీవు ఆకాశ స్వరూపుదవై ఉన్నావు. నీవు దిగంబరుడవు. పది దిక్కులు కలిసి నీకు వస్త్రము అయ్యాయి. దిక్కులను అంబరముగా కట్టుకున్నవాడవు. చంద్రరేఖను ఆభరణముగా కలిగిన వాడవు. ఎప్పుడూ ఆనందమయ స్వరూపుదవై ఉంటావు. వేదముల చివరి భాగాములయిన ఉపనిషత్తులయందు చెప్పబడుతుంటావు. వినయముతో నిన్ను తలుచుకుంటే చాలు, మమ్మల్ని ఉద్ధరించడానికి వస్తావు’.

శివమహా పురాణం భాగం: 12[మార్చు]

  • భీమేశ్వర జ్యోతిర్లింగము

భీమేశ్వర జ్యోతిర్లింగం గూర్చి ప్రార్థనా శ్లోకంగా ఒకమాట చెప్తారు.
యం డాకినీశాకినికాసమాజై నిషేవ్యమాణం పిశితా శనైశ్చ!
సదైవ భీమాదిపదప్రసిద్ధం, తమ్ శంకరం భూతహితం నమామి!!

ఇక్కడ ఉండే శంకరుడిని భీమలింగము అని పిలుస్తారు. శివాష్టోత్తరంలో ‘భీమః’ అన్న నామమును మనం చదువుతుంటాము. ‘భీమః’ అనే నామం విష్ణుసహస్రనామ స్తోత్రంలో కూడా ఉంది. ఇది చాలా చిత్రాతిచిత్రమయిన స్వయంభూలింగము.

లింగపురాణం మనకొక మాట చెప్తోంది. వాయువు పేరును ‘ప్రభంజనః’ అని పేర్కొంది. ఆయన గట్టిగా వీస్తే పెద్దపెద్ద వృక్షములు కూడా కూకటి వేళ్ళతో క్రిందపడిపోతాయి. కాబట్టి ఆయన ప్రభంజనుడు. అటువంటి వాడికి శంకరుడు ‘నీవు జీవులలో ఉండి వాళ్ళ కార్యములన్నీ నిర్వర్తించాలి’ అని చెప్పాడు. వెంటనే వాయువు జీవులలోకి వెళ్ళాడు. ఇప్పుడు ప్రభంజనుడై వాయువు మీ శరీరము నిలబడడానికి పది రకములయిన కర్మలను లోపల వుండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే మన బ్రతుకే లేదు.

పూర్వకాలమునందు సహ్య పర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసుని పేరు కర్కటుడు. ఆయన భార్య పేరు పుష్కసి. ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షసి పిల్ల పుట్టింది. ఆమె పేరు కర్కసి. పెరిగి పెద్దదయి యౌవనంలోకి వచ్చింది. తగిన సంబంధం చూడాలి. విరాధుడు అనేవాడిని ఈమెకు తగిన వరునిగా నిర్ణయించి పెళ్ళి చేశారు. కొంతకాలమునకు రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు. ఈవిడకి వైధవ్యం వచ్చింది రాముడి పట్ల వైరం ఉన్న కుంభకర్ణుని పట్ల మక్కువ పెంచుకుంది. ఈ విషయం తెలుసుకుని కుంభకర్ణుడు ఈమె దగ్గరికి వచ్చాడు. కదళీ వనంలో వున్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి ఆమెను బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆవిడకి కుంభకర్ణుడి వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టినవాడు అపారమయిన బలవంతుడు అవాలని ఆమె కోరుకుంది. తన కొడుకు తన భర్త విరాధుడిని, కుంభకర్ణుని సంహరించిన రాముడిని సంహరించగల శక్తిమంతుడు కావాలని ఆమె కోరిక. అందుకని ఆ పిల్లాడిని ‘భీమః’ అని పిలవడం ప్రారంభించింది. భీమః అంటే గోప్పబలం ఉన్నవాడు అని అర్థం.

వాడు పెరిగి పెద్ద రాక్షసుడు అయ్యాడు. వాడు ఒకనాడు తల్లిని “నాన్నగారు ఎక్కడ” అని అడిగాడు. అపుడు ఆమె తన కథను కొడుక్కి చెప్పి ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీవు విష్ణువును సంహరించాలి’ అని చెప్పింది. విష్ణువు గురించి లోకములనన్నింటిని వెతికి వెతికి విసిగిపోయాడు. ఎవడయినా భగవంతుని పాదములు పట్టుకున్న వాడు ఉన్నట్లయితే వాని తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు. ఇలా భక్తులన్దరినీ చెనకుతూ వెళ్ళిపోతుండగా ఒకానొకప్పుడు కామరూప రాజ్యమును పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజు జోలికి వెళ్ళి ఆయనను ఓడించి తీసుకు వచ్చి కారాగారంలో పెట్టాడు.

సుదక్షిణుడు పార్థివ లింగం పెట్టి రోజూ లింగార్చన చేస్తూండేవాడు. మనస్సుతోనే ఆయన అన్నీ సృష్టించి శివపూజ చేస్తుండేవాడు. అలా చేస్తుంటే అక్కడ ఉన్న కాపలాదారులు వెళ్ళి ఈవిషయం రాజుకు చెప్పారు. వీడికి ఎక్కడ లేని కోపం వచ్చి నాకన్నా గొప్పవాడు ఎవడు? ఇప్పుడే ఈ లింగమును కత్తితో నరికేస్తాను అని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతుండగా సుదక్షిణుడు పరమేశ్వరా నీవు ఆవిర్భవించి వీనిని సంహరించు అని ప్రార్థన చేశాడు.

ఎప్పుడయితే తన చేతిలో ఉన్న చంద్రహాసమును విసిరాడో అంతటా నిండి నిబిడీ కృతమయిన పరమాత్మ ఈ కన్నులకు కనపడని పరమాత్మ సాకార రూపమును పొంది పార్థివ లింగంలోంచి బయటకు వచ్చి నేను నా భక్తుల జోలికి వెళ్ళే వాళ్ళని ఉపేక్షించను అని ఉత్తరక్షణం వాడిని కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు. ఆ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు ‘భీముడు’ అని చెప్పుకున్నాడు. భీముడు అనగా అద్వితీయ పరాక్రముడు.

ఇందులో తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది. ఆ రాక్షసుని కక్ష విష్ణువు మీద. అయితే ఇక్కడ పరమశివుడు వచ్చాడు. యథార్థమునకు విష్ణురూపం రావాలి కదా! అయితే శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు? అంటే భగవంతుని రెండు పేర్లు చెప్తారు – వామదేవ, వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు. వామదేవ అంటే పరమశివుడు. ఈ రెండు పేర్లలో మారిన అక్షరములు ‘మ’ ‘సు’. ఇప్పుడు ‘సు’ పక్కన ‘మ’ పెట్టండి. ‘సుమ’ అవుతుంది. ‘సుమం’ అంటే పువ్వు. పువ్వు అనగా జ్ఞానం. జ్ఞానం మీకు కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు వామదేవుడు అవుతారు. నామములు, రూపములు మారాయి. తత్త్వరీత్యా ఉన్నది ఒక్కటే పదార్ధం. అందుకే శివలింగమును పూజించి రాముని జోలికి వెళ్ళినా, రావణాసురుని పది తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు. శివ స్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదములు పట్టుకున్నా, శ్రీమహావిష్ణువు వచ్చి శంకరుడు చేసే ప్రళయమును ఆపడు. ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పదార్థము. ‘ఏకోదేవః సర్వభూతాంతరాత్మా స్రవభూతాభివాసః సాక్షీచేతోకేవలోనిర్గుణస్యా’ అంది వేదం. ఆ ఉన్న ఒక్క పదార్థము అవసరమును బట్టి రూపమును మారుస్తుంది. ఇక్కడ భీమః – మీరు ఏమి కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదయినా మీకు ఇవ్వగలిగిన వాడు. ఇప్పుడు ఆ స్థితిలో వచ్చి రాక్షససంహారం చేసి తన భక్తుడయినవాడికి రాజ్యాధికారం ఇచ్చి, తదనంతరం మోక్షమునిచ్చినవాడు.

ఒక్కసారి వెళ్ళి ఆ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి ‘డాకిన్యాం భీమశంకరం’ అని ఒక్క నమస్కారం చేస్తే భీముడు శంకరుడు మీకు శుభం చేస్తాడు. ఒక్క నమస్కారం చేస్తే ఆ పరమాత్మ మిమ్మల్ని కాపాడి ఎటువంటి దుఃఖములు రాకుండా రక్షిస్తాడు.

శివమహా పురాణం భాగం: 13[మార్చు]

  • త్ర్యంబకేశ్వరుడు

‘త్ర్యంబకం గౌతమీ తటే’ అని మనం అంటాము.
సహ్యాద్రి శీర్శే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్రదేశే,
యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తమ్ త్ర్యంబకమీశమీడే!!
(ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం – ౧౦)

త్ర్యంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు. ఆయనను స్మరించిన వారిని, ఆయనను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించే స్వరూపం ఉన్నవాడు. ఇప్పటివరకు చదివిన స్వయంభూలింగముల విశేషం ఒకలా ఉంటుంది. త్ర్యంబకేశ్వరుని వద్దకు వచ్చేటప్పటికి ఒకలా ఉంటుంది. ఇది కేవలము ఒక లింగము ఆవిర్భవించిన కథ కాదు. గౌతమ మహర్షి జీవితమును, ఆయన శీలమును, ఆయన గొప్పతనమును ఇందులో చూస్తారు. అక్కడి శివలింగం గొప్పదా, గౌతముడు గొప్పవాడా అని ఒకసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది. ఇక్కడ ఒక నది, ఒక శివలింగం ఆవిర్భవించాయి. మనం తెల్లవారి లేస్తే ఏ నదీజలములు త్రాగి బతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర ఇప్పుడు చదవబోతున్నాము.

గౌతముడు చాలా గొప్ప మహర్షి. ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజూ శంభు లింగారాధనము చేస్తుండేవాడు. ఆ లింగానికి శంభులింగము అని పేరు పెట్టాడు. ‘శం భావయతి ఇతి శంభుః’ – మంచి భావములను కల్పించ గలిగిన లింగమును ఆరాధనా చేశాడు. అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే. లోకమంతటినీ లోకేశ్వరునిగా చూడడం. చాలామంది శిష్యులు ఆయనను అనుగమించి ఉండేవారు. వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వతశిఖర పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణము చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమయిన జీవితమును గడుపుతున్నాడు.

ఇలా నడుస్తుండగా కొంతకాలమునకు అనావృష్టి వలన భయంకరమయిన క్షామం వచ్చింది. వర్షములు పడలేదు. ఎక్కడా నీరు లేదు. ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే శివలింగామునకు సహస్ర ఘటాభిషేకం చేస్తారు. చేస్తే వర్షములు పడతాయి. ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనిని గౌతముడు చూసి నేను ఎలాగయినా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను’ అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. ‘నీవు తపస్సు చేశావు. సంతోషించాను. కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు. కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను. లోకమునకంతటికీ నేను నీరు ఇవ్వలేను. నీవు ఒక చిన్న గుండం తవ్వు. నేను అందులో నీళ్ళు పోస్తాను. ఒక వరం ఇస్తాను. ఆ కుండం ఆరదు. ఎప్పుడూ నీళ్లు ఉంటాయి’ అని చెప్పాడు వరుణుడు. అపుడు గౌతముడు ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది. తప్పకుండా అలా చేస్తాను’ అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు. అహల్య గొప్ప పతివ్రత. వారు తవ్విన గుండంలో నీరు నింపాడు వరుణుడు. అపుడు గౌతముడు అహల్య కలిసి ఈ నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమయిన పంటలు పండించాడు. అందరికీ ఉచితంగా భోజనం లభించింది. అక్కడి ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమమునకు వెళ్లి చక్కగా ఆ పెట్టిన పదార్థముల నన్నిటిని తినడమే కాక ఈ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు.

ఇలా జరుగుతుండగా గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు తెల్లవారు జామున మహర్షి శివలింగమునకు అభిషేకం చేయాలి. వరుణ గుండంలోకి వెళ్ళి నీళ్ళు పట్టుకురండి అన్నారు శిష్యులను మహర్షి. వాళ్ళు నీళ్ళు తేవడానికి వెళ్ళారు. అదే సమయమునకు మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాములే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది కాబట్టి అమ్మలారా, మీరు ఒక్కదారి అలా ప్రక్కకి తొలగితే మీము నీళ్ళు పట్టుకుని వెళ్లిపోతాము అని చెప్పారు. స్త్రీలు అన్నారు ‘ మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది. మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం, అభిషేకం ఎక్కువయ్యాయా?అవతలికి పొండి ’ అన్నారు. ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకుని ఖాళీ కుండతో తిరిగివచ్చారు. అప్పుడు వాళ్లకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి ‘అమ్మా, ముని పత్నులు మమ్మల్ని అనరాని మాటలు అని పంపించి వేశారు. ఇప్పుడు గురువుగారి వద్దకు ఎలా వెళ్ళడం’ అని అడిగారు. ఆమాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది.

వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయింది అని దెప్పిపొడిచారు. వాళ్ళలో అక్కసు బయలుదేరింది. వెళ్ళి భర్తలను “మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా?” అని అడిగారు. అలా భార్యలు అడిగేసరికి వాళ్లకి కష్టం వచ్చింది. వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలు పెట్టారు. వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతిమఖము అనే మఖము ఒకటి చేశారు. వీళ్ళు చేసినటువంటి మఖమునకు తృప్తిపొందిన గణపతి యజ్ఞ గుండంలోంచి ఆవిర్భవించాడు. ‘నేను మీకు ఏమి చేసిపెట్టాలి?” అని అడిగాడు. అపుడు వాళ్ళు ‘గౌతముడు పొగరెక్కి ఉన్నాడు. కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు తరమబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి’ అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘ఇది మీరు అడగవలసిన మాట కాదు. ఒకనాడు మీకు తాగడానికి నీళ్ళు లేక, తినడానికి అన్నం లేకపోతె ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఈ ఆశ్రమం నుండి తరిమి క్షామంలోకి తొరి మీరు సుఖములను అనుభవిద్దామని అనుకుంటున్నారా? ఇది ఎంత కృతఘ్నత! ఇలా చేయకూడదు. అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు” అన్నాడు.

అపుడు వాళ్ళు “నీ దగ్గర నీతులు వినదానిమి మేము ఈ మఖము చేయలేదు. మాకోరిక ఒక్కటే. గౌతముడు ఈ ఆశ్రమం నుండి తరమబడాలి. అలా నువ్వు చేస్తే మేము చేసిన మఖమునకు ఫలితం ఇచ్చినట్లు అవుతంది. కానినాడు నీవు కృతఘ్నుడవు అయిపోయినట్లు మేము భావిస్తాము” అన్నారు. అపుడు విఘ్నేశ్వరుడు ‘మీరు చేసిన మఖమునకు నేను ప్రీతి చెందాను. తప్పకుండా మీకోరిక తీరుస్తాను. కానీ మీరు పాడయిపోతారు. తన ఉపాసన యందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సర్వోత్క్రుష్టమయిన కీర్తిని పొందుతాడు. దీనిని మీ మనస్సులో పెట్టుకోండి. మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు. ఒక వృద్ధ గోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు, ఆకుకూరలు వచ్చి తినేస్తోంది. గణపతి ఆ వృద్ధ గోవు రూపంలో వచ్చాడు మునుల కోర్కెను తీర్చడానికి గాను. బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టినా, చేతితో కొట్టినా గోమోదక దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డిపరక తీసి ఆవుమీద పడేసి ‘హ హ’ అన్నాడు. ఆ గడ్డిపరక పడగానే ఆవు చచ్చిపోయింది. నాకు గోహత్యాదోషం వచ్చింది’ అని ఏడ్చాడు. ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడలేదు. అక్కడికి అహల్య, ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. మునులు, మునిపత్నులు వచ్చారు. ఏమయిందని గౌతముని అడిగారు. జరిగింది చెప్పాడు గౌతముడు. అపుడు వారు’ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహా పాతకములు వస్తాయి. నీవు నీ భార్యను, శిష్యులను తీసుకుని ఆశ్రమం వదలి ఎక్కడికయినా పో’ అన్నారు. అక్కడితో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడివి, ఇక్కడ నీవు ఉంటె మేము ఉండము అంతేకాక ఈవేళ నుండి నీవు దేవతలను ఆరాధించకూడదు. గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజచేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు. అదేమీ కుదరు పో’ అన్నారు. గౌతముని ప్రాణం ఈశ్వరార్చన. అప్పుడు ఆయన ‘అయ్యో, నేను తప్పకుండా వెళ్ళిపోతాను. అని వెళ్ళిపోయాడు. అక్కడ నుండి బయలుదేరి అక్కడ అక్కడ తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయశ్చిత్తం వుంటే చెప్పండి. నేనది చేసుకుని మరల నా జీవితమును ఈశ్వరాభిముఖం చేసుకుంటాను’ అన్నాడు. నిజానికి ఆయనకు తెలియని విషయమా? ఆయన ఇంకా మెట్లు దిగి వినయమునకు వెళుతున్నాడు. వీళ్ళు మెట్లెక్కి అహంకారమునకు వెడుతున్నారు. అపుడు వీళ్ళు ‘అయితే ఈ భూమండలమునంతటినీ మూడు మార్లు ప్రదక్షిణ చెయ్యి. అలా చేస్తున్నప్పుడు అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా గోవును చంపిన మహా పాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి. వచ్చిన తరువాత చాంద్రాయణ వ్రతం చెయ్యి. అప్పుడు నీకు ఆవును చంపిన పాపం పోతుంది’ అని చెప్పారు. ఒకవేళ అలా చేయలేక పోయినట్లయితే వెళ్లి శంకరుని గూర్చి తపస్సు చెయ్యి. శంకరుడు ప్రత్యక్షమయిన తర్వాత గంగను ఇమ్మని అడుగు. ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి గంగను ప్రవహింపజెయ్యి. తర్వాత అఘమర్షణవ్రతం చెయ్యి. కోటి లింగములు పెట్టు. వాటికి అర్చన చెయ్యి. అలా చెయ్యి అన్నారు. మరల గౌతముడు ఆశ్రమమునకు తిరిగి రాకుడా ఉండేవిధంగా ఉపదేశం చేశారు.

గౌతమ మహర్షి వెళ్లి అద్భుతమయిన తపస్సు ప్రారంభం చేశారు. ఒక పార్థివ లింగమును తీసుకుని పంచాక్షరీ మహామంత్రముతో తదేక నిష్ఠతో శివుణ్ణి ఆరాధన చేశారు. అలా తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షం అయి ‘నాయనా, ఎందుకింత గొప్ప తపస్సు చేశావు?” అన్నాడు. కన్నుల నీరు కారుస్తూ గౌతముడు ‘ఈశ్వరా నీకు తెలియనిది ఏముంటుంది? నేను ఆవుని చంపి మహాపాపం చేశాను. నేను చేసిన గోహత్యా పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాక్కు కల్పించవలసినది’ అని ప్రార్థించాడు. శంకరుడు ‘అయ్యో పిచ్చివాడా. ఇంత తపస్సు చేసి పాపమును తియ్యమని అడుగుతున్నావా? నీకు పాపం ఉన్నాడని అనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదు. నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. జగత్తులో ఎవడయినా గౌతమమహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపములు నశించిపోతాయి. నీవు అంతటి పుణ్యాత్ముడవు. నిన్ను చూడడానికి నేను వచ్చాను’ అన్నాడు. గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు. సత్యం తెలిసిపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరచి శంకరుని చూసి ఆహా పరమేశ్వరా, వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను అలా తిట్టక పొతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడిని కాదు. వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయింది. వాళ్లకు నేను ఋణపడిపోయాను అన్నాడు.

తరువాత శివుడు ‘గౌతమా! ఏదైనా వరం కోరుకో ఇస్తాను’ అన్నాడు. అపుడు గౌతముడు స్వామీ మీరు నిజంగా నన్నుకానీ అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగను విడిచి పెట్టండి. నేను ఆంధ్రదేశానికి తీసుకువెడతాను’ అనగానే గభాలున గంగ స్త్రీరూపంలో పైనుండి క్రిందికి దూకి తెల్లటి వస్త్రములతో నిలబడింది. గౌతమునికి గంగాదర్శనం అయింది. వెంటనే ఆయన తన రెండు చేతులు ముకుళించి నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లీ అన్నాడు. అపుడు ఆ తల్లి నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒక్కసారి నేను ఆగుతాను. నీటి రూపంలో నీ తలమీద పడతాను. అపుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు. నీవు నిర్మలుడవు అయినట్లే. వెంటనే శివుని తలమీద వెళ్ళిపోతాను. ఇంకొకసారి భూమిమీద ప్రవహించను అన్నది. అపుడు గౌతముడు ‘అమ్మా, లోకం అంతా సుభిక్షం కావాలి. నీవు ప్రవహించాలని కదా తల్లీ నేను కోరింది అన్నాడు. అపుడు గంగ శంకరుని వంక చూసి స్వామీ, గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను. మీరు లింగరూపంలో ఇక్కడ వెలయండి. 33 కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటువెడుతుందో అటు ఉండాలి. అంది. శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు అమ్మా మేము మాత్రం ఏడాదికి ఒకమారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము. పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము. అని గంగామాతను ప్రార్థించారు. గంగ సరే సంవత్సరమునకు ఒకరోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది.

గౌతముని మీద వెడుతున్న గంగ పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు. స్వామి ఇక్కడ త్ర్యంబకుడు అనే పేరుతో వెలశాడు. ఇది పరమశివుని అపారమయిన కారుణ్యమును, సౌలభ్యమును తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఏ మునులయితే గౌతమ మహర్షిని పో పో అని తరిమేశారో వాళ్ళందరూ గంగ క్రింద పడిందిట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి, శిష్యుల తోటి, దిగుతున్నారు. గంగ వారిని చూసి ‘ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా దూర్తులారా? అని అంతర్ధానం అయిపోయింది. గౌతముడు ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు.

కొన్నిచోట్ల గౌతముడు మునులను శపించాడు అని వ్రాయబడింది. అలా చెప్తే ఈ ఆఖ్యానమునకు అర్థం ఉండదు. గౌతముడు శపించలేదు. తమ గురువుగారు ఇంత చేసినా సరే, గంగాస్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసిన అసారే స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు. ఆనాటి నుండి వాళ్ళు జడులై, తమ జీవితములను పాడుచేసుకుని తిరగసాగారు. ఆనాడు వెలసిన త్రయంబక లింగమే మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వరుడు అని పిలవబడుతూ గౌతమీ తటి ఒడ్డునే మనం చూస్తున్నది. ఆయన త్ర్యంబకుడు. అనగా మూడు కన్నులు కలవాడు. ఆ త్ర్యంబకుడిని చూసి ఒక్కసారి మూడు కన్నుల వాడా మహాదేవా అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకింత ఫలితమును ఇచ్చేస్తాడు. ఒకనది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి మనవరకు బ్రతుకుతున్నాం అంటే ఇన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడయిన గౌతముడిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి.

శివమహా పురాణం భాగం: 14[మార్చు]

  • విశ్వేశ్వర లింగము

వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనాశ్లోకం చెప్తూ ఉంటారు.

సానందమానందవనే వసంతం, ఆనందకరం హతపాప బృందం
వారాణసీ నాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే!!


ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి, ఈశ్వరా, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు’ అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే’ – ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను’ అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. అసలు కాశీ నేను రాను అన్నవాడు కాని, వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనినాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు. మొట్టమొదట ఈలోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్ట మొదట కనపడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చారు. దీనినే శాస్త్రం ‘నారాయణ, నారాయణి’ అని మాట్లాడింది. ఇపుడు వాళ్ళిద్దరూ చూసి ‘నీ సంకల్పం మాకు తెలిసింది. మేము ఏమి చెయ్యాలి? అని అడిగారు.అపుడు ఆయన తపించండి’ అని చెప్పాడు. నిర్గుణం నుండి సగుణం అయిన తర్వాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రపంచం అంతా నీటితో నిండిపోయి ఉంది.. వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణాన్ని సృష్టించాడు. అదే వారణాసి. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణం వారణాసి. చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు. ఇలా బతికేటట్లు చేయడానికి కాశీ ఇప్పుడు మోక్షపురి అయింది. కాశీ భోగపురి కాదు. మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు.

ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. ఆ పట్టణంలో అడుగు పెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణంలో అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అందుకే చచ్చిపోతే కాశీ వెళ్లి చచ్చిపోవాలన్నారు. కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తీ మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది. ఇప్పుడు అయిదు క్రోసుల కాశీపట్టణం సిద్ధం చేసి ఇక్కడ తపించండి అన్నాడు. శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్ళ వంక చూసి ఆశ్చర్య పోతున్నాడు. శ్రీమహావిష్ణువు శరీరమునుండి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీపట్టణాన్ని ముంచెత్తేస్తోంది. ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు ఆ పట్టణంనాకు త్రిశూల స్పర్శ కలిగింది. నీళ్ళలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నీళ్ళలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే ‘మణికర్ణికా తీర్థం’ అయింది.

అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ‘ ఇప్పటి వరకు ఈ పట్టణంను మాత్రమే సృష్టించాను. లయం జరిగినప్పుడు ప్రళయజలములందు ఈలోకం అంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశి నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణం మునగదు. ఈ కాశీపట్టణం అలాగే ఉండిపోతుంది’ అన్నాడు. కాబట్టి కాశీకి లయంలేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళాడు. ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు. వేదమును ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభం అయిన భూమి వారణాసి. ‘వారణ’ ‘అసి’ అని రెండు నదుల సంగమ క్షేత్రం వారణాసి. శంకరుని జటాజూటం మీద పడి అక్కడినుంచి క్రిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి.

అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు ‘ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలయింది ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు కనుక నీవు విశ్వేశ్వర నామంతోను, విశ్వమునకు నాథుడవు గనుక విశ్వనాథుడను నామంతోను పిలవబడతావు’ అని చెప్పింది. సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన. అందుచేత అది స్వయంభూలింగం అయింది. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇపుడు ఈ సృష్టి నిలబడదానికి ఆహారం అవసరము. ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త విశ్వభర్తయై అక్కడ కూర్చుంటే అన్నపూర్ణయై తాను అంతరికీ అన్నం పెడతానని మునికాన్తలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువయినదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది.

భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః’ అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలు పెట్టి వారణాసీ క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవ స్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానమునకు వెళ్ళడం. మనం అందరూ అలానే తిరుగుతున్నాము. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది. కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు – గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం. కాశీ మోక్షపురి పెద్దలయిన వారు ముందు నడవడిని చూపిస్తే వెనకనున్న వాళ్లకి అలవాటు అవుతుంది. అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక ఏడురోజుల పాటు ఆయనకీ అన్నం దొరకకుండా చేశాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా! వ్యాసుడు శాపజలమును పటుకోగానే గభాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 50 సం!!ల స్త్రీ బయటకు వచ్చి “నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్డామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్లి స్నానం చేసి మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా. అన్నం పెడతాను’ అన్నది. వ్యాసుడు వెళ్లి గంగాస్నానం చేసి సంధ్యావందనం, అభిషేకం చేసుకుని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు. అని అనుకుని ఆపోశన నీళ్ళు చేత్తో పట్టుకునే సరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిఘారం చెయ్యబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోశనం పట్టేశారు. అమ్మవారు వచ్చి ‘మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చోనమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్లిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అపుడు శంకరుని తీసుకు వచ్చింది. అపుడు వ్యాసుడు అమ్మవారి వంక, అయ్యవారి వంక చూశాడు. అపుడు శంకరుడు ‘వ్యాసా, నీవు ప్రాజ్ఞుడవని, ఏడు రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నాచేత నిర్మింపబడి కొన్ని కోట్లమందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసీ పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో’ అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు.

వెనక్కి తిరిగి బాధలో అయ్యో కాశీ విడిచి పెట్టి వెళ్లిపోవడమా? అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అపుడు వెనక నుంచి అమ్మవారు ‘వ్యాసా, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము, మోక్షము రెండూ దొరుకుతాయి కాబట్టి నీవు ఇక్కడనుండి దక్షారామం వెళ్ళిపో’ అంది. ఇదీ అన్నపూర్ణాతత్త్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం.

శివమహా పురాణం భాగం: 15[మార్చు]

  • విశ్వేశ్వర లింగము
    భాగం2

మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాలభైరవుని దర్శిస్తాము. కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి ప్రవేశించలేము. ఈ కాలభైరవుడు ఎవరు? ఒకానొకప్పుడు బ్రహ్మగారికి అయిదు తలలు ఉండేవి. శంకరుడికి కూడా అయిదు తలలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. తాను ఈశ్వరుడితో సమానం అని అనుకున్నాడు. శంకరుని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుడిని సృష్టించాడు. ఆ కాలభైరవుడు తన బొటనవ్రేలి గోటితో బ్రహ్మగారి అయిదు తలలలో ఒక తలను పువ్వును గిల్లినట్లు గిల్లేశాడు. ఆయన వారణాసి పట్టణంనకంతటికీ కాపలాదారై ఉంటాడు. కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమం. కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం పూర్ణత్వమును ఇస్తుంది.

కాశీ పట్టణంలో సూర్యశక్తి ఒకచోట కేంద్రీకృతమై ఉంది. దీనిని లోలార్కుడు అని పిలుస్తారు. కాశీలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశములలో ఇది ఒకటి.

తులసీఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీఘాట్ ఎదురుగుండా ఉన్నగోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ద్వాదశాదిత్యుల శక్తి ఆ చక్రం మీద ఉంది. ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చి వెలసిన సూర్యశక్తి అక్కడ ఉన్న చక్రం మీద ఉంది. కనుక దానిని లోలార్కుడు అని పిలుస్తారు. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ – తులసీ ఘాట్ గోడమీద ఉన్న లోలార్కబింబమునకు, ఆ చక్రమునకు గంగాస్నానం చేసి నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది.

కాశీ పట్టణాలు వారాహి కూడా రక్షిస్తుంది. రాజేంద్రప్రసాద్ ఘాట్లో స్నానం చేసి ప్రక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనపడుతుంది. వారాహి సరస్వతీ స్వరూపం. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతుంది. ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే మరల దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీ పట్టణంలో వారాహి మూర్తి చాలా ఎత్తు ఉంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారు జామున బిక్కుబిక్కుమంటూ వెళతారు. అసలు అమ్మవారిని పైనుంచి క్రిందకు పూర్ణంగా చూడలేరు. అర్చకులు లోపలి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తిచేసి నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నములుంటాయి. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంది. మీరు పూర్ణంగా చూడలేరని, అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి పంపరు. అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి. ఆ వారాహీ దర్శనమును మీరు వారణాసీ పట్టణంలో చెస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది. వారాహి వీర్యసమృద్ధిని ఈయగాలిగిన తల్లి. కేవలం కామ్యముచేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి.

కాశీలోని దర్శనీయ స్థలములలో ఆదికేశవుని ఆలయం. ఎన్నో విష్ణ్వాలయములు ఉన్నాయి. కానీ మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరుచుకున్న విష్ణ్వాలయమునకు ఆదికేశవాలయం అని పేరు. దానిని ప్రతివారు దర్శనం చేయాలి.

తరువాత డుంఠి గణపతిని దర్శించాలి. సాధారణంగా గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. కానీ ఒక్క కాశీ పట్టణంలో ఉన్న డుంఠి గణపతి తొండం ఎడమవైపు తిరిగి ఉంటుంది. ఎడమ వైపు తొండం తిరిగి ఉన్నవాడు కాబట్టి డుంఠి గణపతి అని పేరు. డుంఠి గణపతి దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి.

అక్కడ హరికేశుడు అనే ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత ప్రమథగణములలో చేరి, ప్రమథగణములకు నాయకుడై రెండవ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు. ఆయన చేతిలో వెండి కట్టుతో ఉన్న బెత్తం పట్టుకుని ఉంటాడు. విభూతి పిండికట్టు పెట్టుకుని రుద్రాక్షలను సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్ములకు భయంకరంగా కనపడతాడు. ఈశ్వర భక్తులకు ప్రసన్నమూర్తిగా కనపడతాడు.

కాశీవిశ్వేశ్వర క్షేత్రంలో ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపం అని ఒక మంటపం ఉంది. కాశీకి సంబంధించిన చిత్రం ఏమిటంటే విశ్వేశ్వరుడి దర్శనం చేసి అక్కడే ఉన్న గంగలో ఉన్న నీళ్ళు తీసుకు వెళ్లి, ఆయన తలమీద పోసేస్తే చాలు. ఆయనకు ప్రత్యేకంగా తీసుకువెళ్ళనవసరం లేదు. మనం అక్కడి ముక్తి మంటపంలో కూర్చుని ఏదో ఒక శివకథ చెప్పుకుని వారణాసి విడిచిపెట్టాలి అని నియమం. వారణాసి ఊరికే వెళ్లి వచ్చేయడం కాదు. వీలయితే మణికర్ణికా ఘట్టంలో స్నానం చెయ్యాలి.

వారణాసి గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా రెండింటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది. కాశీలో మనం విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేస్తాము. ఆ విశాలాక్షి దర్శనం చెయ్యకపోతే కృతఘ్నులం అయిపోతాము.

అక్కడే మహానుభావుడు శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు. కాశీవిశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటకు వస్తే ఎడమ ప్రక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి లోపలికి వెళితే కుడిచేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగమును తన చేత లలితా సహస్ర స్తోత్రమునకు భాష్యం అమ్మవారు వ్రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యులవారు ప్రతిష్ఠ చేశారు. దానియందు అయ్య, అమ్మ కలిసి ఉన్నారు. ఆ శివలింగం దగ్గరకు వెళ్లి నమస్కరిస్తే ఆ తల్లి ఎంతగానో పొంగిపోతుంది.

కాశ్యాంతు మరణాన్ ముక్తిః’ – కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్న స్థితిలో వెళ్ళిపోతున్న వాడు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి ఒక చిత్రం జరుగుతుంది. పార్వతీదేవి అటువంటి వాని దగ్గరికి వచ్చి కూర్చుని తన పమిటతో ఆ వెళ్ళిపోతున్న వాడికి వీస్తుంది. వాడు సేదతీరి ఏ బాధలేని స్థితిని పొందుతాడు. అప్పుడు డుంఠి గణపతి వచ్చి పక్కన కూర్చుని ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు. అపుడు ఆ ప్రాణి ఎంతగానో సేదతీరుతాడు. భ్రుంగి వచ్చి లలాటమునందు పెడతాడు. మంచి సువాసనలతో మారేడు వాసనలతో స్వామివారు వచ్చి నవ్వుతూ చూస్తారు. అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతమునకు స్వామి కుడిచెవిలో ప్రణవమును ఉపదేశం చేస్తాడు. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన యందే చేరిపోతున్నాయి. మన పాపధ్వంసము చేయకలిగిన కాశీ కొన్ని కోట్ల జన్మల పాపములను నశింపజేయగలిగిన కాశీ మన భరతఖండంలో ఉంది. అది ఎన్నో ప్రాణులు ఈశ్వరునిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం. సర్వ జగత్తు లయం అయిపోతున్నా తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమపావనమయిన భూమి.

సానందమానందవనే వసంత మానందకందం హృతపాపబృందం
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే.

శివమహా పురాణం భాగం: 16[మార్చు]

  • వైద్యనాథ లింగము

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదావసంతం గిరిజా సమేతం!
సురాసురాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి!!

‘ఓ వైద్యనాథుడా, నీకు మేము నమస్కరించుచున్నాము’ అంటారు. మనవాళ్ళు ఏది చేసినా దాని చిట్టచివరి ప్రయోజనం పరబ్రహ్మమును చేరటమే. అభిషేకంలో శివునికి ఒక నామం ఉంది. ‘ప్రథమో దైవ్యో భిషక్’. ఈశ్వరుడు ఈ లోకమునకు మొట్టమొదటి వైద్యుడు. వైద్యుడు సాధారణంగా నాది నాది అని చెప్పిన ఈ శరీరంలో మీకే తెలియకుండా ప్రవేశించిన రుగ్మతను తొలగిస్తాడు. మనకి భవరోగము అని ఒక రోగం ఉంటుంది. అంటే ఎప్పుడూ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం. ఈ భవ రోగమునకు ప్రధాన కారణం అహంకారం. ఇటువంటి భవరోగములో పది కొట్టుకునే వాడిని పైకెత్తి తన పాదముల దగ్గరకి చేర్చుకుంటాడు. కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడు. వైద్యులకు నాథుడయినవాడు లేదా వైద్యులయందు పెద్ద వైద్యుడు – రెండు కారణముల చేత ఆయనను వైద్యనాథ లింగము అని పిలుస్తారు.

ఒకానొక సమయంలో లంకా పట్టణాన్ని రావణాసురుడు పరిపాలిస్తూ ఉండేవాడు. లంకా పట్టణం ఎప్పుడూ దక్షిణ దిక్కునే ఉంటుంది. ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది. జీవన యాత్రలో చిట్టచివరి ప్రయాణం అక్కడకు వెళ్ళడంతో పూర్తయిపోతుంది. రావణాసురుడు అజ్ఞాని కాదు. వేదమును చదువుకున్న వాడు, త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు, లింగార్చన చేసేవాడు, ఘన జట చెప్పేవాడు. కానీ ఈ చదువు ఒక స్థాయి యందు నిజమయిన చదువు కాదు. అంత గొప్పవాడయిన రావణుడు ఒకసారి కైలాసమునకు వెళ్ళాడు. శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచలాధీశుని దర్శనం దొరకడం కష్టం. కానీ రావణుడు ఈశ్వరుని పట్టుకోవడానికి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. అనగా రజోగుణ ప్రకృతితో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. ఇటువంటి పట్టుదలతో కూడిన తపస్సు చాలా అనర్థహేతువుగా, మనిషిని పాడు చేసేదిగా ఉంటుంది. ఈ తపస్సు సాత్త్వికంగా ఉండదు. అది ఈశ్వరుడిని కదపలేక పోయింది. పరమేశ్వరుడు రాలేదు. రావణుడు చేసే తపస్సులో దోషం ఉంది. ఈశ్వరుడి మీద అలక వహించాడు రావణుడు. అందుకని తొమ్మిది తలలు కోసేసుకున్నాడు. వాటిని అగ్నిహోత్రమునందు వ్రేల్చాడు. రావణుడు చేసే తపస్సు యందు వినయము లేదు. రావణుడు తన పదవ తలను కూడా నరుక్కుందుకు సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆసమయంలో శంకరుడు వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడే సరికి రావణుని పది తలలు మరల మొలిచాయి. అపుడు శంకరుడు రావణునితో “రావణా, నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. రావణుడు అపుడు తనకు విపరీతమయిన బలం కావాలి అన్నాడు. రెండవ కోరికగా శంకరుడిని వచ్చి లంకలో కూర్చోమన్నాడు. అపుడు శివుడు ‘నేను లింగమునందు ఉంటాను. నీవు దీనిని తెలివితో నీ పట్టణంనకు తీసుకువెళ్ళు’ అన్నాడు. రావణుడి ఒంటికి బలం ఉందికాని మనస్సుకి తెలివిలేదు. ఉత్తర క్షణం రావణుడి ఒంటికి బలం వచ్చింది. కానీ అతని ప్రవృత్తిలో మార్పు రాలేదు.

రావణుడు ఆ శివలింగమును పట్టుకుని లంకకు బయలుదేరాడు. పరమాత్మ వానికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. పిండాండ బ్రహ్మాండ అనుసంధానం అని ఒకటి ఉంది. ఈ శరీరమునకు ఆకలి వేస్తుంది. బ్రహ్మాండంలో లభించే ఏదో ఒక ఆహారపదార్ధం తీసుకు వెళ్లి ఈ పిండాండంలో పడెయ్యాలి. మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషమును బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండమునకు దాహం వేస్తే బ్రహ్మాండమే ఇవ్వాలి. దాహార్తిని తీర్చడమే కాకుండా ఇందులో ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది. ఇందులోని మలినములను పట్టుకుని ఆ నీళ్ళు బయటికి రావాలి. నీళ్ళను మరల బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు. దాహం వేయించిన వాడు ఈశ్వరుడు, నీటిని ఇచ్చిన వాడు ఈశ్వరుడు, ఈ నీటిని మరల మూత్రముగా మార్చిన వాడు ఈశ్వరుడు, బయటకు పంపిన వాడు ఈశ్వరుడు. అందువల్ల ఈశ్వరానుగ్రహం లుప్తం అయితే అవతలి వాడు పాడైపోవడానికి ఒక్క కారణం చాలు. మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది. శివలింగాన్ని చేతితో పట్టుకుని మూత్ర విసర్జన చేయలేడు కదా! ఎవడో ఒకటు శివలింగమును పట్టుకుంటే బాగుండుని అని అనుకుని అటూ ఇటూ చూశాడు. ఆ శివలింగం శివుడన్న భావన రావణునికి లేదు. తేలికగా చూశాడు. అక్కడి సమీపంలో గల పశువులు కాసుకునే ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి నేను మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తాను ఈ శివలింగమును ఒకసారి పట్టుకుని ఉండవలసినది అని అడిగాడు. పిల్లాడి చేతిలో శివలింగమును పెట్టి మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అది శివుడు. రావణాసురుడికి ఎలా బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఆ శివలింగం చాలా బరువయిపోయింది. వాడు మోయలేక కింద పెట్టేశాడు. శివుడు రావణునితో ఇది నీ పురి చేర్చు. మధ్యలో దీనిని ఎక్కడయినా క్రింద పెట్టావో అక్కడ ఉండిపోతాను’ అని ముందరే చెప్పాడు. ఇప్పుడు ఆ గొల్ల పిల్లవాడు శివలింగమును చితాభూమి మీద పెట్టేశాడు. దీనిని చూసి రావణుడు పరుగుపరుగున వచ్చాడు. అతను వెంటనే ‘ఈశ్వరా, తీసుకు వెళ్ళమన్నావు, కానీ ఆ తెలివి నాయందు నిలబడక పోవడానికి కారణం కూడా నీవే. కాబట్టి ఇప్పుడ నా బుద్ధి మార్చవలసింది అని ప్రార్థన చేయలేదు. ఇదెంత దీనిని నేను ఎత్తుకు పోతాను అని కదపడానికి ప్రయత్నించాడు. అది కదలలేదు. ఆ శివలింగమును అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు. వానికి ఒంట్లో బలం బాగా ఉంది.

దేవతలందరూ వచ్చి రావణుడు అక్కడ వదిలి వెళ్ళిన ఆ శివలింగమునకు పూజలు చేయడం ప్రారంభించారు. రావణుడి బలం వలన చాలా ప్రమాదం రాగలదని దేవతలు భావించి దేవతలు నారదుని వద్దకు వెళ్లి రావణుడు సంపాదించిన బలం వానినే పాడుచేసేటట్లుగా చేయవలసినది అని కోరారు. నారదుడు వెళ్ళి ‘రావణా, నీవు కైలాసమునకు వెళ్ళి గొప్ప తపస్సు చేసి శంకరుడిని ప్రత్యక్షం చేసుకున్నావని ఎవరో చెప్పగా తెలిసింది. ఏమి చేశావో చెప్పవలసినది’ అని అడిగాడు. రావణుడు జరిగిన విషయం చెప్పాడు. అపుడు నారదుడు నీకు శివలింగమును ఇచ్చినట్లే ఇచ్చి దానిని నీకు కాకుండా చేసినవాడు కూడా శివుడే అయి ఉండవచ్చు కదా. దీనిని నిర్ధారించుకుందుకు నీవు ఒకసారి కైలాసమునకు వెళ్ళి నీ బలంతో కైలాసాన్ని కదిపి చూడు అప్పుడు నీకు యథార్థం తెలుస్తుంది. శంకరుడే కదిలిపోతే నీకు బలం బాగా ఉన్నట్లు. అప్పుడు ఇతరులమీదికి వెళ్ళు’ అన్నాడు. వెంటనే రావణుడికి అనుమానం వచ్చింది. ఇదేదో బాగుంది అని వెంటనే పుష్పకవిమానం ఎక్కి కైలాసపర్వతం దగ్గరకు వెళ్ళి కైలాస పర్వతమును కదపడం మొదలుపెట్టాడు. అలా కదిపేసరికి పార్వతీ పరమేశ్వరుల సింహాసనం కదులుతోంది. శంకరునికి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు. ఆయన మౌనంగా ఉంటాడేమోనని ఆ తల్లి కొంచెం చమత్కారంగా ‘మాట్లాడింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. లోకమునకు అనారోగ్యం వస్తే బతికిస్తుంది. ఇప్పుడు లోకమును బతికించాలి. లోక కంటకుడిని చంపాలి. వాడు చావడానికి కారణం శివ ముఖతః రావాలి. అలా వచ్చేటట్లు ఆవిడ శివుణ్ణి మాట్లాడింది. ఆవిడ శివుణ్ణి రుద్రుడిని చేస్తుంది. రుద్రుడిని శివుడు చేస్తుంది. ఇప్పుడు లోకక్షేమం కోసం శివున్ని రుద్రుని చేస్తోంది.

అబ్బా మీరు ఎంత గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నా రండీ! మీరు వరాలు ఇచ్చిన రావణుడే వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడు. ఎవరికైతే మీరు వరాలు ఇచ్చారో వాడికి ఇప్పుడు మీమీదకోపం వచ్చింది. వాడి బలానికి ఇప్పుడు మీరు నేనూ ఊగిపోతున్నాము. పాపం మీరుమాత్రం ఏం చేస్తారు లెండి?” అంది. ఆమె మాటలు వినేసరికి శివుడు రుద్రుడయ్యాడు. ఎవరు రావణుడికి బలం ఇచ్చారో ఆయనే శాపమును ఇచ్చాడు. ‘రావణా, ఇక కొద్దికాలంలో నీ మదం అణగిపోతుంది, ఇక్కడనుండి పో’ అన్నాడు. కైలాస పర్వతమును ఊపుతున్న రావణునికి ఈమాట వినపడింది. ఈశ్వరుని మాట నిజం అయింది. రావణుని పట్టుకున్న వాళ్ళందరూ నశించిపోయారు. రాముని ఆశ్రయించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ శివ వాక్యమును ఆధారం చేసుకునే తరువాత రావణునికి శాపములన్నీ వచ్చేశాయి. చివరకు రావణుని బలం తన వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది. రాముడు ఒక్కొక్క తల చొప్పున పది తలలు పడగొట్టేస్తుంటే ఆఖరున మండోదరి వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది. రాముడు నిన్ను చంపలేదు. ఏ మదం నీలో ప్రవేశించిందో అది నిన్ను చంపేసింది అని ఆవిడ చెప్పింది.

ఇది ఆనాడు చితాభూమియందు వెలసిన వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగం. ఆనాటి నుండి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహమును ఇస్తోంది. ఇదే వైద్యనాథుడంటే! భవము – అంటే సంసారమునండు కొట్టుమిట్టాడుతూ, కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములలో పడి సొక్కిపోకుండా సాత్త్వికోపాసనతో కూడిన ఈశ్వర భక్తిని క్రుపచేసి భవసాగరమునుండి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒకడికి ఈశ్వరుడిని చేరడానికి కోటి జన్మలు పట్టవచ్చు. ఒక్క జన్మలో, ఒక్క గంటలో ఈశ్వరుని చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు. కాబట్టి ఆ వైద్యనాథుని అలా దర్శించిన వారికి అటువంటి మహానుభావుడికి నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే అతి తక్కువ కాలంలో ఉపాసన దిద్దబడుతుంది. అతి తక్కువ కాలంలో సత్త్వగుణం ఆవిర్భవిస్తుంది. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనను రాజస తామసిక పూజలతో లొంగదీసుకోవాలన్న భావన మంచిది కాదు.

శివమహా పురాణం భాగం: 17[మార్చు]

  • రామేశ్వర లింగము

రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము. మహాబలసంపన్నుడయిన రావణాసురుని సంహారం అంత తేలికయినది కాదు. దీనికి పరమ మంగళప్రదుడయిన శంకరుని అనుగ్రహం కావాలి. ‘ఈశ్వరా’ లంకా పట్టణంనందు ప్రవేశించి రావణుడే పది తలలతో నాకంటపడినా ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నాయందు ప్రచోదనమయి యుద్ధం జరుగుగాక’ అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభు లింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట. అనగా రామచంద్ర మూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు.

స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సలా
పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం!!

ఈశ్వరా, నేను నీ భక్తుడిని, దీనుడిని. ఎప్పుడయినా నానుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. మీరు శివుడు, మంగళప్రదులు. నన్ను ఆశీర్వదించాలి. జయమును ఇవ్వాలి. కాబట్టి శంకరా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షం అయి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగము అనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది. అన్నాడు. శివుడే ఇప్పుడు శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ – లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ‘నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు. ఇప్పుడాయన రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పకవిమానంలో రామచంద్ర మూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందికి చూపించారు. ‘సీతా, ఇదిగో సేతువు. అదిగో అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు’ అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలోని శ్లోకములలో ఈపాదం ఉంది. ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు.

ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు. సముద్రం దాటేముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము. కానీ ఈవేళ రామేశ్వరం దీవియందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం. రెండూ ఒకటేనా? అలా అయితే స్థలపురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్ర మూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీ పట్టణం పంపించి విశ్వనాథ లింగము నొకదానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగముతయారుచేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రీ బావి, గాయత్రీ బావి మున్నగు బావులు ఉన్నాయి. ఈ రెండు శివలింగములు ఒకటేనా? ఈవిషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు ‘రామాయణమునందు ధర్మ సూక్ష్మములు’ అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒకమాట చెప్పారు. కూర్మపురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ ‘యావస్సేతుశ్చతావశ్చ కాస్యాంయత్రతిరోహితః’ ‘నేను తిరోహితుడనై ఉంటాను. అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని మీరు ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెడితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగుచేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాందపురాణంలో నాగర ఖండమునందు ఈ శివలింగం ప్రతిష్ఠితం చేయబడడం యథార్థమే అని చెప్పి ఉన్నాడు. కాబట్టి అది రామేశ్వర లింగమే. హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహుర్తమై హనుమ ప్రతిష్ఠించాలీ. అందుకని ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగుచేస్తే అది శివలింగం అయింది. ఇపుడు దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశాడు. దానిని రామనాథ లింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకు వచ్చిన లింగము. అది కాశీనుండి తేబడింది కాబాట్టి దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు. ఆ బావులలో ఉండే నీటియందు ఓషధీశక్తులు ఉంటాయి. ఆ బావుల నీటితో స్నానం చేయాలి.

రామేశ్వరంలో మనం సముద్రస్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమయిన దర్శనం. అక్కడ రైల్వేస్టేషన్లో ఒక గొప్పతనం ఉంది. కొత్త ప్లాట్ ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరోచోట పెట్టకుండా రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావిచెట్టు క్రింద పెట్టారు. మీరు రైల్వేస్టేషనులోనే దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవచ్చు.

అక్కడే శంకరాచార్యుల వారు తీసుకు వచ్చిన శివలింగములలో ఒక శివలింగం ఉంది. అది స్ఫటికలింగం. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చెయ్యాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉంది. కానీ అక్కడ విన్యాసములేవీ కనపడవు. దాని వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగమునకు అర్చకులు పూజచేస్తారు. అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటిక లింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మరల మీకు తెల్లటి లింగం కనపడుతుంది. అదీ స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం. అనగా నిర్గుణమయిన పరబ్రహ్మము శుద్ధసత్వంతో ఉంటాడు. ఆయనయందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది.

ఎవరయినా ఈ రామేశ్వర లింగం దగ్గరకు వెళ్లి కాశీ పట్టణంలో ఉన్న గంగను తీసుకు వెళ్ళి ఆ రామేశ్వర లింగమును గంగదారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసినవాడు కైలాసమును చేరుకుంటున్నాడు. గంగ అనగా జ్ఞానము. కాశీ గంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒక్కటే పదార్ధం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనం. అది చేసిన వాడు సంసార సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమయిన క్షేత్రము రామేశ్వర క్షేత్రము.

ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్లకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది. కానీ రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు. కాబట్టి రామేశ్వరం వెడదాం అనుకున్నాను అని అనకూడదు. ‘ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నాను’ అని అనాలి. ఆ బాధ్యతను ఆయన మీద పెట్టెయ్యాలి. అపుడు ఆయనే మిమ్మల్ని రామేశ్వరం తీసుకువెడతాడు.

శివమహా పురాణం భాగం: 18[మార్చు]

  • నాగేశ్వర జ్యోతిర్లింగము

యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై
సద్భక్తి ముక్తిప్రథమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే!!

సద్భక్తిని, ముక్తిని రెండింటిని ఈయగాలిగిన నాగనాథునికి నమస్కరించుచున్నాను. ఇక్కడ నాగ నాథుడు అంటే విశేషమయిన పూజనీయుడు అని అర్థం. అటువంటి నాగనాథునికి నేను శరణాగతి చేయుచున్నాను. ఈ నాగనాథ లింగము ఎందులకు వచ్చింది? దీని ఆవిర్భావమునకు వెనకాతల ఉండే కారణం ఏమిటి? ఇక్కడ మనం ఒక విషయమును పరిశీలనం చేయాలి. శివారాధన రాక్షసులు చేస్తారు, ప్రమథగణములు చేస్తారు, మహాభక్తులు చేస్తారు, భూతప్రేతాది గణములు చేస్తాయి. శివారాధనమును జ్ఞానమును ఐశ్వర్యమును అపేక్షించేటటువంటి వారు చేస్తారు. ఆపద పోవాలనుకుంటున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు.

దారుకుడు, దారుకి వీరిద్దరూ రాక్షస దంపతులు. వారికి బోలెడంత సంతానం ఉంది. వాళ్ళు ఒకనాడు ఒక సముద్రతీరమునకు చేరారు. వీరు చాలామందిని హింసించారు. ఒకానొకప్పుడు అందరి ప్రజలని బాధపెడుతూ భగవద్భక్తుల జోలికి కూడా వెళ్ళారు. అపుడు ఆ భక్తులు ఔర్వుడు అనే మహర్షి పాదములు పట్టుకుని ఆయనను శరణాగతి చేశారు. ఔర్వుడు గొప్ప తపశ్శక్తి కలవాడు. ‘వాళ్ళు వాళ్ళ ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితం గడిపినట్లయితే ఫరవాలేదు. వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేము అనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడా ఉండకూడదు. భూమండలం మీద ఎక్కడయినా రాక్షస ప్రవృత్తి కలిగినవాడు ఉన్నట్లయితే వారు ఉత్తరక్షణం మరణిస్తాడు. ఇదే నా శాపం’ అని ఔర్వుడు అభయం ఇచ్చాడు. తపశ్శక్తి కలిగిన వాడి వాక్కు బ్రహ్మాస్త్రం అయి కూర్చుంటుంది. ఈవార్త రాక్షసులకు తెలిసింది వాళ్లకి తాము బ్రతకడం ఎలా అనే బెంగపట్టుకుంది. అపుడు దారుకి ‘నేను పార్వతీదేవి గురించి ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాడు. అపుడు శాంభవి నాకు ప్రక్షమయి ఒక గొప్ప వరం ఇచ్చింది. దాని వలన నేను నా వారిని ఎక్కడయినా పెట్టి బ్రతికించగలను. ఔర్వుడు మనలను భూమి మీద కదా ఉండవద్దని శాపం ఇచ్చాడు. అందుకని మనందరం సముద్రం మీద ఉందాము. ఆవిడ ఇచ్చిన తపశ్శక్తితో మిమ్మల్నందరిని నేను రక్షిస్తాను. పదండి’ అంది. దారుకి సూచనను అనుసరించి రాక్షసులందరూ సముద్రం మీద పడ్డారు. ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం మీద ఓడలలో ప్రయాణించే వారిని పట్టుకుని వారిని చెరపట్టి హింసించి బాధిస్తూ ఆనందిస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు.

అక్కడ సముద్రం మీద ఓడలో వెళుతున్న వారిలో సుప్రియుడు అనబడే ఒక వైశ్యుడు ఉన్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదు. రాక్షస దంపతులు సుప్రియుడిని పట్టుకున్నారు. సుప్రియుడికి దాసదాసీజనం ఉన్నారు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఒక్కడినీ తీసుకు వెళ్లి కారాగారంలో పెట్టారు. అపుడు ఆయన ఇవన్నీ ఉండడం, పోవడం ఈశ్వరేచ్ఛ. నాకు ఈశ్వరుడు చాలు అన్నాడు. ఆయన కారాగారంలో ఉన్న ధూళినంతా పోగేస్తే ఒక చిన్న శివలింగం అయింది. దానిమీద చుక్క నీరు పోసి పార్థివలింగం చేశాడు. ఆరాధన చేయడం ప్రారంభించాడు. అపురూ రాక్షసులు ఆరాధనకు అడ్డుపడ్డారు. నువ్వు శివారాధన చేయకూడదు, శివ అనే నామం చెప్పినా, శివున్ని ఆరాధన చేసినా, ధ్యానంలో కూర్చున్నా, భగవంతుని స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రం నాకు కలిగినా నీ శిరస్సు త్రుంచేస్తాను అన్నారు. అంటే ఆయన అన్నాడు – ‘నేను ఒక్కనాటికి శివారాధన మానను. నన్ను రక్షించేవాడు శంకరుడు. నా తల త్రుంచడానికి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాని చేతిలో నీ తల త్రుంచబడుతుంది. త్రుంచకలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన పాదములు పట్టుకున్నాను అన్నాడు. అపుడు వెంటనే రాక్షసుడు కత్తినొకదానిని తీసుకుని అపారమయిన ఉగ్రరూపంతో సుప్రియుడి కంఠమును నరికేయ్యబోయాడు. ఆ సమయమునకు సుప్రియుడు ఈశ్వరుని పరమ భక్తితో శరణాగతి చేస్తున్నాడు. రెండు చేతులతో పరమేశ్వరునికి నమస్కారం చేశాడు. అలా చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్న పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించడం త్రిశూలం పెట్టి దారుకుడిని దెబ్బకొట్టడం వాడు పారిపోవడం ఆయన ఉగ్రమయిన దృష్టికి కొన్ని వందలమంది రాక్షసులు బూడిద కుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయాయి. చిత్రమేమిటంటే ఆ వచ్చిన పరమశివుని అర్థభాగమందు పార్వతీదేవి ఉంది. ఆవిడ గబుక్కున శివుని చేయి పట్టుకుని తనవారిని తాను రక్షించుకునే శక్తి ఇమ్మని దారుకి అడిగింది. ఆమెకు అటువంటి శక్తి కలిగేలా నేను ఆమెకు వరం ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఎమవ్వాలి? ఆవిడ నాకు భక్తురాలు. మీరు నామీద ప్రేమతో ఆమెయందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి’ అంది.

వెంటనే శివుడు శంకరుడు అయిపోయాడు. ఒక నవ్వు నవ్వి ‘పార్వతీ నిజమే. ఆవిడకి నీవు వరం ఇచ్చావు. కానీ వాళ్ళు రాక్షసులు. నేను ఇప్పుడు వీళ్ళని విడిచిపెడితే వీళ్ళు మరల దుర్మార్గపు పనులు చేయడం మొదలుపెడతారు. కాబట్టి వీళ్ళు మరల ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసే నిమిత్తం నేను ఇక్కడే జ్యోతిర్లింగరూపంలో కూర్చుంటాను. నీవు కూడా నీవలన బతుకున్నామని వాళ్లకి గుర్తు ఉండడానికి అమ్మవారి రూపంలో ఇక్కడే కూర్చో. నేను నాగనాథుడు అనే పేరుతో వేలుస్తున్నాను. ఈశ్వరీ, నువ్వు నాగేశ్వరీ అనే పేరుతో వెలవవలసింది’ అన్నాడు. ఆవిధంగా ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లిన్గమై వెలిశారు. ఎవరయినా వారి దర్శనం చేస్తే వారికి జన్మ జన్మలయందు పార్వతీ పరమేశ్వరుల పాదపద్మముల యందు చెక్కుచెదరని భక్తి ప్రపత్తులు కలిగేలా అనుగ్రహిస్తాను అని స్వామి శపథం చేసి చెప్పి నాగనాథుడిగా ఆ తీరమునందు వెలసి ఉన్నాడు. కాబట్టి మనం నాగ నాథ క్షేత్రమునకు తప్పకుండా వెళ్ళాలి. మనస్సును నిగ్రహించి ఈశ్వరుని వైపు పెట్టడం అలవాటు అవడం అనే భక్తి ముహూర్తములవలన రాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసన భక్తియందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. అటువంటి అనుగ్రహమును తన దర్శనమాత్రం చేత ఇచ్చేస్తానన్నాడు నాగనాథుడు.

పూర్వం పెద్దలు మనలను తీర్థయాత్రలు చేయమని ప్రోత్సహించేవారు. తీర్థయాత్ర చేసేముందు వెడుతున్న ఆ క్షేత్రం వైశిష్ట్యం తెలియాలి. తీర్థయాత్రలు చేసినప్పుడు ఆయా క్షేత్రములకు వెళ్లినపుడు వాటిని గురించి తెలుసుకుని ఆయా క్షేత్రములలో ఏ శ్లోకమును చెప్పాలో ఆ శ్లోకమును చెప్పి ఏది మీరు భగవంతుని అడగాలో దానిని అక్కడ అడగాలి. అంతేగానీ వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము అనుకోవడం వలన ఉపయోగం లేదు. క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు దానికి తగిన పనిని మీరు చేసి వస్తుండాలి. ఒకవేళ అలా చేయడం తెలియకపోయినా మన అమాయకత్వం చేత ఈశ్వరుడు దానిని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. ఈశ్వరశక్తియందు అదికూడా ఉంటుంది

శివమహా పురాణం భాగం: 19[మార్చు]

  • ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగము

ఇళాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్!
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే!!

ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణం చెప్పబడింది. ఇంక ఆయన ఔదర్యమును ఇంత అంత అని మీరు లెక్కకట్టి చెప్పడం కుదరదు. స్వామి అంతటి ఔదార్యం ఉన్నవాడు. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు త్రికాల సంధ్యావందనం అలవాటయిన వాడు. నిరంతరం శివ పార్థివేశార్చనకు అలవాటు పడిన మనస్సు ఉన్నవాడు. భగవంతునియందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కాని, తనకిదిలేదని కాని, ఎన్నడు భావన చేయనివాడు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఆయన భార్యపేరు సుదేహ. ఆమె మహా సౌశీల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరమూ అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలాకాలం ఇలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె బాధపడింది. అపుడు ఆయన భార్యతో “ఏమిటే నీ వెర్రి! ఎవరు ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డలకోసం ఎందుకు నీకీ అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు తరిస్తావు. నీతోపాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు, సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు’ అని చెప్పాడు. ఈ మాటలు విన్న తరువాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఎదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచిమాట చెప్పింది. ఆ పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఈమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. భర్త దగ్గరకు వెళ్లి చెప్పింది. అపుడు ఆయన ‘నేను ఎంత చెప్పినా నీవు బిడ్డలను గురించే ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చుకోలేక పోతున్నావు. బిడ్డలు కలుగక పోవడానికి దోషము నీదో, నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయమును ఈశ్వరుదినే అడుగుతాను’ అని చెప్పాడు. తరువాత ఆవిడకి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు.

రెండు పూలదండలు తెచ్చి భగవంతుని పాదముల దగ్గర పెట్టాడు. రెండు పువ్వులు పెట్టి ఆయన శివునికి ఒక విజ్ఞాపన చేశాడు. ‘ఒకవేళ నాయందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. మాకు అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది’ అని ఈశ్వరా నీ సంకల్పమును మాకు చెప్పెయ్యాలి’ అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండలలో ఒకదానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి రెండవదండను తీసింది. అపుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలుగదు అని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకొనవలసిందని చెప్పాడు. అపుడు ఆవిడ అలా వీల్లేదని ‘నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు. కానే అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమెవలన మీకు సంతానం కలుగుతారు కదా! వాళ్ళు నన్ను అమా అని పిలిస్తే చాలు. అని చెప్పింది. అపుడు ఆయన ‘ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీయందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను’ అన్నాడు. అపుడు ఆవిడ చచ్చిపోతానుఅన్నంత హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ఘృష్ణ. సంతోషంగా కాలం గడుస్తోంది. ఘృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకి చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజూ నూట ఒక్క పార్థివ లింగాములకు అర్చన చేసేది. పూజ అయిన తర్వాత నూటొక్క లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఇలా మూడు సంవత్సరములు ఆరాధన చేసింది. ఆవిడ చేసిన శివపూజ వలన ఆయనకు నానా అనిపించుకోగల అదృష్టం కలిగింది. మూడు సంవత్సరములలో ఆవిడ దాదాపు లక్ష శివలింగములకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భమును ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ మూడు సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లవాడిని కనింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు.

ఆ పిల్లవాడికి యుక్తవయస్సు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళయితే సుదేహను గౌరవంగా చూశారు కానీ వియ్యాలవారు మాత్రం పిల్లవాని సొంతతల్లి ఎవరయితే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దానితో కక్ష సుదేహలో కలిగింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువు అయింది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లు అంత ఆదరణ పొందడానికి కారణమని తలచి ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్న తన చెల్లెలు కళ్ళవెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది.

ఒకరోజు కొడుకు కోడలు శయనించి ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాని గదిలోకి వెళ్లి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరమును ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకు వెళ్లి తన చెల్లెలు రోజూ శివలింగములను కలిపే చోటులో నీటిలో పారవేసింది. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకుందుకు నదీ తీరమునకు వెళ్ళిపోయాడు. ఈవిడ నూటొక్క లింగములకు అర్చన చేస్తోంది. పిల్ల నిద్రలేచి చూసింది. తన వంటి మీద పక్కబట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యమును చూసి ఆమె గొల్లుమని ఏడుస్తోంది. సుదేహ గబగబా లోపలి వెళ్లి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఘృష్ణ ఏడవదే అని చూస్తోంది. ఘ్రుష్ణ మామూలుగా శివార్చన చేస్తోంది. ఆవిడ ఎవడు బిడ్డను ఇచ్చాడో వాడు ఆ బిడ్డకు రక్షకుడు. వాడిని ఆయన రక్షిస్తాడు. అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజచేసిన శివలింగములను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగములు ఆ నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ అనలేదు. ఈ దృశ్యమును చూసి శివుడు తట్టుకోలేక పోయాడు. అదీ విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఆవిడ నాయనా, నిన్ను కాపాడిన వాడు మహాకాలుడు. ఆయనే తీసుకెళ్ళ గలడు. ఆయనే బ్రతికించగలడు. ఆయన నిన్ను రక్షించాడు అంది. కానీ తల్లియైన ఘృష్ణ ‘నాయనా నీవు మాట్లాడేది తప్పు. పెద్దమ్మను అలా అనకూడదు. ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపము మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతోంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక మూడు కన్నులతో త్రిశూలం పట్టుకుని ఘృష్ణా, ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను’ అని అన్నాడు. ఆవిడ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. కాబట్టే నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అంది ఆవిడ. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత! నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకమునకు తెలుసు. ఈశ్వరా నీ పాదముల యందు భక్తిని నాకు కృప చెయ్యి. మా అక్కవలన కదా నాకు కొడుకు కలిగాడు. మా అక్క వలన కదా నాకు నీయందు పూనిక కలిగింది. ఈ ఔదార్యమును ఇలా అనుగ్రహించు’ అంది. ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న అంతటి శివుడు చేష్టలుడిగి నిలబడి సరే నేను నీకు కనపడ్డాను కనుక ఏదేని ఒక కోరిక కోరుకోవలసింది అన్నాడు. ఆమె ‘అయితే ఒకటి అడుగుతాను. ఏ నీటిలో పడిపోయిన పిల్లాడిని రక్షించావో, ఏ నీటిలో రోజూ నూటొక్క లింగములు తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగంగా వెలవవలసినది. నీ దగ్గరకి వచ్చి నమస్కరించిన వాళ్ళందరిని ఇలాగే కాపాడు’ అన్నది. అపుడు శివుడు ‘తప్పకుండా అలాగే చేస్తాను. నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగంగా ఉంటాను. నీపేరు మీద ఘృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలవు. ఇక్కడకు వచ్చినపుడు అందరూ నిన్ను తలచుకోవాలి. ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈశ్వరుడి ఔదార్యం ఘృష్ణవలన గుర్తురావాలి. నా ఔదార్యం ప్రకటితం అవడానికి కారణం నువ్వు. కాబట్టి నిన్ను తలచుకుని నన్ను తలచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు ఘృష్ణేశ్వరుడు’ అని ఘృష్ణేశ్వరుడై అక్కడ వెలిశాడు.

పిమ్మట శివుడు ‘ఘృష్ణా, నూటొక్క తరాలు నీవంశంలో చెప్పుకోదగిన మహా భక్తులయిన వారు కుమారులుగా జన్మించి వెడుతుంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను. మీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఈవేళ నుంచి నాకు మహా భక్తురాలయిపోతుంది’ అన్నాడు. వీటన్నింటిని ఘృష్ణ అడగలేదు. కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరములను ఇచ్చేశాడు. కాబాట్టే ఈశ్వరుడిని నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు.

శివమహా పురాణం భాగం: 20[మార్చు]

  • అరుణాచలేశ్వరుడు

మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు. దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించింది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది. ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము. స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రామించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభశైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మీరు రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహమును మనం పొందుతాము.

శివమహా పురాణం భాగం: 21[మార్చు]

వినా భస్మత్రిపుండేన వినా రుద్రాక్షమాలయా
బిల్వపత్రం వినానైవ పూజయేచ్ఛం కరం బుధః!!

విభూతి ధారణ అనేది శివపురాణాంతర్గతమైన విషయం. ఆరాధన చేసేటప్పుడు శౌచముతో పూజామందిర ప్రవేశం జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు సాధ్యమయినంతమటుకు ఈమూడూ లేకుండా పూజ జరుగకుండా చూసుకోవాలి. భస్మము అనగా తేలికగా చెప్పాలంటే బూడిద. దానిని మూడు గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. శివలింగం మీద ఆజ్ఞాచక్రం మీద బొటనవేలితో బొట్టుపెట్టే అధికారం ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. స్త్రీలయినా, పురుషులయినా లలాటమునందు విభూతిని మూడు గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి. విభూతిని పెట్టుకోకుండా ఉండరాదు. రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయరాదు. బిల్వపత్రం లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను కొన్ని రోజులపాటు నిల్వచేసి పూజ చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటితో పూజ చేయాలని పండితులయిన వారు జ్ఞానమున్న వారు భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు.

శాస్త్రమునందు శివనామము గంగ. విభూతి యమునా. రుద్రాక్ష సరస్వతి. గొప్ప శివభక్తుడు లలాటమునందు త్రిపుండ్రములను ధరించిన వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాల వేసుకుని శివపూజ పూర్తిచేసి బయటకు వచ్చిన వ్యక్తిని పూజామందిరంలోంచి బయటకు రాగానే చూస్తే చూసిన వారికి త్రివేణీసంగమ స్నానాన్ని చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేస్తారు. ఈమూడింటిని శరీరం మీద వేసుకుని ఉండడం వలన అంత గొప్పతనం కలుగుతుంది.

నుదుటిమీద భస్మమును ఎలా బడితే అలా పెట్టుకోకూడదు. శాస్త్ర నియమం ప్రకారం మీరు నిద్రలేచిన తరువాత స్నానం అయేవరకు యథార్థమునకు పచ్చిగంగ త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాల పద్ధతులు వచ్చాయి. అయితే కొన్ని కారణముల చేత కొంతమంది స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి రావచ్చు. అలా తీసుకుంటే ఆ పాపం గాయత్రి చేత సాధ్యమయినంత తొందరగా పోతుంది. గాయత్రికి అధికారం లేనివాడు తమ ఇష్టదేవతానామం చెప్పి పూజ చేసుకోవాలి. విభూతి ధారణా చేసేవారు స్నానం చేయకుండా ఎక్కడికో అత్యవసరంగా వెళ్ళవలసి వచ్చిన సందర్భంలో వారు పొడి విభూతిని తీసుకుని లలాటమునందు దరించవచ్చు. పొడి విభూతిని ధరించడం వెనుక ఒక రహస్యం ఉంది. స్నానం చెయ్యనంత వరకు శరీరమునకు అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్న శరీరం తొందరగా వ్యగ్రత కలిగిన ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణహేతువు ఉండాలి. అందుకని విభూతి పెట్టుకోవాలి. చాలామందికి విభూతి పెట్టుకున్నవాళ్ళందరూ శైవులు అని ఒక దురభిప్రాయం ఉంటుంది. అది సరికాదు. విభూతి వేదప్రోక్తంగా చెప్పబడిన విషయం. ఎవరయినా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉంది. స్నానం చెయ్యకుండా వెళుతున్నా పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళవచ్చు. తడి విభూతిని పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమచేతిలో వేసుకుని దాంట్లో రెండు మూడు నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూతి మీద కుడిచేతిని మూత పెట్టాలి. అలా పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగే గొప్ప మహాత్మ్యమును గురించి శబ్దశక్తిచేత మీరు దానిని అనుసంధానం చేయాలి.

భూతిం భూతకరీ, పవిత్ర జననీ పాపౌఘ విధ్వంసినీ
సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ
భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణీ
తేజోరాజ్య విశేష మోక్షణకరీ భూతి స్సదా ధార్యతామ్!!

అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది మీ శరీరమునకు అలది ఉండగా భూతప్రేతపిశాచరాక్షస గణములు మీ ఇంట ప్రవేశించలేవు. తేజస్సును ప్రసాదిస్తుంది. విశేషమయిన ఐశ్వర్యమును ఈయగలదు. మోక్షమును ఇవ్వగలదు. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. బ్రహ్మచారి అయితే సాధ్యం అయినంత వరకు
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
” అన్న మంత్రం చెప్పి సజలవిభూతిని ధరించాలి. ఇవేమీ చేతకాకపోతే తేలికైన మార్గం ఒకటి ఉంది. కుడి చేతిని ఎడమ చేతి మీద వేసి
శ్రీకరంచ పవిత్రం చ శోకమోహ వినాశనం లొకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం

అని చెప్పాలి. దీని ధారణ చేత ఐశ్వర్యం కలుగుతోంది. ఇది నన్ను పవిత్రుడిని చేస్తోంది. ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకము వశం అయ్యేటట్లుగా చేస్తోంది. ఇది నాకు పుణ్యమును ఇస్తోంది. ఇదేదో వశీకరణ విద్య లాంటిది అని అనుకోకూడదు. లోకము యథార్థ స్థితి మీకు భాసిస్తుంది. పరమ పావనమైన ఈ భస్మమును నేను ధరించుచున్నాను.

ఒకవేళ ఈ మంత్రం రాకపోతే కనీసంలో కనీసం ‘శివా శివా శివా’ అని మూడు మాట్లు అనాలి. ఆటే మంగళము, శోభనము, భద్రము క్షేమము, కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్లు అవుతుంది. ఈ మాటలు చెప్పి విభూతిని మూడు వేళ్ళతో పెట్టుకుంటారు. అలా విభూతి ధారణ చేయరాదు. అది దోష భూయిష్టం. నీటియందు భస్మము తడిపి మృగముద్ర పట్టమని శాస్రం చెప్పింది. మృగముద్రను జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏ లేడి/జింక కొమ్ములతో నిలబడ్డట్లుగా కనపడుతుంది. మూడువేళ్ళు కలుస్తాయి, రెండు వేళ్ళు నిలబడతాయి. ఇప్పుడు తడి భాస్మంలో ముందుగా మధ్య వేలును ఉంగరపు వేలును ముంచుతారు. తరువాత బొటన వేలును ముంచుటారు. తర్వాత కుడివైపు నుండి ఎడమ వైపుకి బొటనవేలు పట్టగలినంత దూరం విడిచిపెట్టి నుదుటిమీద ప్రయాణం చెయ్యాలి. అపుడు బొటన వెలికి సజల విభూతి ఉన్నది కదా – ఆ రెండు వేళ్ళు గీసిన విభూతి రేఖల మధ్యలోంచి విభూతితో కూడిన బొటనవేలును లలాటం మీద రాస్తూ వెనక్కి తీసుకురావాలి. దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు.

భస్మధారణము అనేది మనుష్యుని జీవితమును కొత్త దారికి తిప్పగలిగిన ఒక విశేషము. మనకి వాసనలు కొని జన్మల నుండి తరుముకు వస్తాయి. విభూతి ధారణ చేస్తే మీకు ఉన్న వాసనా బలమును గెలవగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు. పాపక్షయం అంటే ఇదే. శాస్త్ర ప్రకారం ‘భ’ భస్మ ధారణము పాపములను తీయగలదు. మీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుడిని చేరకుండా భోగముల వైపుకి తిప్పెస్తున్నాయి. అధర్మబద్ధమయిన భోగముల కోసం వెంపర్లాడుతుంటారు. అలా వెంపర్లాడకుండా చెయ్యగల్గినది ‘సమ’ భగవంతుడిని స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు ‘భస్మ’. భస్మం రెండు రకములుగా తయారవుతుంది అని శాస్త్రం చెప్పింది. ఒకటి మహా ప్రళయమునందు ఏర్పడే భస్మం. ఆ భస్మం దరించడానికి మనం ఉండము. ఆ సమయంలో లోకములన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమయిన భస్మం. ఆవు పేడను పట్టి జాగ్రత్తగా కాల్చి దానిని విభూతిగా తయారుచేస్తే తేలిక అయిన భస్మం తయారు అవుతుంది. అది మనకి శ్రీశైల దేవస్థానం వారు పలకల పలకల ఉండలుగా చేసి అమ్ముతారు. ఆవుపేడను కాల్చినపుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం. భస్మమును లలాటమునందే ఎందుకు ధరించాలి అంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాము. కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉంది. నుదుటిమీద పెట్టుకున్న భస్మ రేఖలను త్రిపుండ్రములు అని అంటారు. భస్మం పవిత్రమయినది సమస్త దోషములు పోయినపుడు మాత్రమే ఏదయినా పవిత్రం అవుతుంది. ఏదయినా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది. విభూతి అగ్నిసంపర్కం కలిగినది. దానిని ధరిస్తే మీయందు జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది.

శివలింగమునకు అభిషేకం ప్రారంభం చేసేముందు పంచ బ్రహ్మ మంత్రములతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు. ఏ చెట్టునుండి ఎన్ని పువ్వులను కోయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితం పొడి భస్మంతో అభిషేకం ప్రారంభించిన వాడి ఖాతాలో వేసేస్తారు. విభూతిని తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే తెల్లటి విభూతి ధారా శివలింగం మీదనుండి క్రిందపడగానే ఈయన పాదములన్నీ హరిస్తాయి. శివలింగం మీదినుండి జారిన ఆ విభూతిని గాని పెట్టుకుంటే అపారమయిన తేజస్సు ఉద్భవించి ఈశ్వరాభిముఖుడు అవుతాడు. స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత ఆ రాక్షసునికి శాపవిమోచనం అయిపొయింది. ఆయన భస్మం అలా పెట్టుకున్నాడు. అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు. కాబట్టి భస్మం అంత గొప్పది.

శివమహా పురాణం భాగం: 22[మార్చు]

  • రుద్రాక్ష ధారణ – మారేడు దళము

భస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి. తపస్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్షచెట్లయి పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటినీటి బిందువులలోంచి ఉద్భవించినవి కాబట్టి అవి మిక్కిలి తేజస్సు సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. నేపాల్ ఖాట్మండు పశుపతినాథ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు ఉంది. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో ఆరు ముఖములు ఉన్న రుద్రాక్ష కేవలము సుబ్రహ్మణ్య స్వరూపమని పెద్దలు నమ్ముతారు.

మీకు సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. వీటిని ఒక మాలగా గ్రుచ్చవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది. రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతడితో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్ళు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమయిన అవయవముల పనిని నియంత్రించి రక్షించగలదు.అలా రక్షించగలిగిన శక్తి రుద్రాక్షలకు ఉంది. అందుకే రుద్రాక్ష మాలలో పగదమును ముత్యమును కలిపి వేసుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు. రాత్రుళ్ళు దానిని తీసి భగవంతుని పదముల వద్ద పెట్టి మరల పొద్దున్నే వేసుకుంటారు. చిదంబర క్షేత్రమును సాక్షాత్తు పరమేశ్వరుని హృదయంగా భావిస్తారు. భగవంతుని హృదయము చిదంబరం అయితే, ఈశ్వరుడు మనలోకి వచ్చి కూర్చోవడానికి వీలయిన రీతిలో మీ శరీరమునందు సాత్వికమయిన భావనలు కలిగేటట్లుగా లోపల కన్నం ఉండి ఇటునుంచి అటు దారం వెళ్ళిపోయేటట్లుగా ఉన్న ఏకైక పవిత్రమయిన గింజ రుద్రాక్ష.

రుద్రాక్ష వేసుకోవడం అంటే ‘నేను కూడా నా భావనల చేత నా కర్మల చేత నా శరీరంలో జరుగుతున్న సమస్త వ్యాపారములను ఒక మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడలో వేయుచున్నాను” అని అర్థం. ఈ భావన ఏర్పడిందంటే ‘యద్యత్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ మనం చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలై కూర్చుంటాయి. అటువంటి భావన కలగడానికి రుద్రాక్ష ధారణ చేస్తారు.

ఉమానాథుడయితే మారేడు దళము, శ్రీమహా విష్ణువయితే తులసిదళంతో మనం పూజ చేస్తాము. రెండూ దళాలే. మారేడుదళం ఏర్పడడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీసూక్తం చదివినప్పుడు మనం ఈ క్రింది మంత్రమును చదువుతుంటాము.
ఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథబిల్వః!
తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః!!
లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దామని అనుకున్నప్పుడు కుడిచేతితో ఆమెచేత సృష్టించబడిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలము’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!
దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడ్ ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు మూడు కింద తొమ్మిది కూడా ఉంటాయి. పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనెకాని శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. శివుడికి మారేడు దళంతో పూజ చేయడం మొదలు పెట్టగానే వెంటనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. ‘బాల్యం, యౌవనం, కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు’ అని ఆశీర్వదిస్తాడుట. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు. మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీసూక్తంలో ‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’ (అమ్మా అలక్ష్మిని దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము. మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి. నాల్గవదానిలోకి వెళ్ళడు. నాల్గవది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.

మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది. శాస్త్రము మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.

అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. ‘మా-రేడు’ తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.

అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం, రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట, మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.

శివమహా పురాణం భాగం: 23[మార్చు]

  • గౌరీపూజ

ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిరువురూ మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతం ఒక జీవ స్వరూపమును పొంది సేవిస్తోంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. పరమశివుని చెల్లెలుగా సరస్వతీ దేవి సంభావించబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనమైన వృషభం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతం తెల్లగా ఉంటుంది. వేసుకునే పుర్రెల మాల తెలుపు. ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు జ్ఞానప్రదాతయై ఉంటాడు. ఇంత తెల్లటి శంకరుడి ప్రక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చుంది. కానీ యథార్థమునకు శివ పార్వతులిరువురిలో కూడా వారి రూపురేఖలకు సంబంధించిన భావములేవీ లేవు. ఆయన పార్వతీదేవి వంక చూసి ‘కాళీ’ అని పిలిచారు. ఆ పిలుపు పూర్వం పిలిచినట్లు లేదు. కొద్దిగా ఏదో ఎత్తిపొడిచినట్లుగా ఉంది. ‘ఓ నల్లపిల్లా’ అని పిలిచినట్లు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిప్యి కన్నుల వెంట బాష్పధారలు కారుతుండగా అమ్మవారు క్రిందికి దిగి ‘లోకమునందు ఎన్ని సుఖములైనా ఉండవచ్చు, ఎన్ని భోగాములైనా ఉండవచ్చు. కానీ భర్తకు ప్రీతి చేయలేని సౌందర్యం ఈ శరీరమునందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరమును పొంది ఉండడంలో ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు నేను కైలాసంలో ఉన్నా, మణిద్వీపంలో ఉన్నా, నన్ను ఎంతమంది సేవిస్తున్నా, మా వారు మాత్రం నన్ను కాళీ అని పిలుస్తారు. ఇటువంటి భావన నాకు కలగగానే ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతోంది’ అంది. అన్ని కారణముల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది. తాను ఏది చేసినా భర్త ప్రీతి కొరకే చేస్తుంది. ఇది మహా పతివ్రత లక్షణము. అందుకే శంకరాచార్యులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తే ‘శివశ్శక్త్యా యుక్తో’ అని ప్రారంభించారు. ఆయన పేరు ఎత్తకుండా మొదలెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు మహానుభావులు అయిన శంకరులకు తెలుసు కనుక భర్త పేరుతోనే మొదలుపెట్టారు. ఆయన పేరు చెప్తే ఆవిడకు సంతోషం. ‘నీవు ఈ శరీరమును చూసి ప్రీతిని పొందడం లేదు. అటువంటప్పుడు ఈ శరీరంతో నేను ఉండాలని అనుకోవడం లేదు. ఈ నల్లటి శరీరమును వదిలిపెట్టేస్తాను. నీకు ప్రీతిని కలిగించే శరీరముతో వస్తాను. దేవా నన్ను అనుగ్రహించండి’ అంది. ఈ మాటకు శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ‘అయ్యో పార్వతీ, నా మనస్సు నీకు తెలియదా. నీయందు నాకెప్పుడూ అటువంటి భావన లేదు. ఒకవేళ నేను పరాచికానికి అన్నమాట నీకు అంత కష్టపెట్టి ఉన్నట్లయితే ఇంతటి నిర్ణయం తీసుకునేటట్లయితే నేను నీ పాదములమీద వ్రాలి నీ సేవ చేస్తాను. నువ్వు ఇంత తొందర నిర్ణయమును తీసుకోవద్దు’ అన్నాడు. ఈ సంఘటన అంతఃపురంలో జరిగింది. ఎవ్వరికీ తెలియని విషయం. ఇప్పుడు ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది.

పరమశివుని మాటలను విన్న ఆవిడ ‘లేదు లేదు. నేను మీ మనస్సును చూరగొనలేక పోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇష్టపడను. నేను ఇంక ఈ శరీరంతో ఉండను’ అని శరీరమును వదిలిపెట్టేసింది. మరల ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమశివుడికి ఇల్లాలయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరింది. ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమయిన వస్త్రములను ధరించింది. ఎవరు ఈమాట అన్నాడో ఆయనకు ప్రీతి కలిగిన రంగును నేను పొందుతాను అని నియతమయిన సంకల్పం చేసి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమెను తిందామని ఒక పులి వచ్చింది. ఆమెను చూడగానే దుష్ట గుణము కలిగిన పులి సాత్త్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది. తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకు కూడా మూడు రకములయిన మలములు ఆవిడను చూసేసరికి ఎగిరిపోయాయి. అమ్మవారి పాదములకు ఉండే బొటనవేలి గోటి నుండి వస్తున్నా కాంతిని చూస్తే పాపములు ఎగిరిపోతాయని వ్యాసమహర్షి అంటారు. అగ్నిహోత్రమును ముట్టుకుంటే కాల్చడం దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా అది ఏ దృష్టితో చేసినా తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న మూడు రకములయిన మలములను తీసివేసింది. అది అదేపనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని లోపలికి రాకుండా కాపాడుతోంది. పిమ్మట శుంభనిశుంభులను సంహరించదానికి ఒక రూపమును ఇవ్వమని బ్రహ్మ అడిగాడు. ఆ తల్లి ఇపుడు రూపమును స్వీకరించాలి బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు ఎరుపు పసుపు రంగులతో కూడిన రంగులోకి అమ్మవారు మారిపోయింది. గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు. తన నల్లని శరీరమును పాము కుబుసము విడిచినట్లు అమ్మవారు లీలా మాత్రంగా శరీరమును విడిచింది. ఈ విధంగా విడిచిన నల్లని శరీరమునకు కౌశికి అనే పేరు వస్తుంది.

ఇక్కడ మీకొక విషయం అవగతం కావాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినది కాముని బాణముల వలన జరిగిన సృష్టి కాదు. అది లీలా మాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై, ఆ తల్లి లోపల మనస్సులో కదిలితే, ఆ సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతొ నల్లటి శరీరమును ఇచ్చి ఈవిడ వచ్చి శుంభ నిశుంభులను సంహారం చేస్తుందని బ్రహ్మ కోర్కెను తీర్చింది. ఇపుడు ఈ కౌశికి వెళ్లి శుంభనిశుంభుల సంహారం పూర్తిచేసింది. ఆ తర్వాత అమ్మవారు వింధ్యవాసినియై వింధ్య పర్వతం మీద కూర్చుని ఉంది. ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడకి వాహనంగా బహూకరించాడు. సింహవాహన అనే పేరుతో వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి మనలనందరిని రక్షించడం కోసమని ఆ వింధ్యపర్వతం మీద వేంచేసి ఉంది.

ఇపుడు ఈ గౌరీ వ్యాఘ్రమును కూడా వెంటపెట్టుకుని పరమశివుడు ఉన్న మందరపర్వతం మీదకు వెళ్ళింది. ఆమెను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. ‘పార్వతీ, నేను ఆనాడు ఈమాట ఎందుకన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థం అయింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి. ఇప్పుడు నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. నీవు వాక్యము, నీవు విద్య. నేను ఆ విద్యచేత ప్రతిపాదింపబడే జ్ఞానమును. విద్య జ్ఞానము ఈ రెండూ ఎలా విడివడి ఉండవో అలా నీవు నేనూ ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. నీవు సోమాత్మకంగా ఉంటావు. నేను అగ్నిస్వరూపంగా ఉంటాను. ఊర్ధ్వముఖ ప్రయాణం నాది. నీవు క్రిందికి వెడతావు.నేనే ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినపుడు నీ అనుగ్రహ ప్రవేశం చేత మరల సృష్టి పునఃసృష్టి జరుగుతోంది. కాబట్టి ఈ సమస్తము మనమిరువురమై ఉన్నాము. ఇక మనం విడివడినది ఎప్పుడు! అటువంటిది నీవు నామీద కోపపది దూరంగా వెళ్ళినట్లుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కోసమని ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాము. మనం చేసిన ఈ లీల వృథాగా పోదు. రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతువు అవుతుంది’ అన్నాడు. ఇక్కడ మనం ఆ లోక రక్షణ హేతువైన విషయమును గూర్చి తెలుసుకోవాలి. ఆంధ్రదేశమునందు, తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్ళిచేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీపూజ చెయ్యాలి. గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది. అన్నీ అమ్మవారి స్వరూపములే. పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకువిల్లు పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మనకోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టి నంతటినీ చేసి మరల ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదికి వెడుతున్నపుడు ఆమెకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక ఆమెయందు అటువంటి బలం రావాలని ఆమెచేత సన్నికల్లు తోక్కిస్తారు. పెళ్ళి పీటలమీద కూర్చునేముందు పెళ్ళి కూతురుచేత గౌరీపూజ చేయిస్తారు. ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు ‘సన్నికల్లు ఎలా ఉందొ అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్తమీద మామమీద మరిది మీద ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమయిన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండు చేయకు అని బోధ చేస్తారు. వధువు ‘నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంది పోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా, అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్లుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదను గాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై వుండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు’ అని పెళ్ళికూతురు గౌరీ తపస్సు చేస్తుంది. మన ఆర్షధర్మం అంత గొప్పది. మనజాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీపూజ చేస్తాము.

అక్కడ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. అక్కడ అమ్మవారు పులిని కూడా మందర పర్వతము దగ్గరకు తీసుకువెళ్ళింది. దానిని పరమశివునకు చూపించి – ‘అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చింది. తన స్వభావమును మార్చుకుంది. కాబట్టి దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురమునందు రక్షణ భారము వహించే అదృష్టమును ఇవ్వండి’ అంది. అపుడు శంకరుడు తప్పకుండా పార్వతీ అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటిముందు నందీశ్వరుని కన్న కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమథగణములలో ఒకడిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనపడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం ఈ గౌరీ వృత్తాంతం కౌశికీ వృత్తాంతం రాక్షససంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపుకుంకుమలతో పదికాలాలపాటు ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. కనుక అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితిని మనం పొందెదముగాక!

శివమహా పురాణం భాగం: 24[మార్చు]

  • మార్కండేయ చరిత్ర

పూర్వకాలంలో మృకండుడు అనబడే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణయందు ఆయన, ఆయన భార్యయైన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక ఉన్నవారు. వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మితం చేసుకుని తల్లిదండ్రులతో, శిష్యులతో అక్కడ నివసిస్తున్నారు. ఆవులనన్నిటినీ చేరదీసి కాపాడుతూ ఆ ఆవుపాలతో శివార్చన చేస్తూ ఆయన ఈలోకమునందు ప్రకాశిస్తున్నాడు. మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది. భర్తను సేవించేది. శిష్యులను తల్లిలా కాపాడేది. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితమును పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితమును నడుపుతున్నా వారికి బిడ్డలు కలుగలేదు. ఆ సాకుతో వారు శివార్చన మాత్రం మానలేదు. ఈశ్వరుడిస్తాడని పూనికతో వారు శివార్చన చేస్తున్నారు.

ఇలా ఉండగా ఒకరోజు మృకండుడు బ్రహ్మ ఉండే అంతఃపురప్రదేశానికి వెళ్ళి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. అపుడు ఆయనను అక్కడ ఉండే ద్వారపాలకులు మీరు వెళ్ళకూడదు అని అడ్డుపెట్టారు. ఆయన ఆశ్చర్యపోయి ‘నేను ఎందుకు వెళ్ళకూడదు?” అని ప్రశ్నించారు. ‘మీకు సంతానం లేదు. అందువల్ల మీకు బ్రహ్మ సభా ప్రవేశార్హత లేదు’ అన్నారు. మృకండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు ఒకటి ఉంది. సంతానం లేకపోతే పితృ ఋణం తీరదు. ఎవరయినా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు. దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అందుకే నేను పెళ్ళి చేసుకోను అనరాదు. చేసుకుని తీరాలి. ఇక్కడ మృకండునికి పితృ ఋణం తీరలేదు. అది దోషం. మృకండు మహర్షి ధర్మ సూక్ష్మం తెలిసిన ఉన్నవాడు. ‘నాకు అనపత్య దోషం ఉంది’ అని మనస్సులో కొంచెం బాధపడుతూ ‘అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృ ఋణం నుంచి విముక్తుడిని చేయలేదు’ అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడి ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు. వారు మరుద్వతిని చూసి చాలా సంతసించి ‘అమ్మా మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ప్రదేశములను చూడడానికి వచ్చాము. మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా’ అని అడిగారు. అపుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి’ అని వారందరినీ పిలిచి పంచభక్ష్య పరమాన్నాలతో చక్కటి భోజనం తయారుచేసి వాళ్ళకి భోజనం వడ్డించింది. అపుడు వాళ్ళు ‘అమ్మా, అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము మేమూ తల్లులమే కదా! నీ బిడ్డలను పిలు. నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము. ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది. నీ బిడ్డలను పిలువవలసినది’ అన్నారు. అపుడు మరుద్వతి ‘అమ్మా నేను తక్కువ నోములు నోచాను. నా నోములు ఫలించలేదు. నాకు బిడ్డలు లేరు. మీవంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నాకడుపు పండుతుందని అనుకుంటున్నాను. దయచేసి స్వీకరించండి’ అంది. అపుడు వాళ్ళు ‘అమ్మా, ఏమీ అనుకోవద్దు. పురుషుడు పితృ ఋణం తీరడం కోసమే సంతానమును అపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు. మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేక పోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయము’ అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అపుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది.ఆసమయంలో మృకండు మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగారు. జరిగిన విషయం చెప్పింది ఆవిడ. అపుడు ఆయన కన్నుల కూడా నీరు కారింది. సంతానం కలుగకుండా గల దోషం పరిహరింప బడడం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాదన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. అపుడు మృకండుడు అన్నాడు “అయ్యయ్యో మరుద్వతీ, ఏక కారణమునకు ఇద్దరమూ గురయ్యాము. దేవీ, నువ్వు బాధపడకు. ఈశ్వరుడు ఉన్నాడు. నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను, బయలుదేరుతున్నాను” అని నీ తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజూ అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరారాధన చేస్తోంది. వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్నా శంకరుడు ప్రత్యక్షం అవలేదు.

నారదమహర్షి కైలాసమునకు వెళ్ళి శంకరుని చూసి ‘తండ్రీ, నిన్ను నమ్మి ఆ దంపతులిద్దరూ తపస్సు చేస్తున్నారు. ఇలా పిలిస్తే పలికేవాడివి.వారినింకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు’ అన్నాడు. శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై నీకు పదహారేళ్ళ వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కుమారుడు పుట్టాడు. మార్కండేయుడని పేరు. ఆ దంపతులు, కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతున్నారు. ఇలా గడిపేస్తుండగా ఒకరోజు నారదమహర్షి అక్కడికి వచ్చారు. మృకండు దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. నారదుడు మృకండునితో ‘మృకండా, నీకు ఒక్క విషయం జ్ఞాపకం ఉందా? ఈ పిల్లవానికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది. అది కూడా కొద్ది రోజులలో అయిపోబోతోంది. ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లవాడికి ఏదయినా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా! ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా’ అన్నాడు. నారదుడు ఈమాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తోంది. ఇంత తపో నిష్ఠా గరిష్ఠుడయిన మృకండుడు కూడా దుఃఖమును ఓర్చుకోలేక క్రిందపడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్ఛి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారమూ లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అపుడు నారదుడు వాడి భక్తి, వాడి విశ్వాసం వాడి ధృతి వాడి ధైర్యం చూశారా! మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగల శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి. తపస్సు మొదలుపెట్టండి. మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఎ శంకరుడు వీనిని ఇచ్చాడో ఆ శంకరుడు వేడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది. పిల్లాడిని పంపండి’ అన్నాడు. అపుడు మార్కండేయుడు “నన్ను అనుమతించండి. నేను దీర్ఘాయుష్మంతుడనవ్వాలని ఆశీర్వచనం చేయండి. శంకరుని గూర్చి తపస్సు చేస్తాను. నాకు ఆ మహానుభావుడు సిద్ధిని ఇస్తాడు. మీరేమీ బెంగ పెట్టుకోకండి’ అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్లి హిమాలయ ప్రాంతమందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు.

సమయం ఆసన్నమయింది. అక్కడ యమలోకంలో యమ ధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుడిని పాశములచేత బంధించి ఈ లోకమును చేరండి’ అని చెప్పాడు. యమదూతలు వెళ్లి పాశం వెయ్యడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అపుడు యమధర్మరాజుకు ఎక్కడలేని కోపం వచ్చి నేను బయలుదేరి వెడతాను. నాకు ఏమగాడు అడ్డు వస్తాడో చూస్తాను’ అని బయలుదేరుతుండగా నారదుడు ఎదురు వచ్చాడు. మహర్షిని నమస్కారం చేశాడు యమధర్మరాజు. అపుడు నారదుడు ‘ఎందుకయ్యా పంతాలు పట్టింపులు. వాళ్లకి ఉన్నది ఒక్క పిల్లాడు. మహర్షి కదా. పుత్రభిక్ష పెట్టిన వాడవు అవుతావు కదా’ అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది. ప్రాణములు తీసి తీరతాను అని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అతనిని బహిర్ముఖుని చేస్తే సరిపోతుంది అనుకోని బయటకు రా నేను యమధర్మరాజుని నీ ప్రాణములు తీయడానికి వచ్చాను. అదే నీకు మోక్షము. బయటకు రా’ అన్నాడు. అపుడు మార్కండేయుడు ‘ఓరి పిచ్చివాడా! నీకుకూడా ప్రభువెవడో వానిని నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. నా తల్లిదండ్రుల కోర్కె తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. అలా ఉండేటట్లు చేయమని పరమశివుని ప్రార్థిస్తున్నాను. నేను ఆయనను ఆరాధన చేస్తుండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు? నీకు చేతనయితే ప్రాణాలు తియ్యి’ అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. చేతిలో మెరిసిపోతున్న యమపాశమును విసిరి లాగుతున్నాడు. పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగలించుకుని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు. అలా కౌగలించుకోవడంలో కంఠమునకు పడిన పాశం శివలింగమునకు తగిలింది. అంతే ఒక్కసారి శివలింగం ఫెటిల్లున పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీ దేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు వక్షస్థలం పై ఒక్క తన్ను తన్నేటప్పటికి యమధర్మరాజు నీలపై విరుచుకు పడిపోయాడు. అపుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఒక్కవరం కోరుకో. అన్నాడు.

మార్కండేయుడు ఇరువురికీ నమస్కరించి నేను ఏ కోరిక కోరను? పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు. ఆయనను బ్రతికించండి’ అన్నాడు. అపుడు శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మళ్ళీ లేచి నమస్కరించి “స్వామీ, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి పదహారు సంవత్సరములు ఆయుర్దాయం మాత్రమె ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి? చెప్పవలసింది’ అన్నాడు. శివుడు మందహాసం చేసి నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సు ఉండే పిల్లవాడిని నేను వాళ్లకి ఇచ్చాను. నువ్వు పదహారేళ్ళే అర్థం చేసుకున్నావు. అందుకని ఇలా జరిగింది ఏమీ బెంగలేదు. వెళ్ళు’ అన్నాడు. మార్కండేయుడిని చూసి పార్వతీదేవి పొంగిపోయింది. వీడికి మంచి వరమును ఇవ్వవలసింది అని చెప్పింది భర్తకి. అప్పుడు పరమేశ్వరుడు ‘ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెటుకుని చీకుతూ ఒక మర్రి ఆకుమీద పడుకున్తాడో అప్పటి వరకు చిరంజీవివై ఉంది మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకే మనవాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్ళు పోస్తే నాన్నా నీకు మార్కండేయ ఆయుష్షురా’ అనేవారు. అలా రోజూ అంటూ నీళ్ళు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమౌతుంది అని వారి ఉద్దేశం.

ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నామీద నమ్మకంతో చదివితే వాళ్లకి అపమృత్యుదోషం రాకుండా నేను పరిహరిస్తాను. వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. ఎవరయితే ఈ చంద్రశేఖరాష్టకమును నమ్ముకుని ప్రతిరోజూ ఇంట్లో చాడువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళలోంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశములను కాపాడతాను. ఇది చదివిన వారికి దీనిని వినిన వారికి అపారమయిన కీర్తిని తేజస్సుని ఆయుర్దాయం నేను కృప చేస్తున్నాను అన్నాడు. ఈ అష్టకం ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అన్నాడు. ఎవరు నమ్మకంతో రోజూ శివుని సన్నిధానమునందు మృత్యు భీతితో ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యు భయం ఉండదు. ఆపదలు రాకుండా పూర్ణమయిన ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు. దానితో బాటుగా అఖిలమయిన అర్థములు యశస్సు సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్టచివరి రోజున చంద్రశేఖరాష్టకం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞాపకమునకు వచ్చి చంద్రశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో/వింటున్నారో వారికి పరిపూర్ణమయిన శివకటాక్షం కలుగుతుందని శివపురాణామ్తర్గతమయిన వాక్కు.

శివమహా పురాణం భాగం: 25[మార్చు]

  • నటరాజు

మనకి పరమశివుని స్వరూపము అనేకరకములయిన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమ శివునికి అరువది నాలుగు మూర్తులు ఉన్నాయి. శివుని స్వరూపమేమి అని అడిగితె మనకి శివలింగం అనే సమాధానం వస్తుంది. సాధారణంగా శివాలయముల అన్నిటియందు లింగ స్వరూపమే ఉంటుంది. కానీ సాకారంగా పరమశివుడికి పార్వతీదేవికి మూర్తి ఉంది. ఈ అరువది నాలుగులో ఒక భాగమును ‘ఘోర స్వరూపములు’ అంటారు. ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి. రెండవది ‘అఘోరరూపములు’. మంగళప్రదంగా ఉంటాయి. అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. మీకు ప్రపంచంలో ఎన్ని రకములయిన విద్యలు ఉన్నాయో ఎన్ని కళలు ఉన్నాయో అంతమందీ కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన మూర్తి ఒకటి లోకంలో ఉంది. దానిని ఆనంద తాండవమూర్తి అంటారు. దానిని మనం ‘నటరాజు’ అని పిలుస్తుంటాం. కానీ శైవాగమం దానిని ‘ఆనంద తాండవ మూర్తి’ అని పిలుస్తుంది. ఆ తాండవం చెయ్యడంలో గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి. ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరు ఉన్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి. ఆయనలో నుంచే సమస్తమయిన కళలు వచ్చాయి. ఒక్క శంకరుడు చేసిన తాండవంలోంచి 650 రకాలైన నాట్యములు పుట్టాయి. ఈవేళ ఇప్పటికీ కర్మభూమిలో బ్రతికినవి 108 రకముల నాట్యములు. కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యము ఇవన్నీ ఆనంద తాండవ మూర్తి అయిన శంకరుని దగ్గరనుంచే వచ్చాయి.

ఈ ఆనంద తాండవ మూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టం. చేతులు కట్టుకుని ఆయన నాట్యమును నలుగురు మాత్రమే చూస్తారు. అందులో ఒకడు నందీశ్వరుడు, రెండవ వాడు భ్రుంగి, మూడవ వాడు పతంజలి, నాల్గవ వాడు వ్యాఘ్రపాదుడు. ఈ తాండవం ఆ స్వరూపంలో అప్పుడు సమస్త లయకారకమై ఉంటుంది. ఈ తాండవం ప్రదోష వేళలో జరుగుతూంటుంది. ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. అందుకే ‘నటరాజు’ అని పిలుస్తుంటాము. ఆయన చేసే నాట్యం మామూలు నాట్యం కాదు. అది మీరు తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరకు వెళ్లి అంత పెద్ద ఆనంద మూర్తిని మీరు చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే మీరు ప్రణిపాతం చేసి సాష్టాంగనమస్కారం చేసేస్తారు. అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపములలో ఆనందమూర్తి స్వరూపం ఒకటి.

ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో మొదటి వాడు నందీశ్వరుడు. ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. రెండవ వాడు భ్రుంగి. మూడవ వాడు పతంజలి. ఆదిశేషుని అవతారము. అందుకని ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది. మిగిలిన శరీరం పాముగా ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి తలకాయ మనుష్యుడిది. పాములు పెద్దపులివి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి తాండవం చూస్తూంటారు. ముప్పది మూడు కోట్లమంది దేవతలు అక్కడే ఉంటారు. బ్రహ్మ శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటారు. పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికీ తోచిన వాద్య విశేషణాన్ని వారు వాయిస్తూంటారు. డమరుకం కదలిక చేత ఇన్ని రకములయిన సృష్టి ప్రారంభం అయింది. ఆయన చేతిలో ఉన్న డమరుకం కారణంగా ఈయన సృష్టికర్త అయ్యాడు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి. ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనే సమస్త కదలికలకు డమరుక సంకేతం. ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి ఆయన కదలికే కారణము. ఈశ్వరుని కదలికకు నర్తనమని పేరు. ఇదే ఆనంద తాండవము. ఆనంద తాండవ మూర్తి చేతిలో కుడివైపు డమరుకం ఉంటుంది. ఎడమచేతి వైపు అగ్నిహోత్రం ఉంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి. ఈ విషయం లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పుడు పనులు చేయడు. ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని మీకు అర్థం అయిపోతే మీ నడవడి యందు మార్పు వచ్చేస్తుంది. నటరాజ స్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈయన కాలుకింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు. ఏడవడు. మాయను గెలవడమే కుడికాలి కింద రాక్షసుని తొక్కి పట్టడం. ఎడమ కాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది. కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడమకాలు. అందుకే ఆనంద తాండవ మూర్తి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది. నీవు ఊర్ధ్వ ముఖ చలనము చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది ‘నేనుగా ఉండడం’ నీవు నేర్చుకో. నీవు నేనై ఉన్నాను అని తెలుసుకో. దానికి ధ్యానం అవసరం. ఇది చెప్పడానికి ఎడమచెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది. కుడి చేయి అభయ ముద్ర పట్టింది. శివుడు చాలా తేలికయిన వాటిని పుచ్చుకుని పెద్ద శుభ ఫలితములను ఇస్తాడు. ఇది చెప్పడానికే ఆయన అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి ‘శివ’ – అంటే మంగళమును చేరతాడు. ఈ ‘శివ’ నుండి ఆనంద తాండవ మూర్తిలోనికి లయం అయిపోవాలి, తాను ఆనందంగా మారిపోవాలి. అలా మారిపోతుంటే ఇప్పుడు ఆయన దిగంబరుడుగా వచ్చాడు. అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందం అంటారు. ఆత్మస్వరూపి అయిన ఆనంద తాండవ మూర్తియండు సాధకుడు కలిసిపోతే తానె ఆనంద తాండవ మూర్తి అయిపోతాడు. ఆయనకి మరల చావడం అనేది ఉండదు. ఇదే ఆఖరి చావు. శివుని విశేషములను వేటినీ మీరు సామాన్యముగా తీసుకొనుటకు ఉండవు. మీరు కేవలం ఒక నటరాజ స్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను అంటే మీకు ఈ తత్త్వము ఆవిష్కరింపబడదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం. కోరిక పుట్టినా అది నిలబడడం చాలా కష్టం. ఎందుకు అంటే కింద కుడికాలిక్రింద నవ్వుతూ ఒకడు బ్రతికే ఉంటాడు. వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మనకి తెలియదు. ఎప్పుడయినా మాయ మళ్ళీ పట్టేస్తుంది. మళ్ళీ కూపంలోకి పడిపోతాడు. ఉదాహరణకు రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు. తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు “జటాటవీ గలజ్జల’ అని. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడ లేకపోయాడు. పరమేశ్వరుని తనతో లంకకు రమ్మన్నాడు. ఏమయిపోయింది ఈ స్తోత్రం. అంటే అంతలో మాయ కమ్మింది. అడగడం కాదు. అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి. శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. కాబట్టి అటువంటి ఆనంద తాండవ మూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్యజన్మ ప్రయోజనం నెరవేరేటట్లుగా నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల చేత ఈశ్వరానుగ్రహం మనయందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేద్దాము.

శివమహా పురాణం భాగం: 26[మార్చు]

  • విఘ్నేశ్వరుడు

ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. ‘అమ్మా, నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భ్రుంగీ అంతే. మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అపుడు వానితో నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అంది అపుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు.

ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు. అపుడు ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమంవారి దగ్గరకు వచ్చి అమ్మా పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. ఇంక అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అపుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు. అపుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అపుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. అపుడు పార్వతీదేవి అయ్యో ఆ పిల్లాడిని నేనే సృష్టించాను – చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరల బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను’ అన్నాడు. వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది.

ఒకరోజు ఒక యోగ్యమయిన సంబంధం వచ్చింది విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలయిన సిద్ధిబుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అపుడు శంకరుడు తన కుమారులను పిలిచి ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్ళి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపటిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి ‘నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామీ వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు.

ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా! అని. పార్వతీ దేవి అనగా పరమ ప్రక్రుతి. పరమ శివుడనగా పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచ భూతములు. పంచభూతములయందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నిటిని తయారుచేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమయిన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము ‘నేను’ అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయాడు. అంటే త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడయితే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు ‘గజ’ – ఏనుగు తల పెట్టబడింది. ‘గ’ అంటే గతి అంటే కదలడం; ‘జ’ అంటే పుట్టడం. ఇపుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. రెండూ పంచ భూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్త్వమసి అర్థమయితే ‘తత్ త్వం అసి’ ‘అదే వాడి ఉన్నాడు’ జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్త్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడాయన వినాయకుడు అయ్యాడు. ‘వి’ అంటే విశిష్టమయిన – అనగా విశిష్టమయిన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పథంలోకి తీసుకు వెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు.

గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధిబుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకీ సిద్ధి బుద్ధి భార్యలు అయి ఉండడం. ఆ అనుగ్రహం మీయందు ప్రసరింపబడడం. ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగ పడితే కొన్ని యుగాలపాటు పంచమ వేదమయిన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ‘ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం’ అని పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమయిన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. ఇరువది ఒక్క గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు. అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మమునాకు రాస్తే చాలు పొంగిపోతాడు. ఏనుగు తల కనపడితే మంగళ ప్రథము. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే.

గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకూ అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించదానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి చేట లాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమభక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తీ పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు.

చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది. ఋణభారంతో ఉన్నవాడికి ఋణం తొలగుతుంది. ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.

శివమహా పురాణం భాగం: 27[మార్చు]

  • కాల భైరవుడు

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీరతామని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర తత్పురుష ఈశాన వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల నన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా, నా అంతవాడిని నేను అంటున్నావు. అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేయాలని మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. దాన్ని తీసి పారేసి యజుర్వేదమును పిలిచారు. అసురీశాక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నారు. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.

బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు బట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. పుట్టేతప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి ఇచట బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.

ఇకనుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.

ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.

అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు.

కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.

శివమహా పురాణం భాగం: 28[మార్చు]

  • కుమారిలభట్టు

ఒకానొక సమయంలో భారతదేశమంతటా బౌద్ధమతము వ్యాప్తి చెందినది. దీనికి సంబంధించి సనాతన ధర్మంలో కొంత ఆందోళన పాడడం జరిగింది. బౌద్ధము వేదమును అంగీకరించదు. వేదము ప్రమాణము కాదు అన్నవారిని నాస్తికుడు అని పిలుస్తారు. వేదప్రమాణమును అంగీకరించనిది నాస్తికము అవుతుంది. బౌద్ధము వైపు వెళ్ళిపోతే నాస్తికులు అయిపోతారని నాస్తిక మతమును ఖండించి తిరిగి ప్రజలలో కర్మ నియతిని ఏర్పరచి, మరల అందరినీ వేదమార్గంలో నడిపించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు కుమారిల భట్టుగా వెలశారు. ఆయన ప్రయాగ క్షేత్రంలో పుట్టారు. ఏదయినా తెలుసుకోకుండా ఖండిస్తే దానివలన మర్యాద ఉండదు. బాగా తెలుసుకుని ఖండించాలి. అందుకని వారు ఒక బౌద్ధారామమునందు చేరారు. అది ఏడు అంతస్తుల ప్రాకారము కలిగినటువంటి ఆరామము. అక్కడ అనేకమంది బౌద్ధులు ఉండేవారు. వేదము కాని, యజ్ఞము కాని, యాగము కాని, ప్రార్థన కాని, స్తోత్రము కాని చేయడం వారు అంగీకరించరు. అక్కడే కూర్చుని గురువుగారు చెప్పేది ఆయన వినేవారు. సనాతన ధర్మమును ఖండించినపుడు వాటి గురించి చెప్పినపుడు కుమారిల భట్టు ఏడుస్తూ ఉండేవాడు. ఒకరోజున గురువు ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. అపుడు ఆయన ‘సనాతన ధర్మంలోని విషయములను ఎంతో గొప్పగా ఖండించారు. అందుకు సంతోషంతో ఆనంద భాష్పములు కారుస్తున్నాను’ అని ఆయన అబద్ధం చెప్పారు. ఎందుకు? అసలు ఆ మతంలో ఉన్నదేంటో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు. పూర్వం అంటే అటువంటి కర్మనిష్ఠ ఉండేది. ఇప్పుడు నాలుగు శ్లోకములు, రెండు పద్యములు చదవడం రాకపోయినా అసలు అవతల మతంలో గొప్పతనం ఏమి ఉన్నదో తెలియకపోయినా అవతల మతానికున్న ప్రస్థాన త్రయం అంటే ఏమిటో తెలియకపోయినా, అవతల మతం మీద దుమ్మెత్తి పోసెయ్యవచ్చు. అంతటి హీనస్థితికి మనం దిగజారిపోయాము. ఇది కలియుగం కదా! కానీ కుమారిల భట్టు అటువంటి వాడు కాదు. విషయమును తెలుసుకుని, ఏది చెడో దానిని మాత్రమే ఖండించాలని అనుకున్నాడు. ఇలా అనుకుని గురువుగారి దగ్గర నేర్చుకున్నాడు.

బాగా నేర్చుకున్న తర్వాత ఈయన ఉద్దేశమును శిష్యులు, గురువులు కనిపెట్టారు. ‘ఈయన బౌద్ధుడు కాడు. ఈయన బ్రాహ్మణుడు. ఈయన సనాతన ధర్మమునందు మక్కువ ఉన్నవాడు. వేదమంటే చాలా ప్రీతి కలిగిన వాడు. ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికి మనలో చేరాడు. కుశాగ్రబుద్ధి కనుక ఈవేళో రేపో మనతో వాదానికి దిగుతాడు. అప్పుడు మనం ఈయనను తట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన ఈ స్థితిని పొందకముందే ఈయనను చంపేస్తే గొడవ వదిలిపోతుంది’ అని అనుకున్నారు. ఆయనను మాటలలో పెట్టి ఏడవ అంతస్తుకి తీసుకువెళ్ళారు. ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతుండగా కొందరు వెనకనుంచి వచ్చి ఆయన రెండు కాళ్ళూ ఎత్తేసి, ఆయనను పైనుండి క్రిందికి తోసేశారు. అపుడు కుమారిల భట్టు క్రింద పడిపోతూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. ‘వేదమే ప్రమాణం అయితే, సనాతన ధర్మం సత్యం అయితే వేదములలో చెప్పబడినవన్నీ సత్యములే అయితే, అది అనుష్టించవలసిన మతమయితే నేను క్రిందపడినప్పుడు మరణించకుందును గాక’ అని దాని అర్థం. ఏడంతస్తుల నుండి కిందపడిపోయినా ఆయనకు ఏమీ అవలేదు. కానీ కంట్లో ఒకరాయి గుచ్చుకుని నెత్తురు వచ్చింది. ఆయన వెంటనే వేదమాతను ప్రార్థన చేసి ‘నువ్వు ప్రమాణం అయితే నేను మరణించకూడదు అని నేను అన్నాను. ఇపుడు నేను మరణించలేదు. బ్రతికాను. నువ్వు ప్రమాణమని నిరూపించావు. చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి?’ అని అడిగాడు.

మనకి పురాణములలో అశరీరవాణి పలికింది అని తరచుగా చెప్తుంటారు. అశరీరవాణి అంటే వేదం. ఇప్పుడు వేదం అశరీరవాణియై పలికింది. వేదమును మొట్టమొదట ఈశ్వరుడు ఋషులకు చెప్పాడు. ఏ రూపము లేకుండా వారికి వినపడేటట్లుగా వాళ్ళ చెవిలో చెప్పాడు. అది అప్పటినుంచి వినబడుతూ గురువు దగ్గర శిష్యుడు, గురువు దగర శిష్యుడు అలా వింటూ వెళ్ళింది. కాబట్టి దానికి ‘శృతి’ అని పేరు వచ్చింది. వింటూ స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి అని పేరు వచ్చింది. కాబట్టి ‘మనకి శృతి ప్రమాణము. ఇటువంటి శృతి ప్రమాణం అయితే చావకూడదని నేను అనినప్పుడు నేను చావలేదు కానీ నా కంటికి ఎందుకు దెబ్బతగిలింది’ అని ఆయన అడిగారు. అలా అడిగితే అశరీరవాణియైవేదము అంది ‘నీవు పైనుండి క్రింద పడిపోయేటప్పుడు ‘వేదమే ప్రమాణం అయితే’ అంటూ పడ్డావు. ‘వేదము ప్రమాణం కనుక నేను మరణించను’ అని నీవు అనలేదు. చిన్న అనుమానం పెట్టుకున్నావు. అటువంటి అనుమానము నీ శ్లోకమునండు ఉండరాదు. నీవు బ్రతికావు కానీ నీకు ఈ చిన్న అనుమానం ఉండడం వల్ల కంట్లో రాయి గుచ్చుకుంది’ కుమారిల భట్టుకి కంటికి దెబ్బ తగిలింది కానీ వేదము ప్రమాణం అయింది. అప్పటి నుంచి మరల అందరూ కర్మానుష్ఠానం యజ్ఞము, యాగము, దానము ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టారు. కానీ శంకర భగవత్పాదుల అంశ కుమారిల భట్టుకన్నా కొంచెం పైస్థాయి. వీళ్ళకి కర్మయందు కొంచెం కోరిక ఉండడం, కోరిక తీరకపోతే కోపం రావడం లాంటివి ఉంటాయి. ముందు కర్మ నిలబడితే వెనక జ్ఞానం వస్తుంది. ఇంత గొప్ప కుమారిల భట్టుకు కర్మ నిలబెట్టవలసి వచ్చినపుడు కంటివెంట అప్పుడప్పుడు నీళ్ళు వచ్చాయి. అదే శంకరాచార్యుల వారు అయితే జ్ఞానంలో ఉంటారు. ఆయన బ్రహ్మజ్ఞాని. తలకాయను ఇచ్చేస్తారా అని కాపాలిని అడిగితే తీసుకుపో అన్నారు. అందుకే బ్రహ్మజ్ఞాని స్థాయిని చూసి ఈశ్వరుడు కూడా పొంగిపోతాడు. బ్రహ్మజ్ఞాని కన్నా గొప్ప స్థాయి ఇంక సనాతన ధర్మమందు లేదు.

కుమారిల భట్టు కర్మ గురించి వ్యాప్తిచేశాడు కనుక జ్ఞానమార్గము గొప్పది అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఆయన దగ్గరకి వచ్చారు. కానీ అప్పటికి కుమారిల భట్ట తుషాగ్ని ప్రవేశం చేసేశారు. తుషాగ్ని అంటే ఊకను పెద్ద రాశిగా పోసుకుని ఆ ఊకను అంటిస్తారు. ఊకకు ఉండే లక్షణం ఏమిటంటే అది గబగబా కాలిపోదు. తుషాగ్నిలో నిప్పు సెగ మెలమెల్లగా క్రిందనుండి అంటుకుంటూ వస్తుంది. ముందు వేడి పుడుతుంది. సెగ పుడుతుంది. ఒళ్ళు ఉడికిపోతుంది. తరువాత కిందకు వస్తుంది. తరువాత పాదములు, మోకాళ్ళు, తొడలు అన్నీ కాలిపోతుంటాయి. ఎంత కాలిపోతుంటే బూదిలోకి అలా దిగిపోతూ ఉంటాడు. ఎంత దిగిపోతుంటే అంత కాలుస్తూ ఉంటుంది. కాల్చి కాల్చి చివరకు ప్రధానమయిన అవయవములయిన గుండె మొదలగునవి కాలిపోయేంత వరకు ఆ ఒళ్ళు కాలిపోతున్న బాధ అనుభవించవలసిందే. ఈవిధంగా క్రిందనుండి పైకి కాలుస్తూనే ఉంటుంది. కదలకుండా కూర్చుని తుషాగ్నిలో ఆయన కాలిపోతున్నారు. ఆ సమయంలో శంకరాచార్యుల వారు వచ్చారు. వచ్చి ‘అయ్యో, మీరు ఎందుకు ఇలా కాలిపోతున్నారు? ఎందుకు మీరు ఈ పని చేయవలసి వచ్చింది? నేను మిమ్మల్ని కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి తిప్పడానికి వచ్చాను’ అని చెప్పారు. అపుడు కుమారిల భట్టు ‘నేను తెలిసి చేసినా తెలియక చేసినా గురువుల పట్ల అపచారం చేశాను. బౌద్ధము సనాతన ధర్మమును అంగీకరించని నాస్తికమతం కావచ్చు. కానీ ఇప్పుడు నేను సనాతన ధర్మ ప్రచారం కోసం బౌద్ధమతంలో ఉన్న రహస్యములు తెలుసుకోవడం కోసం వాటిని ఖండించడం కోసం గురువుల దగ్గర శిష్యుడుగా చేసి వాటిని నేర్చుకున్నాను. ఇలా గురువు దగ్గర వినకూడదు. వాటిని విన్నాను కనుక దానికి ఈ శరీరం తుషాగ్నిలో కాలిపోవడం ఒక్కటే సరియైన ప్రాయశ్చిత్తం. అందుచేత దీనిని ఇలా కాల్చేస్తున్నాను’ అన్నారు. ఆయన ఎంతటి మహాత్ములో చూడండి. నిష్ఠతో ఉన్నవాడు కాబట్టి ఆ కర్మనిష్ఠకే శరీరమును వదిలేశాడు. సుబ్రహ్మణ్య స్వామీ అవతారములు అన్నీ కూడా అగ్నియందే పర్యవసిస్తాయి. అందుకే అగ్నిహోత్రంలోకే తుషాగ్నిలోకి కుమారిల భట్టు వెళ్ళిపోతూ ‘నా శిష్యుడు మండనమిశ్రుడు’ ఉన్నాడు. ఆయనతో వాదించి ఓడించండి. అపుడు లోకం అంతా కర్మమార్గం నుండి జ్ఞానమార్గంలోకి వెడుతుంది’ అన్నాడు.

ఏమి చిత్రం జరిగిందంటే అంతకుపూర్వం వరకు పూజలుచేస్తే మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ పూజలో స్వామి పేరు చెప్పి ప్రీత్యర్థం అనేమాట చెప్పడం సంకల్పంలో లేదు. ఇది చెప్పకుండా పూజ చేసేవారు. శంకరాచార్యుల వారు మండనమిశ్రుని గెలిచిన తర్వాత కర్మ భాగమునందు ఒక కొత్త విషయం కలిసింది. మీరు ఏది చేసినా సంకల్పంలో....ప్రీత్యర్థం అని దేవత పేరు చెప్పి నీళ్ళు ముట్టుకుంటారు. ‘ఈ కర్మను నేను ఇప్పుడు ఈశ్వరానుగ్రహం కొరకు చేస్తున్నాను’. ఈ కర్మ చేస్తే ఫలితం వచ్చేస్తుందని కాదు. ఈ కర్మ చేస్తే ఈశ్వరుడు ప్రీతిచెంది ఫలితమును ఇవ్వాలి. ఈశ్వర ముఖంగా ఫలితం రావాలన్న జ్ఞానమును అంకురింపచేయడానికి సంకల్పమును శంకరాచార్యుల వారే అక్కడ మార్చారు. మండనమిశ్రుడు ఓడిపోయినతరువాతి నుండి అలా మారింది. కనుక తుషాగ్నిప్రవేశం చేసిన గొప్ప అవతారం కుమారిల భట్టు అవతారం. ఆయన అవతారం రాబట్టే మనకి సనాతన ధర్మం మరల నిలబడే అవకాశం ఈ లోకమునందు కలిగింది. అంతటి మహోత్కృష్టమయిన అవతారం కుమారిలభట్టు అవతారం.

ఎప్పుడెప్పుడు వేదం చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమును గూర్చిన ఆలోచనయందు వైక్లభ్యము కలుగుతుందో, వేదము ప్రమాణము కాదనే ఆలోచనలు ప్రబలుతాయో, అప్పుడు ముందుగా సుబ్రహ్మణ్యుడే అవతరిస్తూ ఉంటాడు. రాక్షసులను సంహరించడం ఆయనకేమీ పెద్ద విషయం కాదు. లోకమునకు వైదికమయిన మార్గమును ప్రబోధం చేయవలసి వస్తే ఎప్పుడెప్పుడు ఎంతవరకు సమాజంలో బోధ జరిగితే తప్ప కుదరదో అంత గొప్ప బాధ్యతను ఆయన భుజాల మీదకు ఎత్తుకుంటాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞాన బోధ చేయగలడు. లోకం అంతాకూడా సనాతన ధర్మమును విడిచిపెట్టి నాస్తికము వైపు నడుస్తున్న రోజులలో ముందు కర్మనిష్ఠను చూపించడం కోసమని ఆయన కుమారిల భట్టు రూపంగా వచ్చాడు. అంతే కర్మనిష్ఠతో చిట్టచివరకు ఆయన తుషాగ్ని ప్రవేశం చేసేశారు. వేరొక సందర్భంలో ఆయన తిరుజ్ఞాన సంబంధర్ గా వచ్చారు.

శివమహా పురాణం భాగం: 29[మార్చు]

  • స్కందోత్పత్తి – కుమారసంభవం

మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు 13మంది భార్యలు ఈ 13మంది దక్షప్రజాపతి కుమార్తెలు. కశ్యప ప్రజాపతి భార్యలలో ‘దితి, అదితి’కి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణకు అనేకమయిన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి. దితియందు మార్పురాలేదు. కాబట్టి ఇపుడు తేడా క్షేత్రమునందే ఉంది. ఇప్పుడు మరల బిడ్డలు కావాలని కశ్యప ప్రజాపతిని అడిగింది. ‘నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలి’ అని. అపుడు కశ్యప ప్రజాపతి నవ్వి ‘నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టేవరకూ అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు’ అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణీ అయింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు ఆవిడ దగ్గరకు వచ్చి ‘అమ్మా, నీకు సేవచేస్తాను’ అన్నాడు. ఆవిడ ధర్మం పాటించింది ఇక్కడ. ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది.

ఒకనాడు ఆవిడ మిట్టమధ్యాహ్నం వేల తల విరబోసుకుని కూర్చుని ఉంది. కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిందమును ముక్కలుగా నరికేశాడు ‘మారుదః మారుదః – ఏడవకండి’ అంటూ. అపుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీదగ్గర పదవులియ్యి అని ఇంద్రుని అడిగింది. మారుదః మారుదః అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు ‘మరుత్తులు’ అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. ఇపుడు దితికి మరల భంగపాటు అయింది.

ఇలా కొన్నాళ్ళు అయిపొయింది. మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమయిన కోరిక కోరింది. ‘నాకు దేవతలనందరిని గెలవగల కుమారుడు కావాలి’ అని అడిగింది. అపుడు ఆయన ‘పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మగురించి తపస్సు చెయ్యాలి. అప్పుడు నీకు నీవు కోరుకునే కొడుకు పుడతాడు’ అని చెప్పాడు. అటువంటి తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ‘వజ్రాంగుడు’ అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు అని అర్థం. వాడికి దేహమునందు బలం ఉంది. బుద్ధియందు సంస్కారం ఏర్పడలేదు. యితడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. ఇప్పుడు బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. అపుడు బ్రహ్మ ‘నాయనా, నీవు చేసిన అతిథిమర్యాదకు చాలా సంతోషించాము. కానీ దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్ళను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే. అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళ పదవులు వాళ్ళను చేసుకొనీ’ అని చెప్పాడు. వాళ్ళమాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని, తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో ఇలా అన్నాడు ‘మహానుభావా అనుకోకుండా ఈవేళ నాకోసం ఇలా వచ్చావు. నేనూ నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో ఏది నిజమయిన తత్త్వమో ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది. ఉపదేశం చేయవలసింది’ అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి ‘నాయనా నీవు ఎల్లప్పుడూ సత్త్వ గుణమును పట్టుకుని ఉండు. ఈశ్వరుని నమ్మి ఉండు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు ఒక భార్యను ఇస్తున్నాను నేను. ఆమె పేరు ‘వరాంగి’. నేను సృష్టించి ఇస్తున్నాను. తీసుకో’ అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగికి పెళ్ళిచేశారు.

వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి ‘నీకు ఏమి కావాలనుకుంటున్నావు? నీవు ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు’ అని అడిగాడు. అపుడు వరాంగి ‘ముల్లోకములను గెలవగలిగిన వాడు పాకశాసనుని కన్నుల వెంట నీళ్ళు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు’ అన్నది. ఇప్పుడు వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి ‘స్వామీ, వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి’ అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకు వచ్చి ఆ పిల్లవానికి ‘తారకుడు’ అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది. తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడి పోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. ఇప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలుమీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా నూరేళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఉగ్రతపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది. అపుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకములనన్నిటిని కాల్చేస్తోంది. అపుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకముల నన్నింటిని కాల్చేస్తోంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు. అపుడు బ్రహ్మ వెళ్ళాడు.

తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయి నాయనా ఏమిటి నీ కోరిక? అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి ‘దేవతలనందరినీ, మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఈయవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మథుని దాహిస్తాడు. ఆయన కామారి. ఆయనకీ కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్య స్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది’ అని అడిగాడు. బ్రహ్మ సాంబసదాశివుని తలుచుకుని తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు.

తారకుడిని మూడు లోకములకు రాజ్యాభిషేకం చేసేశారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏయే పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. ఇపుడు వాళ్ళందరూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్ఛి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీమహావిష్ణువు అక్కడినుండి తప్పుకున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ‘ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగ మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి’ అని వేడుకున్నారు.

ఇప్పుడు లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమారసంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మథుడు కామప్రచోదనం చేయగలడు. ఇంద్రుడు మన్మథుని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మథుడు వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవకన్ను తెరచాడు. ఆ కంటి మంటకు మన్మథుడు భస్మం అయిపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కర్తే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మథుడు చేతిలో చెరకు విల్లు, పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని దింపలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినపుడు ఆవిడ శివకామ సుందరి. అమ్మవారు వెళ్లి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అపుడు అమ్మవారు ‘ధూర్త బ్రహ్మచారీ, శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీ ప్రాంతమును వదులుతావా వదలవా? అని అదిలించింది. అప్పుడు శంకరుడు నిజరూపం చూపించాడు. తరువాత అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. ఇపుడు పార్వతీ పరమేశ్వరులిరువురూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు.

శివమహా పురాణం భాగం: 30[మార్చు]

  • స్కందోత్పత్తి – కుమారసంభవం – 2

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతియందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. కాబట్టి వారి దివ్యమైన క్రీడా జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. ఇలా శివపార్వతుల దివ్యమైన క్రీడా శత దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మొహితుడు కాలేదన్నమాట. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడిని కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవియందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకీ కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.

ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది. అసలు కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? అందుకని ఇపుడు శివతేజస్సు కదలరాదు అన్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చినవాళ్ళు వీళ్ళే. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్ళారు. ఇపుడు ఆయన పార్వతీ దేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. అటువంటి వాడు బ్రహ్మతో కలిసి దేవతలు తనకొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి? అని అడిగాడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు. కాబట్టి ఈశ్వరా మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పదకుండు గాక! కానీ ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించదానికి భూమి అంగీకరించింది. అపుడు శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేడు.ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు గాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమివంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకములయిన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అంది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగామించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతెజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. కాబట్టి గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకి వెళ్లి అమ్మా దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగాడు. అపుడు ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకమాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను. ఏమి చెయ్యను అని అడిగింది. దేవతలలో మరల కంగారు మొదలయింది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించ లేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు ఉన్నాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకములో పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది. ఈవిధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. అపుడు ఆ కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వదానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి ‘షణ్ముఖుడు’ అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. ఆరుగురు కృత్తికల స్తనములను ఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు.

ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి ‘సేనాని’ అని పేరుపొందాడు. ఈయనే ‘గుహా’ అనే పేరు ఉంది. కాబట్టి పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది, ఆయన సంబంధమును గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూస్తారు, స్కందలోకమును పొందుతారు

శివమహా పురాణం భాగం: 31[మార్చు]

  • కుమార స్వామి

పార్వతీపరమేశ్వరులిద్దరూ కూడా తమకు కుమారుడు కలిగాదని చాలా సంతోషించారు. వెంటనే కైలాసమునుండి ఒక రథమును పంపి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు. తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించి పోయి ఎదురు వచ్చి మూర్థన్య స్థానమునందు ముద్దు పెట్టుకుంది. ఆయన కూడా పరవశించి మూడవవాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవి దగ్గరకు తీసుకుని ఆయుష్మాన్ భావ అని ఆరుమాట్లు అన్నాడు. ఇప్పుడు జరగవలసిన దేవకార్యం ఒకటి ఉంది. అదే తారకాసుర సంహారము. సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యము కాదు. తారకుడిని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలములను (శూలము అమ్మవారి శక్తి) ఇచ్చారు. శంకరుడు వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవీ విద్యనూ కూడా కటాక్షించాడు. బ్రహ్మదేవుడు వేదములను, యజ్ఞోపవీతమును, గాయత్రీ మంత్రమును, కమండలమును, బ్రహ్మాస్త్రమును, శ్రీమహావిష్ణువు వైజయంతీ మాల, కంఠహారము, ఐరావతమును, వజ్రాయుధమును, వరుణుడు ఒక శ్వేత ఛత్రమును, రత్నమాలను, సూర్యుడు మనోవేగము కలిగిన రథమును, కవచమును, యముడు యమ దండమును, చంద్రుడు అమృత కలశమును, అగ్ని మహాశక్తిని, వాయువు వాయవ్యాస్త్రమును, కుబేరుడు గదను, మన్మథుడు కామ శాస్త్రమును ఇచ్చారు. పాలసముద్రము అమూల్యమయిన రత్నములను, రత్నములతో కూడిన ఒక అందెను బహూకరించింది. అమ్మవైపు తాతగారయిన హిమవంతుడు వచ్చి కట్టుకోమని పట్టుబట్టలు ఇచ్చాడు. గరుత్మంతుడు ‘చిత్రబర్హణుడు’ అనబడే ఒక నెమలిని, అరుణుడు ‘తామ్రచూడుడు’ అనే కోడి పుంజును బహూకరించారు. అదే కుక్కుట ధ్వజము. పార్వతీదేవి వెనక్కి పిలిచి గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందట. అందుకే మీకు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపములు అన్నిచోట్లా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి. అంతేకాక ఐశ్వర్యమును, చిరంజీవిత్వమును ఇచ్చింది. లక్ష్మీదేవి సంపదను, కంఠహారమును ఇచ్చింది. సావిత్రీదేవి సకల విద్యలను ఆయనకు ఇచ్చారు. ఇప్పుడు దేవేంద్రుడితో దేవతలతో కలిసి ఆయన తారకాసుర, సంహారమునకు బయలుదేరాడు. దేవ సైన్యంతో కూడి వెళ్ళిన వాడై దేవసేనానిగా తారకా సుర సంహారం చేశాడు. లోకములన్నీ ఎంతగానో మురిసిపోయాయి. యుద్ధానంతరం సుబ్రహ్మణ్యుడు సంతోషంగా తిరిగి కైలాస పర్వతమును చేరుకున్నాడు.

అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్య సేనతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది.ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ‘ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో. దేవసేన నా దగ్గర పెరుగుతుంది. అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళి పెంచాడు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికొక

ఆలోచన కలిగింది. ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన వాడి ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు. ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు. తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. వెళ్లి కుమారస్వామిని వేడుకుని దేవసేననిచ్చి వివాహం చేసిన స్థలాన్ని తిరుప్పరంకుండ్రం అని పిలుస్తారు. మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తీరవలెనని శాస్త్రం చెప్తోంది. సుబ్రహ్మణ్యానుగ్రహమును పొందాలి. అగస్త్య మహర్షికి ద్రావిడ వ్యాకరణం సుబ్రహ్మణ్య స్వామివారే నేర్పారు. కాబట్టి అగస్త్యుడికి సుబ్రహ్మణ్యుడు గురువు.

సుబ్రహ్మణ్య స్వామి వారు అవతారములను స్వీకరించారు. ఇందులో ప్రధానమయిన అవతారం జ్ఞాన సంబంధర్ ఒకటి.

తిరుజ్ఞాన సంబంధర్:

జ్ఞాన సంబంధర్ గురించి వినినంత మాత్రం చేత పాపరాశి దగ్ధం అవుతుంది. ద్రవిడ దేశంలో శీర్గాళి అనే ఊరు పరమ పావనమయిన క్షేత్రం. అక్కడ తోణిపురీశ్వర దేవాలయం ఉంది. ఆ ఊరిలో శివ పాద హృదయుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు భగవతి. వారికి పరమాత్మ అనుగ్రహం చేత ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన మూడు సంవత్సరముల వయసు బాలుడయ్యాడు. ఒకనాడు శీర్గాళిలో తండ్రి అయిన శివ పాద హృదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు. నేనూ వస్తాను అని ఏడుపు మొదలు పెట్టాడు పిల్లవాడు. నాయనా, నాతో నీవెందుకు, వద్దు అన్నాడు తండ్రి. పిల్లవాడు వినలేదు. అపుడు పిల్లవాడిని ఎత్తుకుని ఆయన దేవాలయమునకు వెళ్ళాడు. ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోబెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్తూ మంటపంలో కూర్చోబెట్టి వెళ్ళాడు. పిల్లవాడికి తండ్రి కనపడలేదు. భయం వేసింది. అపుడు వాడు శిఖరం వంక పార్వతీ పరమేశ్వరులను చూసి అమ్మా నాన్నా అని ఏడుస్తున్నాడు. వెంటనే శంకరుడు కదిలిపోయాడు. పార్వతి వైపు చూసి పిల్లవాడు ఏడుస్తున్నాడు పద అన్నాడు. అపుడు ఇద్దరూ కలిసి గబగబా పిల్లవాడి దగ్గరకు వచ్చారు. పిల్లవాడు ఎత్తుకుని లాలించినా ఏడుపు ఆపలేదు. ఒక బంగారు పాత్రను తేసుకుఇ నీ స్తన్యమును ఆ పాత్రలోకి పట్టి పిల్లవాడికి త్రాగించు వాడు ఏడుపు ఆపుతాడు అన్నాడు పరమశివుడు. అపుడు పార్వతీదేవి నాపాలు తాగితే మీ జ్ఞానం వచ్చేస్తుంది. మహాజ్ఞాని అయిపోతాడు పట్టమంటారా? అని అడిగింది. పిల్లవాడు మనలను నమ్మి అమ్మా నాన్నా అని ఏడ్చాడు. పాలు త్రాగించు అన్నాడు. అందుకే జ్ఞాన సంబంధర్ ఎక్కడికి వెళ్ళినా ఆయనను నమ్మి ఏడ్చినవాడు అని పిలిచేవారు. మనమూ ఏడుస్తాము. కానీ ఆ ఏడుపులో భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉండదు. శంకరుడు అలా చెప్పిన పిదప పాలు పట్టి పిల్లవాడి చేత త్రాగించింది పార్వతీ దేవి. పాలను త్రాగేసి మూతి తుడుచుకుంటున్నాడు. తండ్రి సరోవరంలోంచి మెట్లు ఎక్కుతున్నాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ అంతర్థానం అయిపోయారు. ఆయన పిల్లవాని దగ్గరికి వచ్చి నాయనా ఎంత పనిచేశావురా ఎవరో ఇచ్చిన పాలు తాగేశావా”

అన్నాడు. అపుడు పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు. పత్తికం అంటే దండకం లాంటిది. మూడేళ్ళ పిల్లవాడు. భక్తులందరూ గుమిగూడి పత్తికం విని ఆశ్చర్యపోయారు. తండ్రి పరవశించి పోయి భగవత్ దర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు. అసలు ఇందులో ఉన్న చమత్కారం రహస్యం ఏమిటంటే ఆ అంశాలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివభక్తిని ప్రచారం చెయ్యడానికి వైదికమయిన మార్గమును ఆ రోజులలో నలిపి వేస్తున్న వాళ్ళ దురాచారములను ఖండించదానికి పుట్టిన సుబ్రహ్మణ్యుడు. ఆనాడు పార్వతీదేవి స్తన్యం ఇచ్చే అదృష్టం తిన్నగా కలగలేదు. కృత్తికల ద్వారా ఇవ్వవలసి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది. శంకరుడు గుర్తు పెట్టుకుని ఆ కోర్కె ఇప్పుడు తీర్చాడు. అమ్మవారి పాలు జ్ఞాన సంబంధర్ పిల్లవాడుగా త్రాగేశాడు. అందుకని ఆయనను తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు. శివునకు మారు పేరే జ్ఞానము. అమ్మవారి క్షీరమును గ్రోలి అపారమయిన జ్ఞానమును పొందినవాడు కనుక ఆయనకు తిరుజ్ఞాన సంబంధర్ పేరు.

వల్లీ కళ్యాణం – ఒకానొక సమయంలో నారదమహర్షి కైలాసపర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు. లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలు పెట్టాడు. ఇప్పుడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజయై ఒకపిల్ల ఒకతె అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక భిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకు వచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశీభూతమయిన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడు. నువ్వు చూసి భయపడకూడదు సుమా! ఎవరు ఆ పిల్ల వొంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు. ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి భిల్లరాజు ఎదురువచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు భిల్లరాజుతో “నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్ళి చేసుకో బోయేవాడు లోకంలో యౌవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో, ఎవరు పరమ సౌందర్యరాశియైన శంకరుని తేజమును పొందిన వాడో, ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అన్నాడు. భిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు

కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక చూసి బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. ‘లతాంగీ నన్ను చేపట్టవా?” అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి ‘అబ్బో ఈతడు ఎంత అందగాడో’ అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు.

ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సులో పాపపంకిలమయిన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందినదానను. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అయి ఉంటె నా రొట్టె విరిగి నేతిలో పడినట్లే కదా అనుకుని ‘ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదయినా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది. ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది. అయ్యో ఎక్కడి మహానుభావుడు. నేను ఒక్కమాట నోరు తెరిచి చెప్పలేదు. అని. చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు. ఒక ఆకుమీద ఉత్తరం రాసి ఇవ్వు. నేను పట్టుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అంది.

అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదా అన్నాడు. అపుడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్లి వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు. భిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు. సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహతప్పిపోయారు. అప్పుడు వల్లీ దేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది. అపుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలివాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ భిల్లులందరూ నేలమీద పది సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు.

నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు. నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. అపుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలూ లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుత్తణియందు వెలసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమయిపోతాయి. వంశాభివృద్ధి జరుగుతుంది.

శివమహా పురాణం భాగం: 32[మార్చు]

  • గంగావతరణం

శివ సంబంధమయిన విషయములలో చాలా పరమ పవిత్రమయిన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సామానమయిన ఘట్టం మరొకటి లేదు. ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించేవాటిలో గంగావతరణం ఒకటి.

సగరచక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిలమహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్ళి, తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి, చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నిందచేస్తూ ఆయన మీదకు పరుగెత్తారు. నాశనం చేసెయ్యడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు. అది చాలా భయంకరంగా ఉంటుంది. కపిలమహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళుతెరిచి చూశారు. సగరులు మీదికి వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయన కోపమును పొంది వారిని చూసి హుంకరించారు. అంతే. వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అరువదివేలమంది బూదికుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్ళు పట్టుకువస్తున్నాడు. అపుడు గరుత్మంతుడు ‘ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమయిన జలములకు అధికారం లేదు. వీళ్ళు ఊర్ధ్వలోకములను పొందరు. వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమిమీదకి ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావింపబడి, వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి వీళ్ళు ఉన్నతలోకములను పొందుతారు. కాబట్టి నీవు ఈ నీతితో జలతర్పణ చేయకు.’ అన్నాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగపెట్టుకున్నారు. ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాలపాటు పడిపోయిన సందర్భం ఏదయినా ఉంటె అది ఒక్క సగరచక్రవర్తి బిడ్డలవల్లే. చాలా కష్టపడి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదయి అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జల తర్పణలు లేవు. పితృకార్యములు లేవు. వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒకమాట వచ్చింది.

భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చి గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయి నీకేమి కావాలి? అని అడిగాడు. అపుడు భగీరథుడు ‘ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవిచ్చిన్నముగ వంశం జరుగుగాక; రెండవది – నాకు ముందు తరములలలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందకి పాతాళగంగను విడిచిపెట్టు’ అని కోరాడు. గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు శంకరుడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని చెప్పాడు. భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై అతనికి ప్రత్యక్షం అయి నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్పర్వతం మీద నిలబడ్డాడు. అప్పుడు గంగ అనుకుంది “నేను ఈయన తలమీద పది ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను’ అని. ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి. ఇపుడు శివుడు ఆ నీటినంతటినీ తన జటాజూటంలో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీదనుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు. ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందుసరోవరంలో పడింది. బిందుసరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. అక్కడి నుండి ఏడూ పాయలుగా విడిపోయింది. భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు. దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునికి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళుతుంటే వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. దారిలో జహ్నుమహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెడుతూ జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జహ్నుమహర్షి కోపంతో గంగనంతటినీ ఔపోసన పట్టేశాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్నుమహర్షిని ప్రార్థించాడు. అపుడు జహ్నుమహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు. గంగ మరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది. అలా చివరకు పాతాళలోకానికి వెళ్ళింది. గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటిమీద నుంచి ప్రవహించమని చేతులోగ్గి నమస్కరించి అడిగాడు. గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది. వాళ్ళందరూ కూడా ఉత్తరక్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు.

వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పిలవకుండా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగలించుకుని ‘భగీరథా, ఇంకా లోకంలో ఎప్పుడయినా ఎవరయినా ఎక్కడయినా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. . అన్నింటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్చి ఓర్పుతో గంగ పాయను పాతాళమునాకు తెచ్చావు గనుక ఈపాయకు భాగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడినుంచి నిష్క్రమించాడు. సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికీ ఫలశ్రుతిని చెప్పలేదు. కానీ ఈ గంగావతరణ విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు. తెలిసికానీ, తెలియకకానీ ఎన్ని పాపములు చేసిన వారయినా సరే నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో అటువంటి వారి సమస్తమయిన కోరికలు తీరుతాయి. వారు ఇంతకుపూర్వం ఎన్ని పాపములు చేసిన వారయినా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. చిరంజీవులు అవుతారు. అపమృత్యుదోషం ఉండదు. చక్కటి కీర్తి పొందుతారు. అనగా ఈ గంగావతరణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్టానం కలిగి వేరోకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు. కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమయినది.

శివమహా పురాణం భాగం: 33[మార్చు]

  • కిరాతార్జునీయం

పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. కృష్ణ భగవానుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ధర్మరాజు కృష్ణ భగవానుడితో ఒకమాట అంటున్నాడు. “అయ్యా, మహానుభావా, నీకు తెలియని విషయం లేదు. ఇంతకు పూర్వం మేము రాజసూయ యాగం చేశాము. మాచేత ఓడింపబడని రాజు లేడు. ఇప్పుడు మేము అరణ్యవాసమునకు వచ్చాము. అనగా ఓడలు బండ్లు అయ్యాయి. ఇప్పుడు మాకు శత్రువులు అనంతము. ఈశ్వరా, మేము ఈ సంకటం నుండి ఎలా బయటపడతాము? అన్నాడు. ఇదీ మీకు పెద్దలు కనపడినపుడు మీరు అడగవలసిన మాట. ధర్మరాజుగారు ప్రాజ్ఞుడు. మాకు ఇన్ని ఉన్నాయి అనడం లేదు. శత్రు బలమును ఎక్కువచేసి చెప్తున్నాడు. ధర్మరాజు అలా అడిగిన మీదట కృష్ణుడు ‘ఎందుకయ్యా నువ్వు బెంగ పెట్టుకుంటావు? నాకు ఉపమన్యు మహర్షి ఉపదేశం చేశారు. నేను పరమశివుడిని ఆరాధన చేసి ఎన్నో శక్తులు పొందాను. మహానుభావుడు దీన దయాళువు ఎవరి పేరు శివుడో, ఎవడు మంగళము లన్నిటికీ కూడా ఆలవాలమో, ఎవరి అనుగ్రహం మంగళములను ఇస్తుందో, ఎవరు చెయ్యెత్తి ఆశీర్వదిస్తే నీకు శుభం జరుగుతుందో, ఏ ఒక్కడు నిన్ను చూసి నవ్వినంత మాత్రం చేత సమస్త లోకములు నీకు ఎదురు నిలబడినా నీవు బెంగ పెట్టుకోనవసరం లేదో అటువంటి పరమశివుని గురించి తపస్సు చేయండి. ఆ శంకరుడు కానీ కృపాళుడై మిమ్మల్ని అనుగ్రహించాడంటే ఎంతమంది శక్తిమంతులు అటుపక్కన నిలబడిన మీకిక ఎదురు ఉండదు. మీరు యుద్ధంలో గెలుస్తారు. కాబట్టి మీరు శివానుగ్రహమును పొందండి” అని చెప్పి కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు.

ఇప్పుడు వ్యాసభగవానుడు అక్కడికి వచ్చాడు. ఆయన సాక్షాత్తు నారాయణుడు. అపుడు పాండవులు అర్ఘ్య పాద్యాదులు యిచ్చి నమస్కరించి పూజించారు. తరువాత ఆయనతో ‘కౌరవులు మమ్మల్ని మాయా జూదంలో ఓడించారు. దుర్యోధనుడు మమ్మల్ని ఇలా అరణ్యవాసమునకు తరువాత అజ్ఞాత వాసమునకు వెళ్ళేటట్లుగా చేశాడు. మేము కృష్ణ భగవానుని ఆరాధన చేశాము. ఆయన మమ్మల్ని శంకరుని పూజ చేయమని ఆనతిచ్చాడు. మహాత్మా ఇవాళ మీరు వచ్చారు. మేము ఈ కష్టంలో ఉన్నాము. ఇదే విషయమును మీకు కూడా చెప్పుకుంటున్నాము’ అన్నారు. ఆ తరువాత ద్రౌపది మాట్లాడింది. ‘నేను ధర్మమునందు ఉన్నాను కాబట్టి మీ ఆశీర్వచనం నాకు కావాలి’ అని వ్యాసులవారితో అన్నది. తనకి జరిగిన పరాభవం గురించి చెప్పింది. ఇది చెప్పగానే వ్యాసుడి మనస్సు చిన్నబుచ్చుకుంది. నీవు శాసించగలిగిన వాడివి, నీకు ఎదురు తిరిగితే శాపవాక్యం విడిచి పెట్టగలిగిన వాడివి. అంది. కానీ శాపం ఇవ్వవలసిందని ఆవిడ అడగలేదు. ఈ విషయములను చెప్పిన తర్వాత ఇపుడు వ్యాసుడు వీళ్ళు గెలవడానికి మార్గం చెప్తాడు. ఇది పాండవుల ఉన్నతికి పనికొస్తుంది. తన కష్టం చెప్పి తన భర్తలను గెలిపించుకుంది. చేతకానివారై తనను ఎన్నో కష్టములు పెట్టారని భర్తల మీద వ్యాసుడికి చెప్పలేదు. కౌరవులు ఎంత ధర్మం తప్పి ప్రవర్తించారో చెప్పి, ఆయన సలహా చేత భర్తలను రక్షించుకుంది. ఇదీ మహా పాతివ్రత్యం అంటే. ద్రౌపది లాంటి స్త్రీ చాలా అరుదుగా కనపడుతుంది.

అపుడు వ్యాసభగవానుడు ‘అటు కౌరవులూ నా వాళ్ళే, మీరూ నా వాళ్ళే. కానీ ధర్మము మీ పట్ల ఉన్నది. కాబట్టి నా అనుగ్రహం మీకే ఉంటుంది. దానివలన మీరు గెలుపొందుతారు’ అని చెప్పాడు. మీకు కృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది సత్యం. మీకు ఎంతమంది శత్రువులున్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కలగాలి. కాబట్టి ఇపుడు పాండవమధ్యముడయిన అర్జునుని తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి మీదికి పంపించండి. అక్కడ శంకరుని గూర్చి తపస్సు చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రం అడగండి. శంకరుడు దానిని మీకు ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే ఇక మీ విజయమునకు తిరుగులేదు. అని చెప్పి వ్యాస భగవానుడు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు.

అర్జునుడు అన్న దగ్గర, తమ్ముళ్ళ దగ్గర శలవు తీసుకుని బయల్దేరాడు. ఇంద్రకీలాద్రి చేరుకుని శివారాధన చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుని తండ్రి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి ‘దేనికి తపస్సు చేస్తున్నావయ్యా?” అని అడిగాడు. శంకరుని అనుగ్రహం కోసం చేస్తున్నట్లు చెప్పాడు అర్జునుడు. నీకేం కావాలి? అని వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు ఆర్జునుడిని అడిగాడు. నాకు పాశుపతాస్త్రం కావాలి’ అన్నాడు. ఆయన నవ్వి ‘శంకరుడు మహాజ్ఞాని. శంకరుని అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి. అపుడు ఈ యుద్ధములు, గొడవలు అవేమీ మీకు ఉండవు. కానీ యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రమును ఆశీర్వచనం అడుగుతానంటున్నావు. ఎవరికయినా ఇంత తెలివితక్కువతనం ఉంటుందా! అన్నాడు. ఇపుడు ఇంద్రుడు అర్జునుడు తన క్షాత్ర ధర్మమును విడిచిపెట్టేశాడా అని చూస్తున్నాడు. ప్ర్జునుడు అపుడు నాకేమి కావాలో తెలుసు. మా అన్నగారు నన్ను శివానుగ్రహంతో పాశుపతం తెమ్మనమని పంపారు. మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సుకు వచ్చాను తప్ప మధ్యలో మీరు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి మీకొక నమస్కారం, వెళ్ళిరండి’ అన్నాడు. అయినా వెళ్ళకుండా వేధిస్తున్నాడు ఇంద్రుడు. ఇంక నన్నుగాని విసిగించావంటే నీకు శాస్తి జరుగుతుంది. ఇక్కడనుండి పో అన్నాడు. ఇపుడు ఇంద్రుడు సంతోషించాడు. తన నిజరూపంతో సాక్షాత్కరించి ఇక నుంచి నీవు పార్థివలింగమును పంచాక్షరీ మంత్రముతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి. నీ క్షాత్రధర్మమును మాత్రం మరిచిపోకు. అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని అర్జునుడు శివుని గూర్చి ఘోరమయిన తపస్సు మొదలుపెట్టాడు.

శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. మూకాసురుడు అనే ఒక రాక్షసుడిని పిలిచి ‘నీవు ఒక బ్రహ్మాండమయిన అడవి పందిగా మారి అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు వెళ్ళి పెద్ద రొద చెయ్యి అన్నాడు. అది అక్కడికి వెళ్లి పెద్ద చప్పుడు చేస్తోంది. ధ్వనికి కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడు. వీడెవడో రాక్షసుడు అయి ఉంటాడు. కాబట్టి వీడిని విడిచిపెట్టకూడదు. అని ధనుస్సును అందుకున్నాడు. శివుడు అర్జునుడికి వెనక ప్రదేశంలో ఉన్నాడు. అందుకే అర్జునుడికి శివుడు కనపడడు. శివుడు అర్జునుడి వెనుకనుంచి అడవి పంది మీదకి బాణం ప్రయోగించాడు. అది అడవిపంది పృష్ట భాగంలోంచి శరీరంలోకి వెళ్లి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేలమీద పడింది. ఇది శివుడి బాణం. ఆ బాణం తగిలిన వెంటనే అడవిపంది కంగారుగా అర్జునుడి వైపు తిరిగింది. బాణం ఎక్కుపెట్టి అడవిపందిని గురిచూసి కొట్టాడు అర్జునుడు. అర్జునుడి బాణం అడవి పంది నోట్లోంచి శరీరంలోకి వెళ్లి అక్కడనుంచి పృష్ఠ భాగంలోంచి బయటకు వెళ్లి నేలమీద పడింది. ఉత్తరక్షణం నేలమీద పడిపోయి చచ్చిపోయింది. శివుడి ప్రమథగణములు వెనుక కిరాతులుగా వచ్చారు. శివుడు వారిలో ఒకడిని పిలిచి తన బాణమును తీసుకు రమ్మనమని చెప్పాడు. అతను వెళ్లి కలహామును పెంచుకునే ప్రయత్నంగా అర్జునునితో ‘ఈ బాణం మా నాయకుడిది. ఆయన మహానుభావుడు. గొప్ప కిరాతవీరుడు. ఆయన బాణం తీశాడంటే ఎవరూ నిలబడలేరు. జాగ్రత్త. అన్నాడు. అపుడు అర్జునుడు నేనూ బాణం వేశాను. నా బాణానికే ఈ పంది చచ్చిపోయింది. ముందు నేనే ఎక్కుపెట్టాను అన్నాడు. ఇద్దరి మధ్యా వాదం పెరిగింది. అపుడు అర్జునుడు మీ నాయకుడు అంత గొప్ప మొనగాడయితే నాతో యుద్ధమునకు రమ్మనమని చెప్పు అన్నాడు. ఆ మాటకోసమే పరమశివుడు ఎదురుచూస్తున్నాడు.

వెంటనే శివుడు కొండమీద నుండి గభాలున దూకాడు. తన శరీరమునకు పులితోలును అడ్డంగా కట్టేసుకున్నాడు. తన కొప్పును బాగా ముడివేశాను. దానినిండా నెమలి ఈకలు పెట్టుకున్నాడు. ఏ అమ్మవారి అనుగ్రహం కలిగినంత మాత్రం చేత శక్తి వస్తుందో అటువంటి తల్లి ఎరుకతగా మారిపోయింది. కిరాతుడి రూపంలో ఉన్న శివుడు ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి ఏరా కుర్రా, ఈ పందిని నువ్వు నీ బాణంతో కొట్టావా? ఏదీ బాణములను వెయ్యి చూద్దాం. ఇద్దరం యుద్ధం చేసుకుందాం అన్నాడు.

వెంటనే అర్జునుడు ముందుగా గాండీవం టంకారం చేశారు. శివుడు నవ్వి ఒక హుంకారం చేశాడు. ఆ హుంకారమునాకు అర్జునుడు ఉలిక్కిపడ్డాడు. ఆ కిరాతుడు మామూలు వాడు కాదనుకుని అర్జునుడు తన గాండీవంలో బాణములు పెట్టి శివుని మీద ప్రయోగించడం ప్రారంభించాడు. శివుడు కూడా కోపం నటించి తన చేతిలోని ఒక ధనుస్సు ద్వారా అర్జునుని మీదకు బాణములు వేస్తున్నాడు. అర్జునుడికి మహా కోపం వచ్చేసింది. అర్జునుడు తన బలం అంతటినీ ఉపయోగించి శివుడిని కొట్టేస్తున్నాడు. కానీ శివునికి ఏమీ అవడం లేదు. ఏ చెయ్యి అభయం ఇస్తుందో, ఏ శరీరమును ఎవ్వరూ తాకరో, ఎవరి శరీరం తెల్లని పేరుకున్న నెయ్యిలా ఉంటుందో, ఆ శరీరమును ఎవ్వరూ చెనకలేరో అటువంటి శరీరమును ఇపుడు అర్జునుడు ద్వంద్వ యుద్ధంలో కౌగలించుకుంటున్నాడు. సృష్టిలో ఇప్పటి వరకూ ఇలా ఎక్కడా జరగలేదు. అలా ఆయన ఒంటికి ఉన్న విభూతి అంతా ఈయనకు అంటిపోయింది. ఈయన సర్వాంగములను తాకేశాడు. ఈ శరీరం రేపు కురుక్షేత్రంలో అప్రమేయంగా నిలబడాలి. కాబట్టి మల్లయుద్ధం పేరుతొ పరమేశ్వరుడు అర్జునుడి అవయవములన్నిటిని కౌగలించేసుకున్నాడు. తరువాత బాగా తిప్పి అర్జునుని శరీరమును త్రోసి అవతల పారేశాడు. అపుడు అర్జునుడు తిరిగిలేచి తన ధనుస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేశాడు. అపుడు శంకరుడు ‘ఆహా, ఏమి మొనగాడివిరా నీవు, ఎంత పౌరుషంరా నీకు అని అనుకుని యుద్దమును చాలించాలనుకున్నాడు. అపుడు మహానుభావుడు చంద్రవంకతో, పట్టుపుట్టంతో, వామార్థ భాగమునందు పార్వతీ దేవితో అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు.మళ్ళీ కొడదామని అర్జునుడు గాండీవమును ఎత్తబోయాడు. ఎదురుగుండా అర్థనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరుడు కనపడ్డారు. గబగబా అర్జునుడు ఈశ్వరుడి పాదముల మీద పడిపోయాడు. శంకరా, ఇంత కృపా నామీద! నాచేతి దెబ్బలు తిన్నావా! నాతో మల్లయుద్ధం చేశావా తండ్రీ అని శంకరుని పలువిధముల స్తోత్రం చేసి ఆయన పాదముల మీద పడిపోయాడు. అపుడు శంకరుడు అర్జునుని చూసి అర్జునా నన్ను కొట్టానని ఎందుకు బాధ పడతావు? అలా అనుకోవద్దు. నీవు నాకు చేసినా పూజగా దానిని నేను స్వీకరించాను. నీకేమి కావాలో అడుగు ఇచ్చేస్గ్తాను అన్నాడు. అపుడు అర్జునుడు శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి కన్నుల వెంట నీరు కార్చుతూ ఈశ్వరా, నీవు కంటి ఎదుట కనపడుతున్నావు. పరాత్పరుడవు. జగద్భర్తవు. అటువంటి తండ్రివయిన నీపై అజ్ఞానినై బాణములు వేశాను. నేను కాని పనులు చేస్తే వాటిని పూజ అన్నావా తండ్రీ! నీ కారుణ్యంతో నాగుండె నిండిపోయింది. అని పరమేశ్వరుని పాదముల మీద పడిపోయాడు. అపుడు శంకరుడు నీకు పాశుపతాస్త్రమును ఇస్తున్నాను మీకు ఎదురులేదు. రాబోయే కురుక్షేత్రంలో పాండవులు గెలిచి తీరుతారు. విజయీభవ! దీనితో పాటుగా శివలీలగా ఈ కిరాతార్జునీయం ఎక్కడ ఎవరు చెప్పుకున్నా, వినినా చదువుకుని బయలుదేరినా శివదండకమును చదువుకుని బయలుదేరినా వినినా ఈ ఆఖ్యానమును చదివి నమస్కరించినా అటువంటి వారికి జటిలమయిన సమస్యలు తీరి కార్యసిద్ధి కలుగుగాక! నీకు ఏ విజయం కలుగుతుందో వినిన వారికి, చదివిన వారికి కూడా అటువంటి విజయము కలుగుగాక! అని ఆశీర్వచనం చేసి ఆర్జునుడిని పంపించాడు.

శివమహా పురాణం భాగం: 34[మార్చు]

  • చండీశ్వరుడు

ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరంతప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవులను కాసే ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను. నీవు ఈ ఆవులను కొట్టవద్దు. తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నింటిని విడిచిపెట్టి కట్టేవాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచెలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు.

ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. ‘అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు. ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో’ అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసేచోట చేట్టిక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలికూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారుచేసి సైకతప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు.తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. ఆటను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అవును అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతని అభిషేకం చేస్తున్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయిందో అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయాయి. క్రిందపడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. ‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించవలసిందే’ అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నాభిన్నమయిన సైకతలింగంలోంచి పార్వతీపరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అనికూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు. మనుష్యుడవైపుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మాకుటుంబంలో అయిదవవాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చందీశ్వరుడు అని పిలుస్తారు. ఇకనుంచి సాధారణంగా లోకంలో వివాహం అయిపోతే ఆ విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు. భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీభాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతీ నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.

ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. నందీశ్వరుడి లాగే ఆయన కూడా. ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు. మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి.అందుకే ఆయనకి చిటికల చందీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము. దానిని మీరు గుడియందు విడిచి పెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని, ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయ్యకూడదు. నంది మీద పెట్టడం కాదు. చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమ పావనమయిన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు.

ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకు వెళ్ళరు. చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవ మూర్తులలో. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ అయిదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి అయిదవ స్థానం ఇచ్చారు. ఒక్కసారి శివాలయంలోకి మనం గడపదాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము. మన భాగ్యమే భాగ్యం. అందుకే శివాలయం విష్ణ్వాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండూ ఉండి తీరాలి. మనదేశం అంతటి భాగ్యవంతమయిన దేశం.

శివమహా పురాణం భాగం: 35[మార్చు]

  • నందీశ్వరుడు

మనం శివాలయమునకు వెళ్ళినప్పుడు ఎదురుగుండా ముందు దర్శనం ఇచ్చే భగవన్మూర్తి నందికేశ్వరుడు. నందీశ్వర దర్శనం చేసి శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెప్తోంది. శివాలయం ద్వారపాలకులు దిండి, మొండి. విష్ణ్వాలయం ద్వారపాలకులు జయవిజయులు. విష్ణ్వాలయంలో అయితే గరుడాళ్వారు ఉంటారు. శివాలయంలో శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇక్కడ వృషభ రూపమై ఒక పశువు శివుడి ముందు కూర్చునే అధికారం ఎలా పొందింది? దీనిని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం శివాలయపు మెట్లు దాటి లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా ధ్వజ స్తంభం కనపడుతుంది. దాని తర్వాత నందీశ్వరుడు కనపడతాడు. ఆ నందీశ్వరుడు అసలు అలా ఎందుకు ఉంటాడు అనే విషయం మీకు అర్థం అయితే జీవితంలో మీరు నూరు మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్లు.

పూర్వం శిలాదుడు అనే మహర్షికి చిత్రమయిన కోరిక కలిగింది. ఆయన ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షం అయి నీకు ఏమి కావాలి? అని అడిగాడు. అపుడు శిలాదుడు ‘నాకు అయోని సంభవుడు, చిరంజీవి, పరమ భక్తుడయిన కుమారుడు కావాలి’ అన్నాడు. అపుడు దేవేంద్రుడు ‘నాకే శాశ్వతత్వము లేదు. నాకే చిరంజీవిత్వం లేదు. అటువంటప్పుడు ఎదుటివాళ్ళకు నేను ఎలా ఇవ్వగలను? ఇవ్వలేను. పరమశివుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి నువ్వు ఆ శంకరుడి గురించి తపించు’ అన్నాడు. అపుడు శిలాదుడు శివుని గురించి తపస్సు మొదలుపెట్టాడు. కొద్దికాలం గడిచేసరికి శిలాదుని రూపం అక్కడలేదు. ఆస్థిపంజరం ఒక్కటే ఉంది. శంకరుడు ప్రమథగణములతో, పార్వతీ సహితుడై, సుబ్రహ్మణ్య, గణపతులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అయినా శిలాదుడు బహిర్ముఖుడు కాలేదు. అపుడు శంకరుడు తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటనవ్రేలితో ఆయన మూడవకన్ను అనగా జ్ఞాన నేత్రం ఉండే ఆజ్ఞాచక్రం దగ్గరపెట్టి ఆపాడు. అప్పుడు శిలాడుడు బహిర్ముఖుడు అయ్యాడు. శంకరుడు ‘శిలాదా, నీవు దేనిని గురించి తపస్సు చేశావు? అని అడిగాడు. అపుడు శిలాదుడు ‘నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలి అన్నాడు. ఈమాట అనేసరికి శంకరుడు నవ్వి నాలాంటి కొడుకు వేరొకడు లేదు. నీ భక్తికి లొంగిపోయాను. కనుక నేనే నీకొడుకుగా వస్తాను’ అని చెప్పి వెళ్ళిపోయాడు.

కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు శిలాదుడు పరమశివ సంబంధమయిన ఒక యజ్ఞకార్యమును నిర్వహించడం కోసం భూమిని దున్ని యజ్ఞశాలా నిర్మాణం చేసి అగ్నిహోత్రములను వ్రేల్చడం కోసమని కొన్ని గుండములను ఏర్పాటు చేసి ఆ యజ్ఞ నిర్వహణ చేస్తున్నాడు. అప్పుడు ఆ యజ్ఞ వాటికలో ఉన్న అగ్నిగుండంలోంచి ఒక మూర్తి ఆవిర్భవించాడు. ఆ వచ్చినవాడు చంద్రరేఖవంటి కిరీటం ధరించి ఉన్నాడు. ఏ విధమైన మలినము లేకుండా ప్రకాశించి పోతున్న తెల్లని శరీరం మీద అలదిన భస్మంతో కూడిన శరీరం కలిగి ఉన్నాడు. నాలుగు భుజములు కలిగి ఉన్నాడు. పరమశివుని అంశ చేత బాలశివుడా అన్నట్లుగా ఆవిర్భవించాడు. ఆ పిల్లవాడిని చూడగానే శిలాదుడు పొంగిపోయాడు. ఆ పిల్లవాడిని చూడగానే ఎక్కడలేని ఆనందం పొంగి పొరలింది కాబట్టి నందీ అని పిలిచాడు. ప్రజలందరూ చూసి పొంగిపోతుండగా ఆ పిల్లవాడు దినదినప్రవర్ధమానం అవుతున్నాడు.

శిలాదుడు శివుడిని నీలాంటి కొడుకు కావాలని అడిగినప్పుడు పరమశివుడు వెంటనే ‘ఆదివృషభము’ను పిలిచాడు. దానికి ధర్మము అని పేరు. నీవు ధర్మ స్వరూపంగా నా స్వరూపంగా నందీశ్వరుడుగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు. అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనం ఇచ్చాడు. శివునికి తనకి అభేదం చెప్పడానికి అలా దర్శనం ఇచ్చాడు. బాలశివుడయి ఉన్నాడు. కొంతకాలం అయిన పిమ్మట ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కొంతమంది దేవతలు వచ్చి శిలాడుడితో అన్నారు ‘అయ్యో శిలాదుడా నువ్వు ఎటువంటి స్వరూపమును కోరావో అటువంటి స్వరూపమును నీ పిల్లవానికి ఇచ్చారు. కానీ పిల్లవాడిది అల్పాయుర్దాయం. ఆయన జ్ఞానము చేత చిరంజీవి అవుతాడు కానీ శరీరం చేత చిరంజీవి కాడు. ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపొయింది’ అని చెప్పారు. ఈ మాటలకు శిలాదుడు బాధపడి శోకిస్తున్నాడు. అపుడు పిల్లవాడయిన నందీశ్వరుడు ‘నాన్నగారూ, ఎందుకంత బాధపడతారు? నేను శంకరుని గూర్చి తపస్సు చేస్తాను’ అని చెప్పి మార్కండేయుడు ఎలా తపస్సు చేశాడో అలాగే ఈయన కూడా తపస్సు ప్రారంభించాడు. ఈయన చేసిన తపస్సు చేత ప్రీతిచెందిన శంకరుడు ప్రత్యక్షమయి నీవు ఎప్పటికీ చిరంజీవివే. నామీద నీకు ఎంత పూనిక ఉన్నదో చూడడం కోసమని ఈ పరీక్ష చేశాను. నీ పూజకు నీ తపస్సుకు నేను పరవశించాను అని చెప్పి తన మెడలో ఉన్న బంగారు పద్మములతో కూడిన హారమునొకదానిని ఎదురుగుండా వున్నా పిల్లవాడి మెడలో వేశాడు. ఆ మాలను మెడలో వేయగానే పిల్లవాడికి కూడా మూడవకన్ను వచ్చింది. శివునికి అయిదు ముఖములు ఎలా ఉంటాయో అలా అయిదు ముఖములు వచ్చాయి. పది భుజములు వచ్చాయి. ఈవిధంగా వచ్చి పిల్లవాడు శివునితో సమానంగా అలరారుతూ శివుని ఎదుట నిలబడ్డాడు. అపుడు అమ్మవారి పుత్రప్రేమతో పరవశించిపోతూ ఆ నందీశ్వరుడిని కొడుకుగా అక్కున చేర్చుకుంది. శివుడు తన జటాజూటంలో వున్నా నీళ్ళు తీసి ఆ పిల్లవాడి మీద చల్లాడు. అవి నందీశ్వరుడినుండి జాలువారి ‘త్రిశ్రోట, జటోదక, స్వర్ణోదక, జంబూనది, వృషధ్వని’ అను పేర్లు గల అయిదు నదులుగా ప్రవహించాయి. ఈ అయిదు నదులు ప్రవహిస్తున్న మధ్యప్రదేశంలో పరమేశ్వరుడు ప్రతిష్ఠచేసిన శివలింగం ఒకటి ఉంది. ఆ అయిదు నదులలో స్నానం చేసి అక్కడి శివలింగమును ఎవరు అర్చిస్తారో వారికి మోక్షం ఇవ్వబడుతుంది అని శాస్త్రం చెప్పింది. పార్వతీదేవి ఆ పిల్లవాడిని ప్రమథగణములకు నాయకునిగా చేయవలసినదని శివుని అభ్యర్థించింది. వెంటనే శివుడు ఆ పిల్లవానిని కూర్చోబెట్టి ప్రమథగణములన్నింటికి నాయకునిగా అభిషిక్తం చేశారు.

ఈవిధంగా అభిషిక్తం చేయబడిన వానికి తగిన కాంతను చూసి వివాహం చేద్దామని పార్వతి శివునకు చెప్పింది. ఆయనకు తగిన భార్యగా మరుత్తుల కుమార్తె ‘సుయశ’ను నిర్ణయించి వివాహం చేశారు. పిమ్మట శివుడు నందీశ్వరునితో ‘నీవల్ల నీతండ్రి తరించాలి కదా. నీ తండ్రిని, తాతని కూడా సమున్నతమయిన అధికారం కలిగినటువంటి ప్రమథగణముల స్థితిలోకి తీసుకువస్తున్నాను. వారు కూడా నన్ను సేవించుకుంటారు’ అన్నాడు. ఇప్పుడు శిలాదుడు ప్రమథగణములలో ఒకడిగా చేరిపోయాడు. ప్రమథగణములకు నాయకుడు తన కొడుకు నందీశ్వరుడు. ఇదీ వాళ్ళ గొప్పతనం. ఇది నందికేశ్వరుడి చరిత్ర. శివుడు నందీశ్వరునికి మరొక వరం ఇచ్చాడు. ‘నీవు ఎప్పుడయినా ఎక్కడికయినా వెళ్ళి ఉంటే నేను కూడా అక్కడికి వచ్చేసి ఉంటాను. నేను ఎక్కడయినా ఉంటే నీవు కూడా అక్కడ ఉంటావు. శివాలయములలో నా ఎదురుగుండా నీవు ఉండాలి’ అని చెప్పాడు. కాబట్టి నందీశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ శివుడు ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నందీశ్వరుడు కూడా ఉంటాడు. ఎవరయినా నందికేశ్వర చరిత్రను చదివినా చేతులొగ్గి నమస్కరిస్తూ వినినా నందికేశ్వరుని వైభవమును మనసులో తలంచుకొని మురిసిపోయినా వారికి భగవంతుడు ఇహమునందు సమస్త సుఖములను యిచ్చి అంతమునందు ఇదివిని పరవశించి పోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమథగణములలో ఒకరిగా చేర్చుకుంటాడు అని అభయం ఇవ్వబడింది.

నందీశ్వరుడు ఆదివృషభం కాబట్టి ఆయన వృషభ రూపంలో ఉంటాడు. శివాలయంలో శివలింగ దర్శనం చేసేటప్పుడు నందీశ్వరుడి ప్రక్కనుంచి వెళ్ళడం కానీ, నందికి శివుడికి మధ్యలో వెళ్ళడం కానీ చేయరాదు. తోక పక్కకు పడేసి వృషణములు కనపడేటట్లుగా నందీశ్వరుని మూర్తి పడుకుని ఉంటుంది. ఎడమచేతి బొటనవ్రేలిని ఎడమచేతి చూపుడు వ్రేలిని నంది కొమ్ముల మీద వేసి కుడిచేతితో ఆయన వృషణములను పట్టుకుని రెండు వేళ్ళ మధ్యలోంచి శివలింగమును చూస్తూ ‘హరహర మహాదేవ శంభోశంకర’ అని అనాలి. ఇలా ఎవడు అన్నాడో వాడు కైలాసమునందు శంకరుడిని దర్శనము చేసిన పుణ్యమును వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి నందీశ్వరుడి శృంగముల మధ్య నుంచి తప్ప శివలింగ దర్శనం చేయరాదు. నందీశ్వరుడు జీవుడికి సంకేతం. శివుడు బ్రహ్మమునకు సంకేతం. జీవ బ్రహ్మల మధ్య భేదము చెప్పడం కానీ మధ్యలోకి వెళ్ళడం కానీ చేయరాదు. కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చేయకూడదు. దానికి ఒకే ఒక్క మినహాయింపు ఉంది. శివలింగమునకు సాయంకాలం కవచం పెడతారు. అలా కవచం తొడిగి ఉంటే మాత్రం శివలింగమును శృంగములలోంచి చూడనక్కరలేదు. మీరు తిన్నగా శివ దర్శనం చేయవచ్చు.

అరటిపండు ముక్కలు పట్టుకు వెళ్ళి నందీశ్వరుడి మూతికి రాయడం, కార్తిక దీపముల పేరు చెప్పి నందీశ్వరుడి తోకకింద పెట్టేయడం వంటి పనులు మిక్కిలి పాపభూయిష్టములు. మనం పుణ్యం పేరుతో హద్దులేని పాపములు చేస్తుంటాము. అలా చెయ్యకూడదు. నందీశ్వరుడి శృంగములలోంచి శివలింగ దర్శనం చేసిన తర్వాత ఆగి నందీశ్వరునికి నమస్కరించి

222

అని అడగాలి. నందీశ్వరుడు నాలుగు పాదములతో చక్కగా పడుకుని ఉంటాడు. బసవయ్య ధర్మమునకు మారుపేరు. ఆ ధర్మము మీదనే శివుడు అధిరోహించి ఉంటాడు. నందీశ్వరుడు మీకొక పాఠమును నేర్పుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ శివుడినే చూస్తూ ఉంటాడు. అలాగే మీకు లోకమునందు ఎప్పుడూ ఈశ్వరుడినే చూడడం అలవాటు కావాలి.

ఆంధ్రదేశంలో నందిమండలం’ అనే ప్రాంతంలో నవనందులుగా తపస్సు చేశాడు. అవే ప్రథమనంది, నాగనంది, శివనంది, కృష్ణ (విష్ణు) నంది, మహానంది, గరుడనంది, గణేశనంది, సోమనంది, భానునంది అనునవి. నంది తపస్సు చేసిన ప్రతి చోట ఒక శివలింగం ఉంటుంది. ఆయనకి ‘నందివిద్య’ అని పేరు. అయ్యగారి అనుగ్రహమును ఎంత పొందాడో అమ్మవారి అనుగ్రహమును కూడా అంతే పొందాడు. అమ్మవారు తన విద్యా రహస్యమునంతటిని నందికి చెప్పింది. అమ్మవారి శ్రీవిద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే లలితా సహస్రనామంలో ‘నందివిద్యానటేశ్వరీ’ అని ఒకమాట ఉంది.

నందీశ్వరుని ప్రజ్ఞ చాలా గొప్పది. ఇప్పటికీ మనకి ‘చరనంది’ అని ఒకటి ఉంటుంది. ‘స్థిరనంది’ అంటే కదలని నంది. చరనంది కదులుతుంది. పూర్వం శివాలయములలో రెండు నందులు పెట్టేవారు. ఒకటి స్థిరనంది, రెండవది చరనంది. పూర్వం అంత తొందరగా వెళ్ళడానికి వైద్యులు దొరికేవారు కారు. శివుడే మొదటి వైద్యుడు. ఆ చుట్టుపక్కల ఎవరికయినా ప్రసవం అవక బిడ్డ అడ్డం తిరిగితే వాళ్ళని తీసుకువెళ్ళడం కుదరకపోతే తల్లీ బిడ్డా బతకాలంటే వైద్యుడి దృష్టిపడాలి. అంతరాలయంలోంచి అది కుదరదు కనుక చరనందికి శివుడికి అభేదం కనుక గబగబా ఆవిడను ముఖమండపం వద్దకు తీసుకువచ్చి తలుపులు తీయించి ఆవిడ బాధపడుతున్నవైపుకి చరనందిని తిప్పేవారు. చరనందిని ప్రసవమునకు బాధపడుతున్న ఆవిడ వైపు తిప్పగానే ఆవిడ చాలా సులువుగా ప్రసవం అయ్యేది. అందుకే పూర్వం శివాలయములలో చరనంది ఉండేది. నందీశ్వరుడు అంతటి మహానుభావుడై ఈ లోకమును రక్షించాడు.

శివమహా పురాణం భాగం: 36[మార్చు]

  • లింగావిర్భావం

ఒకనాడు లింగావిర్భావకాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ‘నేను అధికుడను అంటే నేను అధికుడను’ అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీ పుష్పం (మొగలి పువ్వు) ఒకటి క్రింద పడింది. దానిని నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?” అని అడిగారు. అపుడు మొగలిపువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు?” అని అడిగింది. అపుడు బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా?’ అని అడిగాడు. ఏమిటి కావాలి మీకు?” అని అడిగింది మొగలిపువ్వు. ఆయన “క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. చెప్తాను అన్నది మొగలి పువ్వు. బ్రహ్మగారు మొగలిపువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగారు. అపుడు విష్ణువు నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను అన్నారు.

అపుడు బ్రహ్మ గారు నేను చూసి వచ్చాను. సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నారు. ఇప్పుడు జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో బ్రహ్మా నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు. కాబట్టి నీకు భూమియందు పూజ లేకుండుగాక! కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు. మహావిష్ణువు నేను చూడలేదు అని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి. ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయం అవకుండుగాక! ఇప్పుడు కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు కానీ నా భక్తులయిన వారు నిన్ను తలలో ధరిస్తారు. వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను. అని చెప్పాడు. అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే మహాశివరాత్రి. కాబట్టి భగవత్ స్వరూపములు అన్నీ సమానములే. ఎన్ని దీపములు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపములుగా ఉన్నది ఒక్కటే అని మీరు తెలుసుకోవాలనే జ్యోతిర్లింగం ఆవిర్భవించింది.

శివలింగమునకు ఒక విశేషం ఉంది. మొట్టమొదట అన్నిటికన్నా గొప్పదయినా లింగమును స్వయంభూ లింగము అని పిలుస్తారు. ఆ లింగమును ఒకరు ప్రతిష్ఠ చేయరు. తనంత తాను వెలుస్తుంది. శ్రీశైలాది క్షేత్రములు ఇందుకు ఉదాహరణ. రెండవది దివ్య లింగములు ఇవి దేవతలు ప్రతిష్ఠ చేసినవి. కుమారస్వామి ప్రతిష్ఠ చేసిన సామర్లకోటలోని కుమారారామం ఇందుకు ఉదాహరణ. మూడవది మానుష లింగములు. ఇవి మనుష్యులు ప్రతిష్ఠ చేసినవి. తరువాత ఆర్ష లింగములు. ఇవి మహర్షులు ప్రతిష్ఠ చేసినవి. రాక్షస లింగములు. రాక్షసులు ప్రతిష్ఠ చేసినవి. దైవిక లింగములు వాటంతట అవి ఏర్పడతాయి. అరకువేలీలోని బుర్రా గుహలలో పైనుండి నీటి బిందువులు క్రిందపడతాయి. కొండ ఉపరితలం ఎక్కడో పైన ఉంటుంది. పైనుండి నీటి బిందువు ఒకేచోట బయలుదేరి క్రింద ఒకేచోట పడుతుంది. ఆ నీటి బిందువు పడినప్పుడల్లా క్రింద ఉన్న భూమి కొద్దికొద్దిగా పైకి లేస్తూ శివలింగంగా మారిపోతుంది. ఇది క్రమక్రమంగా పెరిగి చివరకు ఎక్కడి నుండి నీరు పడుతోందో ఆ ప్రదేశమును తాకి ఇంక నీరు పడకుండా ఆపేస్తుంది. అలా అది మర్రిచెట్టు ఊడలా పెరిగిపోతుంది. దీనిని దైవిక లింగం అంటారు. బాణ లింగములు అని ఉంటాయి. అవి నర్మదానది ప్రవాహము ఒరిపిడి చేత ఏర్పడతాయి.

లింగము అరూపరూపి. ఉపాసనలో లింగోపాసన ఒక మెట్టు పైన ఉంటుంది. మీకు శివలింగమును చూపించి ఆ శివలింగం ఎటువైపు చూస్తోంది అని అడిగినట్లయితే దానికి సమాధానం చెప్పడం తేలికయిన విషయం కాదు. యథార్థమునకు మీరు శివాలయంలోపల కూర్చుని శివలింగమునాకు అభిషేకం చేయడం కన్నా రుద్రాధ్యాయంతో అర్చక స్వాములు అభిషేకం చేస్తుండగా బయట కూర్చుని కైమోడ్చి నమస్కరిస్తే దానివలన మీరు ఎక్కువ ప్రయోజనమును పొందుతారు. ఇది సాక్షాత్తు చంద్రశేఖరపరమాచార్య స్వామివారు చెప్పినమాట.

శివలింగంలో తూర్పుకు చూస్తున్న దానిని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్ఠానంగా ఉంటుంది. దీనివలన అజ్ఞానం కలుగుతుంది. దక్షిణమునకు చూసే ముఖమును అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రమును శాస్తిస్తుంది. అది అగ్నిహోత్రంగా ఉంటుంది లయం చేస్తుంది. ఇది మీ అజ్ఞానమును దహించేస్తూ జ్ఞానమును కూడా ఇస్తుంది. పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్ళు విభూతి, పళ్ళరసములు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా మీకు పరమేశ్వరుని అనుగ్రహం కలిగేస్తూ ఉంటుంది. అది భూసంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది. అందుకే లోకంలో పిల్లలు పుట్టలేదని అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. దుష్ట నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు అని చెప్తే సుందరకాండ పారాయణ/శివాభిషేకం చేసుకోమని చెప్తారు. అపమృత్యువు వస్తుందేమోనని భయంగా ఉంది అంటే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. పీడకలలు వస్తున్నాయని చెప్తే సుందరకాండ పారాయణం చేసుకోమని గాని, శివాభిషేకం చేసుకోమని గాని చెప్తారు. ఈ రెండు క్రియలె చెప్తారు. ఎందుచేత? హనుమ శివాంశ. వర్షములు పడకపోతే శివలింగామునకు అభిషేకం చెయ్యండని చెప్తారు. అభిషేకం చేస్తే వామదేవ ముఖం కానీ తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది. దానిని ఈశానముఖం అంటారు. దీనిని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపియై ఉంటుంది. ఇదే మోక్షమును కటాక్షిస్తుంది. ఈ అయిదు ముఖములతో పంచభూతములను శాసిస్తోంది. సృష్టి స్థితి లయ అజ్ఞాన మోక్షములకు కారకం అవుతుంది. సమస్త ఫలితములను ఇస్తుంది. కాబట్టి శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే.

అసలు లింగమునకు బాహ్యమునందు ఏమీ లేదు. బ్రహ్మాండములన్నీ లింగాకృతిలోనే ఉన్నాయి. లింగమునకు పూజ చేస్తే సమస్త లోకములకు పూజ జరిగినట్లే. శివాలయమునకు వెళ్ళినపుడు ముఖ్యంగా ఎనిమిది కనపడతాయి. మనం ఒక అపచార ధోరణి చేస్తూ ఉంటాము. శివాలయం గోడకు ఆనుకోవడం, స్తంభాలను ఆనుకోవడం చేస్తుంటాము. ఆ గోడలు, స్తంభములు అన్నీ ఈశ్వర స్వరూపమే అయి ఉంటాయి. దేవాలయ గోడను కొట్టినట్లయితే శాస్త్రం ప్రకారం శివుడిని కొట్టినట్లుగానే పరిగణింపబడుతుంది. శివాలయంలో ఎనిమిది రూపములలో లింగం ఉంటుంది. అందుకే పూర్వం పెళ్ళిళ్ళు గాని, జరిగితే ధ్వజస్తంభం ఎక్కడివరకు కనపడుతోందో అక్కడ మేళతాళములు ఆపుచేసేవారు. గోపురంగా శివుడే ఉంటాడు. రెండవది శివుడు గర్భాలయ శిఖరంగా ఉంటాడు. ధ్వజస్తంభం శివుడు. ఇప్పటికీ కొన్ని దేవాలయములలో బలి పీఠమునకు, ధ్వజ స్తంభానికి అభిషేకం చేస్తారు. లోపల ఉన్న శివలింగమును మహాలింగం అని పిలుస్తారు. పెద్ద పెద్ద దేవాలయములలో కొన్ని మహాలింగముల మీద చారికలు ఉంటాయి. ఆ గీతలను బ్రహ్మసూత్రములు అని పిలుస్తారు. అవి సాధారణంగా స్వయంభూ లింగముల మీద ఉంటాయి.

శివాలయంలో ఉన్న ప్రధాన లింగమును ‘మూల లింగము లేక మహాలింగము’ అని పిలుస్తారు. చందీశ్వరుడు ఒక లింగము. ఇవి కాకుండా అర్చక స్వామి ఒక లింగము. అందుకే నందికి శివుడికి మధ్య అర్చకుడు వెళ్ళవచ్చు. శివాలయంలో దేవతామూర్తులు స్థానములు మారడానికి వీలులేదు. ఎంత పెద్ద శివాలయం అయినా సరే నైరుతిలో విఘ్నేశ్వరుడు, పడమట సుబ్రహ్మణ్యుడు, ఉత్తరమున చండీశ్వరుడు, దక్షిణమునందు దక్షిణామూర్తి, ఆగ్నేయంలో సోమస్కందుడు, ఈశాన్యము =నందు నటరాజు కాని, భైరవ మూర్తి కాని ఉండాలి.

శివ లింగారాధనం ఎలా చేయాలి అని తెలిసి చెయ్యగలిగితే వాడంత అదృష్టవంతుడు సృష్టిలో లేడు. అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై నీటిని సన్నటి ధారగా పోయాలి. అంతేకానీ పంచపాత్రలో నీళ్ళు తీసుకుని ఉద్ధరిణతో పోయకూడదు. అభిషేక జలం తొక్కకూడదు. శివాభిషేకం గురు ముఖతః చేయడం చాలా మంచిది. ఫేంటు ధరించికాని, తోలు బెల్టు పెట్టుకుని గానీ గర్భాలయం లోపలి వెళ్ళకూడదు.

శివమహా పురాణం భాగం: 37[మార్చు]

  • శివపురాణం వేదాంత సార సర్వస్వము

శివపురాణం వేదాంత సార సర్వస్వము. దీనిని వినిపించమని మహర్షులందరూ అడిగారు. ఇలా ఎందుకు చెప్పాడు సూతుల వారు అంటే ఒక వస్తువు గొప్పతనం చెప్పడం వలన దానియందు ఆదరణ, గౌరవము, శ్రద్ధ పెరుగుతాయి. అవి పెరిగితే విషయాన్ని సరిగ్గా గ్రహించగలవు. అందుకు పురాణంయొక్క మహిమని పేర్కొన్నాడు సూతుల వారు. "శంకరమ్ సంస్మరణ్ సూతః" - శంకరుని స్మరించి మొదలు పెట్టారు. అనామయుడైన శివుణ్ణి స్మరించి నేను చెప్తాను. ఆ శివుని స్మరించి మీరు వినండి. ఆమయము అంటే ఆధి, వ్యాధి, లోపములు, అజ్ఞానములు. ఆమయములు లేని వాడు శివుడొక్కడే. అందుకే ఆయన రోగంలేని పెద్ద డాక్టర్. అందుకే సంసార వైద్యః ఆయన. "భిషక్తమం త్వా భిషజాం శృణోమి" - అని ఉపనిషత్తు చెప్తున్నది. "ప్రథమో దేవ్యో భిషక్" అటువంటి ఆ వైద్య శిఖామణిని మనం స్మరించుకుంటున్నాం. నా ప్రయత్నం నేను చేస్తాను తరువాత మీఇష్టం అనే డాక్టర్ కాదు ఆయన. ఆయన చెయ్యి వేశాడా జబ్బు సమూలంగా నశిస్తుంది. అనామయం. అన్ని జబ్బులూ పోగొట్టేవాడు. అన్నింటికంటె పెద్ద జబ్బు సంసారం. దానికి వైద్యుడాయన. అందుకే భవరోగ హరుడు అని పేరు ఆయనకి.

అనేక కల్పములు గడిచి ప్రస్తుత కల్పం ప్రారంభమైనది. ఆ సమయంలో ఆరు సముదాయములుగా ఋషులు బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా అడిగారు. మా మధ్య ఒక తేల్చరాని వివాదం వచ్చింది ఏది గొప్పది? అని. సృష్టికర్తవైన గురువువు కనుక నాశరహితమైన బ్రహ్మమేది? అన్నింటికీ కారణమైనదేది? చెప్పమని అడిగారు.

అన్ని తత్త్వములకంటె పూర్వమందున్నవాడు. సృష్టి అంతా తత్త్వములతో కూడియున్నది. అవి సాంఖ్యం ప్రకారం 24/25, ఆగమాల ప్రకారం 36 తత్త్వములు. సృష్టి ప్రారాంభం అయ్యాక ఈ తత్త్వములతో నడుస్తున్నది. సృష్టికి, మూలకములకుముందు ఉన్నది ఎవరు? తత్త్వములు అనగా సృష్టికి మూలకములు సర్వతత్వములకంటే ప్రాచీనమైనవాడు., సర్వోత్కృష్టుడు, అతీతమైన వాడు ఎవరు? అని అడిగారు. "యతోవాచా నివర్తంతే" ఉపనిషద్వాక్యం అది. ఉపనిషద్వాక్యాలు కొల్లలు కొల్లలుగా పరిగెడతాయి శివపురాణంలో. ఉపనిషత్తులను ఆవుగా భావిస్తే ఆ ఆవు పొదుగు నుంచి వచ్చిన క్షీరమే శివతత్త్వం. మనసుకీ, మాటలకీ అందనిదీ, బ్రహ్మవిష్ణురుద్రాదులకు మూలమైనది. శివుడు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులలో ఒక్కడు అని కాదు శివపురాణ ప్రతిపాదన. వారికి మూలమై బ్రహ్మవిష్ణురుద్రాదులుగా ప్రవర్తిసున్నది. అచ్చమైన హైందవ ధర్మంలో పరతత్త్వ ప్రతిపాదన ఉంది. ఆ పరతత్త్వం బ్రహ్మవిష్ణు రుద్రాదులకంటే అతీతమైన వాడు. సృష్టి స్థితి లయ ఉన్నప్పుడే ఈ ముగ్గురూ ఉంటారు. సృష్టికి అతీతంగా ఉన్నది ఈ మూడూ కానిది. అయిన దైవము మహాదేవుడు, శివుడు అని చెప్పబడుతున్నాడు.

మూలాలు, వనరులు[మార్చు]

  • అష్టాదశ పురాణములు - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)
  • "శివ మహా పురాణం"'శివ పురాణము - వ్యాఖ్యానం: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు. ఇంటర్నెట్, యుట్యూబ్ లలో లభించిన వాటి స్వేచ్ఛానువాదం.

బయటి లింకులు[మార్చు]