Jump to content

బ్రహ్మేశ్వర దేవాలయం (భువనేశ్వర్)

వికీపీడియా నుండి
బ్రహ్మేశ్వర దేవాలయం
బ్రహ్మేశ్వర దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఒడిషా
ప్రదేశం:భుబనేశ్వర్

బ్రహ్మేశ్వర దేవాలయంఒడిషా రాష్ట్రంలోని భుబనేశ్వర్ పట్టణంలో నెలకొని ఉన్న ఒక శైవాలయము. ఇది 9వ శతాబ్దం చివరిలో ప్రతిష్ఠించబడినట్లు ఈ గుడిలో లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తున్నది. కానీ కచ్చితమైన వివరాలు ఆ శాసనాలు భద్రపరచకపోవడం వల్ల సా.శ.1058 తరువాతి వివరాలు మాత్రమే లభిస్తున్నాయి. ఈ దేవాలయాన్ని 18వ సోమవంశరాజు ఉద్యోతకేసరి తల్లి కళావతీదేవి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాధారాలు వెల్లడిస్తున్నాయి.[1]

చరిత్ర

[మార్చు]

భువనేశ్వర్ నుండి కలకత్తాకు తరలించబడిన ఒక శాసనం ఆధారంగా ఈ ఆలయం 11వ శతాబ్దం చివరిలో నిర్మించబడినట్లు చరిత్రకారులు నిర్ణయించారు. ఆ శాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని సోమవంశపు రాజు ఉద్యోతకేసరి తల్లి కళావతీదేవి నిర్మించింది. ఈ ఆలయం నాలుగు నాట్యశాలలతో సిద్ధతీర్థం అనే ప్రదేశం (నేటి భువనేశ్వర్)లో నిర్మించబడింది. ఈ శాసనం అసలైన ప్రదేశంలో లేకపోవడం వల్ల దానిలోని వివరాలు మరొక దేవాలయానికి సంబంధించనవని కొందరు చరిత్రకారులు అనుమానిస్తున్నా ఆ శాసనంలో పేర్కొన్న ప్రదేశము, వివరాల ప్రకారం ఆ శాసనం ఈ దేవాలయానికి చెందినదని నిర్ధారించారు. అయితే ఆ శాసనంలో పేర్కొన్న విధంగా అక్కడ ఉన్నవి నాట్యశాలలు కావని, అవి అంగశాలలని పాణిగ్రాహి వంటి చరిత్రకారుల వాదన.[2]

నిర్మాణశైలి

[మార్చు]

ఈ దేవాలయాన్ని పంచాయతన దేవాలయంగా వర్గీకరించారు. ప్రధాన గుడికి నలుమూలలా నాలుగు ఉప దేవాలయాలున్నాయి. ఈ దేవాలయ్ం యొక్క విమాన గోపురం 62.2 అడుగుల ఎత్తును కలిగి ఉంది[2]. ఈ ఆలయం సాంప్రదాయ దారుశిల్ప వాస్తు పద్ధతులలో కట్టబడింది కానీ రాతిలో చెక్కబడింది. ఈ ఆలయ సౌధాలు పిరమిడ్ ఆకారంలోని శిలలను ఉపయోగించి ఆ శిలల లోపలి, వెలుపలి భాగాలలో శిల్పాలను చెక్కారు.

బ్రహ్మేశ్వర దేవాలయ ప్రాంగణంలోని ఉప ఆలయాల నమూనా ఆకృతి

ఈ ఆలయ ప్రధాన కట్టడం రెండు భాగాలుగా ఉంది. చిన్న భాగం జగ్మోహన మండపం దాని వెనుక గర్భగుడి ఉన్నాయి. మిగిలిన ఆలయాలకు మరో రెండు భాగాలు నాట్యశాల, ఉత్సవశాలలున్నాయి.[3]

ఈ బ్రహ్మేశ్వర దేవాలయం పురాతనమైన ముక్తేశ్వరాలయానికి దగ్గర పోలికలు ఉన్నాయి. దేవాలయం గోడలపై నాట్యకత్తెల, సంగీత కారుల, వీణ మొదలైన సంగీత వాయిద్యాల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. ఈ గుడి నిర్మాణంలో ఇనుప దిమ్మెలను ఉపయోగించారు. అంతకు పూర్వం కట్టిన దేవాలయాలలో ఇనుము వినియోగంలేదు.

ఈ దేవాలయ ప్రాకార కుడ్యాలపై అనేక దేవతా మూర్తులను చెక్కారు. ద్వారాలపై అందమైన పుష్పాల చిత్రాలను, అష్టదిక్పాలకుల మూర్తులను చెక్కారు. ఇంకా ఈ దేవాలయ గోడలపై తాంత్రిక సంబంధమైన బొమ్మలు, చాముండేశ్వరి, రౌద్రాకారంలో ఉన్న శివుని విగ్రహాలు ఉన్నాయి.

ఒక శాసనం ప్రకారం రాణీ కళావతీ దేవి ఈ దేవాలయాని అనేక అందమైన యువతులను కానుకగా సమర్పించిందని తెలుస్తున్నది. ఇది ఆనాటి దేవదాసీ వ్యవస్థను సూచిస్తున్నదని, ఈ దేవదాసీ సంప్రదాయం తదనంతర ఒరిస్సా దేవాలయ చరిత్రలో ముఖ్యమైన భాగంగా నిలిచిపోయిందని చరిత్రకారులు తీర్మానిస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "బ్రహ్మేశ్వర దేవాలయ ప్రాంగణం" (PDF). ఇందిరాగాంధీ జాతీయ కళల కేంద్రం. Retrieved 2013-08-24.
  2. 2.0 2.1 పరీదా, ఎ.ఎన్. (1999). అర్లీ టెంపుల్స్ ఆఫ్ ఒరిస్సా (1st ed.). న్యూఢిల్లీ: కామన్‌వెల్త్ పబ్లిషర్స్. pp. 101–4. ISBN 81-7169-519-1.
  3. [జాన్ జూలియస్ నార్విచ్, ed. గ్రేట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది వరల్డ్. p26.

బయటి లింకులు

[మార్చు]