ముక్తేశ్వర దేవాలయం (భువనేశ్వర్)
ముక్తేశ్వర దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఒడిషా |
జిల్లా: | ఖుర్దా |
భౌగోళికాంశాలు: | 20°14′33.72″N 85°50′25.41″E / 20.2427000°N 85.8403917°E |
నిర్మాణశైలి, సంస్కృతి | |
నిర్మాణ శైలి: | కళింగ ఆలయ వాస్తు |
ముక్తేశ్వర దేవాలయం (ఒరియా: ମୁକ୍ତେଶ୍ଵର ଦେଉଳ) ఒడిషా రాష్ట్ర రాజధాని భుబనేశ్వర్ పట్టణంలోని 10వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం. ఈ ఆలయం సా.శ.950-975ల మధ్య నిర్మించబడింది.[1] ఒరిస్సాలోని హిందూ దేవాలయాలలో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం. ఈ ఆలయం లోని శిల్ప సంపద అంతకుముందున్న ఆలయాలకంటే ఉన్నత స్థాయికి చేరుకుని తరువాత నిర్మించబడిన దేవాలయాలు రాజారాణీ దేవాలయం, లింగరాజ దేవాలయాలకు మార్గదర్శకంగా ఉంది.[2] ఇది భువనేశ్వర్ నగరంలో ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా నిలిచింది.[3]
చరిత్ర
[మార్చు]ముక్తేశ్వర దేవాలయం సోమవంశీకుల పరిపాలన తొలినాళ్లలో నిర్మించబడింది. ఈ ఆలయం పరశురామేశ్వర ఆలయం తరువాత, బ్రహ్మేశ్వర ఆలయానికి ముందు నిర్మించబడినట్లు పలువురు పండితుల అభిప్రాయం. పెర్సీ బ్రౌన్ ఈ ఆలయ నిర్మాణం సా.శ.950లో ఆరంభమైనట్లు నిర్ధారించాడు. ఈ ప్రాంతంలోని దేవాలయాలలో లేని విధంగా ఈ దేవాలయానికి తోరణ ద్వారం ఉండడం కొత్త సంస్కృతికి దారితీసినట్లు భావిస్తున్నారు.[4] కె.సి.పాణిగ్రాహి పరిశోధనల ప్రకారం ఈ దేవాలయం సా.శ.966లో సోమవంశపు రాజు యయాతి-I నిర్మించాడు.[5]
నిర్మాణశైలి
[మార్చు]ముక్తేశ్వర దేవాలయ ఆలయశిల్పకళ దానిని "జెమ్ ఆఫ్ ఒడిషా ఆర్కిటెక్చర్"గా పేరుపొందడానికి దోహదపడింది.[6] ఈ ఆలయం లోతట్టు ప్రదేశంలో ఆలయ సముదాయం నడుమ పశ్చిమాభిముఖంగా నిర్మితమైంది. ఈ ఆలయంలోని జగన్మోహన మండప గోపురం మొదటిసారిగా సాంప్రదాయ రెండంతస్థుల నిర్మాణానికి బదులుగా పిరమిడ్ ఆకృతిలో కట్టబడింది.[7] ఈ ఆలయం భువనేశ్వర్‌లోని ఇతర పెద్ద దేవాలయాలతో పోలిస్తే పరిమాణంలో చిన్నది. దీని చుట్టూ అష్టభుజాకృతిలో విస్తారమైన శిల్పాలు చెక్కబడిన ప్రాకారం ఉంది. ఈ ఆలయనిర్మాణంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా అంతకుముందు లేని క్రొత్తకొత్త నమూనాలతో నిర్మించబడినట్లు వాటిని తరువాత నగరంలో నిర్మాణమైన దేవాలయాలు అనుసరించినట్లు భావిస్తారు. ఈ దేవాలయానికి "తోరణం" అని పిలవబడే తలవాకిలి ఉంది. ఇది ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారానికి ద్వారంగా పనిచేస్తున్నది. ఈ ఆలయంలో విమానము, ముఖశాల అనే రెండు ప్రధాన కట్టడాలు ఉన్నాయి. ఇవి ఎత్తైన అరుగుపై కట్టబడ్డాయి.
తోరణం
[మార్చు]ఈ దేవాలయం యొక్క ముఖ్యమైన ఆకర్షణ తోరణ స్తంభము. దీని నిర్మాణంలో బౌద్ధ ఆలయ నిర్మాణశైలి ప్రభావం కనిపిస్తున్నది.[8] ఈ కమానుకు వెడల్పాటి స్తంభాలున్నాయి. వాటికి ఆభరణాలతో అలంకరింపబడిన స్త్రీ మూర్తులు చెక్కబడి ఉన్నాయి. ఇంకా ఈ స్తంభాలపై కోతులు, నెమళ్ల బొమ్మలున్నాయి.[9] ఈ కమాను ముందు నుండి చూసినా వెనుక నుండి చూసినా ఒకే విధంగా ఉంది.[10]
విమాన గోపురం
[మార్చు]ఈ ఆలయపు "విమానం" అడుగు చతురస్రాకారంతో ఉండి నాలుగు ముఖాలు కుడ్యస్తంభాలతో కట్టబడి ఉంది. ఇతర దేవాలయాలతో పోలిస్తే దీని "శిఖరం" చిన్నగా ఉంది. నాలుగు వైపులా నాలుగు నటరాజ విగ్రహాలు, నాలుగు కృత్తిముఖాలు ఉన్నాయి. శిఖరపు పై భాగంలో కలశం ఉంది.[4] శిఖరం 34 అడుగుల ఎత్తుండి అణువణువునా శిల్పాకృతులతో అలంకరించబడింది.[7]
గర్భగుడి
[మార్చు]గర్భగుడి చుట్టూ లోపలి భాగంలో గోడలపై అందమైన కన్నెల బొమ్మలు, నాగులు, నాగినులు పెనవేసుకున్న శిల్పాలు ఉన్నాయి. గర్భగుడి లోపలిభాగం ఘనాకృతిలోను వెలుపల స్థూపాకృతిలోనూ ఉంది.[7]
జగ్మోహన మండపం
[మార్చు]జగన్మోహన మండపం 115 అడుగుల ఎత్తు వుండి విశ్వకర్మ మోహరన శిల్పులచే చెక్కిబడిన శిల్పాలతో సుశోభితం అయ్యింది.[9]. ఈ మండపం ఎర్రని ఇసుకరాయితో నిర్మించబడి సాధువుల, శృంగార స్త్రీల బొమ్మలు చెక్కబడివున్నాయి. చండప్రచండుల విగ్రహాల ప్రక్కన గంగ, యమున విగ్రహాలు చెక్కబడివున్నాయి. ఈ మండపానికి ఎదురుగా తోరణద్వారం ఉంది. గజలక్ష్మి, రాహు,కేతు విగ్రహాలు కూడా ఈ మండపగోడలపై చెక్కబడి ఉన్నాయి.[4] సింహం తనకాళ్ళపై కూర్చొని వున్న బొమ్మ పై భాగాన ఉంది. బయటి గోడలపై నాగులు, నాగినుల బొమ్మలు చెక్కబడ్డాయి.[7]
ఇతరాలు
[మార్చు]గర్భగుడి ద్వారంపై హిందూ పురాణాల ప్రకారం తొమ్మిదవ గ్రహమైన కేతువు యొక్క విగ్రహం మూడు పడగల నాగుపాముతో కలిపి ఉంది.[9] ఈ ఆలయం నైరుతి దిక్కులో ఒక కోనేరు (మారీచకుండం) ఉంది. దీనిలో మునిగితే స్త్రీలకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఇంకా ఈ ఆలయ ప్రాకరంలో కొన్ని శివాలయాలున్నాయి.[9] ఈ ఆలయం తక్కువ ఎత్తుకలిగిన ప్రాకారాన్ని కలిగి ఉంది. ఈ దేవాలయం లోపలివైపు, వెలుపలివైపు శిల్పాలతో నిండివుంది.[7]
మతపరమైన ప్రాధాన్యత
[మార్చు]ఈ దేవాలయంలోని శివుని ఆరాధిస్తే ముక్తి లభిస్తుందని కాబట్టి ఈ దేవునికి ముక్తేశ్వరుడనే పేరు ఉందని అంటారు.[8] ఈ ఆలయ కుడ్యాలపై యోగాభ్యాసానికి చెందిన అనేక భంగిమలు చెక్కబడిబడి ఉన్నాయి. తాంత్రిక విద్యలకు ఈ దేవాలయాన్ని కేంద్రంగా కొందరు ఋషులు భావిస్తారు.[9] ఈ దేవాలయం ప్రాకారానికి బయటివైపు సరస్వతి, గణేశ విగ్రహాలతోపాటు పాశుపతశైవాచారపు వ్యవస్థాపకుడు లకులీశుని విగ్రహం కూడా ఉంది.[4][9] ఇక్కడి సాంప్రదాయం ప్రకారం గొడ్రాళ్లయిన స్త్రీలు ఈ ఆలయసమీపంలోని "మారీచకుండం"లో రథోత్సవం జరిగే అశోకాష్టమి ముందురోజు స్నానంచేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. రథోత్సవం జరిగిన రోజు రాత్రి ఈ కుండంలోని నీటిని భక్తులకు విక్రయిస్తారు.[11]
ఆకర్షణీయాంశాలు
[మార్చు]ఒడిషా రాష్ట్రప్రభుత్వం పర్యాటక శాఖ ప్రతియేటా ఈ ఆలయ ప్రాంగణంలో "ముక్తేశ్వర నాట్యోత్సవాల"ను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలలో ప్రఖ్యాతిగాంచిన ఒడిస్సీ నృత్య కళాకారులు, కళాకారిణులు తమ నృత్యాలతో అలరిస్తారు.[12][13] ఈ ఉత్సవం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక జాలస్థలిలో ప్రసారం అవుతుంది.[14][15]
గ్యాలరీ
[మార్చు]-
ముక్తేశ్వరాలయంలో వేణువూదుతున్న కళాకారుడు.
-
ముక్తేశ్వర దేవాలయ దృశ్యం
-
విమాన గోపురం
-
ముక్తేశ్వర దేవాలయపు తోరణ ద్వారము
-
కృత్తిముఖుని చిత్రం
-
మహావిష్ణువు శిల్పం
-
దేవాలయ ఆవరణలో నృత్యకారిణి శిల్పం
ఇంకా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ స్మిత్, వాల్టర్ (1991). "ఇమేజస్ ఆఫ్ డివైన్ కింగ్స్ ఫ్రం ద ముక్తేశ్వర టెంపుల్, భుబనేశర్". ఆర్టిబస్ ఏసియే. 51 (1/2): 90. doi:10.2307/3249678. JSTOR 3249678.
- ↑ స్మిత్, వాల్టర్ (1994). ది ముక్తేశ్వర టెంపుల్ ఇన్ భుబనేశ్వర్. ఢిల్లీ: మోతీలాల్ బనార్సీదాస్ పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్. p. xix. ISBN 81-208-0793-6.
- ↑ గోపాల్, మదన్ (1990). కె.ఎస్.గౌతం (ed.). ఇండియా త్రూ ది ఏజెస్. పబ్లికేషన్ డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. p. 175.
- ↑ 4.0 4.1 4.2 4.3 పరమేశ్వరానంద్, స్వామీ (2004). ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ శైవిజం. సరూప్ & సన్స్. pp. 164–165. ISBN 81-7625-427-4.
- ↑ పరీదా, ఎ.ఎన్. (1999). ఎర్లీ టెంపుల్స్ ఆఫ్ ఒరిస్సా (1st ed.). న్యూ ఢిల్లీ: కామన్‌వెల్త్ పబ్లిషర్స్. pp. 93–97. ISBN 81-7169-519-1.
- ↑ "టెంపుల్ ఆర్కిటెక్చర్". కల్చరల్ డిపార్ట్‌మెంట్ - గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా. Archived from the original on 7 అక్టోబరు 2014. Retrieved 23 May 2014.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 జావీద్, ʻఆలి; జావీద్, తబసుమ్ (2008). వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్. అల్గోరా పబ్లిషింగ్. pp. 192–194. ISBN 9780875864846.
- ↑ 8.0 8.1 "Bhubaneswar tourist attractions". Bhubaneswar Municipal Corporation. Archived from the original on 2011-08-10. Retrieved 2006-09-12.
- ↑ 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "భుబనేశ్వర్ ముక్తేశ్వర టెంపుల్". టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిషా. Archived from the original on 2007-09-25. Retrieved 2006-09-12.
- ↑ అల్లెన్, మార్గరెట్ (1991). ఆర్నమెంట్ ఇన్ ఇండియన్ ఆర్కిటెక్చర్. అసోసియేటెడ్ యూనివర్సిటీ ప్రెస్. pp. 206–207. ISBN 0-87413-399-8.
- ↑ E.J. pp.96-107
- ↑ "భుబనేశ్వర్ ముక్తేశ్వర టెంపుల్". టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిషా. Archived from the original on 2013-04-12. Retrieved 2006-09-12.
- ↑ "ముక్తేశ్వర్ డాన్స్ ఫెస్టివల్". The Hindu. 2013-01-12. Retrieved 2012-01-13.
- ↑ "ఒడిషా గవర్నమెంట్ వెబ్‌కాస్ట్". గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా. Archived from the original on 2012-05-05. Retrieved 2006-09-12.
- ↑ "సీజన్ ఆఫ్ మేళాస్". డైలీ న్యూస్. శ్రీలంక. 23 December 2010. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 2 June 2015.
ఉపయుక్త గ్రంథాలు
[మార్చు]- ఇ.జె., బ్రిల్స్ (1973). కంట్రిబ్యూషన్స్ టు ఏషియన్ స్టడీస్:1973. నెదర్లాండ్స్: బ్రిల్ అకాడమిక్ పబ్లిషర్స్. ISBN 9789004035386.
వెలుపలి లింకులు
[మార్చు]- ఒరిస్సా దేవాలయాలు
- ముక్తేశ్వర దేవాలయం Archived 2018-04-19 at the Wayback Machine