వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 49వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిజామాబాదు జిల్లా

నిజామాబాదు జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క తెలంగాణ ప్రాంతము నందు ఉన్నది. నిజామాబాదు నగరము ఈ జిల్లా ముఖ్య పట్టణము. నిజామాబాదు ను పూర్వము ఇందూరు మరియు ఇంద్రపురి అని పిలిచేవారు. బోధన్, కామారెడ్డి, ఆర్మూరు ఇతర ప్రధాన నగరములు. నిజామాబాదు నగరం హైదరాబాదు, వరంగల్ తరువాత తెలంగాణాలో అతిపెద్ద నగరం.

నిజామాబాద్ ను 8వ శతాబ్దములొ రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సొముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చినది. తరువాత 1905వ సంవత్సరములో ఈ ప్రాంతములో నుండి (సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వరకు) రైలు మార్గము ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి ప్రాంతానికి అప్పటి రాజు నిజాం-ఉల్-ముల్క్ పేరు పెట్టి,నిజామాబాద్ గా మార్చడం జరిగింది.

జిల్లాలో చారిత్రక శిల్పసంపదకు కొదవలేదు. రాజులు ఏలిన సంస్థానాలలో నేటికీ చారిత్రక కట్టడాల ఆనవాళ్ళు దర్శనమిస్తున్నాయి. క్రీ.పూ.3000 నాటికే జిల్లాలో మానవుల ఉనికి ఆధారాలున్నాయి. అందుకు చరిత్రకారులకు దొరికిన 'కైరన్'(చనిపోయిన వారిని వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చిపెట్టి దాని చుట్టూ కొన్ని గుర్తులను అమర్చడం)లే నిదర్శనం. దీని ద్వారానే ప్రాచీన కట్టడాలైన రాష్ట్ర కూటులు, బోధన్ చాళుక్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆలయాలు, ముస్లిం నిర్మాణాలు తెలిశాయి.

(ఇంకా…)