వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 31వ వారం
ధవళేశ్వరం ఆనకట్ట
తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రికి సమీపమున ఉన్న ధవళేశ్వరము,మరియు పశ్చిమ గోదావరి జిల్లా లోని విజ్జేశ్వరములనుకలుపుచూ గోదావరి నదికి అడ్డంగా నిర్మించిన ఆనకట్టయే 'ధవళేశ్వరం-విజ్జేశ్వరము ఆనకట్ట. ఈ ఆనకట్ట సర్ ఆర్థర్ కాటన్ అనే బ్రిటిషు ఇంజనీరు ఆధ్వర్యంలో 1847 లో ప్రారంభించి,1852నాటికి పూర్తిచెయ్యబడినది.
గోదావరినది పై ధవళేశ్వరము వద్ద ఆనకట్ట నిర్మించకముందు, గోదావరి డెల్టా లోని రెండు జిల్లాలు అతివృష్టివలన ,తుఫానుల వలన ముంపునకు గురై,,అనావృష్టి వలన కరువుకాటకాలకు లోనై, ప్రజలు అష్టకష్టాలు పడుచు, దుర్భర దారిద్ర్యానికి లోనయి జీవించేవారు. వరుసగా దాదాపు 20 సంవత్సరములు క్షామం నీడలో రెండుజిల్లాల జనం అల్లాడిపోయారు.1831-32 లో అతివృష్టి మరియు తుఫా నుల కారణంగా పలు గ్రామాలు ముంపుకు గురైనాయి.1833 లో, నందన సంవత్సరంలో అనావృష్టి వలన దుర్భరమైన క్షామం, కరువు వచ్చి, వేలసంఖ్యలో ఆకలిచావులు సంభవించాయి.దాదాపు రెండు లక్షలమంది కరువు బారిన పడ్డారు. ఊరు విడిచి వెళ్లలేని వారు కడకు తమ ప్రేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను సంతలో వస్తువులను అమ్మినట్లు అమ్ముటకుకూడా సిద్ధమయ్యారంటే, నాటి క్షామం ఎంత తీవ్రమైనదో ఊహించవచ్చును. తిరిగి 1839 లో తీవ్రమైన తుఫానులు, ఉప్పెన కారణంగా పొలాలు, గ్రామాలు ముంపునకు గురై, క్షామపరిస్థితులేర్పడి, వేలాది జనం కాందిశీకులుగా ప్రక్క జిల్లాలకు, ప్రక్క రాష్ట్రాలకు వలస వెళ్ళవలసివచ్చింది.గోదావరి జిల్లాల ప్రజల ఈ దుర్భర పరిస్థితులను గమనించిన, అప్పటి జిల్లా అధికారి సర్ హెన్రి మౌంట్ , ప్రజల కష్టాలను వివరిస్తూ, ప్రభుత్వానికి ఒక నివేదికను పంపాడు. ఆ నివేదికకు స్పందించిన బ్రిటిషు ఇండియా ప్రభుత్వం, గోదావరి నదిపై ఆనకట్ట కట్టుటకుగల అనుకూల, ప్రతికూల స్థితిగతులను అంచనావేయుటకై ఆర్థర్ కాటన్ అనే ఇంజనీరుకు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశం పై రాజమండ్రి వచ్చిన కాటన్, గోదావరి నదిపై ఆనకట్ట కట్టుటకై, అనువైన ప్రాంతానికై అన్వేషణ ప్రారంభించాడు.
(ఇంకా…)