వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 02వ వారం
స్టెతస్కోప్ (ఆంగ్లం: Stethoscope) అనగా గుండె, ఊపిరితిత్తులు, ఉదరం లాంటి అవయవాల చప్పుడు విని పరీక్షించడానికి వాడే ఒక వైద్య పరికరం. దానిని రెని థియోఫిల్ హయసింత్ లెనెక్ (Rene Theophile Hyacinthe Laennec) అనే ఫ్రెంచ్ వైద్యుడు 1819లో కనుగొన్నాడు. 1781 నుండి 1826 వరకు జీవించిన లెనెక్ ప్రతిభాశాలియైన కల్పనాచరుతుడే కాక అనుభవశాలియైన వైద్యుడు కూడా. 1816లో అతను ఒక యువతిని పరీక్షించసాగాడు. ఆ రోజుల్లో వైద్యుడు రోగి గుండెను, ఊపిరితిత్తుల్ని పరీక్షించేటప్పుడు తన చెవుల్ని రోగి గుండెకు ఆనించి వినేవాడు. కాని లెనెక్ ఆ యువతిని పరీక్షించడానికి మొహమాటపడ్డాడు. గట్టి వస్తువుల ద్వారా చప్పుడు పయనిస్తుందని అతనికి తెలుసు. కాబట్టి అతను 24 కాగితాల్ని చుట్టగా చుట్టి వాటి ఒక కొనను తన చెవికీ, యింకొక కొనను ఆ యువతి గుండెకు ఆనించి వినగా మామూలు పద్ధతిలో కంటే చాలా స్పష్టంగా చప్పుడు వినపడి అతను సంతోషించాడు. ఆ ఏడాదే లెనెక్ పారిస్‌లోని నెకెర్ ఆస్పత్రిలో ఉద్యోగాన్ని స్వీకరించాడు. తరువాతి కొన్నె నెలలపాటు అతను నవీన స్టెతస్కోప్‌కు పూర్వపు మోటురకాలతో ప్రయోగాలు చేశాడు. చివరకు అతను వాడిన స్టెతస్కోప్ యొక్క సమాచారాన్నీ, నిరూపణన్నీ ప్రమాణ పత్రాల ద్వారా ఆధారంగా చేసుకొని ఒక రాత ప్రతిని 1817 మార్చి 8న తయారుచేశాడు. అంగశ్రవణానికి సంబంధించి నమోదైన మొట్టమొదటి రాతప్రతి యిదే. లెనెక్ తన పరికరానికి "లె సినిండర్" అని పేరుపెట్టాడు. తరువాత స్నేహితులు, సహచరులు అతనికి నచ్చచెప్పాక దానికి "స్టెతస్కోప్" అని పేరును మార్చాడు. గ్రీకు భాషలో స్టెతస్కోప్ కు "నేను గుండెను చూస్తున్నాను" అని అర్ధము. లెనెక్ ఆ స్టెతస్కోప్‌ను వెంటనే వాడుకలో ప్రవేశపెట్టాడు.
(ఇంకా…)