Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 09వ వారం

వికీపీడియా నుండి

బుడుగు

బుడుగు, ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు మరియు బాపు బొమ్మలు ద్వారా హాస్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. తెలుగు సాహిత్యంలో ఈ తరహా పుస్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును. ముళ్ళపూడి రచనలు "ముళ్ళపూడి సాహితీ సర్వస్వం" అనే సంపుటాలుగా లభిస్తున్నాయి. అనువాద రమణీయం, సినీరమణీయం, బాలరమణీయం, కదంబ రమణీయం ఇలా. ఇందులో 3వ సంపుటం "బాలరమణీయం" బుడుగు. ఇది ఎమ్బీఎస్ ప్రసాద్ సంపాదకత్వం (ముందుమాట)తో వెలువడింది. ఈ రచన ప్రశంస ఆరుద్ర కూనలమ్మ పదాలులో ఇలా ఉంది. ఆరుద్ర చెప్పినట్లుగా ముళ్ళపూడి వెంకటరమణ "బుడుగు వెంకటరమణ"గా అయ్యాడంటే ముళ్ళపూడి సృష్టించిన పాత్రలన్నింటిలోనూ బుడుగు ఎంత ప్రసిద్ధమయ్యాడో తెలుస్తుంది. నవంబరు 1956 నుండి ఏప్రిల్ 1957 వరకు ఆంధ్ర పత్రిక వార పత్రికలో సీరియల్‌గా వచ్చింది. అప్పుడు రచయిత అసలు తన పేరు వేసుకోలేదు. చివరికి అందరి బలవంతం వల్ల "ఇది వ్రాసి పెట్టినవాడు - ఫలానా, బొమ్మలు వేసిపెట్టినవాడు - ఫలానా" అని ఆఖరు సంచికలో వేశారు. అప్పుడు వీక్లీ సీరియల్‌కు పెట్టిన పేరు బుడుగు - చిచ్చర పిడుగు ఏప్రిల్ 24.1957 లో బుడుగు స్కూల్లో చేరడానికి, అల్లరి మానేయడానికి నిశ్చయించుకోవడంతో సీరియల్ ఆగిపోయింది. నాలుగేళ్ళ తరువాత "వురేయ్, మళ్ళీ నేనే" అని పాఠకులను అలరిస్తూ వచ్చాడు. ఇప్పటికి కాస్త తెలివి మీరాడు. అణ్వస్త్ర భయం గురించి, మేష్టర్ల జీతాల గురించి కూడా మాట్లాడాడు. బుడుగు పాత్ర సృష్టికి ప్రసిద్ధ ఆంగ్ల కార్టూను డెనిస్ - ది మెనేస్ స్ఫూర్తి అని అంటుంటారు. ఇది ఎంత నిజమో తెలియదు. కాని ముళ్ళపూడి వెంకట రమణను చిన్నప్పుడు "బుడుగు" అని పిలిచేవారట. డెనిస్, బుడుగు పాత్రలలోనూ, వారి పరిజనాలలోనూ సాపత్యం ఉన్నదనుకొన్నా బుడుగు పరివారం, ఆలోచనలు, భాష అన్నీ పక్కా తెలుగు వాతావరణమే. ఆలోచించి చూస్తే డెనిస్ కంటె బుడుగు పాత్ర విస్తృతి ఎక్కువ


(ఇంకా…)