Jump to content

బుడుగు

వికీపీడియా నుండి
బుడుగు
బుడుగు పుస్తక ముఖ చిత్రం
బుడుగు పుస్తక ముఖ చిత్రం

బుడుగు పుస్తక ముఖ చిత్రం
Comic strip(s) బుడుగు
Creator(s) ముళ్ళపూడి వెంకటరమణ
First appearance నవంబరు, 1956

బుడుగు, ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు, బాపు బొమ్మల ద్వారా హాస్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. తెలుగు సాహిత్యంలో ఈ తరహా పుస్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును.

ముళ్ళపూడి రచనలు "ముళ్ళపూడి సాహితీ సర్వస్వం" అనే సంపుటాలుగా లభిస్తున్నాయి. అనువాద రమణీయం, సినీరమణీయం, బాలరమణీయం, కదంబ రమణీయం ఇలా. ఇందులో 3వ సంపుటం "బాలరమణీయం" బుడుగు. ఇది ఎమ్బీఎస్ ప్రసాద్ సంపాదకత్వం (ముందుమాట) తో వెలువడింది. ఈ రచన ప్రశంస ఆరుద్ర కూనలమ్మ పదాలులో ఇలా ఉంది.

హాస్యమందున అఋణ
అందె వేసిన కరుణ
బుడుగు వెంకటరమణ
ఓ కూనలమ్మా!

నేపథ్యం

[మార్చు]
బుడుగు పుస్తక వెనుక అట్ట
బుడుగు పుస్తక వెనుక అట్ట

ఆరుద్ర చెప్పినట్లుగా ముళ్ళపూడి వెంకటరమణ "బుడుగు వెంకటరమణ"గా అయ్యాడంటే ముళ్ళపూడి సృష్టించిన పాత్రలన్నింటిలోనూ బుడుగు ఎంత ప్రసిద్ధమయ్యాడో తెలుస్తుంది. నవంబర్ 1956 నుండి ఏప్రిల్ 1957 వరకు ఆంధ్ర పత్రిక వార పత్రికలో సీరియల్‌గా వచ్చింది. అప్పుడు రచయిత అసలు తన పేరు వేసుకోలేదు. చివరికి అందరి బలవంతం వల్ల "ఇది వ్రాసి పెట్టినవాడు - ఫలానా, బొమ్మలు వేసిపెట్టినవాడు - ఫలానా" అని ఆఖరు సంచికలో వేశారు. అప్పుడు వీక్లీ సీరియల్‌కు పెట్టిన పేరు బుడుగు - చిచ్చర పిడుగు 24.4.1957లో బుడుగు స్కూల్లో చేరడానికి, అల్లరి మానేయడానికి నిశ్చయించుకోవడంతో సీరియల్ ఆగిపోయింది. నాలుగేళ్ళ తరువాత "వురేయ్, మళ్ళీ నేనే" అని పాఠకులను అలరిస్తూ వచ్చాడు. ఇప్పటికి కాస్త తెలివి మీరాడు. అణ్వస్త్ర భయం గురించి, మేష్టర్ల జీతాల గురించి కూడా మాట్లాడాడు.[1]

బుడుగు పాత్ర సృష్టికి ప్రసిద్ధ ఆంగ్ల కార్టూను డెనిస్ - ది మెనేస్ స్ఫూర్తి అని అంటుంటారు. ఇది ఎంత నిజమో తెలియదు. కాని ముళ్ళపూడి వెంకట రమణను చిన్నప్పుడు "బుడుగు" అని పిలిచేవారట.[1]. డెనిస్, బుడుగు పాత్రలలోనూ, వారి పరిజనాలలోనూ సాపత్యం ఉన్నదనుకొన్నా బుడుగు పరివారం, ఆలోచనలు, భాష అన్నీ పక్కా తెలుగు వాతావరణమే. ఆలోచించి చూస్తే డెనిస్ కంటే బుడుగు పాత్ర విస్తృతి ఎక్కువ (సమష్టి కుటుంబం కారణంగా కావచ్చును).

బాపు బొమ్మలు

[మార్చు]

బుడుగు సృష్టిలో బాపు పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. పత్రికలో వచ్చిన బుడుగు బొమ్మలే కాకుండా బుడుగు పుస్తకం ఒకో ప్రచురణలో ఒకోలాగా చిత్రిస్తూ క్రొత్తదనం మెయింటెయిన్ చేశాడు. బాపు బొమ్మ వెబ్‌సైటులో బుడుగు బొమ్మలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.

బుడుగు, బుడుగు కుటుంబం

[మార్చు]

"ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకోపేరు పిడుగు. ... ఇంకో అస్సలుపేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావలిస్తే మా నాన్నని అడుగు" అని మొదట్లో బుడుగు తనను పరిచయం చేసుకొన్నాడు.

బుడుగు కుటుంబంలో మనుషులు
  • నాన్న (గోపాళం), అమ్మ (రాధ) :అమ్మా నాన్నా నిఝంగా కొట్టరు. కొట్టినా గట్టిగా కొట్టరు. ఉత్తుత్తినే.
  • బామ్మ : బుడుగును "హారి పిడుగా" అంటుంది. బుడుగును వెనకేసుకొస్తుంది.
  • బాబాయి : రెండుజళ్ళ సీత వస్తుంటే విజిలేయమంటాడు. వీడి దగ్గిర బోల్డు లౌలెట్రులున్నాయి.
బుడుగు ఇరుగు, పొరుగు
  • ప్రవేటు మాష్టారు: వీడు మంచివాడు కాడు. అసలు ప్రవేటు మాష్టర్లు అందరూ ఇంతే. ఇప్పటికి వీడు పదోవాడు. ఒక్కడూ పకోడీలు తేడు. పైగా లెక్కలు చేయమంటారు. చెవి మెలిపెడతారు.
  • రెండుజళ్ళ సీత : చాలామంది ఉన్నారు. ఒకోసారి ఒక జడ ముందుకీ, ఒక జడ వెనక్కీ వేసుకొని నడుస్తారు. ఇది చాలా ఇబ్బంది. అప్పుడు వాళ్ళు వస్తున్నారో వెళ్తున్నారో ఎలా తెలుస్తుంది?
  • లావుపాటి పిన్నిగారు : అవిడకు పెద్ద జడ లేదు. అయినా పేరంటంలో పెద్ద జడ ఉంటుంది. అది నిజం జడ కాదనుకో. "డేంజరు" అంటే పిన్నిగారూ, మా బామ్మా పోట్లాడుకోవడం.
  • సిగాన పెసూనాంబ : బుడుగు గర్ల్‌ఫ్రెండ్

ఇంకా డికెష్టివ్, విగ్గు లేని యముడు, పిన్నిగారి ముగుడు, సుబ్బలక్ష్మి - ఇలా చాలా మందున్నారు.

బుడుగు ఆలోచనలు, అయోమయం

[మార్చు]
  • నా అంతవాడు నేను. నన్ను ఎవరూ కొట్టకూడదు. నేను నిఝంగా పెద్దవాడినే అనుకో. ఐతే వాళ్ళే నన్ను కుర్రకుంకా అంటారుగా. అందుకని కొట్టకూడదు.
  • సిగరెట్లు తెల్లగా ఉంటాయిలే. వీటిని బాబాయిలాంటి కుర్రవాళ్ళు కాలుస్తారు. .. మరి నేను పెద్దవాడినిగా. అందుకనే కాలవను. నేను ఇంఖా పెద్దవాణ్ణయ్యాకా జెటకా బండియేనా రైలింజనేనా తోలుతానుగా. అందుకని బీడీలు దాస్తాననుకో. అప్పుడు చెవులో పెట్టుకోవాలిగా. బీడీలు బామ్మ వత్తుల పెట్టెలో దాస్తే భద్రంగా ఉంటాయి...
  • అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడమీద గుచ్చి కాలుస్తారు. సిగరెట్లేమో నోట్లో గుచ్చి కాలుస్తారు.
  • ధైర్యం అంటే పోలీసుతో మాట్లాడ్డం. ధైర్యం అంటే సుబ్బలష్మితో మాట్లాడ్డం అని కూడా అర్ధం అట. ఇలా అని బాబాయి చెప్పాడు.
  • డికేష్టివురావు అంటే నాకు తెలీదు. బాబాయికీ తెలీదు. వాడికి కూడా తెలీదట. డికెష్టివురావుకు పెద్ద మీసాలున్నాయి. డికెష్టింగ్ చేసేప్పుడు అవి పెట్టుకోవాలట. అప్పుడు టుపాకీ కూడా పట్టుకోవాలట.
  • బళ్ళోకెళ్ళకుండా ఉండాలంటే చొక్కా ఇప్పేసి ముందుగా ఎండలో నించోవాలి. అప్పుడు వీపుమీద పొట్టమీద జొరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేఠుకుని అమ్మదగ్గిరికెళ్ళి గబగబా చూడూ బళ్ళోకెళ్ళద్దని చెప్పూ అనాలి. లాపోతే జెరం చల్లారిపోతుంది. బామ్మకి చెప్పేస్తే చాలు. .. కడుపునెప్పి మంచిది కాదు ఎందుకంటే పకోడీలు చేసుకొని మనకు పెట్టకుండా తినేస్తారు. అందుకని తలనొప్పి అన్నిటికన్నా మంచిది. ఇది కూడా బామ్మకే చెప్పాలి.
  • అయిసు ఫ్రూటువాడిని పిలిచి ముందుగా రెండు ఎంగిలి చేసెయ్యాలి. అప్పుడు అమ్మ కొనిపెడుతుంది. తరువాత ప్రెవేటు చెబుతుందనుకో. ఈ పెరపంచకంలో ప్రెవేటు లేకుండా మనకి ఏం రాదుగదా మరి?
  • ఒక మేష్టారేమో చెవి కుడివైపుకు మెలిపెడతాడు. ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడొస్తాడు కదా? వాడేమో ఎడమవైపుకి మెలిపెడతాడు. ఇలా అవుతే చెవి పాడైపోదూ? అందుకని ఎటేపు మెలెట్టాలో కొత్తమేష్టరు ముందుగా పాతమేష్టరును కనుక్కుని రావాలి.
  • ఈ పెద్దవాళ్ళు ఒకోసారి అబద్ధం చెబితే తిడతారు. ఒకోసారి నిఝెం చెబితే కూడా ప్రెవేటు చెప్పేస్తారు.
  • చంపడానికి ఇప్పుడు రాచ్ఛసులు అయిపోయారట. అందుకని మనం పదమూడో ఎక్కం, సిబి పాఠం ఇవన్నీ చదూకోవాలట. అవన్నీ వచ్చేస్తే రాచ్ఛసులు చచ్చిపోతారట. మనం బాగా చదూకుని ప్ఫది కాణీలో, వంద కాణీలో తెచ్చినా రాచ్ఛసులు చచ్చిపోతారట. లాపోతే సీగాన పెసూనాంబనిచ్చి పెళ్ళి చైరన్నమాట. ఇలాగని మా రాద చెప్పింది. రాధంటే అమ్మలే.

బుడుగు భాష

[మార్చు]
  • "ప్రెవేటు చెప్పడం" - లౌలెట్రు వ్రాసినపుడు రెండుజళ్ళ సీత నాన్న బాబాయికి ప్రెవేటు చెబుతాడు. ఒకోసారి నాన్న అమ్మకు ప్రెవేటు చెబుతాడు.
  • "జాఠర్ ఢమాల్" - అంటే ఏంటో.
  • "అంకెలు" - ఒకటి, రెండు, ఫది, డెభ్బయ్యో, బోల్డన్నో
  • "అనుభవం" : టెంకిజెల్లలు, మొట్టికాయలు తినడం

బుడుగు భాష ప్రత్యేకమైనది. అది వ్యాకరణ పరిధికి అందదు. భాషలోని తియ్యదనం అంతా ఆ మాటల్లోనే ఉంది.[2]

అభిప్రాయాలు

[మార్చు]
  • బుడుగు ఎన్నటికీ ఏడేళ్ళ చిచ్చరపిడుగు గానే పాఠకుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఆ పాత్రను అద్భుతంగా చిత్రించిన ముళ్ళపూడి వెంకట రమణకి, రమణ భావనలో పుట్టిన బుడుగు ఆకారాన్ని అత్యంత ఆకర్షణీయంగా మన కళ్ళముందు ఉంచిన బాపుకి సార్థకత.[2]
  • మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి మహనీయుడు "నేను- నా కతలు" అనే పుస్తకం పరిచయంలో బుడుగు భాషను అనుకరించాడు. ఇది బుడుగు వంటి చిరంజీవికి, ఆ చిరంజీవిని సృష్టించిన సాహితీ చిరంజీవికి లభించిన అరుదైన అక్షరాశీర్వచనం. ఆయనంతటివారు బుడగును అనుకరించారంటే అది వాత్సల్యంతో కాగితం మీద పెట్టిన దీవెన అని ఆరుద్ర అన్నాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 బుడుగు పుస్తకం ముందుమాట "బుడుగు వెంకటరమణ ..." లో సంపాదకుడు ఎమ్బీయస్ ప్రసాద్ - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2001-2007 ఆరు ముద్రణలు)
  2. 2.0 2.1 శత వసంత సాహితీ మంజీరాలు లో సి.హెచ్. సుశీల ఉపన్యాస వ్యాసం - ప్రచురణ : ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం, నిజయవాడ

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బుడుగు&oldid=3922217" నుండి వెలికితీశారు