వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 10వ వారం
నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాదు జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27న జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవారు. 1952లో ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి ఎన్నికై హైదరాబాదు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా చిన్నకొండూరు మరియు భువనగిరిల నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినారు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969 మరియు 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేసిన బాపూజీ సెప్టెంబరు 21, 2012 నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించారు.
(ఇంకా…)