వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 29వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాన్ ఎవరెట్ క్లౌ

జాన్ ఎవరెట్ క్లౌ (జూలై 16 1836-నవంబర్ 26 1910) తెలుగునాట పేరొందిన క్రైస్తవ మతబోధకుడు, సంఘ సేవకుడు. 1876-78 కాలంలో కోస్తాంధ్ర ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కరువు కాలంలో క్లౌ చేసిన సేవలు పేర్కొనదగినవి. 1876లోనే కరవు జాడలు పసిగట్టి ఆంగ్లేయ ప్రభుత్వం ప్రారంభించిన బకింగ్ హాం కాలువ పనులలో 3 మైళ్ళ పనికి కాంట్రాక్టు ప్రయత్నించి పొందారు. రాజుపాలెం అనే గ్రామం వద్ద సహాయ శిబిరాన్ని ఏర్పాటుచేసి "అన్నం పెట్టించి, కూలీ ఇస్తానని" బోధకులతో గ్రామాల్లో చెప్పించారు. వారిని అనుసరించి అనూహ్యమైన సంఖ్యలో అన్నార్తులు వచ్చారు. వేలాదిమంది బీదసాదలు ఆ శిబిరానికి నకనకలాడుతూ చేరుకుని అప్పటికి ఉడకని అన్నమే తిని మరణించినవారూ, చేరుకుంటూనే తట్టుకోలేక మరణించినవారూ, రేపు తినగలమో లేదోనని తినీ తినీ చనిపోయినవారూ ఇలా వేలకొద్దీ శవాలు పేరుకునేవి. వాటిని తీయించి శుభ్రం చేయించి ఉన్నవారిని బతికించుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. వేలాదిమంది కూలీలను, అట్టడుగు వర్గాలకు చెందినవారినీ వారు పనుల నెపంతో బతికించారు. ఆకలి కారణంగా క్రైస్తవంలోకి చేరడాన్ని నిరసించి, తనపై అధికారుల ఆగ్రహాన్ని చవిచూస్తూనే, కరవు కాలంలో మతమార్పిడులు చేసేందుకు వీల్లేదంటూ నిలిచారు. కరవు ముగిసాకా, స్వచ్ఛందంగా ముందుకువచ్చినవారికే బాప్తిజం ఇచ్చారు. అన్నార్తులకు, క్రైస్తవ సమాజానికి ఆయన చేసిన సేవలకు అపోస్తల్ ఆఫ్ తెలుగూస్ (తెలుగువారి అపోస్తలుడు)గా పేరొందారు.

(ఇంకా…)