వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 03వ వారం
బొబ్బిలి యుద్ధం ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం. 1758 జనవరి 24 న బొబ్బిలి సంస్థాన సైన్యానికి, ఫ్రెంచి, విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికీ మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచింది. బొబ్బిలి కోట విశాఖపట్నానికి ఈశాన్యంగా 140 మైళ్ళ దూరంలో ఉంది. 18 వశతాబ్ది మధ్య కాలంలో బొబ్బిలి జమీందారుగా ఉన్న రాజా గోపాలకృష్ణ రంగారావుకు, విజయనగర సంస్థానం ప్రభువు పూసపాటి పెద విజయరామరాజుకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. రెండు రాజ్యాల సరిహద్దుల వద్ద ఉన్న వాగుల్లోని నీటిని బొబ్బిలి ప్రజలు బలవంతంగా తిసుకు వెళ్ళేవారు. తన బలం చాలనందున విజయరామరాజు ఈ దోపిడీని ఎదుర్కొనలేకపోయేవాడు. ఫ్రెంచి కమాండర్ ఇన్ ఛీఫ్ బుస్సీ వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని, పక్కలో బల్లెంలా ఉన్న తన పొరుగు రాజును ఇక్కడి నుండి తరిమికొట్టాలని పెద విజయరామరాజు భావించాడు. బొబ్బిలి పాలకులు మిగిలిన జమీందార్ల లాగా ఫ్రెంచి వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోక, తమ చర్యల ద్వారా ఫ్రెంచి కమాండర్ ఇన్ ఛీఫ్, మార్క్ దీ బుస్సీతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఈ చర్యలన్నిటి పర్యవసానమే బొబ్బిలి యుద్ధం. భారత దేశ చరిత్రలో మున్నెన్నడూ ఎరగని సంఘటనను ఆవిష్కరించిన యుద్ధం ఇది. అనేక జానపద గాథలకు ప్రాణం పోసిన బీభత్స కాండ ఈ యుద్ధంలో జరిగింది.యుద్ధాన్ని నివారించేందుకు బొబ్బిలి సంస్థానం ప్రయత్నాలు చేసింది.
(ఇంకా…)