Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 08వ వారం

వికీపీడియా నుండి

బమియాన్ బుద్ధ విగ్రహాలు

బమియాన్ బుద్ధ విగ్రహాలు ఆఫ్ఘనిస్తాన్ లోని ఆరవ శతాబ్దానికి చెందిన పెద్ద బుద్ధ విగ్రహాలు. ఈ విగ్రహాలు మధ్య ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన హజరాజత్ అనే ప్రాంతంలో బమియాన్ లోయ దగ్గర ఇసుకరాతి కొండల్లో చెక్కబడ్డాయి. ఈ ప్రదేశం కాబూల్ కు 213 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శిల్పాలు గాంధార శిల్పకళ పద్ధతిలో చెక్కారు. శిథిలమైన బమియాన్ బుద్ధ విగ్రహం బమియాన్‌ అనేది హిందుకుష్ పర్వత ప్రాంతంలో ఓ అందమైన లోయ. ఇక్కడ ఎన్నో బుద్ధవిగ్రహాలున్నాయి. అందమైన గుహలున్నాయి. ఈ శిల్పాలు కుషాణుల కాలం నాటివి. ఇక్కడి శిల్పాలు కాలక్రమేణా వాతావరణ మార్పులకు లోనై పాడయ్యాయి. బమియాన్‌లోని రెండు పెద్ద విగ్రహాలను 2011 లో తాలిబన్లు, తమ నాయకుడు ముల్లా ఒమర్ ఆదేశానుసారం ధ్వంసం చేసారు. బమియాన్ హిందూకుష్ పర్వతాల గుండా సాగిపోయే సిల్కు రోడ్డులో ఉంది. చారిత్రికంగా సిల్కు రోడ్డు చైనాను పాశ్చాత్య దేశాలతో కలిపే బిడారు వర్తకుల మార్గం. బమియాన్ అనేక బౌద్ధారామాలు వెలసిన ప్రదేశం. ఆధ్యాత్మికత, తాత్వికత, కళలూ విలసిల్లిన స్థలం. బమియాన్ కొండల్లో తొలిచిన గుహల్లో బౌద్ధ సన్యాసులు నివసించేవారు. సన్యాసులు ఈ గుహలను విగ్రహాలతో రంగురంగుల కుడ్య చిత్రాలతో అలంకరించేవారు. రెండవ శతాబ్ది నుండి 7 వ శతాబ్దిలో ఇస్లామిక దండయాత్రల వరకూ అది బౌద్ధ ఆధ్యాత్మిక స్థలంగా ఉండేది. 9 వ శతాబ్దిలో పూర్తిగా ముస్లిముల ఆక్రమణలోకి వెళ్ళేవరకూ బమియాన్‌లో గాంధార సంస్కృతి విలసిల్లింది.

(ఇంకా…)