వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 09వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమం

భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమం, క్షిపణి దాడుల నుండి దేశాన్ని రక్షించే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ. పాకిస్తాన్ నుండి ఎదురౌతున్న క్షిపణి ముప్పును ఎదుర్కొనేందుకు ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలో రెండు నిరోధక క్షిపణులు ఉన్నాయి. అవి, అధిక ఎత్తులలో అడ్డుకునేందుకు పనిచేసే పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD) క్షిపణి, తక్కువ ఎత్తులలో పనిచేసే అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD) క్షిపణి. 5,000 కి.మీ. దూరం నుండి ప్రయోగించిన ఏ క్షిపణినైనా నిలువరించగల సామర్థ్యం ఈ రెండంచెల వ్యవస్థకు కలదు. 2006 నవంబరులో PAD ని పరీక్షించారు. 2007 డిసెంబరులో AAD ని పరీక్షించారు. PAD ని పరీక్షించడంతో, బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్న నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్లు మిగిలిన మూడు దేశాలు. ఈ వ్యవస్థ చాలా పరీక్షలకు లోనయ్యింది. దీన్ని అధికారికంగా ప్రారంభించవలసి ఉంది. 1990 ల తొలినాళ్ళ నుండి భారత్, పాకిస్తాన్ నుండి క్షిపణి దాడి ముప్పును ఎదుర్కొంటోంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు తోడు, పాకిస్తాన్ చైనానుండి కొన్న ఎమ్-11 క్షిపణులను మోహరించడంతో భారత్ 1995 ఆగస్టులో రష్యా నుండి 6 బ్యాటరీల S-300 భూమి-నుండి-గాలిలోకి పేల్చగలిగే క్షిపణులను కొనుగోలు చేసింది. ఢిల్లీ, ఇతర నగరాల రక్షణకు ఈ క్షిపణులను మోహరించింది. 1998 మేలో భారత్ తన రెండవ అణ్వస్త్ర పరీక్షను నిర్వహించింది.

(ఇంకా…)