Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 08వ వారం

వికీపీడియా నుండి

అల్లూరి సీతారామరాజు (సినిమా)

అల్లూరి సీతారామరాజు ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974లో విడుదలైన తెలుగు సినిమా. ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్. సినిమాలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించారు. సినిమాలో కొంతభాగానికి వి. రామచంద్రరావు దర్శకత్వం వహించి మరణించగా, కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పూర్తిచేశారు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా నిర్మించేందుకు నందమూరి తారక రామారావు స్క్రిప్ట్ రాయించుకుని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు అల్లూరి పాత్రలో సినిమా తీయాలని కూడా విఫల యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకుని స్క్రిప్టును త్రిపురనేని ని మహారథితో రాయించుకుని కృష్ణ తెరకెక్కించారు. చిత్ర కథ ప్రకారం బ్రిటీష్ పరిపాలన పట్ల చిన్ననాటి నుంచీ వ్యతిరేకత పెంచుకున్న రామరాజు దేశాటన చేసి ప్రజల కష్టాలు, పోరాటాలు తెలుసుకుంటాడు. సీత అనే అమ్మాయిని ప్రేమించి, దేశసేవ కోసం పెళ్ళి చేసుకోకపోవడంతో ఆమె మరణించగా ఆమె పేరులోని సీతను స్వీకరించి సీతారామరాజు అవుతాడు. ఆపైన మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా సీతారామరాజు నేతృత్వంలో, గంటందొర, మల్లుదొర వంటి స్థానిక వీరుల మద్దతుతో ప్రజా విప్లవం ప్రారంభమవుతుంది.


(ఇంకా…)