Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 16వ వారం

వికీపీడియా నుండి

మంచుమనిషి

సామాన్య శక పూర్వం 3,359 - 3,105 సంవత్సరాల మధ్య నివసించిన పురుషుని యొక్క మమ్మీ, మంచుమనిషి. ఇది ప్రకృతి సహజంగా తయారైన మమ్మీ. 1991 సెప్టెంబరులో, ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో, ఆస్ట్రియా, ఇటలీల సరిహద్దు వద్ద ఈ మమ్మీని కనుగొన్నారు. ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో లభించింది కాబట్టి ఈ మమ్మీని ఈట్జి అని కూడా పిలుస్తున్నారు. ఈ వ్యక్తి సా.శ.పూ 3,239 - 3,105 సంవత్సరాల మధ్య మరణించి ఉండేందుకు 66 శాతం అవకాశాలున్నాయి. ఇది ఐరోపాకు చెందిన, అత్యంత పురాతన, ప్రకృతి సహజ మమ్మీ. రాగియుగపు యూరపియన్ల గురించి పరిశోధకులకు అంతకుముందు తెలియని సమాచారం ఈ మమ్మీ ద్వారా లభించింది. అతడి దేహాన్ని, వస్తువులనూ ఇటలీ, దక్షిణ టైరోల్ లోని పురావస్తు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు. వివిధ శాస్త్ర విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు దేహంపై అనేక పరీక్షలు చేసి తాము కనుగొన్న విషయాలను విశ్లేషించారు. చనిపోయినపుడు ఆ వ్యక్తి వయసు, అతడి జీవన శైలి, వృత్తి, అతడి ఆహారపు అలవాట్లు, చనిపోయేముందు అతడు ఏమి తిన్నాడు, ఎన్ని గంటల ముందు తిన్నాడు వంటి అనేక అంశాలను వెలుగులోకి తెచ్చారు. అతడి మరణ కారణంపై శాస్త్రవేత్తలకు భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ, అతడిది హింసాత్మక మరణమనే విషయంపై స్థూలంగా ఏకాభిప్రాయం ఉంది. 1991 సెప్టెంబరు 19 న ఆల్ప్స్ పర్వతాల్లో 3,210 మీటర్ల ఎత్తున ఇద్దరు జర్మను యాత్రికులు హెల్ముట్ సైమన్, ఎరికా సైమన్‌లకు ఆస్ట్రియా-ఇటలీ సరిహద్దులోని ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో తూర్పు శిఖరం పైన ఈ మమ్మీ కనబడింది.

(ఇంకా…)