వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 25వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రత్నం బాల్ పెన్ వర్క్స్
రత్నం పెన్ భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఫౌంటెన్ పెన్. 1930 లో రాజమండ్రిలో ఫౌంటెన్ పెన్‌లు తయారు చెయ్యడం ప్రారంభించిన రత్నం పెన్ వర్క్స్ నేటికీ కలాలు తయారు చేస్తోంది. 80 ఏళ్ళ పైచిలుకు ప్రస్థానంలో అనేక ప్రశంసలు అందుకుంది. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో పెన్నుల రంగంలో అడుగుపెట్టి, అలనాడు గాంధీజీ ప్రశంసలు అందుకున్న రత్నంపెన్ ఇప్పుడు మూడవ తరం భాగస్వామ్యంతో రత్నంపెన్, రత్నం బాల్ పెన్ వర్క్స్‌గా విరాజిల్లుతోంది. స్వాతంత్ర్య పోరాటంలో స్వదేశీ స్ఫూర్తిని జీర్ణించుకుని ఎన్నో కార్యక్రమాలకు వేదికగా నిలిచిన రాజమండ్రి నగరంలో 'కలం' పరిశ్రమకు రత్నం పెన్ వర్క్స్ నాంది పలికింది. ఎందరో ప్రముఖులు ఈ సంస్థను సందర్శించి ముగ్దులయ్యారు. స్వాతంత్ర్య సమర స్ఫూర్తితో స్వదేశీ నినాదానికి వేదికగా నిలిచిన ఈ సంస్థ 85 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కె.వి.రత్నం బ్రదర్స్ పేరిట స్వర్గీయ కోసూరి వెంకటరత్నం నెలకొల్పిన రత్నం పెన్స్ సంస్థ రత్నం గారి హయాంలోనే రత్నం పెన్ వర్క్స్, రత్నం బాల్‌పెన్ వర్క్స్ గా విడివడింది. ప్రస్తుతం రెండు సంస్థలూ వ్యాపారంలో విరాజిల్లుతున్నాయి. దేశ విదేశాలలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న 'రత్నం పెన్' ఆవిర్భావం వెనుక మహాత్మాగాంధీ ప్రేరణ ఉంది. 1921లో వార్ధాలో కె.వి.రత్నంగారు కలసికొని, హితి బ్లాక్ డైస్ (నగలకు సంబంధించి) తయారు చేసి గాంధిజీకి చూపించారు. త్వరలో విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వబోతున్నామని, అందుచేత సామాన్యులకు ఉపయోగపడే వస్తువు తయారు చేయాలని గాంధీజీ చెప్పడంతో, అయితే ఏ వస్తువు తయారుచేయాలో చెప్పాలని రత్నంగారు అడగడం, పిన్ నుంచి పెన్ వరకు ఏదైనా తయారు చేయవచ్చని గాంధిజీ సూచించడంతో, పెన్ తయారీకే రత్నంగారు మొగ్గు చూపారు. 1930 లో పెన్నుల తయారీ ప్రారభించారు. 14 కేరట్ల బంగారు పాళీలు రూపొందించి, ఇంగ్లాండ్ నుంచి ఇరేడియం పాయింట్లు రప్పించి, పెన్నులు తయారు చేసారు.
(ఇంకా…)