వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 11వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్డిపిథెకస్
ఆర్డిపిథెకస్ హోమినినే ఉపకుటుంబానికి చెందిన, అంతరించిపోయిన ప్రజాతి. ఇది అంత్య మయోసీన్‌లోను, తొలి ప్లియోసీన్ లోనూ ఇథియోపియా లోని అఫార్ ప్రాంతంలో జీవించింది. చింపాంజీల నుండి మానవులు వేరుపడిన తరువాత, వారి తొట్టతొలి పూర్వీకులలో ఒకటిగా దీన్ని భావించారు. ఈ ప్రజాతికి మానవ పూర్వీకులతో ఉన్న సంబంధం ఏమిటి, ఇది హోమినిన్నేనా కాదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఈ ప్రజాతికి చెందిన రెండు శిలాజ జాతులను - 44 లక్షల సంవత్సరాల క్రితం తొలి ప్లయోసీన్‌లో నివసించిన ఆర్డిపిథెకస్ రామిడస్, సుమారు 56 లక్షల సంవత్సరాల క్రితం నివసించిన ఆర్డిపిథెకస్ కడబ్బా (అంత్య మయోసీన్లో) లను - శాస్త్ర సాహిత్యంలో వివరించారు. ప్రవర్తనా విశ్లేషణను బట్టి ఆర్డిపిథెకస్‌కు చింపాంజీలతో చాలా దగ్గరి పోలికలున్నాయి. తొలి కాలపు మానవ పూర్వీకులు, ప్రవర్తనలో చింపాంజీలా ఉండేవారని ఇది సూచిస్తుంది. ఎ. రామిడస్ కు1994 సెప్టెంబరులో ఈ పేరు పెట్టారు. రెండు అగ్నిపర్వత లావా పొరల మధ్య దొరకడం వలన వాటి కాలనిర్ణయం ఆధారంగా మొదటి శిలాజం 44 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. ఆర్డిపిథెకస్ రామిడస్ అనే పేరు అఫర్ భాష నుండి వచ్చింది, దీనిలో ఆర్డి అంటే "నేల" అని రామిడ్ అంటే "వేరు" అని అర్థం. పిథెకస్ అంటే గ్రీకు భాషలో "కోతి" అని అర్థం.
(ఇంకా…)