ఆర్డిపిథెకస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆర్డిపిథెకస్
కాల విస్తరణ: Late Miocene - Early Pliocene, 5.77–4.4 Ma
ఆర్డిపిథెకస్ రామిడస్ స్పెసిమెన్, ఆర్డి అని పేరు పెట్టారు.
శాస్త్రీయ వర్గీకరణ e
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Mammalia
Order: Primates
Suborder: Haplorhini
Infraorder: Simiiformes
Family: Hominidae
Subfamily: Homininae
Tribe: Hominini
Subtribe: Hominina
Genus: Ardipithecus
టిమ్ వైట్ తది, 1995
Species

ఆర్డిపిథెకస్ కడబ్బా
ఆర్డిపిథెకస్ రామిడస్

ఆర్డిపిథెకస్, హోమినినే ఉపకుటుంబానికి చెందిన, అంతరించిపోయిన ప్రజాతి. ఇది అంత్య మయోసీన్‌లోను, తొలి ప్లియోసీన్ లోనూ ఇథియోపియా లోని అఫార్ ప్రాంతంలో జీవించింది. చింపాంజీల నుండి మానవులు వేరుపడిన తరువాత, వారి తొట్టతొలి పూర్వీకులలో ఒకటిగా దీన్ని భావించారు. ఈ ప్రజాతికి మానవ పూర్వీకులతో ఉన్న సంబంధం ఏమిటి, ఇది హోమినిన్నేనా కాదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.[1] ఈ ప్రజాతికి చెందిన రెండు శిలాజ జాతులను - 44 లక్షల సంవత్సరాల క్రితం తొలి ప్లయోసీన్‌లో నివసించిన ఆర్డిపిథెకస్ రామిడస్, [2] సుమారు 56 లక్షల సంవత్సరాల క్రితం నివసించిన ఆర్డిపిథెకస్ కడబ్బా (అంత్య మయోసీన్లో) లను - శాస్త్ర సాహిత్యంలో వివరించారు. [3] ప్రవర్తనా విశ్లేషణను బట్టి ఆర్డిపిథెకస్‌కు చింపాంజీలతో చాలా దగ్గరి పోలికలున్నాయి. తొలి కాలపు మానవ పూర్వీకులు, ప్రవర్తనలో బాగా చింపాంజీలా ఉండేవారని ఇది సూచిస్తుంది.

ఆర్డిపిథెకస్ రామిడస్

[మార్చు]

ఎ. రామిడస్ కు1994 సెప్టెంబరులో ఈ పేరు పెట్టారు. రెండు అగ్నిపర్వత లావా పొరల మధ్య దొరకడం వలన వాటి కాలనిర్ణయం ఆధారంగా మొదటి శిలాజం 44 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. [4] ఆర్డిపిథెకస్ రామిడస్ అనే పేరు అఫర్ భాష నుండి వచ్చింది, దీనిలో ఆర్డి అంటే "నేల" అని రామిడ్ అంటే "వేరు" అని అర్థం. పిథెకస్ అంటే గ్రీకు భాషలో "కోతి" అని అర్థం. [5]

చాలా హోమినిడ్ల మాదిరిగానూ, కానీ గతంలో గుర్తించిన ఏ హోమినిన్ లోనూ లేని విధంగానూ, చెట్లపై చరించేందుకు వీలుగా దీనికి పట్టు బిగించగల బొటన వేలు ఉంది. నేలపై రెండు కాళ్ళపై నడిచేదని చెప్పే అంశాలు దాని అస్థిపంజరంలో ఏమైనా ఉన్నాయా అనేది నిర్ధారణ కాలేదు. తరువాతి హోమినిన్ల మాదిరిగా, ఆర్డిపిథెకస్ లో కోర పళ్ళు తగ్గాయి.

1992-1993లో టిమ్ వైట్ నేతృత్వంలోని ఒక పరిశోధనా బృందం ఇథియోపియాలోని మిడిల్ ఆవాష్ నదీ లోయలోని అఫర్ డిప్రెషన్ లో మొదటి ఎ. రామిడస్ శిలాజాలను - పుర్రె, దవడ, పళ్ళు, చేయి ఎముకలతో సహా పదిహేడు శకలాలను - కనుగొంది. 1994 లో మరిన్ని శకలాలను వెలికి తీసారు. మొత్తం అస్థిపంజరంలో 45% వరకూ దొరికింది. ఈ శిలాజాన్ని మొదట ఆస్ట్రలోపిథెకస్ జాతిగా వర్ణించారు. కాని, దాని పేరు ఆర్డిపిథెకస్ అనే కొత్త ప్రజాతికి మారుస్తూ తరువాత అదే పత్రికలో వైట్, అతని సహచరులు ఒక సవరణ ఇచ్చారు. 1999, 2003 ల మధ్య, అఫార్ ప్రాంతం లోని గోనా పశ్చిమ హద్దులోని ఆస్ డుమా వద్ద సిలేషి సెమావ్ నేతృత్వంలోని ఒక మల్టీడిసిప్లినరీ బృందం తొమ్మిది ఎ. రామిడస్ జీవులకు చెందిన ఎముకలు, దంతాలను కనుగొంది. [6] ఈ శిలాజాలు 43.5, 44.5 లక్షల సంవత్సరాల క్రితం మధ్యవి అని తేలింది. [7]

శిలాజాలు కనిపించిన స్థలాలను చూపించే మ్యాప్.

ఆర్డిపిథెకస్ రామిడస్ మెదడు చిన్నది. ఇది 300 సెం.మీ.3 కు 350 సెం.మీ.3 కూ మధ్య ఉంది. ఇది ఆధునిక బోనోబో లేదా ఆడ చింపాంజీ మెదడు కంటే కొంచెం చిన్నది. లూసీ (~ 400 నుండి 550 సెం.మీ.3 వరకు) వంటి ఆస్ట్రలోపిథెసిన్‌ల మెదడు కంటే చాలా చిన్నది. ఆధునిక హోమో సేపియన్స్ మెదడు పరిమాణంలో సుమారుగా ఐదో వంతు. సాధారణ చింపాంజీలకు ఉన్నట్లుగా దీని దవడ చాలా ముందుకు పొడుచుకు వచ్చి ఉంటుంది. [8]

ఎ. రామిడస్ దంతాలలో ఇతర వాలిడుల కుండే ప్రత్యేకాహారం తీసుకున్న గుర్తులేమీ లేవు. ఇది ఉభయాహారి (మాంసాహారి, శాకాహారి). ఫలాహారి కూడా. ఆకులు, పీచు పదార్థం (వేర్లు, దుంపలు మొదలైనవి) గాని, గట్టి, రాపిడి ఆహారం గానీ ఏ ఒక్కదానిపైనా ఎక్కువగా ఆధారపడి ఉండేది కాదు. ఎ. రామిడస్ మగవారి లోని పై రదనికల (కోర పళ్ళు) పరిమాణం ఆడవారి కంటే భిన్నంగా ఏమీ లేదు. ఆధునిక రదనికల పరిమాణం తగ్గినందున వాటి పైకోరలు ఆధునిక చింపాంజీల పళ్ళ కన్నా తక్కువ పదునైనవి. ఎందుకంటే పెద్దగా ఉన్న ఎగువ కోరలు దిగువ దంతాలకు రాచుకుని అరిగి పదునెక్కుతాయి. ఎ. రామిడస్‌లో సాధారణ చింపాంజీలలో గమనించిన లైంగిక డైమోర్ఫిజం కంటే విభిన్నంగా ఉంది. చింపాజీల్లో మగవాటికి ఆడవాటి కంటే పెద్ద, పదునైన ఎగువ రదనికలు ఉంటాయి. [9]

ఎ. రామిడస్‌లో పై కోరపళ్ళు చిన్నగా ఉండడాన్ని బట్టి, ఈ జాతిలోను, ఇతర పూర్వ హోమినిడ్ల లోనూ సామాజిక ప్రవర్తన ఎలా ఉండేదో ఊహించారు. ప్రత్యేకించి, హోమినిడ్లు, ఆఫ్రికా వాలిడుల చివరి సాధారణ పూర్వీకుల్లో మగవారి మధ్య, సమూహాల మధ్యా ఘర్షణలు పెద్దగా ఉండేవి కావు. సాధారణ చింపాంజీలలో నైతే ఈ ఘర్షణలు చాలా ఎక్కువగా జరుగుతాయి. దీని వలన, పూర్వీకుల హోమినిడ్ల ప్రవర్తనకు నమూనాగా ప్రస్తుతం ఉనికిలో ఉన్న చింపాంజీని తీసుకోవడం అంత ఉచితం కాదు అని 2009 లో జరిపిన ఒక అధ్యయనంలో పరిశోధకులు చెప్పారు. [9]

ఎ. రామిడస్ మానవులు, చింపాంజీల (సిఎల్‌సిఎ లేదా పాన్ - హోమో ఎల్‌సిఎ) ఇటీవలి ఉమ్మడి పూర్వీకుల కంటే తరువాత జీవించింది. అందువల్ల ఇది ఆ ఉమ్మడి పూర్వీకులకు సంపూర్ణమైన ప్రతినిధి కాజాలదు. అయితే, కొన్ని కోణాల్లో ఇది చింపాంజీల కంటే భిన్నంగా ఉంది. ఉమ్మడి పూర్వీకుడు ఆధునిక చింపాంజీ కంటే భిన్నంగా ఉండేదని ఇది సూచిస్తోంది. చింపాంజీ, మానవ వంశాలు వేరుపడిన తరువాత, రెండూ కూడా గణనీయమైన పరిణామాలకు లోనయ్యాయి. చింపాంజీ పాదాలు చెట్లను పట్టుకోవటానికి వీలుగా ప్రత్యేకతలు సంపాదించగా; ఎ. రామిడస్ పాదాలు నడిచేందుకు వీలుగా మారాయి.ఎ. రామిడస్ కోరపళ్ళు చిన్నవి. మగ, ఆడ లకు ఒకే పరిమాణంలో ఉంటాయి. మగ-మగ సంఘర్షణలు తక్కువగా ఉండేవని, జంటల మధ్య అనుబంధం ఎక్కువగా ఉండేదనీ, తల్లిదండ్రుల పోషణ ఎక్కువగా ఉండేదనీ ఇవి సూచిస్తున్నాయి. "అందువల్ల, మెదడు పరిమాణం పెరగడాని కంటే, రాతి పనిముట్లను ఉపయోగించడాని కంటే చాలా ముందే హోమినిడ్లలో ప్రాథమిక పునరుత్పత్తి లోను, సామాజిక ప్రవర్తన లోనూ మార్పులు సంభవించాయి" అని పరిశోధన బృందం తేల్చింది. [3]

ఆర్డి

[మార్చు]

1994 లో మొట్టమొదట కనుగొన్న ఎ. రామిడస్ శిలాజ అస్థిపంజరం ఆవిష్కరణను 2009 అక్టోబరు 1 న పాలియోంటాలజిస్టులు అధికారికంగా ప్రకటించారు. ఈ శిలాజం చిన్నపాటి మెదడు కలిగిన, 50 కిలోగ్రాముల బరువున్న ఆడ జీవి అవశేషాలు. దానికి "ఆర్డి" అనే పేరు పెట్టారు. అవశేషాల్లో పుర్రె, దంతాలు, కటి, చేతులు, పాదాలూ ఉన్నాయి. [10] ఇథియోపియా లోని అఫార్ ఎడారిలో, మధ్య ఆవాష్ ప్రాంతంలోని అరామిస్ అనే స్థలంలో దీన్ని కనుగొన్నారు. ఈ అవశేషాలను కప్పేసిన అగ్నిపర్వత బూడిద పొరలను రేడియోమెట్రిక్ డేటింగ్ చేయగా, ఆర్డి సుమారు 43-45 లక్షల సంవత్సరాల క్రితం నివసించినట్లు తెలిసింది. అయితే ఈ తేదీని ఇతరులు సందేహించారు. ఆర్డి దొరికిన ప్రాంతాన్ని రేడియోమెట్రిక్‌గా డేటింగ్ చేయడం కష్టమని ఫ్లీగల్, కప్పెల్మాన్ లు చెబుతూ, ఆర్డి 39 లక్షల సంవత్సరాల నాటిదని వాదించారు. [11]

32 లక్షల సంవత్సరాల క్రితం నివసించిన లూసీ (ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్) కంటే పది లక్షల సంవత్సరాల పైచిలుకు ముందు కాలానికి చెందిన ఆర్డి, మానవ పరిణామం లోని ఈ కాలంపై వెలుగు ప్రసరింపజేస్తుందని దాని తొలి వ్యాఖ్యాతలు చెప్పారు. అయితే, "ఆర్డి" అస్థిపంజరం ఆస్ట్రలోపిథెకస్ కు చెందిన తొలి శిలాజాల వయస్సు కంటే మహా అయితే 2,00,000 సంవత్సరాలు ముందుదై ఉంటుంది. లేదా, అసలు దాని తరువాతది అయినా అయి ఉండవచ్చు. [11] ఈ కారణాన ఆర్డి, ఆస్ట్రలోపిథెకస్ యొక్క ప్రత్యక్ష పూర్వీకుడు కావచ్చనే విషయాన్ని కొందరు పరిశోధకులు సందేహించారు.

ఆర్డి కటి, అవయవాలను బట్టి అది నేలపై రెండు కాళ్ల పైనా, చెట్ల కొమ్మలపై నాలుగు కాళ్ల పైనా చరించేదని అభిప్రాయ పడ్డారు. [3][12] [13] ఎ. రామిడస్‌ నడక సామర్థ్యం, దాని తరువాతి హోమినిడ్ల కంటే ఆదిమ స్థాయిలో ఉంది; ఎక్కువ దూరం నడవడం, పరుగెత్తడం చెయ్యలేక పోయేది. [14] శాక, మాంసాలు రెంటినీ తినేదని దీని దంతాలు సూచిస్తున్నాయి.

అర్డిపిథెకస్ కడబ్బా

[మార్చు]
ఆర్డిపిథెకస్ కడబ్బా శిలాజాలు

ఆర్డిపిథెకస్ కడబ్బా గురించి దాని "దంతాలు, అస్థిపంజరంలోని చిన్నా చితకా ఎముకలను బట్టి మాత్రమే తెలుసు". [10] ఇది సుమారు 56 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని అంచనా వేసారు. [3] ఇది A. రామిడస్ కు పూర్వీకుడై ఉండవచ్చని వివరించారు. మొదట్లో దీన్ని ఎ. రామిడస్ కు ఉపజాతిగా పరిగణించినప్పటికీ, 2004 లో ఇథియోపియా లో కొత్తగా కనుగొన్న దంతాల ఆధారంగా మానవ శాస్త్రవేత్తలు యోహన్నెస్ హైల్-సెలాసీ, జనరల్ సువా, టిమ్ డి. వైట్ లు ఎ. కడబ్బాను ఒక జాతిగా గుర్తించాలనే వ్యాసాన్ని ప్రచురించారు. పళ్ళ ఆదిమ ఆకృతిని, వాటి అరుగుదలనూ గమనిస్తే ఎ. కడబ్బా ఒక ప్రత్యేక జాతి అని తెలుస్తుందని వారు అన్నారు. [15]

కడబ్బా అనే పేరు "కుటుంబపు ప్రాథమిక పూర్వీకుడు" అనే అఫార్ పదం నుండి వచ్చింది. [16]

జీవన విధానం

[మార్చు]

ఎ. రామిడస్ బొటనవేలు, కటి నిర్మాణాన్ని బట్టి, ఈ జీవి నిటారుగా నడిచిందని కొంతమంది పరిశోధకులు సూచించారు. [6]

గోనా ప్రాజెక్టు లోని భౌతిక మానవ శాస్త్రవేత్త స్కాట్ సింప్సన్, మధ్య ఆవాష్ లో దొరికిన శిలాజ ఆధారాలను బట్టి ఎ. కడబ్బా, ఎ. రామిడస్ లు చెరువులు, దొరువులు, నీటి చెలమలూ ఉన్న చిట్టడవులు, గడ్డిభూములూ గల ప్రాంతంలో నివసించాయని చెబుతూ, వీటిలోఎలాంటి ఆవాసమంటే ఆర్డిపిథెకస్ ఎక్కువ ఇష్టపడేదో తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం అని పేర్కొన్నాడు. [6]

ఇతర అభిప్రాయాలు, తదుపరి అధ్యయనాలు

[మార్చు]

చింపాంజీల కుండే అనేక లక్షణాలు ఉండడం, వాలిడుల (తోక లేని కోతులు - ఏప్స్) నుండి వేరుపడిన కాలానికి దగ్గరగా ఉండడం, శిలాజాలు అసంపూర్ణంగా ఉండడం మొదలైన కారణాల వలన శిలాజాల రికార్డులో ఆర్డిపిథెకస్ ఖచ్చితమైన స్థానం ఏంటనేది వివాదాస్పదంగా ఉంది. [17] న్యూ జెర్సీలో హ్యూమన్ ఎవల్యూషన్ ఫౌండేషనుకు చెందిన ఎస్టెబాన్ ఇ. సార్మియెంటో అనే స్వతంత్ర పరిశోధకుడు ఆర్డిపిథెకస్ శిలాజాలను, వాలిడుల లక్షణాలనూ 2010 లో పోల్చి చూసాడు. ఒక ప్రత్యేక మానవ వంశం అని చెప్పేందుకు ఈ డేటా సరిపోదని చెప్పాడు. ఆర్డిపిథెకస్‌లో మానవులకే ప్రత్యేకమైన లక్షణాలేమీ లేవని అతడు చెప్పాడు. దాని లోని కొన్ని లక్షణాలను (మణికట్టు, క్రేనియం లోనివి) బట్టి చూస్తే, మానవులు, చింపాంజీల ఉమ్మడి పూర్వీకులు గొరిల్లా నుండి వేరుపడక ముందే అది మానవ జాతుల నుండి వేరుపడినట్లు తెలుస్తోందని చెప్పాడు. [18] నములు దంతాలు, శరీరంగాల కొలతలను అధ్యయనం చేసాక, 2011 లో పొట్టిగా ఉన్న చేతులు, మెటాకార్పల్స్‌తో సహా కొన్ని కొలతలు మానవులను పోలి ఉన్నాయని చెప్పాడు. పొడవాటి వేళ్ళ వంటివి గొప్ప వాలిడులను (గొప్ప కోతులు - హోమినిడ్లు) పోలి ఉన్నాయి. అటువంటి కొలతలు పరిణామ క్రమంలో పెరగడం తరగడం జరుగుతూనే ఉంటుందని, సంబంధాలను నిరూపించేందుకు అవి సరైన సూచికలు కావనీ సార్మియెంటో చెప్పాడు. అయితే, ఆర్డిపిథెకస్ పొడవుల కొలతలు మాత్రం, దాని పనితీరుకు మంచి సూచికలే. ఈ కొలతలతో పాటు, దంతాల ఐసోటోప్ డేటా, శిలాజ స్థలాల వద్ద ఉండే వృక్ష, జంతుజాలాల డేటా మొదలైనవాటిని బట్టి ఆర్డిపిథెకస్ ప్రధానంగా నేలపై చరించిన నాలుగు కాళ్ళ జీవి అని, దాని ఆహారంలో ఎక్కువ భాగాన్ని నేలపైనుండే సేకరించేదనీ తెలుస్తోంది. చెట్లపై దీని చలనాలు పరిమితం గానే ఉండేవి. ముందరి అవయవాలతో కొమ్మలు పట్టుకుని వేలాడడం చాలా అరుదుగా ఉండేది. [19]

అయితే, ఆర్డిపిథెకస్‌ను మానవ వంశంలోకి చేర్చాలనే వాదనలు ఇంకా ఉన్నాయి. 2013 లో ఆధునిక, శిలాజాల పళ్ళపై ఉండే పింగాణీ లోని కార్బన్ పైన, ఆక్సిజన్ స్థిర ఐసోటోపుల పైనా తులనాత్మక అధ్యయనం చేసినపుడు , ఆర్డిపిథెకస్ చెట్లపైన, నేలపైన కూడా తినేదని తేలింది. చింపాజీలు, శివాపిథెకస్ లు ఇలా తినేవి కావు. తద్వారా ఆర్డిపిథెకస్ ఇతర వాలిడుల కంటే భిన్నంగా ఉండేదని తెలుస్తోంది. [20] ఆర్డిపిథెకస్, ఆస్ట్రలోపిథెకస్ సెడీబా, ఎ. అఫారెన్సిస్ ల చేతి ఎముకల్లో ప్రత్యేకమైన మానవ-వంశ లక్షణాలు ఉన్నాయని 2014 లో తెలిసింది. (ఇది మూడవ మెటాకార్పాల్ స్టైలాయిడ్ ప్రక్రియ. ఇది ఇతర కోతి వంశాలలో లేదు). [21] ఆర్డిపిథెకస్ మెదడులో ఉన్న కొన్ని ప్రత్యేక నిర్మాణాలు, కేవలం ఆస్ట్రలోపిథెకస్, హోమో క్లేడ్‌లో మాత్రమే కనిపిస్తాయి. [22] దంతాల మూల స్వరూపాలు సహెలాంత్రోపస్ చాడెన్సిస్‌తో బాగా సరిపోలి ఉండడం కూడా [23] మానవ వంశంలో దాన్ని చేర్చడం సరైనదేనని సూచిస్తోంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Stanford, Craig B. (2012-09-24). "Chimpanzees and the Behavior of Ardipithecus ramidus". Annual Review of Anthropology. 41 (1): 139–149. doi:10.1146/annurev-anthro-092611-145724. ISSN 0084-6570. Archived from the original on 2019-06-19. Retrieved 2020-09-09.
 2. Perlman, David (July 12, 2001). "Fossils From Ethiopia May Be Earliest Human Ancestor". National Geographic News. Retrieved March 18, 2017.
 3. 3.0 3.1 3.2 3.3 White, T. D.; Asfaw, B.; Beyene, Y.; Haile-Selassie, Y.; Lovejoy, C. O.; Suwa, G.; Woldegabriel, G. (2009). "Ardipithecus ramidus and the Paleobiology of Early Hominids". Science. 326 (5949): 75–86. Bibcode:2009Sci...326...75W. doi:10.1126/science.1175802.
 4. White, Tim D.; Suwa, Gen; Asfaw, Berhane (1994). "Australopithecus ramidus, a new species of early hominid from Aramis, Ethiopia". Nature. 371 (6495): 306–12. Bibcode:1994Natur.371..306W. doi:10.1038/371306a0.
 5. Tyson, Peter (October 2009). "NOVA, Aliens from Earth: Who's who in human evolution". PBS. Retrieved 2009-10-08.
 6. 6.0 6.1 6.2 "New Fossil Hominids of Ardipithecus ramidus from Gona, Afar, Ethiopia". Archived from the original on 2008-06-24. Retrieved 2009-01-30.
 7. "Anthropologists find 4.5 million-year-old hominid fossils in Ethiopia". Retrieved March 18, 2017.
 8. Suwa, G.; Asfaw, B.; Kono, R. T.; Kubo, D.; Lovejoy, C. O.; White, T. D. (2009). "The Ardipithecus ramidus Skull and Its Implications for Hominid Origins" (PDF). Science. 326 (5949): 68e1–7. Bibcode:2009Sci...326...68S. doi:10.1126/science.1175825. Archived from the original (PDF) on 2017-09-22. Retrieved 2019-12-07.
 9. 9.0 9.1 Suwa, G.; Kono, R. T.; Simpson, S. W.; Asfaw, B.; Lovejoy, C. O.; White, T. D. (2009). "Paleobiological Implications of the Ardipithecus ramidus Dentition" (PDF). Science. 326 (5949): 94–9. Bibcode:2009Sci...326...94S. doi:10.1126/science.1175824. Archived from the original (PDF) on 2017-09-21. Retrieved 2019-12-07.
 10. 10.0 10.1 Gibbons, A. (2009). "A New Kind of Ancestor: Ardipithecus Unveiled" (PDF). Science. 326 (5949): 36–40. Bibcode:2009Sci...326...36G. doi:10.1126/science.326_36. Archived from the original (PDF) on 2018-07-22. Retrieved 2019-12-07.
 11. 11.0 11.1 Kappelman, John; Fleagle, John G. (1995). "Age of early hominids". Nature. 376 (6541): 558–559. Bibcode:1995Natur.376..558K. doi:10.1038/376558b0.
 12. Shreeve, Jamie (2009-10-01). "Oldest Skeleton of Human Ancestor Found". National Geographic magazine. Retrieved March 18, 2017.
 13. Gibbons, Ann. "Ancient Skeleton May Rewrite Earliest Chapter of Human Evolution". Science magazine. Retrieved March 18, 2017.
 14. Amos, Jonathan (October 1, 2009). "Fossil finds extend human story". BBC News.
 15. Haile-Selassie, Y.; Suwa, Gen; White, Tim D. (2004). "Late Miocene Teeth from Middle Awash, Ethiopia, and Early Hominid Dental Evolution". Science. 303 (5663): 1503–5. Bibcode:2004Sci...303.1503H. doi:10.1126/science.1092978.
 16. Ellis, Richard (2004). No Turning Back: The Life and Death of Animal Species. New York: Harper Perennial. pp. 92. ISBN 978-0-06-055804-8.
 17. Wood, Bernard; Harrison, Terry (2011). "The evolutionary context of the first hominins". Nature. 470 (7334): 347–35. Bibcode:2011Natur.470..347W. doi:10.1038/nature09709.
 18. Sarmiento, E. E. (2010). "Comment on the Paleobiology and Classification of Ardipithecus ramidus". Science. 328 (5982): 1105, author reply 1105. Bibcode:2010Sci...328.1105S. doi:10.1126/science.1184148.
 19. Sarmiento, E.E.; Meldrum, D.J. (2011). "Behavioral and phylogenetic implications of a narrow allometric study of Ardipithecus ramidus". HOMO. 62 (2): 75–108. doi:10.1016/j.jchb.2011.01.003.
 20. Nelson, S. V. (2013). "Chimpanzee fauna isotopes provide new interpretations of fossil ape and hominin ecologies". Proceedings of the Royal Society B: Biological Sciences. 280 (1773): 20132324. doi:10.1098/rspb.2013.2324.
 21. Ward, C. V.; Tocheri, M. W.; Plavcan, J. M.; Brown, F. H.; Manthi, F. K. (2013). "Early Pleistocene third metacarpal from Kenya and the evolution of modern human-like hand morphology". Proceedings of the National Academy of Sciences. 111 (1): 121–4. Bibcode:2014PNAS..111..121W. doi:10.1073/pnas.1316014110.
 22. Kimbel, W. H.; Suwa, G.; Asfaw, B.; Rak, Y.; White, T. D. (2014). "Ardipithecus ramidus and the evolution of the human cranial base". Proceedings of the National Academy of Sciences. 111 (3): 948–53. Bibcode:2014PNAS..111..948K. doi:10.1073/pnas.1322639111.
 23. Emonet, Edouard-Georges; Andossa, Likius; Taïsso Mackaye, Hassane; Brunet, Michel (2014). "Subocclusal dental morphology of sahelanthropus tchadensis and the evolution of teeth in hominins". American Journal of Physical Anthropology. 153 (1): 116–23. doi:10.1002/ajpa.22400.

బయటి లింకులు

[మార్చు]