పారాంత్రోపస్ రోబస్టస్
పారాంత్రోపస్ రోబస్టస్ Temporal range: ప్లైస్టోసీన్,
| |
---|---|
పారాంత్రోపస్ రోబస్టస్ ఒరిజినల్ కపాలం SK 48, ట్రాన్స్‌వాల్ మ్యూజియమ్‌లో | |
Scientific classification | |
Domain: | Eukaryota |
Kingdom: | జంతువు |
Phylum: | కార్డేటా |
Class: | క్షీరదాలు |
Order: | Primates |
Suborder: | Haplorhini |
Infraorder: | Simiiformes |
Family: | Hominidae |
Subfamily: | Homininae |
Tribe: | Hominini |
Genus: | †Paranthropus |
Species: | †P. robustus
|
Binomial name | |
†Paranthropus robustus రాబర్ట్ బ్రూమ్, 1938
| |
Synonyms | |
ఆస్ట్రలోపిథెకస్ రోబస్టస్ (రేమండ్ డార్ట్, 1938) |
పారాంత్రోపస్ రోబస్టస్ (లేదా ఆస్ట్రలోపిథెకస్ రోబస్టస్) అనేది హోమినిని తెగకు చెందిన తొలి జాతుల్లో ఒకటి. దీన్ని మొదటగా 1938 లో దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. కపాల లక్షణాలకు సంబంధించి, పి. రోబస్టస్ "బాగా నమిలే జాతి" లాగా అనిపించింది. "దృఢమైన" జాతి లక్షణాలు ఉన్న కారణంగా, మానవ శాస్త్రవేత్త రాబర్ట్ బ్రూమ్, పారాంత్రోపస్ ప్రజాతిని స్థాపించి, ఈ ఆస్ట్రలోపిథెసీన్‌ను అందులో చేర్చాడు.
పారాంత్రోపస్ రోబస్టస్ 20, 12 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య నివసించినట్లు భావిస్తున్నారు. దీనికి పెద్ద దవడలు, దవడ కండరాలూ ఉన్నాయి. దానితో పాటు సాజిట్టల్ క్రెస్ట్ (కపాలం మధ్యలో ముందు నుండి వెనుకకు ఉబ్బుగా ఉండే కిరీటం లాంటి రేఖ), అవి నివసించిన పొడి వాతావరణానికి తగినట్లుగా పెద్ద వెనుక కోర పళ్ళూ ఉన్నాయి. దాని వెనుక పళ్ళపై పింగాణికి గుంటలు పడి ఉన్నాయి. ఇది అమెలోజెనిసిస్ ఇంపెర్ఫెక్టా అనే జన్యు స్థితి వల్ల సంభవిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దంతాలు ఇంత పెద్దగా అభివృద్ధి అయిన సందర్భంలో కీలకమైన జన్యువు (ల) లో అస్థిరత కారణంగా ఇది మామూలేనని భావిస్తున్నారు.[1]
కనుగోలు
[మార్చు]ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికానస్ను కనుగొన్న రేమండ్ డార్ట్, అది హోమో సేపియన్లకు పూర్వీకుడని డార్ట్ చేసిన వాదనను రాబర్ట్ బ్రూమ్ సమర్ధించాడు. అయితే, శాస్త్రవేత్తలు దీనిపై చాలా సందేహాలు వ్యక్తం చేసి, విమర్శలు చేసారు. టౌంగ్ చైల్డ్ అని పిలిచే పిల్లవాడి శిలాజాన్ని టైప్ స్పెసిమెన్‌గా చేసుకుని ఈ జాతికి పేరుపెట్టడాన్ని వారు విమర్శించారు. అటువంటి ముఖ్యమైన పని వయోజనుల పూర్తి అస్థిపంజరం మీద ఆధారపడి ఉండాలని వారు భావించారు.
బ్రూమ్ ఒక స్కాటిష్ వైద్యుడు. అప్పుడు దక్షిణాఫ్రికాలో పనిచేసేవాడు. మరిన్ని A. ఆఫ్రికానస్ స్పెసిమెన్లను కనుగొని డార్ట్ వివరణను బలోపేతం చేయడానికి అతడు దక్షిణాఫ్రికాలో స్వంతంగా తవ్వకాలు ప్రారంభించాడు. ఎ. ఆఫ్రికానస్ జాతి హోదాను సమర్థించే సంపూర్ణ వయోజన అస్థిపంజరాలను కనుగొనడం, ఆధునిక మానవుల పూర్వీకుడిగా దాని స్థానాన్ని మరింతగా సమర్థించడం అతని ఉద్దేశం. 1938 లో, 70 సంవత్సరాల వయస్సులో, బ్రూమ్ దక్షిణాఫ్రికాలోని క్రోమ్‌డ్రాయ్ వద్ద త్రవ్వకాలు జరుపుతున్నపుడు, డార్ట్ కనుగొన్న ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికానస్‌ను పోలిన పుర్రె, దంతాల ముక్కలను కనుగొన్నాడు. కాని ఆ పుర్రెకు కొన్ని "దృఢమైన" లక్షణాలు ఉన్నాయి .
శిలాజాల లోని పుర్రె, దంతాల భాగాలు అన్నీ 20 లక్షల సంవత్సరాల నాటివి. పారాంత్రోపస్ రోబస్టస్ శిలాజాలు ఉన్న స్థలాలు దక్షిణాఫ్రికాలో మాత్రమే ఉన్నాయి. ఈ స్థలాల్లో క్రోమ్‌డ్రాయ్, స్వార్ట్‌క్రాన్స్, డ్రిమోలెన్, గోండోలిన్, కూపర్స్ ఉన్నాయి. స్వార్ట్‌క్రాన్స్‌లోని గుహలో 130 అవశేషాలను కనుగొన్నారు. ఈ హోమినిన్ల పలువరుసపై చేసిన అధ్యయనంలో పి. రోబస్టస్ సగటున 17 సంవత్సరాల కంటే ఎక్కిఉవ కాలం జీవించలేదని తేలింది.
పరాంత్రోపస్ రోబస్టస్, హోమినిన్ యొక్క "దృఢమైన" జాతికి చెందిన మొదటి ఆవిష్కరణ; పి. బోయిసీ, పి . ఏథియోపికస్‌ల కంటే చాలా ముందు దీన్ని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఈ మూడు జాతులను వాటి స్వంత ప్రజాతి (పరాంత్రోపస్) లోను, ఆస్ట్రలోపిథెకస్ ప్రజాతి లోనూ చేరుస్తూ, మారుస్తూ వచ్చారు. దీనికి కారణం చాలా సూక్ష్మమైన వివరాలలో, ఇతర "దృఢమైన" జాతులైన ఏథియోపికస్, బోయిసీలతో కంటే A. ఆఫ్రికానస్ తోటే దీనికి ఎక్కువ పోలికలు ఉంటాయి. ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ తరువాత, బ్రూమ్ కనుగొన్నదే రెండవ ఆస్ట్రలోపిథెసీన్.
శరీర నిర్మాణం
[మార్చు]దృఢమైన ఆస్ట్రాలోపిథెసిన్‌ల మాదిరిగానే, పి. రోబస్టస్ తల కూడా గొరిల్లా తల ఆకారంలో ఉంటుంది. హోమో వంశంలోని హోమినిన్‌లతో పోల్చితే దీని దవడ, దంతాలు మరింత భారీగా ఉంటాయి. పుర్రె పైనున్న సాజిట్టల్ క్రెస్ట్ పెద్ద నమలు కండరాలకు లంగరుగా పనిచేస్తుంది. పారాంత్రోపస్ రోబస్టస్ యొక్క DNH 7 పుర్రె, "యూరిడైస్"ను, [2] దక్షిణాది ఆఫ్రికాలోని డ్రిమోలెన్ గుహలో 1994 లో ఆండ్రీ కీజర్ కనుగొన్నాడు. ఇది 23 లక్షల సంవత్సరాల నాటిది. ఇది స్త్రీకి చెందినదై ఉండవచ్చు.
ఈ ప్రైమేట్ల దంతాలు మరే ఇతర గ్రెసైల్ ఆస్ట్రలోపిథెసీన్‌ల కంటే పెద్దవి గాను, మందంగానూ ఉన్నాయి. అవయవ నిర్మాణంలో గమనించిన వ్యత్యాసాల కారణంగా బ్రూమ్ తొలుత దీన్ని ఆస్ట్రేలియాపిథెకస్ రోబస్టస్‌గా పేర్కొన్నాడు. పుర్రె పైన, ముందు నుండి వెనుకకు ఒక ఎత్తైన మిట్ట (సాజిట్టల్ క్రెస్ట్) ఉంది. మగ పి. రోబస్టస్ 1.2 మీ ఎత్తు, బరువు 54 కె.జి. మాత్రమే ఉండి ఉండవచ్చు. ఆడవి 1 మీటరు లోపు ఎత్తుతో, 40 కిలోల బరువుతో ఉండేవి. లైంగిక డైమోర్ఫిజం చాలా ఎక్కువగా ఉండేదని ఇది సూచిస్తుంది. పి. రోబస్టస్‌లో దంతాలు దాదాపు పి. బోయిసీ దంతాలంత పెద్దవిగా ఉన్నాయి.
బ్రూమ్ తన పరిశోధనలను జాగ్రత్తగా విశ్లేషించాడు. మోలార్ దంతాల పరిమాణంలో తేడాలను గుర్తించాడు. ఇవి మానవుడి కంటే గొరిల్లాను కొంచెం ఎక్కువగా పోలి ఉన్నాయి. దక్షిణ ఆఫ్రికాలో ఇతర పి. రోబస్టస్ అవశేషాలను కనుగొన్నారు. పి. రోబస్టస్ సగటు మెదడు పరిమాణం 410 - 530 సిసిలు మాత్రమే ఉంది. ఇది సుమారు చింపాంజీల పరిమాణంలో ఉంటుంది. పి రోబస్టస్ బహిరంగ అడవులలో, సవన్నాల్లో నివసించేవి కాబట్టి, వాటి ఆహారంలో గింజలు, దుంపల వంటి గట్టి పదార్థాలు ఉండేవని కొందరు వాదించారు. ఇటీవలి పరిశోధన ప్రకారం, ఇవి ఏవైనా తినేవని (డయటరీ జనరలిస్ట్) తెలిసింది. [3] మామూలుగా తినే ఆహారం దొరకని సమయంలో మాత్రమే అవి గట్టి ఆహారాన్ని తినేవని కొందరు అభిప్రాయపడ్డారు. [4]
పళ్ళలో స్ట్రోంటియం ఐసోటోపుల నిష్పత్తులను బట్టి 2011 లో చేసిన అధ్యయనం - దక్షిణ ఆఫ్రికా లోని ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికానస్, P. రోబస్టస్‌ల సమూహాల్లో మగవే ఎక్కువగా ఉండేవని, ఆడజీవులు తాము పుట్టిన ప్రదేశం నుండి దూరంగా వెళ్ళి జీవించేవనీ సూచించింది. [5] [6]
ఇతర హోమినిన్లతో పోలికలో అభివృద్ధి
[మార్చు]
ఇవి కూడా చూడండి
[మార్చు]- మానవ పరిణామం
- మానవ పరిణామ శిలాజాల జాబితా (చిత్రాలతో)
మూలాలు
[మార్చు]- ↑ Towle, Ian; Irish, Joel D. (April 2019). "A probable genetic origin for pitting enamel hypoplasia on the molars of Paranthropus robustus". Journal of Human Evolution. 129: 54–61. doi:10.1016/j.jhevol.2019.01.002.
- ↑ Frisancho, Roberto (2006). Humankind Evolving: An Exploration of the Origins of Human Diversity. Kendall/Hunt Publishing Company. p. 135. ISBN 978-0757514081.
- ↑ Wood, B.; Strait, D. (2004). "Patterns of resource use in early Homo and Paranthropus". Journal of Human Evolution. 46 (2): 119–162. doi:10.1016/j.jhevol.2003.11.004. PMID 14871560.
- ↑ Scott, R.S.; Ungar, P.S.; Bergstrom, T.S.; Brown, C.A.; Grine, F.E.; Teaford, M.F.; Walker, A. (2005). "Dental microwear texture analysis shows within-species dietary variability in fossil hominins". Nature. 436 (7051): 693–695. doi:10.1038/nature03822. PMID 16079844.
- ↑ Bowdler, Neil (2 June 2011). "Ancient cave women 'left childhood homes'". BBC News. Retrieved 2011-06-02.
- ↑ Copeland SR, et al. (2011). "Strontium isotope evidence for landscape use by early hominins". Nature. 474 (7349): 76–78. doi:10.1038/nature10149. PMID 21637256.