ఆస్ట్రలోపిథెకస్ సెడీబా
ఆస్ట్రలోపిథెకస్ సెడీబా Temporal range: Early Pleistocene,
| |
---|---|
Reconstructed skeleton of MH1 at the Natural History Museum, London | |
Scientific classification | |
Domain: | Eukaryota |
Kingdom: | జంతువు |
Phylum: | కార్డేటా |
Class: | క్షీరదాలు |
Order: | Primates |
Suborder: | Haplorhini |
Infraorder: | Simiiformes |
Family: | Hominidae |
Subfamily: | Homininae |
Tribe: | Hominini |
Genus: | †Australopithecus |
Species: | †A. sediba
|
Binomial name | |
†Australopithecus sediba |
ఆస్ట్రలోపిథెకస్ సెడీబా అనేది ప్లైస్టోసీన్ తొలినాళ్ళకు చెందిన ఆస్ట్రలోపిథెకస్ జీనస్ లోని జాతి. 20 లక్షల సంవత్సరాలకు చెందిన శిలాజ అవశేషాల ఆధారంగా దీన్ని గుర్తించారు. శరీరాంగాల పరంగా ఎ. సెడీబా హోమో హ్యాబిలిస్, ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ లకు భిన్నంగా ఉన్నప్పటికీ, ఇది ఆ రెంటికీ సంబంధించినదే.[2] ఈ కారణంగా హోమో (మానవ) జాతి పరిణామంలో దీన్ని ఓ పరివర్తన (ట్రాన్సిషనల్) జాతిగా భావించవచ్చు అనే దృష్టికోణంలో దీని పరిశీలన ఆసక్తి కలిగిస్తుంది.
దక్షిణాఫ్రికాలోని మానవజాతి ఉయ్యాలలో ఉన్న మాలాపా శిలాజ స్థలంలో కనుగొన్న ఆరు పాక్షిక అస్థిపంజరాల ఆధారంగా ఎ. సెడీబా జాతిని సిద్ధాంతీకరించారు. హోలోటైప్ (ఏ స్పెసిమెన్ ఆధారంగా నైతే ఓ జాతిని నిర్వచించారో ఆ ఒక్క స్పెసిమెన్‌ను ఆ జాతి యొక్క హోలోటైప్ స్పెసిమెన్ అంటారు) స్పెసిమెన్‌కు MH1 (మలాపా హోమినిన్ 1) అని పిలుస్తారు. కౌమారంలో ఉన్న ఆ వ్యక్తికి "కరాబో" అని కూడా పేరు పెట్టారు. MH2 ఒక పారాటైప్ స్పెసిమెన్ (ఓ జాతిని నిర్వచించేందుకు ఆధారపడిన (హోలోటైప్ కాకుండా ఇతర) స్పెసిమెన్‌లను ఆ జాతి యొక్క పారాటైప్ స్పెసిమెన్ అంటారు). అది ఒక వయోజన స్త్రీకి చెందినది. ఇతర అవశేషాల్లో ఒకటి వయోజన పురుషుడిది, మూడు శిశువులవి.[3] మలాపా గుహలో అడుగున ఈ శిలాజాలన్నీ కలిసి కనబడ్డాయి. పైనుంచి ఆ గుహలో పడిపోవటం వలన అవి మరణించి ఉందవచ్చు. అవి 19.8 లక్షల సంవత్సరాల క్రితం నాటివి.[4] మొత్తం 220 ఎముకల శకలాల ఆధారంగా, ఈ పాక్షిక అస్థిపంజరాలను ఆస్ట్రలోపిథెకస్ సెడీబా ఓ కొత్త జాతిగా 2010 లో వర్ణించారు. సెడీబా అనే సోతో భాష లోని పేరుకు "సహజసిద్ధమైన నీటి బుగ్గ" లేదా "బావి" అని అర్థం.[1]
కనుగోలు
[మార్చు]ఎ. సెడీబా యొక్క మొదటి నమూనాను పాలియోఆంత్రోపాలజిస్ట్ లీ బెర్జర్ యొక్క తొమ్మిదేళ్ల కుమారుడు మాథ్యూ 2008 ఆగస్టు 15 న కనుగొన్నాడు. మాలాపా నేచర్ రిజర్వ్‌లో, జోహన్నెస్‌బర్గ్‌కు ఉత్తరాన ఉన్న డోలమైటిక్ కొండలలో, తన తండ్రి తవ్వకాలు జరిపిన ప్రదేశానికి సమీపంలో అన్వేషించేటప్పుడు, మాథ్యూకు ఓ శిలాజ ఎముక తారసపడింది. బాలుడు తన తండ్రికి ఈ సంగతి చెప్పాడు. లీ బెర్జర్ తాను చూసిన దాన్ని నమ్మలేక పోయాడు-అదొక హోమినిడ్ జత్రుక. ఆ రాతిని తిప్పి చూస్తే, "రాతి వెనుక ఒక దంతం, ఒక రదనిక కలిగి ఉన్న దవడ బయటికి చూస్తూ ఉన్నాయి. నేను దాదాపు చచ్చిపోయాను", అని తరువాతి కాలంలో అతను గుర్తుచేసుకున్నాడు.[5] ఆ శిలాజం 1.27 మీ. ఎత్తైన కౌమార వయస్కుడిది అని తేలింది. దాని పుర్రెను 2009 మార్చిలో లీ బెర్జర్ బృందం కనుక్కుంది. ఈ అన్వేషణను 2010 ఏప్రిల్ 8 న బహిరంగంగా ప్రకటించారు.
మాలాపా పురావస్తు ప్రదేశంలో వివిధ రకాల జంతువుల శిలాజాలు కూడా దొరికాయి. వీటిలో కోర దంతాల పిల్లులు, ముంగిసలు, జింకలూ ఉన్నాయి.[5] బెర్జర్, భూవిజ్ఞాన శాస్త్రవేత్త పాల్ డిర్క్స్‌లు ఈ జంతువులు 30 - 46 మీటర్ల గోతి లోకి, బహుశా నీటి వాసనకు ఆకర్షితులై, దూకి ఉండవచ్చని భావించారు. మృతదేహాలు నీటిలో కొట్టుకుపోయి, ఇసుక, సున్నంతో కూడుకుని ఉన్న ఓ చెరువు అడుక్కి చేరి అక్కడ శిలాజాలుగా మారి ఉండవచ్చు.
శిలాజాలు
[మార్చు]MH1 పూర్తి శరీరభాగాల్లో 34% శిలాజాలు లభించాయి. MH2 లో 45.6% దొరికాయి.
పాలియోమాగ్నెటిజం, యురేనియం-లీడ్ (యు-పిబి) సంయుక్తంగా డేటింగుకు వినియోగించారు. దీన్ని బట్టి ఈ శిలాజాలు 20 లక్షల సంవత్సరాల క్రితం కంటే పాతవైతే కాదని తేలింది. అక్కడ కొన్ని జంతువుల శిలాజాలు కూడా దొరికాయి. ఆ జంతువులు 15 లక్షల సంవత్సరాల క్రితం అంతరించి పోయిన జాఅతులకు చెందినవి. అంటే ఈ శిలాజాలు ఆ తరువాతివైతే కాదని స్పష్టమౌతోంది. అవక్షేపాల్లో అయస్కాంత ధ్రువీయత 'సాధారణ' స్థాయిలో ఉంది. 20 - 15 లక్షల సంవత్సరాల మధ్య ఇలా సాధారణ ధ్రువీయత కలిగిన సమయం 19.5 - 17.8 లక్షల సంవత్సరాల మధ్య మాత్రమే.[4] దీని ప్రకారం, శిలాజాల కాలం మొదట 19.5 లక్షల సంవత్సరాల క్రితం అని తేల్చారు. అక్కడ పెరిగిన కాల్షియం రాళ్ళను ఇటీవల డేటింగు చేసినపుడు ఇది సరి కాదని, సాధారణ అయస్కాంత ధ్రువీయత కలిగిన అవక్షేపాల వయసు 19.77 లక్షల సంవత్సరాల క్రితం అనీ తేలింది.
ఈ వ్యక్తులు పూడుకుపోయి, శిలాజాలుగా మారిన చుట్టుపక్కల పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయి. వీటి దంత ఫలకం నుండి మొక్కల ఫైటోలిత్‌లను తీయడానికి వీలైంది.[6] దీని ఆధారంగా, ఆస్ట్రలోపిథెకస్ సెడీబా సవానాలలో నివసించి ఉండవచ్చు అనిపిస్తోంది. కాని ఆధునిక సవానా చింపాంజీల లాగానే అవి కూడా అడవుల లోని పండ్లు, తదితర ఆహారాన్ని తిన్నట్లు తెలుస్తోంది.
అవయవ నిర్మాణం, విశ్లేషణలు
[మార్చు]కపాలం లోపల విస్తారమైన మొజాయిక్ పరిణామ లక్షణాలు (వేరే అవయవాల్లో పరిణామం లేకపోయినా కొన్ని అవయవాలు పరిణామం చెందడాన్ని మొజాయిక్ పరిణామం అంటారు) కనిపించడాన్ని బట్టి, ఎ. సెడీబా, దక్షిణాది ఆఫ్రికా లోని ఎ. ఆఫ్రికానస్ కు (టాంగ్ చైల్డ్, శ్రీమతి ప్లెస్), హోమో హ్యాబిలిస్ లేదా ఆ తరువాతి హెచ్. ఎరెక్టస్ (తుర్కానా బాయ్, జావా మనిషి, పెకింగ్ మనిషి) కూ మధ్యంతర రూపమై ఉండవచ్చని భావించారు.[1]
MH1 కపాల సామర్థ్యం, వయోజనుడి కపాల సామర్థ్యంలో 95% (420 సెం.మీ.3) ఉంటుందని అంచనా వేసారు. ఇది ఎ. ఆఫ్రికానస్ శ్రేణి అత్యధిక సామర్థ్యం కంటే ఎక్కువ గాను, తొలి హోమో (631 సెం.మీ.3) ల కనీస సామర్థ్యాని కంటే తక్కువ గానూ ఉంది. కానీ దవడ, దంతాలు చాలా సున్నితమైన కోవకు చెందినవి. ఇవి హెచ్. ఎరెక్టస్ వాటితో పోలి ఉన్నాయి; ఈ రెంటిలో ఎంత సారూప్యత ఉందంటే, ఇతర అస్థిపంజర అవశేషాలతో కాకుండా విడిగా ఈ దంతాలు, దవడ మాత్రమే కనిపిస్తే, వాటిని హోమోగా వర్గీకరించేసేంత. అయితే, దంతాల మొనలు మాత్రం ఆస్ట్రలోపిథెకస్ లాగా ఉన్నాయి.
ఆస్ట్రలోపిథెకస్ సెడీబా తొలి హోమో ల ప్రత్యక్ష పూర్వీకుడా కాదా అనే దానితో సంబంధం లేకుండా, ఈ కొత్త నమూనాలతో తొలి హోమినిన్ల లోని వైవిధ్యం యొక్క విస్తృతి గురించి మన అవగాహన బాగా పెరిగింది.
బెర్జర్ తదితరులు ఎ. సెడీబా ను, దాని పూర్వీక జాతి ఎ. ఆఫ్రికానస్ తో పోల్చి వివరించారు. దానిలో ఎ. గార్హి కంటే హోమో లక్షణాలే ఎక్కువ ఉన్నాయి.ముఖ్యంగా హెచ్. ఎరెక్టస్‌లోని కటి పునర్వ్యవస్థీకరణను బట్టి, ఇది "మరింత శక్తివంతంగా, మరింత సమర్థవంతంగా నడిచేందుకు, పరిగెత్తేందుకూ" వీలుగా ఉంది. తొడ ఎముక, జంఘిక (ముంగాలిలో ఉండే రెండు ఎముకల్లో పెద్దది) ముక్కలుగా ఉన్నాయి. కాని పాదంలోని మడమ ఆదిమ రూపంలోను, చీలమండ ఆధునికం గానూ ఉన్నాయి.[7] దీని కపాల సామర్థ్యం సుమారు 420 - 450 సెం.మీ.3 ఉండి,[1] ఆధునిక మానవుల సామర్థ్యంలో మూడో వంతు (1200 సెం.మీ.3) ఉంది.
ఎ. సెడీబా చెయ్యి ఆధునికంగా ఉంది. దీని ఖచ్చితమైన పట్టును బట్టి అది పనిముట్లు తయారు చేసే మరొక ఆస్ట్రలోపిథెకస్ అయి ఉండవచ్చు. పొడవైన బొటనవేలు, చిన్న వేళ్లూ వంటి హోమో లక్షణాలు దీనికి ఆధారంగా ఉన్నాయి.[8][9] వయోజన స్త్రీకి చెందిన దాదాపు పూర్తి మణికట్టు, చెయ్యిని బట్టి ఆ స్త్రీలో ఆస్ట్రోలోపిథెకస్ లక్షణాలు కనిపిస్తాయి. చెట్లపై చరించేందుకు వీలైన అవయవాల అమరిక వీటిలో ఒకటి.
ఎ . సెడీబా చీలమండ చక్కగా పాడవకుండా ఉంది. రూపం, పనితీరులో చాలావరకు మానవుణ్ణి పోలి ఉంది. పాదపు వంపు, పిక్క కండరాలు మానవుడి కున్నట్లే ఉన్నాయి. అయితే, ఎ. సెడీబా మడమ మరింత సున్నితం గాను, మధ్యస్థ మల్లెయోలస్ బలిష్ఠం గానూ ఉన్నాయి. వీటిని బట్టి, ఎ. సెడీబా రెండుకాళ్లపై నడవడం, చెట్లపై చరించడం వంటి ప్రతేకమైన ఉభయచర విధాన్ని అనుసరించిందని తెలుస్తోంది.[10]
ఈ రెండు శిలాజాలు ఆస్ట్రలోపిథెకస్‌కు, హోమోకూ మధ్య పరివర్తన జాతి అని తొలి వ్యాఖ్యాతలు చేసిన వ్యాఖ్యానాన్ని ఇతర పాలియో ఆంత్రోపాలజిస్టులు అంగీకరించలేదు. 2010 లో ప్రారంభ వివరణలతో ప్రచురితమైన వార్తా కథనంలో సూచించిన "ఎ. సెడీబా హోమో జీనస్‌కు పూర్వీకుడు కావచ్చు" అనే ఆలోచనను వ్యతిరేకించేవారు (ఉదా. టిమ్ వైట్, రాన్ క్లార్క్), ఈ శిలాజాలు ఆస్ట్రలోపిథెకస్ యొక్క దక్షిణ ఆఫ్రికా శాఖయై ఉండవచ్చని, ఇది ఇప్పటికే హోమో జీనస్ లోని సభ్యులతో సహ ఉనికిలో ఉండి ఉండవచ్చనీ సూచించారు.[11]
ఫ్రీడెమాన్ ష్రెన్క్ కనుగొన్న 25 లక్షల సంవత్సరాల నాటి కింది దవడ శిలాజం (ఇది హెచ్. రుడోల్ఫెన్సిస్‌కు చెందినది) హోమో జీనస్‌కు ఆపాదించిన అత్యంత పురాతన శిలాజమనే వివరణ, పై విమర్శకు ఆధారంగా ఉంది. ఈ స్పెసిమెన్ ఆస్ట్రలోపిథెకస్ సెడీబా శిలాజాల కంటే పాతదిగా భావిస్తున్నారు. ఈ విమర్శకులు, హోమో జీనస్‌కు పూర్వగామి హోదాను ఎ. ఆఫ్రికానస్ కే ఆపాదించడం కొనసాగించారు. నేచర్ పత్రికలో వచ్చిన ఒక వార్తా వ్యాసంలో తొలి వ్యాఖ్యానంపై విమర్శ లేవదీసారు. తొలి వ్యాఖ్యాతలు తమ వ్యాఖ్యానం చేసే సందర్భంలో ఎ. ఆఫ్రికానస్‌లోని వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆ విమర్శకులు అన్నారు.[12]
పైగా, ఒక బాలుడి అస్థిపంజరం స్పెసిమెన్‌పైనే ఎక్కువగాఆధారపడి ఈ జాతిని వర్ణించడం విమర్శలకు గురైంది. ఎందుకంటే, పెద్దలు, బాలుడి నుండి ఎంతవరకు భిన్నంగా ఉంటారో చెప్పే నిర్దుష్ట పద్ధతి లేదు. అయితే, ఇటీవలి సమీక్షలు ఎ. ఆఫ్రికానస్ తదితర తొలి హోమినిన్ల కంటే ఎ. సెడీబా భిన్నమైన జాతిగా అంగీకరించినట్లు కనిపిస్తోంది.[13] అంతేకాకుండా, బాల్య నమూనాలను టైప్ స్పెసిమెన్‌గా ఉపయోగించడం పాలియోఆంత్రోపాలజీలో మామూలే: హోమో హ్యాబిలిస్, ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ టైప్ స్పెసిమెన్లు బాల్య స్పెసిమెన్లే.
బయటి లింకులు
[మార్చు]- <i id="mwAcc">సైన్స్</i> నుండి ఆస్ట్రలోపిథెకస్ సెడీబాపై పత్రాల సేకరణ
- శిలాజ వికీ వద్ద ఆస్ట్రలోపిథెకస్ సెడీబా
- నేషనల్ జియోగ్రాఫిక్ వద్ద కనుగొన్న చిత్రాలు
- సైన్స్ వద్ద అస్థిపంజరం విశ్లేషణ
- పుర్రెలు Archived 2011-07-16 at the Wayback Machine
- అధ్యాపకులు, విద్యార్థుల కోసం " ఆస్ట్రలోపిథెకస్ సెడీబా " గురించి ఉచిత చిత్రాలు, వనరులు
- గార్డియన్ సైన్స్ నోట్స్
- మలపా హోమినిన్ సైట్ మొత్తం కాటలాగ్ 2013 పార్ట్ 1 [dead link]
- మలపా హోమినిన్ సైట్ మొత్తం కాటలాగ్ 2013 పార్ట్ 2 [dead link]
- మాలాపా యొక్క ప్లియో-ప్లైస్టోసీన్ గుహ సైట్ నుండి ప్రారంభ హోమినిన్స్ యొక్క టాఫోనమీని అర్థం చేసుకోవడానికి ఒక 3D విధానం Archived 2020-07-24 at the Wayback Machine
- హ్యూమన్ టైమ్‌లైన్ (ఇంటరాక్టివ్) - స్మిత్సోనియన్, నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (ఆగస్టు 2016).
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 Berger, L. R.; de Ruiter, D. J.; Churchill, S. E.; Schmid, P.; Carlson, K. J.; Dirks, P. H. G. M.; Kibii, J. M. (2010). "Australopithecus sediba: a new species of Homo-like australopith from South Africa". Science. 328 (5975): 195–204. CiteSeerX 10.1.1.729.7802. doi:10.1126/science.1184944. PMID 20378811.
- ↑ Jeremy M. DeSilva (ed.), Special Issue on Australopithecus sediba, PaleoAnthropology (2018), doi:10.4207/PA.2018.ART111.
- ↑ Gibbons, Ann (2011). "A new ancestor for Homo?". Science. 332 (6029): 534. doi:10.1126/science.332.6029.534-a. PMID 21527693.
- ↑ 4.0 4.1 Between 1.980 and 1.977 Mya 95% CI). Dirks, P. H. G. M.; Kibii, J. M.; Kuhn, B. F.; Steininger, C.; Churchill, S. E.; Kramers, J. D.; Pickering, R.; Farber, D. L.; et al. (2010). "Geological setting and age of Australopithecus sediba from Southern Africa" (PDF). Science. 328 (5975): 205–208. doi:10.1126/science.1184950. PMID 20378812.
- ↑ 5.0 5.1 Celia W. Dugger; John Noble Wilford (April 8, 2010). "New hominid species discovered in South Africa". The New York Times. Archived from the original on 11 April 2010. Retrieved April 8, 2010.
- ↑ Henry, Amanda G.; Ungar, Peter S.; Passey, Benjamin H.; Sponheimer, Matt; Rossouw, Lloyd; Bamford, Marion; Sandberg, Paul; de Ruiter, Darryl J.; Berger, Lee (June 27, 2012). "The diet of Australopithecus sediba". Nature. 487 (7405): 90–93. doi:10.1038/nature11185. PMID 22763449.
- ↑ Kate Wong, "First of our kind: sensational fossils from South Africa spark debate over how we came to be human", Scientific American, April 2012:30-39.
- ↑ Kivell TL, Kibii JM, Churchill SE, Schmid P, Berger LR (2011). "Australopithecus sediba hand demonstrates mosaic evolution of locomotor and manipulative abilities". Science. 333 (6048): 1411–1417. doi:10.1126/science.1202625. PMID 21903806.
- ↑ Part ape, part human - National Geographic - Retrieved 10 September 2011.
- ↑ Zipfel B, DeSilva JM, Kidd RS, Carison KJ, Churchill SE, Berger LR (2011). "The foot and ankle of Australopithecus sediba". Science. 333 (6048): 1417–1420. doi:10.1126/science.1202703. PMID 21903807.
- ↑ Balter, Michael (2010). "Candidate human ancestor from South Africa sparks praise and debate" (PDF). Science. 328 (5975): 154–155. doi:10.1126/science.328.5975.154. PMID 20378782.
- ↑ Cherry, Michael (April 8, 2010). "Claim over 'human ancestor' sparks furore". Nature. doi:10.1038/news.2010.171.
- ↑ Spoor, Fred (October 5, 2011). "Palaeoanthropology: Malapa and the genus Homo". Nature. doi:10.1038/478044a/news.2011.171.