వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 01వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నియాండర్తల్

నియాండర్తల్ యురేషియాలో సుమారు 40,000 సంవత్సరాల క్రితం వరకు నివసించి, అంతరించిపోయిన పురాతన మానవుల జాతి లేదా ఉపజాతి. దీని శాస్త్రీయ నామం హోమో నియాండర్తలెన్సిస్ లేదా హోమో సేపియన్స్ నియాండర్తలెన్సిస్. వలస వచ్చిన ఆధునిక మానవులతో పోటీ పడి గాని, వాళ్ళతో స్పర్థ వలన గానీ, లేదా శీతోష్ణస్థితుల్లో వచ్చిన గొప్ప మార్పు వలన గానీ, వ్యాధుల వలన గానీ, లేదా పై కారణాల్లో కొన్నిటి వలన గానీ, లేదా అన్నింటి వలన గానీ అవి అంతరించిపోయాయి. ఆధునిక మానవుల నుండి నియాండర్తళ్ళు ఎప్పుడు వేరుపడ్డారో స్పష్టంగా లేదు. DNA అధ్యయనాల్లో ఈ కాలం 1,82,000 సంవత్సరాల క్రితం నుండి 80,000 సంవత్సరాల క్రితం వరకు ఉండొచ్చని తేలింది. నియాండర్తళ్ళు తమ పూర్వీకుడైన హెచ్. హైడెల్బెర్గెన్సిస్ నుండి ఎప్పుడు వేరుపడ్డారనేది కూడా అస్పష్టంగా ఉంది. నియాండర్తళ్ళకు చెందినవని భావిస్తున్న అత్యంత పురాతన ఎముకలు 4,30,000 సంవత్సరాల నాటివి. కానీ వాటి వర్గీకరణ అనిశ్చితంగా ఉంది. నియాండర్తల్‌కు చెందిన శిలాజాలు ముఖ్యంగా 1,30,000 సవత్సరాల క్రితం తరువాతి కాలానికి చెందినవి చాలా లభించాయి. నియాండర్తల్ 1 అనే టైప్ స్పెసిమెన్ను 1856 లో జర్మనీ లోని నియాండర్ లోయలో కనుగొన్నారు. నియాండర్తళ్ళను ఆదిమ జాతిగాను, తెలివితక్కువ వారిగాను, క్రూరులు గానూ 20 వ శతాబ్దం ప్రారంభంలో చిత్రీకరించారు. తదనంతర కాలంలో వారి గురించిన జ్ఞానం, అవగాహన శాస్త్ర ప్రపంచంలో బాగా మారినప్పటికీ, పరిణతి చెందని, గుహల్లో జీవించిన ఆదిమ మానవులుగా వారిని భావించడం ప్రముఖ సంస్కృతుల్లో ఇంకా ప్రబలంగానే ఉంది.
(ఇంకా…)