Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 09వ వారం

వికీపీడియా నుండి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) భూనిమ్న కక్ష్యలో (Low Earth Orbit) పరిభ్రమిస్తూన్న, మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత ఉపగ్రహం. ఈ కేంద్రాన్ని అమెరికా (నాసా), రష్యా (రోస్‌కాస్మోస్), జపాన్ (జాక్సా), ఐరోపా దేశాలు (ఇ ఎస్ ఏ), కెనడా (సి ఎస్ ఏ) లకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ కేంద్రంపై హక్కులు, దాని వాడుకలు ఈ దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి ఉంటాయి. ఇది ఐఎస్‌ఎస్, మైక్రోగ్రావిటీకి, అంతరిక్ష పర్యావరణానికీ పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. దీనిలో సిబ్బంది జీవశాస్త్రం, మానవ జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, ఇతర రంగాలలో ప్రయోగాలు చేస్తారు. చంద్రుడి వద్దకు, అంగారక గ్రహానికి వెళ్ళే యాత్రలకు అవసరమైన అంతరిక్ష నౌక వ్యవస్థలను, పరికరాలనూ పరీక్షించేందుకు ఈ కేంద్రం అనుకూలంగా ఉంటుంది. ఐఎస్‌ఎస్ సగటున 400 కి.మీ. ఎత్తున ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తుంది. జ్వెజ్డా మాడ్యూల్ లోని ఇంజిన్లను ఉపయోగించి రీబూస్ట్ విన్యాసాలు చెయ్యడం ద్వారా గానీ, అంతరిక్ష నౌకను సందర్శించే నౌకల ద్వారాగానీ ఆ కక్ష్య నిర్వహణ చేస్తుంది. ఇది సుమారు 92 నిమిషాలకు ఒకసారి కక్ష్యలో పరిభ్రమిస్తుంది. రోజుకు 15.5 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ కేంద్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు. రష్యా నిర్వహించే రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్ (ROS), అనేక దేశాలు పంచుకునే యునైటెడ్ స్టేట్స్ ఆర్బిటల్ సెగ్మెంట్ (USOS). ఐఎస్‌ఎస్ కార్యకలాపాలను 2024 వరకూ పొడిగించే ప్రతిపాదనను రోస్‌కాస్మోస్ ఆమోదించింది. కానీ, రష్యన్ విభాగంలోని అంశాలను OPSEK అనే కొత్త రష్యన్ అంతరిక్ష కేంద్రం నిర్మించడానికి ఉపయోగించాలని రోస్‌కాస్మోస్ గతంలో ప్రతిపాదించింది. 2018 డిసెంబరు నాటి స్థితి ప్రకారం, ఈ కేంద్రం 2030 వరకు పనిచేస్తుంది.
(ఇంకా…)