వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 20వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్బూరి రామకృష్ణారావు

అబ్బూరి రామకృష్ణారావు ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి మార్గదర్శకుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు భావకవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త, విమర్శకుడు, అభ్యుదయ భావాలున్నవాడు, మానవతావాది, గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడు, గ్రంథాలయాధికారి. ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, అబ్బురి రామకృష్ణారావులను కవిత్రయమని పేర్కొంటారు. ఆధునిక కవిత్వానికి ముగ్గురూ మార్గదర్శకులే కాక వారి రచనలు ఒకే కాలాన ప్రచురింతం అయ్యాయి. అబ్బూరి జీవితంలో ప్రతి అడుగు మిత్రుల సాంగత్యం, సాహిత్యం తోటే ముడిపడి ఉంది. రామకృష్ణారావు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని అనంతవరం గ్రామంలో లక్ష్మీనరసింహశాస్త్రి, బాపమ్మ దంపతులకు 1896, మే 20 న జన్మించాడు. వారిది పండిత వంశం. తాతగారు కవి. తండ్రి సంస్కృతాంధ్రాలలో పండితుడు. ఆయన చిన్నతనంలో తిరుపతి వెంకట కవులలో ఒకడైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి తరచుగా అబ్బూరి తండ్రి గారి ఇంటికి వస్తుండేవాడు. అబ్బూరి కూడా బహుభాషా కోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లము, బెంగాలీ, పర్షియన్ సాహిత్యాలను క్షుణ్ణంగా చదివినవారు. 15వ ఏటనే వారికి మేనమామ కుమార్తె రుక్మిణితో వివాహం అయింది. వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు స్వర్గీయ అబ్బూరి వరదరాజేశ్వరరావు రచయత, విమర్శకుడు, అధికార భాషా సంఘానికి అధ్యక్ష్యులుగా పనిచేశారు.
(ఇంకా…)