Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 23వ వారం

వికీపీడియా నుండి
అశ్వఘోషుడు

ఆశ్వఘోషుడు క్రీ. శ. 80–150 కాలానికి చెందిన బౌద్ధ దార్శనికుడు. సంస్కృత పండితుడు. మహాకవి. నాటకకర్త. ఇతనిని సంస్కృత వాఙ్మయమున తొలి నాటకకర్తగా భావిస్తారు. అశ్వఘోషుడు కాళిదాసు కన్నా పూర్వుడని, కాళిదాసుని కవిత్వంపై అశ్వఘోషుని ప్రభావం వుందని పాశ్చాత్య సంస్కృత సాహిత్యకారులందరూ తేల్చి చెప్పారు. బౌద్ధ దార్శనికుడైన ఆశ్వఘోషుడు బౌద్ధ ధర్మాన్ని ప్రజలలో ప్రచారం చేయడానికి తన కవిత్వాన్ని ఒక సాధనంగా చేసుకొన్నాడు. అయితే దార్శనికుడుగా కంటే మహాకవిగా ఎక్కువ గుర్తింపు పొందాడు. సమకాలీన రామాయణానికి పోటీగా కావ్యాలను రచించిన బౌద్ధ కవులలో అత్యంత ప్రాచుర్యం పొందాడు. ఇతను రచించిన సంస్కృత గ్రంథాలలో బుద్ధచరితం, సౌందరనందం అనే రెండు మహా కావ్యాలు, సారిపుత్ర ప్రకరణం అనే నాటకం, వజ్రసూచి అనే బౌద్ధ ధర్మ సంబందమైన గ్రంథం ముఖ్యమైనవి. క్రీ. శ. 1, 2 శతాబ్దాలకు చెందిన మహాకవి అశ్వఘోషుని జీవిత విశేషాలు కొద్దిగా మాత్రమే తెలుస్తున్నాయి. ఇతని సౌందరనందం కావ్యం చివర 18 వ సర్గలో "ఆర్య సువర్ణాక్షీపుత్రస్య సాకేతకస్య భిక్షోరాచార్యస్య భదంతాశ్వఘోషస్య మహాకవేర్మహా వాదినః కృతిరియమ్" అన్న వాక్యాన్ని బట్టి ఇతను సాకేత (అయోధ్య) పురవాసి. తల్లి సువర్ణాక్షి. బౌద్ధ ఆచార్యుడు. మహాకవి అని తెలుస్తుంది. శుద్ధ శ్రోత్రియ వైదిక బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అశ్వఘోషుడు వేద ధర్మ శాస్త్రాలను అధ్యయనం చేసాడు. తరువాత బ్రాహ్మణమతం నుండి బౌద్ధంలోకి మారాడు. చైనీయుల సంప్రదాయం ప్రకారం అశ్వఘోషుడు తొలుత బౌద్ధంలోని సర్వాస్తి వాద శాఖకు చెందినవాడుగా ఉన్నాడు. తరువాత తన జీవితంలో వివిధ దశల్లో బౌద్ధంలోని వివిధ శాఖలను అభిమానించి చివరకు అశ్వఘోషుడు మహాసాంఘికానికి సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తుంది.
(ఇంకా…)