వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 24వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిథియం

లిథియం ఒక క్షార లోహం. మూలకాల ఆవర్తన పట్టికలో మొదటి గ్రూపు S బ్లాకుకు చెందిన మూలకం. ఇది సాధారణ పరిస్థితిలో ఘన రూపంలో ఉంటుంది. ఈ మూలకం పేరు లిథోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. లిథోస్ అనగా రాయి అని అర్థం. ఈ మూలకం పరమాణు సంఖ్య 3. అందువలన ఈ మూలకం పరమాణువులో మూడు ఎలక్ట్రాన్లు ఉంటాయి. విశ్వంలో బిగ్ బ్యాంగ్ (మహా విస్ఫోటనం) జరిగినప్పుడు ఏర్పడిన మొదటి మూడు మూలకాలలో మూడో మూలకం లిథియం. మిగతా రెండు హీలియం, హైడ్రోజన్. కాని విశ్వంలో బెరీలియం, బోరాన్, లిథియంల ఉనికి తక్కువ. కారణం లిథియం తక్కువ ఉష్ణోగ్రత వద్దనే నశించు లక్షణాన్ని కలిగి వుంది. లిథియం విశ్వంలో చల్లగా ఉండే బ్రౌన్ మరుగుజ్జు నక్షత్రాలలో, ఆరెంజి నక్షత్రాలలో ఉన్నది. ఘనస్థితిలో లభ్యమయ్యే మూలకాలలో ఎక్కువ విశిష్టోష్ణం కలిగిన మూలకం లిథియం. ఆయనీకరణ శక్తి 5.392 eV. లిథియం మెత్తటి వెండిలా రంగుఉన్న లోహం. ఇది క్షారలోహముల సముదాయానికి చెందినది. అతితక్కువ బరువున్న తెలికపాటి లోహం. మిగతా క్షార లోహలవలె లిథియం రసాయనికంగా అత్యంత చురుకైన చర్యాశీలత కలిగిన, మండే స్వభావము ఉన్న లోహం. అందువలన దీనిని ఏదైనా ఒక హైడ్రోకార్బను ద్రవంలో, సాధారణంగా పెట్రోలియం జెల్లిలో వుంచి భద్రపరుస్తారు. లిథియం ఒంటరి వేలన్సీ ఎలక్ట్రానును కలిగి ఉన్నది. ఈ కారణంచే ఇది ఉత్తమవిద్యుత్తు, ఉష్ణవాహకం. లిథియం చాలా మెత్తటి లోహం.
(ఇంకా…)