వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 25వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాస్తవాధీన రేఖ

వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్), చైనీయుల-నియంత్రణలో ఉన్న భూభాగాన్ని, భారత నియంత్రిత భూభాగాన్నీ వేరుపరచే ఊహాత్మక సరిహద్దు రేఖ. దీన్ని వాస్తవ నియంత్రణ రేఖ అని కూడా అంటారు. పేరులో బాగా దగ్గరి పోలిక ఉండి, దీనితో సంబంధం లేని మరొక రేఖ నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్). ఇది భారత పాకిస్తాన్‌ల మధ్య ఉన్న రేఖ. ఈ రెండు రేఖలూ అవిభక్త జమ్మూ కాశ్మీరు రాష్ట్రం లేదా ఒకప్పటి జమ్మూ కాశ్మీరు సంస్థానం గుండానే పోతాయి. "లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్" అనే మాటను 1959 లో జౌఎన్‌లై, జవహర్‌లాల్ నెహ్రూకు రాసిన లేఖలో ఉపయోగించాడని చెబుతారు. 1962 భారత చైనా యుద్ధం తరువాత ఏర్పాటు చేసుకున్న రేఖకు ఈ పేరు పెట్టారు. ఇది భారత చైనా సరిహద్దు వివాదంలో భాగం. "లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్" అనే పదాన్ని రెండు సందర్భాల్లో వాడతారు. సంకుచితార్థ్గంలో చూస్తే, ఇది భారత కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్కు, చైనీయుల టిబెట్ స్వాధికార ప్రాంతానికీ మధ్య సరిహద్దుగా మాత్రమే సూచిస్తుంది. ఆ అర్థంలో, ఈ వాస్తవాధీన రేఖ, తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న వివాదాస్పద మెక్‌మహాన్ రేఖ, మధ్యలో ఏ వివాదమూ లేని ఒక చిన్న విభాగం -ఈ మూడూ కలిసి రెండు దేశాల మధ్య సరిహద్దును ఏర్పరుస్తాయి. విస్తృతార్థంలో చూస్తే దీన్ని, పశ్చిమ నియంత్రణ రేఖ, తూర్పు నియంత్రణ రేఖ - రెండింటినీ సూచించడానికి ఉపయోగించవచ్చు. ఈ అర్థంలో దీన్ని భారతదేశం, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాల మధ్య సరిహద్దు అని చెప్పుకోవచ్చు.
(ఇంకా…)