Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 27వ వారం

వికీపీడియా నుండి
కూరెళ్ల విఠలాచార్య

డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు. సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు సాగిస్తున్నాడు. కవిగా 22 పుస్తకాలను వెలువరించిన విఠలాచార్య, పదవీ విరమణ అనంతరం తన స్వగ్రామంలోని తన గృహంలో సుమారు రెండు లక్షల గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశాడు. ప్రధానమంత్రి మోడీ 2021, డిసెంబరు 26 ఆదివారం రోజున రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో కూరెల్ల విఠలాచార్య గురించి ప్రస్తావిస్తూ ‘‘కలలను నిజం చేసుకోవాడానికి వయసు అడ్డుకాదని, ఈ విషయంలో తెలంగాణకు చెందిన 84 ఏళ్ల డాక్టర్ కూరెల్ల విఠలాచార్య మనందరికీ ఆదర్శం. ఆయనకు చిన్నతనం నుంచి ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయాలనే కోరిక ఉండేది. చదువుకుని లెక్చరర్‌‌గా ఉద్యోగం చేసిన విఠలాచార్య. పుస్తకాలను కలెక్ట్ చేస్తూ వచ్చి ఈ రిటైర్మెంట్‌ తర్వాత లైబ్రరీని ఏర్పాటు చేశారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని, వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారు” అని ప్రశంసించాడు. ఆబాల్యకవియైన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య 1938 జూలై 9న యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని అతని మాతామహుల గ్రామమైన నీర్నేములలో కూరెళ్ల వెంకటరాజయ్య - లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆ కాలంలో ఇతని తండ్రి కూరెళ్ల వేంకటరాజయ్య గొప్ప స్వర్ణకారుడని ప్రతీతి. అంతేకాకుండా మంచి చిత్రకారుడు కూడా.అతను చేసిన అపురూపమైన చక్కని చొక్కపు ఆభరణాలు ఊళ్ళో వాళ్ళు విఠలాచార్యులకు చూపించి పొంగి పోతుంటారు. అయితే దురదృష్టవశాత్తూ తండ్రి వెంకటరాజయ్య అనారోగ్యానికి గురైనాడు.
(ఇంకా…)