వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 28వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత విభజన

1947 లో యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా బ్రిటిషు భారతదేశాన్ని రెండు స్వతంత్ర అధినివేశ రాజ్యాలు - భారతదేశం, పాకిస్థాన్‌లు - గా విభజించడాన్ని భారత విభజన అంటారు. భారతదేశం నేడు భారత రిపబ్లిక్ గా, పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ లుగా ఉనికిలో ఉన్నాయి. ఈ విభజనలో బెంగాల్, పంజాబ్ అనే రెండు రాష్ట్రాలను ఆ రాష్ట్రాల్లో జిల్లా వారీగా ఉన్న ముస్లిం, ముస్లిమేతర ప్రజల మెజారిటీల ఆధారంగా విభజించారు. దేశ విభజనతో పాటు బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, రాయల్ ఇండియన్ నేవీ, ఇండియన్ సివిల్ సర్వీస్, రైల్వే, సెంట్రల్ ట్రెజరీల విభజన కూడా జరిగింది. ఈ విభజనను భారత స్వాతంత్ర్య చట్టం 1947లో వివరించారు. దీని ఫలితంగా బ్రిటిషు రాజ్ లేదా భారతదేశంలో బ్రిటిషు పాలన రద్దైపోయింది. భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు స్వయంపరిపాలక దేశాలు 1947 ఆగస్టు 15 న అర్ధరాత్రి చట్టబద్ధంగా ఉనికిలోకి వచ్చాయి. ఈ విభజనలో 1 - 1.2 కోట్ల మంది ప్రజలు మత ప్రాతిపదికన కాందిశీకులయ్యారు. కొత్తగా ఏర్పడిన దేశాల్లో పెద్దయెత్తున శరణార్థుల సంక్షోభాలను సృష్టించింది. పెద్ద ఎత్తున హింస జరిగింది. విభజన సమయం లోను, అంతకుముందూ జరిగిన ప్రాణనష్టం రెండు లక్షల నుండి ఇరవై లక్షల దాకా ఉండవచ్చని వివిధ అంచనాలు ఉన్నాయి. విభజన లోని హింసాత్మక స్వభావం భారత పాకిస్తాన్ల మధ్య శత్రుత్వానికి, అనుమానాల వాతావరణానికీ కారణమైంది. ఇప్పటికీ వాటి సంబంధాలను దెబ్బతీస్తూనే ఉంది.
(ఇంకా…)