వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 04వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత రాజ్యాంగ పీఠిక
Constitution of India.jpg

భారత రాజ్యాంగానికి క్లుప్తమైన ప్రవేశికగా భారత రాజ్యాంగ పీఠికను రూపొందించారు. దీనినే రాజ్యాంగ ప్రవేశిక, ప్రస్తావన, మూలతత్వం, ఉపోద్ఘాతం, పరిచయం, ముందుమాట అని కూడా అంటారు. భారత రాజ్యాంగం ఈ పీఠికతోనే మొదలవుతుంది. భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం, మరొకటి పరిచయం, ఇంకొకటి ఉపోద్ఘాతం - ఈ పదాలు వివరించిన విధంగానే పీఠిక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. 1949 నవంబర్ 26 న రాజ్యాంగ సభ పీఠికను ఆమోదించగా, 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది. బేరూబారీ కేసు తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం పీఠికను రాజ్యాంగంలో అంతర్గత భాగంగా గుర్తించరాదని చెప్పింది. అదే న్యాయస్థానం 1973లో కేశవానంద భారతి కేసులో అంతకు ముందు చెప్పిన తీర్పులోని వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటూ రాజ్యాంగంలోని అయోమయాన్ని కలిగించే భాగాలలో స్పష్టత కోసం పీఠికను ఆధారం చేసుకోవాలని తీర్పు చెప్పింది. 1995లో భారత ప్రభుత్వం-ఎల్ఐసీ మధ్య నడిచిన కేసు తీర్పులో మరొకసారి, పీఠిక రాజ్యాంగంలో అంతర్గత భాగమని తెలిపింది. పీఠిక అసలు స్వరూపంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని గుర్తిస్తే, ఆ వాక్యానికి లౌకికవాద, సామ్యవాద పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. పీఠిక పుటను, మిగతా రాజ్యాంగంతో సహా, ప్రసిద్ధ చిత్రకారుడు బెవహర్ రామ్మనోహర్ సింహా రూపొందించారు.
(ఇంకా…)