వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 17వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూగ్లి ఎల్మో మార్కోని

గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతను సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుటకు, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ధి చేయుటలో పితామహుడుగా గుర్తింపు పొందాడు. అతను రేడియో యొక్క ఆవిష్కర్త. 1909 లో కార్ల్ ఫెడ్రినాండ్ బ్రాన్ తో కలసి వైర్‍లెస్ టెలిగ్రాఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నాడు. 1897 లో బ్రిటన్ లో వైర్‍లెస్ టెలిగ్రాఫ్, సిగ్నల్ కంపెనీకి వ్యవస్థాపకునిగా ఉన్నాడు. అతను ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారంగా చేసుకొని రేడియో అనే కొత్త ఆవిష్కరణ చేసి వ్యాపార రంగంలో ఘనమైన విజయాన్ని సాధించాడు. 1929 లో మార్కోనీని మార్చీజ్ అనే అవార్డుతో విక్టర్ ఇమ్మాన్యుయేల్ III గౌరవించాడు. 1931లో అతను పోప్ పియస్ XI కోసం వాటికన్ రేడియోను ఏర్పాటు చేశాడు. యువకునిగా ఉన్న నాటి నుండి మార్కోని విజ్ఞానశాస్త్రం, విద్యుత్ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. 1890 ల ప్రారంభంలో, అతను "వైర్‌లెస్ టెలిగ్రాఫీ" అనే ఆలోచనపై పనిచేయడం ప్రారంభించాడు, అంటే ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ ఉపయోగించిన వైర్లను కనెక్ట్ చేయకుండా టెలిగ్రాఫ్ సందేశాలను ప్రసారం చేయడం. ఇది కొత్త ఆలోచన కాదు; అనేక మంది పరిశోధకులు, ఆవిష్కర్తలు వైర్‌లెస్ టెలిగ్రాఫ్ టెక్నాలజీలను, విద్యుత్ ప్రసరణ, విద్యుదయస్కాంత ప్రేరణ , ఆప్టికల్ (లైట్) సిగ్నలింగ్ ఉపయోగించి 50 సంవత్సరాలుగా కొత్త వ్యవస్థలకోసం అన్వేషిస్తున్నారు. కానీ ఎవరూ సాంకేతికంగా, వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. కొత్త అభివృద్ధి హెన్రిచ్ హెర్ట్‌జ్ నుండి వచ్చింది. అతను 1888 లో, విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేయగలవచ్చునని, గుర్తించగలమని నిరూపించాడు.
(ఇంకా…)