Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 20వ వారం

వికీపీడియా నుండి
ఆర్య వైద్య శాల, కొటక్కల్

ఆర్య వైద్య శాల, కొట్టక్కల్ భారతీయ ప్రాచీన సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానంలో వారసత్వ వ్యవస్థకి, నైపుణ్యానికి ఒక ఉదాహరణ. ఇది భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో, మలప్పురం జిల్లా, కొట్టక్కల్ పట్టణంలో ఉన్న ఒక ఆరోగ్య సంరక్షణా కేంద్రం. ఇది మలప్పురం నుండి 16 కిలోమీటర్లు, కోజికోడ్ (కాలికట్) నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని వైద్యరత్నం పి.ఎస్.వారియర్స్ ఆర్య వైద్య శాల, కొటక్కల్ అంటారు. వైద్యరత్నం పి.ఎస్. వారియర్, ఆయుర్వేదంలో ఒక ప్రఖ్యాత పండితుడు, విద్యావేత్త. ఇతని గౌరవార్థం భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును విడుదల చేసింది. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం వారియర్‌కు 1933 వైద్యరత్నం (వైద్యులలో రత్నం) అను బిరుదును ప్రదానం చేసింది. ఇతను 1902లో కేరళ రాష్ట్రం, మలప్పురం జిల్లాలోని తన స్వస్థలం అయిన కొట్టక్కల్ అనే చిన్న పట్టణంలో స్వంత ధనము వెచ్చించి ఆర్య వైద్యశాలను స్థాపించాడు. ఇది మొదట్లో బయట రోగుల చికిత్సకు, ఆయుర్వేద ఔషధాల విక్రయం కోసమూ ఒక చిన్న వైద్య శాలగా ప్రారంభమైంది. పదిహేనేళ్ల తర్వాత, పి.ఎస్. వారియర్ కోజికోడ్ పట్టణంలో గురుకుల పద్ధతి బోధనతో ఆర్య వైద్య పాఠశాల (ఆయుర్వేద వైద్య పాఠశాల)ను స్థాపించాడు. ఈ వైద్య పాఠశాలను తరువాత కొట్టక్కల్‌కు మార్చారు. ఇదే వైద్యరత్నం పి.ఎస్. వారియర్ ఆయుర్వేద కళాశాలగా రూపాంతరం చెంది, కాలికట్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఇక్కడ ఆయుర్వేదంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. ఆర్య వైద్య శాల ఈ కళాశాలకు పరిపాలన, ఆర్ధిక వనరులలో సహకారం అందిస్తోంది.
(ఇంకా…)