Coordinates: 10°59′55″N 75°59′33″E / 10.9986°N 75.99238°E / 10.9986; 75.99238

ఆర్య వైద్య శాల, కొటక్కల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్య వైద్య శాల కొటక్కల్
వైద్యరత్నం పి.ఎస్.వారియర్స్ ఆర్య వైద్య శాల,కొటక్కల్
పటం
భౌగోళికం
స్థానంకేరళ, భారతదేశం
నిర్దేశాంకాలు10°59′55″N 75°59′33″E / 10.9986°N 75.99238°E / 10.9986; 75.99238
వ్యవస్థ
నిధులుధర్మ సంస్థ, చికిత్స రుసుము
రకాలుఆయుర్వేద వైద్యం
Services
ప్రమాణాలునేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్ National Accreditation Board for Hospitals (NABH)
పడకలు400 కి పైగా
చరిత్ర
ప్రారంభమైనది1902; 121 సంవత్సరాల క్రితం (1902)

ఆర్య వైద్య శాల, కొట్టక్కల్ భారతీయ ప్రాచీన సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానంలో వారసత్వ వ్యవస్థకి, నైపుణ్యానికి ఒక ఉదాహరణ. ఇది భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో, మలప్పురం జిల్లా, కొట్టక్కల్ పట్టణంలో ఉన్న ఒక ఆరోగ్య సంరక్షణా కేంద్రం. ఇది మలప్పురం నుండి 16 కిలోమీటర్లు, కోజికోడ్ (కాలికట్) నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని వైద్యరత్నం పి.ఎస్.వారియర్స్ ఆర్య వైద్య శాల, కొటక్కల్ అంటారు.

ఆర్య వైద్య శాల చరిత్ర[మార్చు]

వైద్యరత్నం పి.ఎస్. వారియర్, ఆయుర్వేదంలో ఒక ప్రఖ్యాత పండితుడు, విద్యావేత్త. ఇతని గౌరవార్థం భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును విడుదల చేసింది.[1]

బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం వారియర్‌కు 1933 వైద్యరత్నం (వైద్యులలో రత్నం) అను బిరుదును ప్రదానం చేసింది. ఇతను 1902లో కేరళ రాష్ట్రం, మలప్పురం జిల్లాలోని తన స్వస్థలం అయిన కొట్టక్కల్ అనే చిన్న పట్టణంలో స్వంత ధనము వెచ్చించి ఆర్య వైద్యశాలను స్థాపించాడు. ఇది మొదట్లో బయట రోగుల చికిత్సకు, ఆయుర్వేద ఔషధాల విక్రయం కోసమూ ఒక చిన్న వైద్య శాలగా ప్రారంభమైంది.[2] పదిహేనేళ్ల తర్వాత, పి.ఎస్. వారియర్ కోజికోడ్ పట్టణంలో గురుకుల పద్ధతి బోధనతో ఆర్య వైద్య పాఠశాల (ఆయుర్వేద వైద్య పాఠశాల)ను స్థాపించాడు. ఈ వైద్య పాఠశాలను తరువాత కొట్టక్కల్‌కు మార్చారు. ఇదే వైద్యరత్నం పి.ఎస్. వారియర్ ఆయుర్వేద కళాశాలగా రూపాంతరం చెంది, కాలికట్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఇక్కడ ఆయుర్వేదంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. ఆర్య వైద్య శాల ఈ కళాశాలకు పరిపాలన, ఆర్ధిక వనరులలో సహకారం అందిస్తోంది. [3]

భారతదేశ పోస్టల్ స్టాంపు - 2002 - Colnect 158266 - ఆర్య వైద్యశాల, కొట్టక్కల్

1944 లో పి,ఎస్. వారియర్ మరణం తరువాత, అతని వీలునామా నిబంధనల ప్రకారం, కొట్టక్కల్ ధర్మ సంస్థ (ఛారిటబుల్ ట్రస్ట్) ద్వారా ఈ వైద్యశాలను నిర్వహిస్తున్నారు. పి,ఎస్. వారియర్ మరణం తరువాత, అతని మేనల్లుడు, పి.మాధవ వారియర్ (పి.ఎం. వారియర్) ప్రధాన వైద్యునిగా బాధ్యతలు స్వీకరించాడు. 1944 లో ధర్మ సంస్థకి మొదటి ధర్మ వ్యవహార కర్త (మానేజింగ్ ట్రస్టీ) అయ్యాడు. అతను ఈ సంస్థను ఆధునీకరించాడు. సంస్థ అభివృద్ధికి అనేక ప్రయత్నాలు ప్రారంభించాడు. మాధవ వారియర్ 1953లో విమాన ప్రమాదంలో మరణించాడు.[4] తదుపరి అతని చిన్న సోదరుడు అయిన వైద్యుడు పి.కె. వారియర్, ధర్మ సంస్థ వ్యవహారకర్తగా, అధిపతిగా, ప్రధాన వైద్యునిగా బాధ్యతలు నిర్వహించాడు.[5] అతను పద్మశ్రీ, పద్మభూషణ్ పౌర పురస్కారాల గ్రహీత. అతను, సంస్థకు చీఫ్ సూపరింటెండెంట్‌గా ఉన్న పి.ఎం. వారియర్ తో కలిసి విధులను నిర్వహించాడు.[6] పి,కె. వారియర్ 2021 జులై 10 న మరణించిన తరువాత, అతని మేనల్లుడు పి.మాధవన్ కుట్టి వారియర్ 2021 జూలై 1 నుంచి ఈ వైద్య శాల బాధ్యతలు చేపట్టాడు.[4]

ఆర్య వైద్య శాల వ్యవస్థ[మార్చు]

ఆర్య వైద్య శాల సముదాయం ఒక వ్యవస్థ. ఇది మొత్తం 400 పైగా పడకల సామర్థ్యంతో (ఇన్‌పేషెంట్) సౌకర్యాలతో నాలుగు ఆసుపత్రులను నిర్వహిస్తోంది. దాని ప్రధాన కార్యాలయం మలప్పురం జిల్లాలోని కొట్టక్కల్‌లో ఉంది. ఈ సముదాయంలో నాలుగు వైద్య శాలలు ఉన్నాయి. వీటిలో రెండు వైద్య శాలలు కొట్టక్కల్‌లో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆయుర్వేద వైద్య శాల, పరిశోధనా కేంద్రం (ఆయుర్వేద హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ - AH & RC) కాగా, రెండవది స్వచ్ఛంద కేంద్రం (చారిటబుల్ హాస్పిటల్).[7] మిగిలిన రెండు ఆయుర్వేద వైద్యశాల, పరిశోధనా కేంద్రాలు కొచ్చి, దిల్లీ నగరాలలో ఉన్నాయి. ఇంకా వీరివే 26 వైద్యశాల శాఖలు, [8] మూడు ఔషధ కర్మాగారాలు, [9] 1500 పైగా దేశ విదేశాలలో ఆర్య వైద్య శాల ఔషద విక్రయ శాలల (రెటైల్ అవుట్‌లెట్‌లు)ను పర్యవేక్షిస్తున్న క్రయ విక్రయ (మార్కెటింగ్) విభాగం,[10] నాలుగు (ఔషద) మూలికల తోటలూ ఉన్నాయి. [11] ఈ వైద్యశాల బృందం 8,00,000 మంది పైగా రోగులకు, సంప్రదింపుల ద్వారాను వైద్యశాలలో సేవల ద్వారానూ చికిత్స చేస్తున్నారు. సంసిద్ధం చేసిన ఈ ఆయుర్వేద ఔషధాలను మాత్రలు, గుళికలు రూపంలో పంపిణీ చేయడం ద్వారా ఆర్య వైద్య శాల ఆయుర్వేద ఔషధ వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 2016లో ఆర్య వైద్య శాల కొట్టక్కల్ కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్ (NABH) వారి గుర్తింపు లభించింది.[4]

ఆర్య వైద్యశాల ప్రధాన ద్వారం

ఆయుర్వేద వైద్య శాలలు[మార్చు]

Kottakkal Arya Vaidya Sala

కొట్టక్కల్ ఆర్య వైద్యశాల, పరిశోధనా సంస్థను (AH & RC) 1954లో స్థాపించారు. నేటికి 300 పడకల సామర్థ్యం కలిగి ఉండి సాంప్రదాయ పంచకర్మ చికిత్సతో పాటు, కేరళ ఆయుర్వేద చికిత్సలను అందిస్తుంది. దీనిని రిఫరల్ వైద్యశాల అని పిలుస్తారు. AH & RC తూర్పు దిల్లీలోని కర్కర్డూమా వద్ద 2000 వ సంవత్సరంలో ఏర్పాటు చేసారు. ఇక్కడ 49 పడకల సౌకర్యం ఉంది. కొటక్కల్ లో నుండి సుక్షితులైన, వైద్యులు, వైద్యేతర సిబ్బందిని ఇక్కడ నియమించి సాంప్రదాయిక పంచకర్మ చికిత్సతో పాటు కేరళ ఆయుర్వేద చికిత్సలను ఆధునిక సౌకర్యాలతో అందిస్తున్నారు. [12] ఆర్య వైద్యశాల స్వర్ణోత్సవాల తరువాత కొటక్కల్‌లో రోగుల రద్దీని తగ్గించటం కోసం కొచ్చిలోని త్రిక్కక్కరాలో 2008 లో (AH & RC) వైద్య శాలను 74 పడకలు, సాంప్రదాయ చికిత్సలు ఇతర ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసారు.[13] వివిధ మొండి వ్యాధుల బారిన పడిన వారికి కూడా ఆయుర్వేద సాంప్రదాయిక చికిత్సలను ఆధునిక జీవన శైలికి, అవసరాలకు అనుగుణంగా రూపొందించి వైద్యనిపుణుల పర్యవేక్షణలో అందిస్తున్నారు. అవి ముఖ్యంగా ధారా, శిరోవస్తి, నవరకిడ్జి, నశ్యం, పిఝికిల్, తర్పణం మొదలయినవి. ఇదికాకుండా వ్యాధిగస్తుల అవసరాన్ననుసరించి శరీర వ్యాయామ చికిత్స, యోగా పద్ధతులలో శిక్షణ ఇస్తారు. ఇక్కడ వైద్య నిమిత్తము వచ్చే రోగులకు వివిధ పరీక్షలు, చికిత్సలు, ఔషద విక్రయ శాలలు వంటి సౌకర్యాలతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉండటానికి కూడా సౌకర్యాలు, గ్రంథాలయం, భోజన శాలలు, యోగా శిక్షణ, ఉద్యానవనాలు మొదలగునవి ఏర్పాటు చేసారు.[4]

కొట్టక్కల్‌లో ఉన్న ఆర్య వైద్య శాల ధర్మ సంస్థను (చారిటబుల్ హాస్పిటల్) 1924లో ప్రారంభించారు. ఇక్కడ ప్రధానంగా ఉచిత వైద్య కార్యక్రమాల విభాగం ఏర్పాటు అయింది. ఇక్కడ ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత సంప్రదింపులు, ఆయుర్వేద, అలోపతి చికిత్సను కూడా అందిస్తోంది. 140 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో పంచకర్మ, విషాలకు విరుగుడు చికిత్స, ప్రసూతి గృహం, శస్త్ర చికిత్స, వైద్య పరిశోధన విభాగాలు ఉన్నాయి. ఆర్య వైద్య శాలకు సంభందించిన వైద్య నిపుణులు ఉచిత సంప్రదింపులకు రోగులకు అందుబాటులో ఉంటారు. ఔషద విక్రయశాలలు కూడా అక్కడే అందుబాటులో ఉంటాయి. ఈ చారిటబుల్ వైద్యశాల అందించే ఉచిత చికిత్సకు సంవత్సరానికి అయ్యే ఖర్చు US$ 9,00,000 అని వైద్యశాల పేర్కొంది. ఈ ధర్మసంస్థను ఆర్య వైద్య శాలకు చెందిన నైతిక, వైద్య పరిశోధనా సంఘాలు నిర్వహిస్తాయి. [14]ఈ సంస్థకు అందుతున్న లాభాలలో 45వ శాతాన్ని తిరిగి ధర్మ సంస్థ ఉచిత వైద్య చికిత్సా కార్యక్రమాలు, ఇతర ధాతృత్వ కార్యక్రమాల ద్వారా సమాజానికి అందిస్తున్నారు.[2]

కొట్టక్కల్ ఆర్క వైద్య శాల, ఒ.పి.బ్లాకు

ఆర్య వైద్య శాల శాఖలు[మార్చు]

ఆర్య వైద్య శాల భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇరవై ఆరు శాఖలను నిర్వహిస్తోంది. కొట్టక్కల్‌లో శిక్షణ పొందిన వైద్యులు ఉచిత సంప్రదింపు సేవలు అందిస్తారు. కొట్టక్కల్ ఔషదాలు కూడా ఈ శాఖ వైద్య శాలలో లభిస్తాయి. వీటిలో పదమూడు కేరళ లోను, మిగిలిన 13 భారతదేశంలోని వివిధ ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. కేరళలోని శాఖలు కొట్టక్కల్, అలువా, కొచ్చి, కన్నూర్, అదూర్, కొజికోడ్, తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిసూర్, తిరూర్, త్రిక్కక్కరా, కొట్టాయం, పాలక్కాడ్, మలప్పురంలో ఉన్నాయి. రాష్ట్రానికి వెలుపల ఉన్న శాఖలు దిల్లీ, ఇండోర్, అహ్మదాబాద్, బెంగళూరు, మదురై, ముంబై, మైసూరు, మంగళూర్, చెన్నై, కోయంబత్తూర్, సికింద్రాబాద్, విజయవాడ, కోల్కతాలలో ఉన్నాయి. [8]

కొట్టక్కల్ ఆర్య వైద్య శాలకు భారతదేశం అంతటా శాఖలు ఉన్నాయి.

ప్రతేక వ్యాధులకు సంప్రదింపు సేవలు[మార్చు]

కొట్టక్కల్ ఆర్యవైద్య శాల ధర్మసంస్థ క్రమంగా తమ కార్యక్రమాలను విస్తరించి వైద్య పరిశోధనలకు, ప్రత్యేకమైన వ్యాధి సంప్రదింపులకు, చికిత్సలకూ విభాగాలను ప్రారంభించింది. మధుమేహం, కాన్సర్, స్త్రీ శిశు ఆరోగ్యం, దీర్ఘకాలపు చర్మవ్యాధి (సోరియాసిస్), అలెర్జీ, మైగ్రేన్, కీళ్ళ వాతం, ఎముకలు అరుగుదల వ్యాధి, నేత్ర, జీర్ణ సంబంధిత వ్యాధులు, కొవిడ్ అనంతర వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణుల సంప్రదింపు సేవలను వివిధ వైద్య శాలలలో అందిస్తోంది. ఈ సంప్రదింపు సేవలను రోగులు స్వయముగా వైద్య శాలలో వైద్యులను సంప్రదించుట ద్వారాను, చరవాణి ద్వారా మౌఖికము గాను, వాట్స్ అప్ ద్వారా, దృశ్య శ్రవణ మాధ్యమాల (వీడియో సమావేశాల) ద్వారా అందచేస్తున్నారు.[15]

ఔషధ మొక్కల పరిశోధన కేంద్రం[మార్చు]

ఆర్య వైద్య శాల 2003 లో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ ఆర్థిక సహాయంతో ఔషద మొక్కల పరిశోధనా కేంద్రం (సెంటర్ ఫర్ మెడిసినల్ ప్లాంట్స్ రీసెర్చ్ - CMPR) ను ప్రారంభించింది. ఈ కేంద్ర పారిపాలనా విభాగం, వృక్ష రసాయన శాస్త్ర, టిష్యూ కల్చర్ ప్రయోగ శాలల భవనాన్ని 2003 సెప్టెంబరు 25 న, అప్పటి భారత రాష్ట్రపతి డా. ఎ.పి.జె.అబ్దుల్ కలాం ప్రారంభించాడు. ఈ కేంద్రం మొక్కల వర్గీకరణ, కణజాల పెరుగుదల, సంస్కరణ (టిష్యు కల్చర్), జన్యు వనరులు, వృక్ష రసాయన శాస్త్రం (ఫైటో కెమిస్ట్రీ), వృక్ష శరీర నిర్మాణ శాస్త్రం మొదలగు విషయాలపై ఆధారపడి ఔషధ మొక్కలపై పరిశోధనలు నిర్వహిస్తుంది. ఈ కేంద్రం కొట్టక్కల్‌లో ఉంది. ఈ పరిశోధన కార్యక్రమాలను భారత ప్రభుత్వం వారి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) సంస్థ వారి సహకారంతో కొనసాగుతున్నాయి.[16] ఈ కేంద్రాన్ని భారత ప్రభుత్వ ఆయుష్ (AYUSH) విభాగం అత్యంత సామర్ధ్య కేంద్రంగా గుర్తించింది.[17]

ఔషధ మూలికా తోటలు[మార్చు]

ఆర్య వైద్య శాల ఔషద తయారీలో కావలసిన పదార్ధాలు చాలావరకు తాము నిర్వహించే మూలికల తోటల నుంచే సేకరిస్తారు. ఈ మూలికల తోటలు సుమారు రెండు 220 ఎకరాల విస్తీర్ణంలో ఎర్నాకులంలో పాలక్కాడ్, త్రిక్కక్కరా సమీపంలోని మన్నార్క్కాడ్ ల వద్ద ఉన్నాయి [18] కొట్టక్కల్ ఆర్యవైద్య శాల వద్ద 6 ఎకరాల వైశాల్యంలో మరో రెండు ప్రదర్శన తోటలు ఉన్నాయి.[19] [20] ఇక్కడ 1100 పైగా ఔషద మొక్కల జాతులను పెంచుతున్నారు. అనేక శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలను కొనసాగిస్తున్న ఔత్సాహిక విద్యార్థులకు, వైద్యులకు, వృక్ష శాస్త్ర అధ్యాపకులకు ఈ మూలికా ఉద్యానవనాలలో ప్రవేశానికి అనుమతిస్తారు. అంతర్జాతీయ పరిశోధనా అభివృద్ధి కేంద్రం (ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ సెంటర్ -IDRC), కెనడా ప్రాజెక్ట్‌లలో ఒకటైన ఔషద మొక్కల పధకం (మెడిసినల్ ప్లాంట్స్ - ఇండియా ప్రాజెక్ట్‌)లో సహకరించింది. [19]

ఔషధ కర్మాగారాలు[మార్చు]

ఆర్య వైద్య శాల 530 కి పైగా సాంప్రదాయిక ఆయుర్వేద ఔషదాలను తయారు చేస్తుంది. ఇందుకు మూడు ఔషధ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అవి కేరళలో రెండు - పాలక్కాడ్ సమీపంలోని కొట్టక్కల్, కంజికోడ్ ల వద్ద, కర్ణాటక లో మైసుర్ దగ్గర నంజనగూడ్ లో ఒకటి. అవి ఔషద నియంత్రణ (డ్రగ్ కంట్రోలర్) అధికార కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వుల (లైసెన్స్‌) తో నిర్వహించబడుతున్నాయి. కేరళ ప్రభుత్వం నుండి సరైన ఆచరణల ధృవీకరణ పత్రాన్ని పొందాయి. ఈ మూడు కేంద్రాలు కూడా ఔషదాల తయారీలో సాంప్రదాయ అయుర్వేద సూత్రాలననుసరించినను, ఆధునిక పారిశ్రామిక ప్రమాణాలను పద్ధతులను పాటిస్తున్నారు, ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ ఆర్య వైద్య శాల సముదాయం అంతటికిని సంబంధించి ఔషధ అవసరాలకు, ఇంకా దేశ విదేశాలలో విస్తరించిన ఔషద విక్రయశాలలో విక్రయాలకు మద్దతు ఇస్తాయి. కర్మాగారాల ఔషద తయారీ ప్రక్రియలను పర్యవేక్షించడానికి మానవ వనరుల విభాగము, నాణ్యత అంచనా (క్వాలిటీ అసెస్‌మెంట్) విభాగము, సాంకేతిక నిపుణులు, పరిశోధన అభివృద్ధి విభాగాలు, ఉత్పత్తుల అభివృద్ధి విభాగములు పని చేస్తున్నాయి. ఈ ఔషద తయారీలు భారత ప్రభుత్వ ప్రమాణాల ద్వారా ధృవీకరించబడ్డాయి. [9]

వ్యాపార విభాగం[మార్చు]

కొట్టక్కల్‌ ఆర్య వైద్య శాలలో ఔషద క్రయ విక్రయాల (వ్యాపార) ప్రధాన కార్యాలయం ఉంది. ఫ్రాంచైజీ వ్యవస్థ ద్వారా ఈ ఔషద విక్రయశాలలు 1200 పైగా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఇంకా విదేశాలలో ఈ ఔషద విక్రయశాలలు కువైట్, ఆస్టేలియా, ఒమన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, [21] జర్మనీ, యునైటెడ్ కింగ్ డమ్, [20] అమెరికా దేశాలలో ఉన్నాయి. ఈ ఔషద కేంద్రాలు భారతదేశంలోని ఆర్య వైద్య శాల ప్రవేశాలకు, సేవలకు అక్కడి రోగులకు సూచనలను, సలహాలు (రెఫరల్) కూడా ఇస్తాయి. [22]

ఇతర వివరాలు[మార్చు]

ఆర్య వైద్య శాల ప్రచురణలు[మార్చు]

ఆర్య వైద్య శాలకు సంప్రదాయ, ఆధునిక ఆయుర్వేద సాహిత్యాన్ని పెంపొందిచడానికి ప్రత్యేక సదుపాయాలతో ఒక ప్రచురణల విభాగం ఉంది. పి.ఎస్.వారియర్ ఆయుర్వేద సాంప్రదాయాన్ని కొనసాగించడానికి, దానిని ప్రామాణికంగా అభివృద్ధి చెందడానికి, ఆ జ్ఞానం సంరక్షించడానికి ప్రచురణలు ముఖ్యం అని గుర్తించాడు. 1903 వ సంవత్సరం లోనే స్వీయ సంపాదకత్వంలో ధన్వంతరి అను ఆయుర్వేద పత్రికను నడిపాడు. దీనికి అతని బంధువు పి.వి.కృష్ణ వారియార్ నిర్వహకుడుగా పనిచేసాడు. అతను 1903 లో ఔషద పట్టికను ప్రచురించాడు. అందుకు ఉదాహరణలుగా అతని సంస్కృత ప్రచురణలయిన - అష్టాంగశరీరం (Astangasariram), బృహచ్చరీరం, 1907లో మలయళంలో ప్రచురించబడిన చికిత్సా సంగ్రహంలను పేర్కోనవచ్చు.[2] తమ ప్రచురణల ద్వారా ప్రజలకు ఆరోగ్య సంరక్షణ గురించిన విశ్వసనీయ సమాచారము అందచేయుట కూడా ముఖ్యోద్దేశ్యము. ఈ ప్రచురణలు ముఖ్యంగా మలయాళం, ఆంగ్లం, హింది, సంస్కృతం, తమిళం భాషలలో ఉన్నాయి. ఆర్య వైద్య శాల 1987 వ సంవత్సరం నుంచి ఆర్య వైద్యం అనే త్రైమాసిక పత్రికను, అనేక పరిశోధనా వ్యాసాలను, విశేషాలతో ప్రచురిస్తోంది. ఈ ప్రచురణలు వైద్యులకు, వైద్య విద్యార్ధులకు ఆచూకీ గ్రంధాలుగా ఉపయొగపడుతున్నాయి. [23] ఆర్య వైద్య శాల ఔషధ మొక్కలపై పరిశోధనలు నిర్వహిస్తుంది. ఆ పరిశోధనల నుండి వచ్చిన కొన్ని ముఖ్యమైన రచనలు:

 • ఆయుర్వేద ఔషదాలు వాటి వృక్ష వనరులు (Ayurvedic Drugs and Their Plant Sources[24])
 • పశ్చిమ కనుమలలో కొన్ని ముఖ్యమైన ఔషద మొక్కలు: ఒక ఆకృతి (Some important medicinal plants of the Western Ghats, India: a profile[25])
 • భారతీయ ఔషద మొక్కలు: ఒక 500 జాతుల సంగ్రహము - సంపుటము 1(Indian Medicinal Plants: A Compendium of 500 Species, Vol. I[26],II[27], III[28], IV[29],V[30])

సాంస్కృతిక కార్యక్రమాలు[మార్చు]

లలిత కళలంటే అభిరుచి కలిగిన వైద్యరత్నం, కథాకళి కళాకారుల జట్టును పి.ఎస్.వి. నాట్యసంఘం అను సాంస్కృతిక కేంద్రంగా మలిచాడు. కోజికోడ్, పాల్కాడ్ లలో నాటక శాలలు నెలకొల్పాడు. ఈ నాట్య సంఘం దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది. ఈ నాట్యసంఘం కథాకళికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. [31]

వస్తు ప్రదర్శన శాల[మార్చు]

వైద్యరత్నం పి.ఎస్.వారియర్ వస్తు ప్రదర్శనశాలను 2002 ఆర్య వైద్య శాల,కొట్టక్కల శతజయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేశారు. 1924 లో వైద్యశాల నిమిత్తంము నిర్మించిన సంస్కృతిక కట్టడంలో ఈ వస్తు ప్రదర్శన శాల ను ఏర్పాటు చేశారు. ఇక్కడ, ఆర్య వైద్య శాల చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, 19, 20 వ శతాబ్దాలలో ఆయుర్వేద చరిత్ర, శాస్త్రీయ ప్రక్రియలలో జరిగిన అభివృద్ధి మొదలగునవి సంక్షేపం చేశారు. [32] [33]

విశ్వంభర దేవాలయం[మార్చు]

పి.ఎస్.వారియర్ మతసామరస్య సమాజాన్ని, లౌకికవాదాన్నీ విశ్వసించి, ఆచరించాడు. ఇందుకు నిదర్శనంగా అతని ఇంటిముందు హిందు, ఇస్లాం, క్రైస్తవ మత చిహ్నాలు అవుపడతాయి.[2] అతను 1932 లో విశ్వంభర దేవాలయాన్ని నిర్మించాడు. 1934 నుంచి ప్రతియేడూ 7 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు. కథాకళి కళాకారులు, సంగీత విద్వాంసులు ఆ ఉత్సవాలలో ప్రదర్శనలు ఇస్తారు. ఆర్యవైద్య శాలకు వైద్యం నిమిత్తం వచ్చినవారు, కొట్టక్కల్ పట్టణ వాసులు ఈ ఉత్సవాలను తిలకిస్తారు.[34]

మూలాలు[మార్చు]

 1. "Postage stamp". Indian Philately. Thakkar Numismatic & Art Foundation. 2022. Retrieved 16 September 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. 2.0 2.1 2.2 2.3 Kottakkal Arya Vaidya Sala, The home of healing, The Week, Malayala Manorama, Malayala Manorama Co. Ltd. 24 November 2019
 3. "Medical College". Vaidyaratnam P. S. Varier Ayurveda College. 2014. Retrieved 25 December 2014.
 4. 4.0 4.1 4.2 4.3 "AVS About". Kottakkal Arya Vaidya Sala. Arya Vaidya Sala. 2022. Retrieved 15 September 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
 5. "The Hindu PK Warrier". The Hindu. 6 June 2011. Retrieved 25 December 2014.
 6. "India Today PM Warrier". India Today. 9 July 2014. Retrieved 25 December 2014.
 7. "Hospitals". Kottakkal Arya Vaidya Sala. AVS. Retrieved 15 September 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
 8. 8.0 8.1 "Branches". Arya Vaidya Sala. AVS. 2022. Retrieved 17 September 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
 9. 9.0 9.1 "Manufacturing Units". Arya Vaidya Sala. AVS. 2022. Retrieved 17 September 2022.
 10. "Dealers". Arya Vaidya Sala. AVS. 2014. Retrieved 17 September 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
 11. "Herbal Gardens". AVS. 2014. Retrieved 25 December 2014.
 12. "Delhi". Arya Vaidya Sala. AVS. 2022. Retrieved 17 September 2022.
 13. https://aryavaidyasala.com/kochi.php
 14. "Charitable Hospital". Arya Vaidya Sala. AVS. 2022. Retrieved 17 September 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
 15. https://www.aryavaidyasala.com/consultation.php
 16. https://cmpr-avs.in/cmpr/
 17. https://www.aryavaidyasala.com/about-us.php
 18. "Herbal Estate". Arya Vaidya Sala. AVS. 2022. Retrieved 17 September 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
 19. 19.0 19.1 "Ayurveda Service". Ayurveda Service. 2014. Archived from the original on 5 March 2016. Retrieved 26 December 2014.
 20. 20.0 20.1 "Kottakkal UK". Kottakkal UK. 2014. Retrieved 26 December 2014.
 21. "Kottakkal UAE". Kottakkal UAE. 2014. Archived from the original on 4 October 2014. Retrieved 26 December 2014.
 22. "Kottakkal USA". Kottakkal USA. 2014. Retrieved 26 December 2014.
 23. https://www.aryavaidyasala.com/publications.php
 24. V. V Sivarajan; Indira Balachandran (1994). Ayurvedic Drugs and Their Plant Sources. Oxford & IBH Pub. Co. p. 570. ISBN 978-8120408289.
 25. Warrier P. K.; Nambiar V. P. K.; Ganapathy P. M. (2001). Some important medicinal plants of the Western Ghats, India: a profile. Canada: Medicinal and Aromatic Plants Program in Asia (MAPPA), International Development Research Centre (IDRC), Canada, South Asia Regional Office (SARO). p. 398.
 26. P K Warrier, V P K Nambiar & C. Ramankutty (1993). Indian Medicinal Plants: A Compendium of 500 Species, Vol. I. Orient BlackSwan/ Universities Press. ISBN 9788173717024.
 27. P K Warrier, V P K Nambiar & C. Ramankutty (1994). Indian Medicinal Plants: A Compendium of 500 Species, Vol. II. Orient BlackSwan/ Universities Press. ISBN 9788173717031.
 28. P K Warrier, V P K Nambiar & C. Ramankutty (1994). Indian Medicinal Plants: A Compendium of 500 Species, Vol. III. Orient BlackSwan/ Universities Press. ISBN 9788173717048.
 29. P K Warrier, V P K Nambiar & C. Ramankutty (1995). Indian Medicinal Plants: A Compendium of 500 Species, Vol. IV. Orient BlackSwan/ Universities Press. ISBN 9788173717055.
 30. P K Warrier, V P K Nambiar & C. Ramankutty (1996). Indian Medicinal Plants: A Compendium of 500 Species, Vol. V. Orient BlackSwan/ Universities Press. ISBN 9788173717062.
 31. "Kottakkal Arya Vaidya Sala's 120 years long rich heritage in health care". English.Mathrubhumi (in ఇంగ్లీష్). Archived from the original on 2023-02-13. Retrieved 2023-02-13.
 32. "Welcome to Malappuram: Nine tourist destinations in the north Kerala district that'll blow your mind away". The New Indian Express. Archived from the original on 2023-02-13. Retrieved 2023-02-13.
 33. "Museum | Arya Vaidya Sala Kottakkal". www.aryavaidyasala.com. Retrieved 2023-02-13.
 34. https://www.aryavaidyasala.com/temple.php

బయటి లింకులు[మార్చు]