Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 29వ వారం

వికీపీడియా నుండి
చంద్రయాన్-2

చంద్రయాన్-2, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధన కోసం చేసిన రెండవ యాత్రకు ఉపయోగించిన నౌక. చంద్రుడిపై నిదానంగా, మృదువుగా దిగి (సాఫ్ట్ ల్యాండింగు), 14 రోజుల పాటు చంద్ర ఉపరితలంపై తిరుగుతూ, వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ నౌకలో భాగం. చంద్రయాన్-2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె-3 వాహనం ద్వారా ప్రయోగించారు. చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉండే ఆర్బిటరు, దాన్నుంచి విడివడి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండిగయ్యే ల్యాండరు, ల్యాండరు నుండి బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై నడిచే రోవరు - ఈ మూడూ చంద్రయాన్-2 లో భాగాలు. భారతదేశపు చంద్రయాన్ కార్యక్రమంలో ఇది రెండవ యాత్ర. చంద్రయాన్-2 కార్యక్రమం ద్వారా వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి, చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడానికీ ఇస్రో తలపెట్టింది. 6 చక్రాలు కలిగిన రోవరు చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి అక్కడే రసాయనిక విశ్లేషణ చేస్తుంది. ఈ సమాచారాన్ని ల్యాండరుకు అందజేయగా అది భూమిపై ఉన్న డీప్ స్పేస్ నెట్‌వర్కుకు చేరవేస్తుంది. చంద్రయాన్-1ను సాకారం చేసిన మైలస్వామి అన్నాదురై నేతృత్వంలోని బృందం చంద్రయాన్-2 పైన పనిచేస్తుంది. ఇస్రో రూపకల్పన ప్రకారం - ఇంతవరకు ఏ దేశం కూడా కాలూనని ప్రదేశంలో, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్-2 ల్యాండరు దిగుతుంది. దాన్నుండి రోవరు బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై తిరుగుతుంది.
(ఇంకా…)