వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 42వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యుద్ధం

యుద్ధం లేదా సంగ్రామం రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు, సంస్థలు, లేదా దేశాల మధ్య పెద్ద యెత్తున జరిగే ఘర్షణ. మానవ సమాజంలో యుద్ధాలు అనాదిగా ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర పూర్వ యుగంలో తెగల మధ్య జరిగిన కొట్లాటల నుండి తరువాత నగరాల మధ్య లేదా దేశాల మధ్య లేదా సామ్రాజ్యాల మధ్య అనేక రకాలుగా ఈ ఘర్షణలు జరిగాయి, జరుగుతున్నాయి. "యుద్ధం" అనే పదాన్ని దేశాల మధ్య జరిగే సాయుధ పోరాటాలకే పరిమితంగా వాడడం లేదు. "మతోన్మాదం పై యుద్ధం", "ఉగ్రవాదంపై యుద్ధం", "దారిద్ర్యంపై యుద్ధం", "అవినీతిపై యుద్ధం" వంటి అనేక సందర్భాలలో "యుద్ధం" అనే పదాన్ని వాడుతారు. యుద్ధం అనే ప్రక్రియ మానవ సమాజాల మధ్య మాత్రమే జరుగదు. చీమల దండుల మధ్య, చింపాంజీ ల సమూహాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతాయని జంతు శాస్త్రం అధ్యయనాల వల్ల తెలుస్తున్నది.

యుద్ధం చేసేవారు సైనికులు. భూమిపైన పోరాడే సైనికులను కాల్బలంగా వ్యవహరిస్తారు. సముద్రంలో పోరాడే సేనలు నౌకాదళం. ఆకాశంలో పోరాడేవి వైమానిక దళాలు. యుద్ధం ఒకే సమయంలో వివిధ రంగాలలోను, వివిధ ప్రాంతాలలోను జరుగవచ్చును. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనే సైనిక దళమే కాకుండా గూఢచారి వ్యవస్థ, సమాచార వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక వ్యవస్థకు చెందిన అనేక వర్గాలు యుద్ధంలో పాల్గొంటాయి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం వల్ల అభివృద్ధి అయిన క్షిపణుల వంటి పరికరాలు, పేలుడు పదార్థాలు యుద్ధాల స్వరూపాన్ని గణనీయంగా మార్చివేస్తున్నాయి.
(ఇంకా…)